నా మనస్సు విలవిలలాడింది..!!

688

మిన్నకుండి పోయాను బాధతో…
ఓటు వెయ్యమంటూ సర్కారు వారు అమ్మకి పంపిన తాఖీదుని చూసి…!!
ఆ క్షణంలో అనిపించింది ప్రసవ వేదన అమ్మకి కొన్ని క్షణాలే…!
కానీ అమ్మ గుర్తుకు వచ్చిన ప్రతిసారి నాకు తెలుసోస్తోంది అమ్మ ప్రసవ సమయంలో పడిన బాధ ఎట్లా ఉంటుందో…!!
ఇక్కడ తేడా ఒక్కటే నాడు అమ్మ పడిన వేదన శరీరానికి అయితే…నేడు నాకు కలుగుతున్న వేదన మనస్సుకు సంబంధించినది.
ప్రతిసారి ఓటు వెయ్యడానికి మా అమ్మను తీసుకుని వెళ్ళేది నేనే…!!ఎప్పటిలాగే గత జనరల్ ఎలక్షన్స్ (2018) కి కూడా ఓటువెయ్యడానికి మా అమ్మని తీసుకుని  వెళ్ళేను..!! అస్వస్థత కారణంగా   వీల్ చైర్ లో ఉండే అమ్మ ఓటు వేసింది.. ఆ క్షణంలో అమ్మ కళ్ళల్లో ఏదో ఆనందం..ఆ మాటునే ఈ పరిస్థితిలో కూడా ఓటు వేయ్యకలిగాను అనే ఒకింత గర్వం అమ్మ కళ్ళల్లో తొణికిసలాడటం నేను గమనించాను…!!
“విధి వ్రాత.. ఆ పైవాడు” ఆదుకునే ఆట ఏమిటో మనకు తెలియదు కదా…!  అందుకే గ్రహించలేకపోయాను..అమ్మ ఓటు వేసే అవకాశం ఈ జన్మకి ఇదే చివరసారి అని..!! తదనంతరం అమ్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది..!.ఆమె శరీరం అంటే వెళ్ళిపోయింది.. కానీ ఆమె జ్ఞాపకాలు, చూపించిన మమకారాలు “గుండె గూడులో” నిక్షిప్తమై ఉన్నాయి..!! అందుకే ఆమె జ్ఞాపకాల చిరుగాలులు వీచినప్పుడు మనస్సు విలవిల లాడుతూ ఉంటుంది…!
సరిగ్గా ఇట్లాంటి పరిస్థితిలోనే మున్సిపల్ ఎన్నికలు ..యధావిధిగానే సర్కారు వారి తాఖీదు..ఓటు వెయ్యండి అంటూ అమ్మకి తాఖీదు…!! ఆ తాఖీదును చూసిన నాకు ఉప్పెనలా దుఃఖం తన్నుకొచ్చింది.. !!  ఎందుకంటే ఓటు వెయ్యంచడానికి ఇప్పుడు అమ్మ లేదు కదా..!!  ఆ విషయం నమోదు చేసుకోని సర్కార్ వారు యధావిధిగా తాఖీదు పంపారు.. !!
ఆ తాఖీదును, చివరసారిగా వీలు చైర్లో అమ్మ ఓటు వేసిన ఫోటోని చేతిలో పట్టుకుని అమ్మ ఒక్కసారి రా అమ్మ.. ఓటు వేసి వెళ్లిపోదువు అని గుండెలు పగిలేలా ఏడ్చాను…అమ్మ ఇంక రాదని తెలిసి కూడా…!! ఓ ఆలోచన తో చిన్నపాటి ఊరట ఆ క్షణంలో నా మదిలో తొణికసలాడింది..
అమ్మలేకపోతే ఏమిటి..చివరి సారి అమ్మ ఓటు వేసిన పోలింగ్ కేంద్రం ఉందిగా.. అక్కడికే పోతాను…ఆమ్మ వయస్సు ఉన్నవారికి ఓటు వెయ్యడలో  సహాయ పడతాను..వాళ్ళల్లో అమ్మను చూసుకుంటూ…!!!చివరిగా ఒక్క మాట..  ఒక్క అమ్మ విషయంలోనే కాదు…నాన్నకి సంబందించిన విషయంలోనూ నాకు ఇవే తలంపులు….
మొన్న ఈ మధ్యన రాజమండ్రి పోయాను.. ఆ సందర్భములో స్నేహితుడు చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళాను..సరిగ్గా ఆ సమయంలో నా స్నేహితుని తల్లితండ్రులు భోజనానికి ఉపక్రమించారు.. పీటల మీద కూర్చుని…!! ఆ క్షణంలో ఆ దంపతుల ఇద్దరిలో మా అమ్మ నాన్నలు నాకు కనిపించారు…!
నేను కూడా ఒకప్పుడు మా అమ్మ నాన్న మధ్యనే కూర్చుని వారితో భోజనం చేసేవాడిని  పైగా వారిరువురికి నా అమ్మ నాన్నలు పరిచయులే..!! దీనికితోడు మా నాన్న మరియు ఫ్రెండ్ నాన్న గారు ఒక్కప్పటి సహోద్యోగులే…!! ఆ క్షణంలో అనిపించింది వారిరువురి మధ్యన కూర్చుని నేను కూడా భోజనం చేయాలని తద్వారా అమ్మ నాన్నలతో నాడు భోజనం చేసిన రోజులను నా కళ్ళ ముందు ఓ మారు సాక్షాత్పరించుకోవచ్చనే తలంపుతో…!!
అవనిపై అమ్మ నాన్నలే ప్రత్యక్ష దైవాలు… సర్వేజన సుఖినో భవంతు.

-శ్రీపాద శ్రీనివాస్