అమిత్‌షా ప్రచారం….ఈసారయినా అచ్చొచ్చేనా?

465

‘గ్రేటర్’ రోడ్‌షోకు రానున్న అమిత్‌షా
గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. కేంద్రమంత్రులు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారంతో, గ్రేటర్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలయిన అమిత్‌షా, నద్దా, యోగి ఆదిత్యనాధ్ కూడా ప్రచారబరిలో దిగుతున్నారు. వారి రాకతో కార్యకర్తల్లో ఊపు-ఉత్సాహం పెల్లుబుకుతోంది. అగ్రనేతల ప్రచారం వల్ల, పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయన్నది వారి ధీమా.

ముఖ్యంగా బీజేపీని.. తెరవెనుక నుంచి నడిపిస్తోన్న కేంద్రహోంమంత్రి అమిత్‌షా ప్రచారం, కమలనాధుల్లో కోటి ఆశలు పెంచింది. ఆయన గ్లామర్ వల్ల తాము, విజయతీరాలకు చేరతామన్న ధీమాతో ఉన్నారు. అమిత్‌షా అంతటి అగ్రనేత నగరానికి వస్తారంటే, బీజేపీ జాతీయ నాయకత్వం, గ్రేటర్ ఎన్నికలకు ఏ స్ధాయిలో ప్రాధాన్యం ఇస్తుందో అర్ధమవుతుంది.
అయితే.. ఇప్పటివరకూ అమిత్‌షా తెలంగాణ సహా, నగరంలో చేసిన ప్రచారం పరిశీలిస్తే, ఆయన ప్రచారం చేసిన చోట… ఎక్కడా పార్టీ గెలవని విషయాన్ని, పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన, ముషీరాబాద్ నియోజకవర్గం పరిథిలోని రాంనగర్ నుంచి అంబర్‌పేట నియోజకవర్గం మీదుగా ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో అటు కిషన్‌రెడ్డి, ఇటు లక్ష్మణ్ ఇద్దరూ ఓడిపోయారు.

తాజాగా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి అమిత్‌షా రానున్నారు. ఆయన రూట్‌మ్యాప్ ఇంకా ఖరారుకానున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లేదా ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఒకచోట, కేవలం ఒక కిలోమీటరు రోడ్ షో ఉండేలా చూస్తున్నారు. ఆ మేరకు లక్ష్మణ్, గరికపాటి మోహన్‌రావు కొన్ని ప్రాంతాలు పరిశీలించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఈసారి అమిత్‌షా ప్రచారం, గ్రేటర్ అభ్యర్ధులకు అచ్చొస్తుందో లేదో చూడాలి. అంత పెద్ద జాతీయ అగ్రనేత ప్రచారం చేసినచోట పార్టీ గెలవకపోతే, పార్టీతోపాటు అటు అమిత్‌షాకూ అప్రతిష్ఠనే కదా!

– మాసుమ