అమరావతిలోనే రాజధాని ఉంటుంది

614

రాజధాని రైతులకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హామీ

అమరావతిలోనే రాజధాని ఉంటుందని, భూములచ్చిన రైతులకు పట్టాలిచ్చేలా ప్రభుత్వంపై ఉద్యమం తెస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గసభ్యులు కుమారస్వామి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులతో సోము వీర్రాజు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని భాజపా నిర్ణయించిందన్నారు. భూములిచ్చిన 29 వేల మంది రైతులకు 64 వేల పట్టాలివ్వాలని, మిగిలిన 9 వేల ఎకరాలు భూమిని అభివృద్ది చేయాలని ఈ ప్రభుత్వంపై భాజపా వత్తిడి తెస్తుందన్నారు. వైకాపా ప్రభుత్వం ఇవ్వకుంటే ప్లాట్లు మేమే ఇస్తామని, భూమిని అభివృద్ధిచేస్తామన్నారు. ఇందులో రెండో మాటకు తావులేదన్నారు. దీనిని 50 సార్లు చెప్పినా ప్రసారమాధ్యమాలు సరిగా ప్రజలకు చేరనీయకపోవడం వల్ల రైతుల్లో అపోహ పెరిగిందన్నారు.

రాజధాని విషయంలో గత ప్రభుత్వం చెప్పిన దానిని నమ్మి వారు చెప్పింది చేశామని అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాజధానిని కడతామని చెప్పి క్టడం లేదన్నారు. తెదేపా, వైకాపా రెండూ కుటుంబ పార్టీలని తమ కుటుంబాల అభివృద్ది తప్ప ప్రజల అభివృద్ది గురించి ఆలోచించవని ఆరోపించారు. రైతులు ఈ పార్టీల మోసంలో ఇరుక్కుపోయారని ఆవేదన చెందారు. భాజపాది సకల జనుల పార్టీగా అభివర్ణించారు. కుటుంబ వ్యవస్థల్ని పరిష్కరించి సమూల అభివృద్ది చేయాలని భాజపా ఆలోచిస్తుందన్నారు.

చేయాల్సినవన్నీ చేశాం
కేంద్ర ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి చేయాల్సిన వన్నీ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల హడ్కో అప్పుతో సహా రూ.7,200 కోట్లు ఇచ్చిందని చెప్పారు. చంద్రబాబు ఈ రూ.7,200 కోట్లతో ఏం ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం రూ. 1,800 కోట్లతో నిర్మించే ఎయివ్‌‌సు ఎంత అద్బుతంగా ఉందో చూడాలన్నారు. అలాగే మరో పక్క రూ.600 కోట్లతో అగ్రివర్శిటీ, పక్కనే డిజైన్ జాతీయ విద్యాసంస్తను నిర్మిస్తుందని వీటిని రైతులు గుర్తించాలన్నారు. అయితే వీటికి రాష్ట్ర ప్రభుత్వం రోడ్డివ్వలేదని విమర్శించారు. రాజధాని ఇవ్వలేదని మేం నిధులు ఆపలేదు కదా అని రైతులను ప్రశ్నించారు. అమరావతి రైతుల కోసం కేపిటల్స్ గెయిన్స్‌తో సహా కేంద్ర ప్రభుత్వం చేయదగినదంతా చేస్తోందన్నారు. వ్యక్తులు చేసే పనుల వల్ల మనలాంటి వ్యవస్ధలు బలైపోయారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం ఏర్పాటైన పార్టీగా స్పష్టం చేశారు. భాజపా ప్రధానులు దేశాభివృద్ధికి, మౌలికసదుపాయాలకు, సాంకేతిక అభివృద్ధికి ఎంతో కృషిచేశారన్నారు. పదవీ కాంక్షతో భాజపా పనిచేయదని చెప్పారు. రాష్ట్ర అభివృద్దికి 6 లైన్ల రహదారులు, రైల్వే ట్రాక్‌లు, వంతెనలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో భాజపా కేంద్ర కార్యాలయం ప్రారంభించామని, త్వరలో పర్మనెంటు కార్యాలయం కూడా నిర్మిస్తామని అన్నారు. అమరావతి రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని, వారి తరపున ఉద్యమం చేసి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.