పాట్నా-తిరుపతి వయా దుబ్బాక

ఒకే వ్యక్తి ఆలోచనలు.. అభిప్రాయాలు.. కోటలకందని మాటల మూటలు.. అవసరానికి అనుగుణంగా వస్త్ర ధారణ.. వీటికి మించి ఎన్నికల్లో తానే సర్వాంతర్యామి. ఇదే భారతీయుల అదృష్టం అన్నట్లు, సోషల్ మీడియాలో పోటాపోటీ విపరీత ప్రచారం. ఇవన్నీ దేశ ప్రధాని మోదీ గురించేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ దేశ ప్రజల ఖచ్చితమైన నాడీ శాస్త్రం తెలిసిన ఏకైక ధీరుడు నరేంద్రుడు మాత్రమే!

అందరూ ఊహించిన విధంగానే.. బీహార్ ఎన్నికలలో అన్నీ తానై వ్యవహరించినా, చివరకి బొటాబొటి స్వల్ప అధిక్యతతో, అంతర్జాతీయ బ్రాండ్ కల్పించుకున్న ఆ ధీరుడు.. కొన్ని దశాబ్దాలు ‘జంగిల్ రాజ్’ టైటిల్ సంపాదించుకున్న, 31 వసంతాల కుర్రాడి ముందు.. ఈ అంతర్జాతీయ బ్రాండ్ చిన్నపోయింది. కరోనా సమయంలో వలస కార్మికులు, దేశం నలుమూలల నుండి ఎన్నో ప్రయాసాలతో , ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అడుగడునా ఆడిపోసుకుంటు గమ్యం చేరుకున్నారు. వారి ఆగ్రహాగ్నిని గమనించిన కేంద్రం, ఆ కష్టాలు మర్చిపోయేలా తాయిలాలు కుమ్మరించారు. దరిమిలా బీహార్‌లో పట్టం కట్టలనుకున్న అధికారం, ఆ యువకునికి చేరువ కాలేకపోయిందన్నది నిజం. ప్రలోభాలు- తేనెలాంటి మాటలు- కరోనా తాండవంలో మసి అయిన గుర్తులు- ఆ కసి, అన్నీ కేంద్రం ప్రలోభాల ముందు బలాదూర్ అయ్యాయి.ఎందుకంటే దేశంలో అత్యధిక ప్రాంతాలకు వలస వెళ్లింది బీహారీ కూలీలే.

అధికార పార్టీ స్థానాల్లో ఎక్కువ శాతం, తక్కువ అధిక్యత. గతం తో పోలిస్తే కూటమికి సీట్లు, ఓట్లు తగ్గటం మార్పునకు మొదటి సంకేతం. గతంలో మాదిరిగా మోదీ ఇచ్చిన ప్రతి పిలుపునకు దేశం ఒక్క తాటిపై స్పందించింది, కానీ కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ‘వీరాజవాన్ల స్మృతికి జ్యోతులు వెలగాలి’ అన్న పిలుపు, పెద్దగా స్పందనకు నోచుకోకపోవ డానికి కారణం.. నమ్మిన వ్యక్తి పై నమ్మ ం సన్నగిల్లడమే! దేశ ప్రజల ఆలోచన సరళి మారుతోందని చెప్పటానికి తాజా ఎన్నికల్లో జరిగిన వోటింగ్, ఓటర్ నాడి ఓ ఉదాహరణ. ఎక్కువ స్థానాల్లో బీజేపీ అనుబంధ పార్టీలు అధికారం చేజిక్కించుకున్నా, వోటింగ్‌లో గతం కంటే వెనక బడ్డారని గణాంకాలు చెబుతున్నాయి.

ఇక దుబ్బాక కిక్‌లోకి వెళదాం. దానిని మీడియాలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా హైలెట్ చేసింది. ఇక ఆంధ్ర, తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే తరువాయి అన్న స్థాయిలో, ఆ పార్టీ శ్రేణి ఉవ్విళ్లూరిన తరుణం అది. అది క్షేత్ర స్థాయి వాస్తవాలు- బలాబలాల్ని అంచనాలు వేయటంలో జరిగిన తప్పిదం. బహుశా దుబ్బాక కిక్ నుండి ఇంకా తెరుకోలేక పోవటమే, దానికి కారణం కావచ్చు. దుబ్బాక బీజేపీ విజయం స్వల్ప ఆధిక్యం అయినా, గెలుపు గెలుపే . అయితే జాతీయ విశ్లేషకుల పరిశీలన మరోలా ఉంది. టిఆర్‌ఎస్ పట్ల నిర్లిప్తత, ఆగ్రహం తెలంగాణ రాష్ట్రమంతా విస్తరించనుందన్నది మీడియా ప్రచార సారాంశం. నిజానికి దుబ్బాక నియోజక ప్రజలకు, ముందున్న శాసన సభ్యుడు, అభివృద్ధి విషయంలో గాని, అందుబాటులో లేరు. ఆయన కుమారుడిపై విపరీతమైన ఆరోపణలున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఎంపిక లోపం కూడా బీజేపీ విజయానికి మరో కారణం. పైగా అప్పటికే రఘునందన్‌రావు రెండుసార్లు ఓడిపోయారు. అయినా ఆయన అక్కడే నిలబడి పొరాడారు. దానితో సంపాదించుకున్న కొద్దిపాటి సానుభూతి. వెరసి ఏదో అలా గెలిచాం. గెలిపించుకున్నాం అన్న చిన్న తృప్తి. నిజానికి, దుబ్బాకలో టీడీపీ పోటీ చేసి ఉంటే , ఆ పార్టీకి హీనపక్షం ఐదారువేల ఓట్లు వచ్చేవి. అవి టీఆర్‌ఎస్ విజయం, బీజేపీ ఓటమికి కారణమయ్యేది. ఎందుకంటే బీజేపీ సాధించింది 1100 మెజారిటీ మాత్రమేనని విస్మరించకూడదు. ఇక్కడ అర్థంకాని విషయం ఏమిటంటే.. దుబ్బాకలో బీజేపీ ప్రభంజనం- నరేంద్రుడి వెలుగు జిలుగులు ఏమయ్యాయి? నిజంగా మోదీ వెలుగు బ్రహ్మాండంగా ఉంటే, దుబ్బాకలో అత్తెసరు మెజారిటీ ఎలా వస్తుంది? అక్కడ టీడీపీ పోటీ ఉంటే, ఇప్పుడు తిరుపతిలో బీజేపీ నేతలు అంత అత్యుత్సాహం ప్రదర్శించేవారా? అన్నవి ప్రశ్నలు.

ఇది ఆదర్శం అనుకున్నారేమో.. తిరుపతిలో విజయ ఢంకా మోగించబోతున్నాం అన్న ప్రచారం ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నాయకుల ప్రెస్ మీట్లు చూస్తే, ఈ ప్రచారం చేస్తున్న వారికి, స్ధానిక రాజకీయ అంశాలపై పెద్దగా అవగాహన లేదేమోననిపిస్తుంది. గతంలో టీడీపీ మద్దతుతో ఒకే ఒకసారి బీజేపీ నెగ్గింది తప్ప, మరే ఎన్నికల్లో గాని ఒక స్థాయి ఓట్లు కూడా సాధించలేదన్నది విస్మరించకూడదు. సొంతంగా ఒక లోక్‌సభ సీటు గెలిచేంత బలం, బీజేపీకి ఇప్పట్లో కష్టమే. సాక్షాత్తు నరేంద్రమోడీ.. తిరుపతిలో 2014 జరిపిన ఎన్నికల ప్రచారం, ఇక్కడ ప్రభావం చూపించలేక పోవటం మరో విశేషం. ప్రధాని ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు. అసలు తిరుపతిలో లీడర్స్, క్యాడర్ మొత్తం కలిపితే కనిపించేది కేవలం 52 మంది. మరి ఈ బలం తోనే, ఎలా విజయ శంఖారావాన్ని పూరిస్తారు? ఏమో.. వారి వద్ద కనికట్టు ఏదయినా ఉందేమో?

బీజేపీ శ్రేణుల వాణి.. కొన్నేళ్లుగా తిరుమల దేవస్థానం కేంద్రంగా విమర్శలు, చర్చలకే పరిమితం అయింది. ఇక్కడి ప్రజల ఈతి బాధలు, అవసరాలకు అనుగుణంగా నోరు విప్పటం గాని అవసరాలకు మద్దతుగా ఉద్యమించిన దాఖలాలు పెద్దగా లేవు. ఈ నేపధ్యంలో ఆ పార్టీ , ప్రధానమంత్రి ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికి అంతర్జాతీయ విమానాల మంజూరు కాలేదు. ( కొన్నివేలమంది ఉద్యోగం కోసం కువైట్ లాంటి దేశాలకు వెళ్తున్న దరిమిలా) దాదాపు అదే కాలంలో ప్రారంభించిన మరొక పుణ్యక్షేత్రం తిరిచిలో, కొన్నేళ్లుగా అంతర్జాతీయ విమానాల మంజూరు చేశారు. దీనికి ఏమని సమాధానం ఇస్తారో కాలమే నిర్ణయిస్తుంది.

– ఓ.వి.రమణ,(టిటిడి బోర్డు మాజీ సభ్యుడు, జనతాదళ్ జాతీయ మాజీ అధికార ప్రతినిధి)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami