ఫవన్‌ను..ఫ్రకాష్‌రాజ్ ఫొగిడారా?తిట్టారా?

577

( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

కన్నడిగుడయినా, విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ అచ్చ తెలుగులో ఊసరవెల్లి పదాన్ని బాగానే వాడారు. ఇంతకూ ఆయన ఆ పదప్రయోగం చేసింది ఎవరిపైనో తెలుసా? జనసేనాధిపతి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాడికిందపడేసిన మన ఫవన్‌కల్యాణ్ గురించి! అవునా ప్రకాష్‌రాజ్ మన జనసేనాని గురించి అంతేసిమాటలన్నారా అని వెంటనే  ఉడుక్కోకండి. కొద్దిగా పొడిగే ప్రయత్నం కూడా చేశారండీ!

ఒక నాయకుడయి ఉండీ, ఆయనకో పార్టీకూడా ఉండీ, మరో పార్టీకి మద్దతునివ్వడం తనకు నచ్చలేదని కూడా చెప్పారు. అంటే ఆ లెక్కన కల్యాణ్‌బాబును నాయకుడిగా ప్రకాష్‌రాజ్ గుర్తించినందుకు, అన్నదమ్ములిద్దరితోపాటు, జనసైనికులు ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం, తనను నిరుత్సాహపరిచిందని కూడా మనసులో మాట చెప్పారు. అంటే.. జనసైనికుల లెక్క ప్రకారం.. ప్రకాష్‌రాజ్, ఫవనన్నయ్యను ఫొగిడినట్లుగానే భావించాలి.

గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం ఎంతో తెలిసి కూడా, ఫవన్ ఆ ఫార్టీతో ఫొత్తు ఫెట్టుకోవడం ప్రకాష్‌రాజ్‌కు సుతరామూ నచ్చలేదట. ఏం చేస్తాం? ఫీత కష్టాలు ఫీతవి. ఫవన్ కష్టాలు ఫవన్‌బాబువి మరి! అప్పటికీ రెండురోజులు ఢిల్లీలో అంతచలిలో కూడా, నద్దా గారి దర్శనభాగ్యం కోసం ఎదురుచూస్తే, రెండోరోజు ఆ భాగ్యం కలిగింది. ఆ భేటీలో ఫవన్ విశ్వరూపం ప్రదర్శించారని జనసైనికుల కథనం.
ఏపీలో బీజీపీ బలం ‘పాయింట్ ఎయిట’న్న విషయాన్ని పవన్‌కు,  ప్రకాష్‌రాజ్ నొక్కివక్కాణించి మరీ గుర్తుచేయడమే ఏమీ బాగోలేదు.  సరే.. ఫవన్‌కూ వేరే దిక్కులేదు. ఇప్పటికే అన్ని పార్టీలతో దోస్తానా అయిపోయింది. ఇక మిగిలింది బీజీపీనే. ఈ వయసులో ఆయన మాత్రం ఇంకా ఎన్నిపార్టీల చుట్టూ తిరుగుతారు చెప్పండి? అమరావతి, గ్రేటర్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక యవ్వారంలో, ‘కమలం’ తనను ‘పులుసులోముక్క’ను చేసి ఆడిస్తున్నా.. చేగువేరా టైపులో తిరగబడకుండా, చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితిపై ఎవరికీ చెప్పుకోలేని దైన్యం.

అసలింతకూ ప్రకాష్‌రాజ్ బాధేమిటో అర్ధం కావడం లేదు. మా ఫవన్ ఎవరికి సఫోర్టు చేస్తే ఆయనకెందుకు? గ్రేటర్ ఎన్నిక ల్లో పోటీ చేయాలని ఏదో తెలియక ఆవేశపడ్డారనుకోండి. తొందపడి ముందే కూసినట్లు, అభ్యర్ధుల పేర్లు కూడా ఎంపిక చేసే హడావిడి కూడా చేశారనుకోండి. అయినా జనసేనతో పొత్తు జాన్తానై అని, కమలదళపతి సంజయ్ చెప్పిన తర్వాత, సరే మీ ఇష్టమని గౌరవప్రదంగా చేతులెత్తేశారే అనుకోండి. అంతమాత్రాన.. ఒకప్పుడు టీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు వచ్చేందుకు పోరాడిన, మా ‘ఆంధ్రా చేగువేరా’ను ప్రకాష్‌రాజ్ అంత అవమానిస్తారా? అయినా.. గ్రేటర్‌లో పోటీ చేయనందుకు ఫవనన్నయ్య ఫీలవ్వాలి గానీ, మధ్యలో ఈ ఫ్రకాష్‌రాజ్‌కెందుకు? అని జనసైనికులు తెగ ఫీలవుతున్నారట. ఫోనీలెండి.. ఫాఫం ఫవన్ ఫ్రతాపం తెలియక, ఏదేదో మాట్లాడిన ఫ్రకాష్‌రాజ్‌ను క్షమించేద్దాం. ఓకేనా?