అదే కద..అదే కదా..అదే కథ?

484

‘గ్రేటర్’లో మారిందేమిటి?
‘కారు’ కథకు ‘కమలం’ ముగింపు చెబుతుందా?
గెలిచి బీజేపీ సాధించేదేమిటి?
బీజేపీ అసలు లక్ష్యం ఓట్ల శాతమేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అవే వార్డులు.. అవే పార్టీలు.. అవే ఓటర్లు… అవే ఎన్నికలు.. అదే కదా? మరి అదే కథ! కానీ ఈసారి ఎన్నికల్లో మారిందేమిటి? మారిందల్లా నినాదాలు- యుద్ధవాతావరణం. బరిలో ఉన్న రెండు ప్రధాన పార్టీలకూ గ్రేటర్‌పై జెండా ఎగురవేయాలన్నదే లక్ష్యం. ఒకటి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, రెండు ప్రతిపక్షంలోని బీజేపీ. ఎలాగూ మజ్లిస్ పాతబస్తీకే పరిమితం. అది ఎలాగూ టీఆర్‌ఎస్ ఫ్రెండ్లీపార్టీనే. కాంగ్రెస్- టీడీపీ సోదిలేనే లేవు. కాంగ్రెస్‌కు ఒక అరడజను, టీడీపీ ఉన్న ఒక్క సీటు నిలబెట్టుకుంటే అదే ఎక్కువ. ఇక ఉన్నది టీఆర్‌ఎస్-బీజేపీ మాత్రమే. ఎలాగూ టీఆర్‌ఎస్‌కు 36 మంది కోఆప్షన్ సభ్యులు, మజ్లిస్ సభ్యుల దన్ను ఎలాగూ ఉంటుంది. మజ్లిస్‌కు వచ్చే 40 సీట్లు ఎలాగూ టీఆర్‌ఎస్‌కే సమర్పిస్తుంది. అంటే 80-82 సీట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ అయినట్లే లెక్క! ఇక టీఆర్‌ఎస్ నికరంగా ఓ 40 సీట్లు సాధిస్తే సరి. అంటే అధికారపీఠం అధికారపార్టీదేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మరిప్పడు ఎన్నికల్లో ఏమిటీ కొత్తదనం? ఎందుకీ కొత్తతరహా పెనుగులాట? మారిన ఆ కథేమిటి? అదేదో చూద్దాం.

దుబ్బాక ఉప ఎన్నిక విజయం టానిక్‌లా మారిన కమలదళం, ఆ ఊపును గ్రేటర్‌లోనూ కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే.. ఇక బీజేపీకి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఇదే ఆఖరి ఎన్నిక. ఎలాగూ వరంగల్,ఖమ్మంలో ఆ పార్టీ హవా తక్కువ. కాబట్టి దీనినే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌కు ఎంచుకుందన్నది బహిరంగం. అందుకే చావోరేవో అన్నట్లు, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీబరిలోకి దూకింది. అమిత్‌షా, నద్దా, స్మృతిఇరానీ, యోగి వంటి అగ్రనేతల రాక, ప్రచార హడావిడి ఆంతర్యం అంతా.. గ్రేటర్‌లో బలపడితే, రానున్న ఎన్నికల్లో తామే ప్రధాన ప్రతిపక్షానికి వస్తామన్న సంకేమివ్వడమే. ఆ మేరకు సీట్లు కాకపోయినా, ఓట్ల శాతం గణనీయంగా పెంచుకోవాలన్నదే బీజేపీ అసలు లక్ష్యం. దానికోసమే ఈ హడావిడి, ఆత్రుత! అదీ అసలు రహస్యం!!

ఇప్పటివరకయితే బండి సంజయ్ సార ధ్యం.. వ్యూహాలు, ఎత్తుగడ, ప్రచారంలో.. అధికారపార్టీకి అందనంత దూరంగా దూసుకుపోతోంది. బీజేపీ హడావిడి, కార్యాచరణ కార్యరూపం దాలిస్తే మంచిదే. కేంద్ర నిఘా సంస్థలు కూడా ఆ పార్టీకి 18-23 వరకూ రావచ్చని నివేదికలిచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు నాలుగు నుంచి అందాకా ఎదగడం గొప్ప విషయమే. అలాకాకుండా.. బీజేపీ నేతలు చెబుతున్నట్లు 60-80 సీట్లు వచ్చినా సంతోషమే. శ్రేణుల కష్టం ఫలించినట్టవుతుంది. దానికీ సంజయ్ వ్యూహమే కారణమని చెప్పాలి. కానీ, ఫలితాలు మొన్నటి- అంతకుముందునాటి మహాకూటమి హడావిడిగా మారితే, బీజేపీ భంగపడక తప్పదు. ప్రచారంలో జిమ్మిక్కులు ఓట్ల రూపం దాల్చితేనే కదా ‘ఫలితం’ ఉండేది?

గతంలో ఒకసారి టీడీపీ-టీఆర్‌ఎస్ కట్టిన మహాకూటమి, ఆ తర్వాత కాంగ్రెస్-టీడీపీ కట్టిన మహాకూటమి కూడా ప్రచారంలో ఇలాంటి హడావిడి, అంచనాలే సృష్టించింది. ముఖ్యంగా చివరి మహాకూటమి ఎన్నికయితే, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఒక్కటే తక్కువ అన్న భావన కలిగించింది. అంటే ఏ స్థాయిలో ప్రచారం నిర్వహించారో అర్ధం చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ, మహహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సర్వేకి వెళ్లినప్పుడు.. మెజారిటీ ప్రజలు, కేసీఆర్ సర్కారును విమర్శించారు. కాంగ్రెస్‌కు సానుకూలంగా మాట్లాడారు. ఆ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన జనాలను చూసి, కాంగ్రెస్‌లో సీఎం పదవిపై పోటీ కూడా మొదలయితే, టీడీపీ ఎమ్మెల్యేలకు ఏ శాఖ ఇవ్వాలన్న దానిపై చర్చ కూడా జరిగింది. ఇక బీజేపీలో కూడా కిషన్‌రెడ్డి సీఎం, లక్ష్మణ్ డిప్యూటీ సీఎం అనేంతవరకూ వ్యవహారం వెళ్లింది. అంటే ఎన్నికల ప్రచారంలో ఊపు, ఆ స్ధాయిలో కనిపిస్తుందన్నమాట.

అదే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ నియోజకవర్గాల పరిథిలో సర్వే నిర్వహించినప్పుడు, ప్రజలు కేసీఆర్‌కే ఓటు వేస్తామన్నారు. చివరకు సీమాంధ్ర, ఉత్తరాది సెటిలర్లు కూడా టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని చెప్పారు. మార్వాడీ, రాజస్థానీ ఇతర ఉత్తరాది వారు.. తాము టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే సేఫ్‌గా ఉంటామని, అదే లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీకే ఓటేస్తామని స్పష్టం చేశారు. ఫలితాలు కూడా అవే స్పష్టం చేశాయి కూడా! ఉత్తరాదివారున్న నియోజకవర్గాల్లో కూడా, బీజేపీ గెలవకపోవడాన్ని విస్మరించకూడదు. అది వేరే విషయం. కానీ విచిత్రంగా.. ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలు మళ్లీ కేసీఆస్‌కే జైకొట్టగా, గ్రేటర్‌లో మాత్రం అనుకున్నట్లుగానే టీఆర్‌ఎస్‌నే గెలిపించారు. అంటే ఫలితాలను తారుమారు చేయడానికి, ఒకటి రెండు రోజులు చాలన్న మాటలు నిజమేననిపించింది.

అమిత్‌షా ప్రచారానికి వచ్చిన జనాలను చూసి, తొలినుంచీ పార్టీలో ఉన్న వారెవరయినా ఆశ్చర్యపోకతప్పదు. సికింద్రాబాద్ వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్‌మండి వరకూ జరిగిన అమిత్‌షా కిలోమీటరు రోడ్‌షోలో, జనం కిక్కిరిసిపోవడం.. 1989లో అక్కడినుంచే జర్నలిస్టు ప్రస్థానం సాగించిన నాకు ఆశ్చర్యమనిపించింది. బీజేపీ కార్యక్రమాలకు ఎప్పుడూ ఆ స్థాయి జనం వచ్చిందిలేదు. పదుల సంఖ్యలో జరిగే పార్టీ కార్యక్రమాలు, వందలొస్తే మహా ఎక్కువగా కనిపించేది. ఎందుకంటే ఆ పార్టీది తొలినుంచీ లిమిటెడ్ వ్యవహారమే. కాకపోతే 10 మంది హాజరయినా, వందమంది వచ్చినంత బిల్డప్ ఎప్పుడూ ఉంటుంది. అదే బీజేపీ టెక్నిక్. బీజేపీకి నిజంగా అంతమంది కార్యకర్తలు, సానుభూతిపరులుంటే.. ఈపాటికి అది అసెంబ్లీ-గ్రేటర్‌లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఉండేదనిపించింది. పైగా అది ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కూడా. మరి అంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎప్పుడూ కనిపించని జనం అక్కడే ఎందుకు కనిపించారన్న ప్రశ్నలకు సమాధానం ‘మామూలే’. ఇలాంటి ‘కృత్రిమ జనక్షేత్రాన్ని’ ఏపార్టీ అయినా సృష్టిస్తాయి. కానీ.. ఇప్పుడు బీజేపీ కూడా ఆ పార్టీల జాబితాలో చేరడమే ఆశ్చర్యం.

సరే.. ఏ వార్డు పరిథిలోకి వచ్చేవారయినా.. ఆ కృత్రిమ జనక్షేత్రం కూడా ఓటర్లే కాబట్టి, వారంతా బీజేపీకి ఓటేస్తే సంతోషమే. కమలదళాల కష్టం ఫలించినట్లే. ఫర్వాలేదు. ముఖ్యంగా.. తమ పార్టీకి ఓటేయకపోయయినా, ‘నోటా’కయినా వేయండన్న మంత్రి కేటీఆర్ పిలుపు.. బీజేపీ నేతల మైండ్‌గేమ్ టీఆర్‌ఎస్ మీద బాగా పనిచేసినట్లు కనిపిస్తూనే ఉంది. ఎన్నికల్లో విద్యాధికులు కంప్యూటర్ల ముందు కాకుండా, పోలింగ్‌బూత్‌కు వెళ్లాలన్న కేటీఆర్ పిలుపు గతంలో చంద్రబాబును గుర్తుచేసింది.

ఇక ఈ ఎన్నికల్లో కమలదళాల కష్టం-వ్యూహం ఫలించి, టీఆర్‌ఎస్ ఓడిపోతే ఆ పార్టీకొచ్చే నష్టమేమీ లేదు. కాకపోతే, ఆ పార్టీ పని అయిపోయిందన్న ప్రచారం.. కేసీఆర్ హవా తగ్గిందన్న భావన.. బీజేపీకి ఇక తిరుగులేదన్న అభిప్రాయం బలపడుతుంది. కానీ, గ్రేటర్‌లో గెలిచి నిలిచే బీజేపీ.. తన మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడానికి, కేసీఆర్ సర్కారు సహకారం తప్పనిసరి. కార్పొరేషన్ తీర్మానాలను ప్రభుత్వం అంగీకరించకపోతే, ఒక్క పనీ జరగదు. అప్పుడు మళ్లీ కార్పొరేషన్-సర్కారు మధ్య సంఘర్ణణ తప్పదు. తాము అభివృద్ధి చేస్తే టీఆర్‌ఎస్ అడ్డుకుందని బీజేపీ… అధికారం లేకపోయినా సానుభూతి కోసమే బీజేపీ రాజకీయాలు చేస్తోందని, టీఆర్‌ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటాయి. ఈలోగా పుణ్యకాలం కాస్తా అయిపోతుంది.జరిగేది అదే.

సరే.. ఎన్నికల్లో ఎవరో ఒకరు మాత్రమే గెలవడం, మిగిలిన వారు ఓడిపోవడం సహజం. కానీ, ఈ ఒక్క ఎన్నికల్లోనే మున్నెన్నడూ విననన్ని పదాలు వింటున్నాం. శత్రుదేశాలపై చేసే సర్జికల్‌స్ట్రైక్స్, సమాధుల కూల్చివేత, దేశద్రోహుల వంటి మాటలు ఈ ఎన్నికల్లో మాత్రమే వినాల్సి రావడం బాధాకరం. అభివృద్ధిని కోరుకునే ఏ సిటిజనుడయినా ఇలాంటి హింసాత్మక పల్లవిని అంగీకరించడు.చెన్నారెడ్డి ముందు వరరూ ర్ఫ్యూలు చవిచూసిన నగర ప్రజలకు, మళ్లీ భూతాన్ని చూపించడం బాధ్యతరాహిత్యం కాదా? తెలుగుజాతిని వెలిగించిన పివి, ఎన్టీఆర్ సమాధులు కూల్చేస్తామంటున్న పార్టీలు, మరి ఎఫ్‌టీఎల్ సమస్య ఉన్నందున ఆగ్రా తాజ్‌మహల్, ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్నందున చార్మినార్‌ను కూల్చేస్తామంటే అంగీకరిస్తాయా? క్షుద్రరాజకీయాల కోసం ఇలాంటి పదాలు వాడితే, నగరంలో ఉండేందుకు, నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరయినా ముందుకువస్తారా? దీనికి అన్ని పార్టీలూ బాధ్యులే కదా?! ఎవరు గెలిచినా ఆ విజయం భాగ్యనగరవాసిదే కావాలి.