ఒవైసీ చెబితేనే వారిని వెళ్లగొడరాతా?

516

రోహింగ్యాలను తరిమే బాధ్యత కేంద్రానికి లేదా?
అమిత్‌షా కొత్త షరతు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆయన భారతదేశ హోం శాఖామంత్రి. అయినా ఆయన కూడా ఒక పార్టీకి నాయకుడే. అందుకే రోహింగ్యాలపై, ఒవైసీని అడ్డుపెట్టి చేసిన వ్యాఖ్య సగటు భారతీయుడికి నచ్చలేదు. ‘ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను వెళ్లగొట్టాలని ఒవైసీని  లిఖితపూర్వకంగా రాసివ్వమనండి. కేంద్రప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూపిస్తా’మన్నది  హోంమంత్రి అమిత్‌షా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్య. ఇది ఆయన కేంద్ర హోంమంత్రిగా విధించిన షరతా? లేక సవాలో అర్ధం కాలేదు.

అమిత్‌షా బీజేపీ నేతగా, ఆ పార్టీ ప్రచారకర్తగా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే పెద్దగా పట్టించుకోవలసిన పనిలేదు. కానీ, ఆయన బాధ్యతాయుతమైన హోంమంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నారు. కాబట్టి, ఆయన నుంచి అలాంటి వ్యాఖ్యలు ఏ భారతీయుడూ ఆశించలేడు. అలా  ఒవైసీ లేఖ రాస్తేనే పరాయిదేశస్తుల సంగతి తేలుస్తామని చెప్పడాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. చివరకు బీజేపీకి ఓటేయాలని పిలుపునిస్తున్న కరుడుకట్టిన హిందుత్వవాదుల సహా!

పాతబస్తీలో ఇటీవలి కాలంలో అయితే రోహింగ్యాల కదలిక, ఆవాసం పెరిగింది. కానీ బంగ్లా, పాకిస్తానీలు దశాబ్దాల నుంచి పాతబస్తీలో నివసిస్తున్నారు. వారికి వీసాలు ముగిసి దశాబ్దాలయిపోయింది. ఇదే బీజేపీ అగ్రనేత నల్లు ఇంద్రసేనారెడ్డి, బీజేవైఎం జాతీయ నేతగా ఉన్న ఇప్పటి కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, ఆ అంశంపై అనేక ఆందోళనలు నిర్వహించిన విషయం, అప్పట్లో గుజరాత్ నేతగా ఉన్న  అమిత్‌షాకు గుర్తుందో లేదో తెలియదు. 1989-2000 మధ్యకాలంలో  , ప్రధానంగా ఇంద్రసేన్-కిషన్,  కాంగ్రెస్-టీడీపీ హయాంలో ఆ అంశంపై భారీ ఆందోళనలు నిర్వహించారు. ఆ సంద ర్భంలో వారు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని దునుమాడారు. అసెంబ్లీలో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో తిష్టవేసిన 25 వేలమంది చొరబాటుదారులను తరిమివేయాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు వాళ్లంతా పెద్ద నాయకులపోయి.. మర్చిపోయినా, అప్పట్లో వారి కార్యక్రమాలకు హాజరయిన మాలాంటి జర్నలిస్టులకు  మాత్రం ఇంకా గుర్తుంది. అదీ..నగరంలో బంగ్లా, పాక్ దేశీయుల అడ్డాకు సంబంధించిన పాత కథ.

ఇప్పుడు అమిత్‌షా కేంద్ర హోంమంత్రిగా రోహింగ్యాలు, బంగ్లాల గురించి చేసిన వ్యాఖ్యలు మరి… భాజపేయులు సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా? అన్నది వారికి సంబంధించిన వ్యవహారం. కానీ సగటు భారతీయుడిగా.. ఒవైసీ లేఖ ఇస్తేనే, రోహింగ్యా-బంగ్లాదేశీయుల పనిపడతామనడాన్ని ఎవరూ స్వాగతించరు. ఇది మనం మనుషులం అన్నంత నిజం! ఎందుకంటే విదేశీయులు దేశంలో ఏ మూల అక్రమంగా చొరబడినా వారిని ఏరివేసే బాధ్యత కేంద్రానిదే. అందుకు ఏ ఎంపీ-ఏ ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగైతే కాశ్మీర్‌లో ముఫ్తీ అండ్ కో లేఖ తీసుకుని, వారి అనుమతి మేరకే తీవ్రవాదులను ఏరివేస్తున్నారా? ఏ లేఖ రాశారని అమెరికా బిన్‌లాడెన్‌ను వెంటాడి చంపింది? ఏ లేఖ రాశారని పాక్ ముష్కరులను మన జవాన్లు మట్టుపెడుతున్నారు?

అమిత్జీ చెప్పినట్లు.. లోక్‌సభలో ఒవైసీ అనే ‘దేశభక్తుడు’ రోహింగ్యాలు-బంగ్లాదేశీయులకు దన్నుగా అరచిగోలచేయవచ్చు. అంతమాత్రాన కేంద్రం, తనకు కావలసిన బిల్లులు అలాంటి అరుపుల మధ్యనే ఆమోదించుకోవడం లేదా? విపక్షాలు అడ్డుకున్నాయని చెప్పి బిల్లులను వెనక్కి తీసుకోవడం లేదు కదా? అసలు హైదరాబాద్ పాతబస్తీలో అనుమతిలేకుండా కొందరు, గడువుతీరిన మరికొందరు ఏళ్ల తరబడి తిష్టవేస్తుంటే, కేంద్రం ఎందుకు చోద్యం చూస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం విఫలమయితే,  కేంద్ర నిఘా దళాలు ఏమయ్యాయి? వారిని ఏరివేయకుండా కేంద్రాన్ని ఎవరు అడ్డుకున్నారు? ఇవన్నీ  మెడపై తల ఉన్న ఎవరికయినా వచ్చే సందేహాలే.

మళ్లీ రోహింగ్యాల వద్దకు వెళదాం. పాతబస్తీలో రోహింగ్యాలపై  తెలంగాణ పాలకులు దయతలచి, ఉండటానికి గూడు కూడా ఇచ్చి పెద్దమనసుచాటుకున్నారు. బాలాపూర్ వద్ద 108 మంది రోహింగ్యాలకు.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ తాత్కాలిక షెల్టర్లు నిర్మించి, ఆ తాళాలు ఒక శుభముహుర్తం రోజున వారికి  చిరుకానుకగా అందించారు. ఆ చూడముచ్చటయిన లోకోత్తర దృశ్యాలు మీడియాలో చూసి దేశప్రజలు పులకించిపోయారు.ఇప్పుడు అదే రోహింగ్యాలు భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న కథనాలు మీడియాలో చూస్తున్నాం. మరి ఇట్టెట్రా అంటే ఇల్లంతా నాదే అన్న సామెత ఊరకనే వచ్చిందా? తొండముదిరితే ఊసరవెల్లి అవడం సహజమే కదా!

వీరంతా మయన్మార్‌లో జరిగిన ఘటనల తర్వాత, హైదరాబాద్‌కు చేరుకుని కష్టాలు పడుతుంటే, జమాతే ఇస్లామే హింద్ సంస్థ  చలించిపోయిందట. ఆ సంస్థ అభ్యర్ధనతో హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ 108 రోహింగ్యా  కుటుంబాలకు తాత్కాలిక షెల్టర్లు నిర్మించింది.  సరే ఆ తర్వాత వారికి రేషన్‌కార్డులు, అవీ కూడా ఇచ్చారనుకోండి. అది వేరే విషయం. దానితోవారు ఇప్పుడు యూట్యూబ్ చానల్ కూడా నడుపుతున్నారండోయ్. అదీ మయన్మార్ నుంచి పాతబస్తీకి వచ్చిన రోహింగ్యాల కథ! సరే.. నగరంలో ఉన్న 62 మంది రోహింగ్యాలపై కేసులు నమోదుచేశామని డీజీపీ కూడా ప్రకటించారు.

అంటే.. బీజేపీ దళపతి బండి సంజయ్ చెప్పినట్లు.. పాతబస్తీలో రోహింగ్యాలు తిష్టవేసినట్లు, దానికి పాతబస్తీలో సర్కారీమిత్రపార్టీలు సహకరిస్తున్నట్లు,  మెడమీద తల ఉన్న ఎవరికయినా స్పష్టమవుతుంది. అమిత్‌షా చెప్పినట్లు.. సంజయ్ ఆరోపించినట్లు, పాతబస్తీలో రోహింగ్యాలు-బంగ్లాదేశీయులు తిష్టవేస్తే, ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారిమీద సర్జికల్‌స్టైక్ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? అది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే గుర్తుకురావడం ఏమిటి?

అమిత్జీ అంటే ఏదో ఎన్నికల కోసం వచ్చారు. మరి ఇక్కడే ఉండే కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగానే ఉన్నారు కదా? ఆయనెందుకు వారిని తరిమికొట్టేందుకు తన అధికారాలు వినియోగించలేదు? మజ్లిస్ ఎమ్మెల్యే చెప్పినట్లు.. పాతబస్తీకి ఒవైసీ సీఎం, అది మజ్లిస్ సామ్రాజ్యమే కావచ్చు. వారి అనుమతి లేకుండా ఎవరూ అటు వైపు వెళ్లలేకపోవచ్చు. కానీ కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కదా? ఆయన తన అధికారాలు ఎందుకు వినియోగించడంలేదు? అన్నట్లు.. తాజా ఎన్నికల ప్రచారంలో.. ‘ మీరు లోక్‌సభకు బీజేపీకి వేసుకుని, లోకల్‌గా మాకు ఓట్లేయమని’ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఉత్తరాది ఓటర్లను కోరారు. శుభం!  ఏదైనా.. ఎవరికయినా,   అంతిమంగా కావలసింది అధికారమే కదా?  హమ్ సబ్ ఏక్ హై! భారత్‌మాతాకీ జై!! అంతేగా… అంతేగా!!!