బీజేపీ నేతల మాటలకు అర్థాలే వేరులే……

145

అమరావతి రాజధాని విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, వేస్తున్న పిల్లిమొగ్గల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దాని గురించి నేను గతంలో ఒక ప్రముఖ దిన పత్రిక లో ఎడిటోరియల్ పేజీలో వ్యాసం రాశా. అందులో కొత్త అంశాలేమీ లేవు. అంతకుముందు జీవీఎల్, సునీల్ దియోథర్, కన్నా. సోము వీర్రాజు చేసిన ప్రకటనల సారాంశమే నా వ్యాసంలోని వస్తువు. అది పార్టీ నియమావళికి వ్యతిరేకమని అప్పుడే పార్టీకి కొత్తగా గజ్జె కట్టిన సోము వీర్రాజు నాయకత్వం భావించింది. ఆ వ్యాసం ప్రచురించిన మరుసటి రోజే, కనీస పద్ధతుల ప్రకారం మాట్లాడటం గానీ, షోకాజ్ నోటీస్ ఇవ్వటం లాంటివి కూడా పాటించకుండా, ఏకంగా పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. ఒక జాతీయ పార్టీకి సస్పెన్షన్ ఇచ్చే సంప్రదాయం లేకపోవడమే ఆశ్చర్యం. వీర్రాజు గారు వచ్చాక, చేరేవారి మాట దేవుడెరుగు సస్పెన్షన్లకు మాత్రం కొదవలేకుండా పోయింది. బహుశా.. ఆ భయానికేనేమో ఇప్పుడు పురందీశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్, కన్నా లక్ష్మీనారాయణ తదితర అగ్రనేతలు ప్రకటనలివ్వకుండా మౌనంగా ఉన్నట్లుంది.

సరే.. ఇది ఒక ఎత్తయితే, పార్టీ ప్రముఖులుగా చెలామణి అవుతున్న నాయకులు , రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనిదన్నారు. కేంద్రం జోక్యం చేసుకోదని, పార్టీ వేరు- కేంద్ర ప్రభుత్వం వేరు అని సూత్రీకరించారు. అమరావతిలో ఏం జరిగిందని? ఉత్త గ్రాఫిక్స్ తప్ప. అయినా అక్కడ రైతులకు అండగా ఉంటాం…ఇలా రకరకాలుగా అయిదు రాష్ట్రాల అధిపతి అని ఒకరు, పార్టీ ముఖ్య నేత అని ఇంకొకరు , మరీ ముఖ్యంగా కొత్త అధ్యకుడు శ్రీమాన్ వీర్రాజు గారు బాధ్యతలు స్వీకరించక ముందునుంచే, ఢిల్లీ నుంచి మొదలెట్టి అమరావతి దాకా రాజధాని విషయంలో వక్ర భాష్యాలు వల్లించారు. ఇది గతం.

మరి ఈ వేళ ఢిల్లీలో, బీజేపీ మిత్ర పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, స్పష్టంగా ‘అమరావతే రాజధాని ఇదే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి మాట కూడా. మొదటినుంచి నడ్డా గారి మాట జనసేన మాట ఒకటే. దానికే కట్టుబడి ఉన్నాం’ అన్నారు. అంటే నద్దా గారు కూడా అమరావతినే రాజధానిగా ఉంటుందని పవన్‌కు హామీ ఇచ్చారన్నమాట. పార్టీ అధినాయకత్వ అభిప్రాయాలకు, భిన్నంగా మాట్లాడిన వారందరిని కూడా రాజీనామా చేయించాలి. లేదా గతంలో అనుసరించిన విధంగా బీజేపీ పార్టీ అధిష్టానం సస్పెండ్ చెయ్యాలి కదా? మరి ఆ ప్రకారంగా అమరావతికి అనుకూలంగా మాట్లాడిన, పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దాను కూడా శ్రీమాన్ రోము వీర్రాజు సస్పెండ్ చే స్తారా? నేను అమరావతి అంశంపై రాసిన వ్యాసానికి, ఇప్పుడు నద్దా ఇచ్చిన హామీకి తేడా ఏముంది? మరి అలాంటప్పుడు నన్ను మాత్రమే సస్పెండ్ చేసి, నద్దాను వదిలేయడం వివేకమా చెప్పండి వీర్రాజు గారూ?! ఇవన్నీ రాజకీయ అవగాహన ఉన్న వారు వేస్తున్న ప్రశ్నలు. మరి నిజమే కదా..! సిద్ధాంతపరమైన పార్టీ.. సిద్ధాంత రహితంగా నడుచుకోవడం, బీజేపీ సానుభూతి పరులు అందరినీ తొలుస్తున్న అర్థం కాని పరిస్థితి.

ఇక తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక సన్నాహక సమావేశాల్లో, తిరుపతి అభివృద్ధి విషయంలో చర్చకు, రచ్చకు రెడీ అన్న బీజేపీ బస్తీమే సవాల్ కేకకు, స్పందించిన తిరుపతి నగర వాసులు.. అనేక సందేహాస్ర్తాలు సంధిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా తిరుపతి ని ప్రారంభించిన ప్రధానమంత్రి గారు, అంతర్జాతీయ విమానాలు ఎగిరే అవకాశం మాత్రం తిరుపతికి ఇవ్వలేదు. పక్కనే ఉన్న తమిళనాడు లోని తిరిచికి ఇచ్చారు. తిరుపతి నుంచి రాయలసీమ వాసులు జీవనాధారం కోసం, కువైట్ లాంటి దేశాలకు విపరీతంగా వెళతారన్నది అందరికీ తెలుసు. అయినా తిరుపతికి, అంతర్జాతీయ విమానాలు ఎగిరేందుకు అనుమతి ఇవ్వక పోవడం వెనక మతలబు ఏంటి? రేపటి ఉప ఎన్నిక ప్రచారంలో, బీజేపీ నాయకులు దీనికి సమాధానం ఇచ్చి తీరాల్సి ఉంటుంది.

ఐఐటీ స్థాపించి ఐదేళ్లు దాటుతున్నా, ఇప్పటికి స్వంత భవనాలు పూర్తి స్థాయిలో రాకపోవటం రహస్యమేమీ కాదు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న 42 నగరాలలో భాగంగానే.. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, కాకినాడ లాంటి పట్టణాలు ఎంచుకున్నారే తప్ప, అదేదో తిరుపతిపై అమిత ప్రేమ ఉన్నట్లు కాదన్నది తిరుపతి వాసుల అభిప్రాయం. మరొక జాతీయ ప్రాచ్య విద్య సాంకేతిక విద్యాలయం ప్రకటించి, అయిదు సంవత్సరాల పైనే అయింది. అది కూడా ఇంకా ప్రకటనలకే పరిమితి అయిందన్నది స్థానికుల మనోగతం.

దుగ్గరాజపట్నం ఓడరేవుకు సంబంధించి, కృష్ణ పట్నం పోర్టుకి ఉన్న సాంకేతిక న్యాయపరమైన అంశాలు, ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకున్నట్లు లేవు. మరి అప్పుడే బీజేపీ దానిని కూడా తన ఖాతాలోకి వేసుకోవడమే ఆశ్చర్యం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్నవరంలో ‘భేల్’ కంపెనీ వేల కోట్లతో రాబోతుందని, కొన్ని బిల్డింగులు కూడా కటి, ్ట చివరికి తమిళనాడుకు తరలించింది. బీజేపీ నేతల తాజా హడావిడి అదేతీరుగా ఉందన్నది స్థానికుల గట్టి నమ్మకం. వీటిపై మరింత స్పష్టత ఇస్తేనే.. బీజేపీ నేతల విశ్వసనీయత, చేస్తున్న ప్రకటనలకు నమ్మకం ఉంటుందన్నది, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ల మనోగతం. మరి తిరుపతి ఉప ఎన్నికల కోసం ఇప్పటినుంచే, నగరంలో బైఠాయించిన బీజేపీ మహానాయకులు ఆ స్పష్టత ఇవ్వగలరా?

– ఓ.వి.రమణ
(టిటిడి బోర్డు మాజీ సభ్యుడు, జనతాదళ్ జాతీయ మాజీ అధికార ప్రతినిధి)