కారు మబ్బులు చీల్చుకు వచ్చిన స్వేచ్ఛా భానుడు బాబాసాహెబ్ 

0
178

అత్యుత్తమమైన భారతరత్న బిరుదాంకితుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. భారత దేశ రాజ్యాంగ నిర్మాత. నిమ్న కులస్థుల ఉద్దరణకు, అస్పృశ్యతా నిర్మూలనకు కృషిచేసి సామాజిక న్యాయంకోసం కొన ఊపిరి ఉన్నంతవరకు పోరాడిన మహానుభావుడు. మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలో వున్నా రత్నగిరి జిల్లాలోని అంబవాడ గ్రామంలో 1891 ఏప్రిల్ 14వ తేదీన ఆయన తల్లిదండ్రులకు 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించారు. తండ్రి రాంజీ సక్పాల్, తల్లి భీమాబాయి. బాలునిగా ఉన్నప్పటి నుండి అనేక చేదు అనుభవాలను పొందాడు. కానీ అంబేద్కర్, కృష్ణాజీ అర్జున కేలూస్కర్లనే ఇద్దరు బ్రాహ్మణ ఉపాద్యాయులు ఆయనను ఆదరించారు. మరాఠీ, హిందీ, ఆంగ్లము, పర్షియన్ మొదలగు భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. రోజుకు 18 గంటల పాటు నెలల తరబడి అవిశ్రాంతంగా పరిశోధన చేస్తూ తన జ్ఞానయజ్ఞాన్ని సాగించి రాజనీతి శాస్త్రము, సామాజిక శాస్త్రము, ఆర్ధిక శాస్త్రములపై పట్టు సాధించారు. భారతదేశ జాతీయాదాయం – చారిత్రక విశ్లేషణాత్మక అధ్యయనం అనే సిద్దాంత గ్రంధాన్ని సమర్పించి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. లండన్ నుండి సైన్స్ లో డాక్టరేట్ పొందాడు. గ్రేస్ ఇన్ ఫర్ లా లో చేరి న్యాయశాస్త్ర అధ్యయనం చేసి బారిష్టర్ అయ్యారు. అనేక అంశాలపై వ్యాసాలూ వ్రాసి ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాడు. దళిత జనోద్దరణకు 1920లో మూక నాయక్ (మూగ ప్రజల నాయకుడు) అనే పక్ష పత్రికను వెనక వుండి నడిపించారు. 1927లో బహిష్కృత భారత్ అనే పక్ష పత్రికను ప్రారంభించారు. సమానత్వం ప్రాతిపదికపై సమాజ పునర్నిర్మాణం కోసం బహిష్కృత హితకారిణి  సంస్థను ఏర్పాటు చేసి నిర్వాహక సమితి అధ్యక్షుడైనాడు. మహద్ పోరాటం చేసి దళిత నాయకునిగా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత బ్రిటీషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు ద్వారా హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. కాని అంబేద్కర్ గాంధీజీతో పూనా ఒడంబడిక చేసుకుని ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా కాంగ్రెసు హరిజన అభ్యర్ధులను నిలిపెటట్లుగా అంగీకరింపజేశారు. ఆ విధంగా కాంగ్రేసు ప్రభుత్వం ఏర్పరచటం సాధ్యం చేశారు అంబేద్కర్. ముస్లిం, క్రైస్తవ మతాధికారులు అంబేద్కర్ ను తమవైపు ఆకర్షించడానికి పరిపరి విధాలుగా ప్రయత్నించారు. జాతీయాభిమాని, హిందూ ధర్మాభిమాని అయిన అంబేద్కర్ బాహాటంగానే నిర్భయంగా వారిని తిరస్కరించారు. కులతత్వం పోవాలి కానీ మా ధర్మం మాకుండాలి అనే భావాన్ని వ్యక్తం చేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక న్యాయశాఖ మంత్రి అయినాడు. రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ అయినారు. తన మేధా సంపత్తితో, విద్యా ప్రతిభతో ఉన్నత శిఖరాలను చేరి భారత రాజ్యాంగానికి రూపురేఖలు ఇచ్చి అభినవ మనువుగా కీర్తిగాంచారు. అస్పృశ్యతను పాటించేవారికి శిక్ష విధించే బిల్లును 1953లో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. శాంతి కోసం, న్యాయం కోసం తహతహలాడుతూ ఆరాటం చెందుతున్న తోటి హరిజనులు కమ్యూనిజం కోరలకు చిక్కకుండా రక్షించడం కోసం లక్షలాది మందితో కలసి 1956 అక్టోబరు 14న బౌద్ద మతాన్ని స్వీకరించారు డాక్టర్ అంబేద్కర్. అస్పృశ్యత అనే సమస్యను పరిష్కరించడానికి భారతీయ సంస్కృతీ చరిత్రలకు హాని చేయని మార్గాన్ని అనుసరించడమే ఆయన నిర్ణయాలకు ప్రాతిపదిక. 1956 డిసెంబరు 6ణ ఆయన అంతిమ శ్వాస విడిచారు.

సాంఘిక దురాచారాలకు లొంగక వాటిని ఎదిరిస్తూ ఆజన్మాంతం పోరు సల్పిన యోధుడు అంబేద్కర్. పీడితులు, ఉపేక్షితులు సగర్వంగా తలెత్తుకు తిరగాలి, అంతరాలు, అపోహలు తొలగి సమతా మమతలు వెల్లివిరియాలన్నదే ఆయన ఆకాంక్ష. అంబేద్కర్ త్యాగమయ, కర్మమయ, తపోమయ జీవనుడు. ఆయన వాణి, బాణి, నాయకత్వ లక్షణం, సంఘటనా దక్షత అందరినీ కలుపుకుంటూ ముందుకు పోవడంలో ఆయన చూపిన ప్రతిభ విలక్షణమైనవి, విశేషమైనవి కూడా. నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఆత్మవిశ్వాసంతో సుదీర్ఘ పోరాటం సాగించిన యోధుడాయన. ఆయన పడుతున్న పాట్లు, మనసులోని వేదన ఆయన రచనలలో ప్రసంగాలలో వ్యక్తమయ్యేవి. ఆదర్శవాదం, దేశ భవిష్యత్తుకు సంబంధించిన దూరదృష్టి ఆయన జీవన అంతస్సూత్రాలు. బుద్దునివలె ఈయన కూడా భారతీయ జనతకు విద్య, పోరాటం, సంఘటన, పునర్నిర్మాణం, ఐక్యత అనే అయిదు సూత్రాలను బోధించారు డాక్టర్ అంబేద్కర్. అందుకే ప్రతి ఒక్కరు ప్రేమాభిమానాలతో ఆయనను “బాబాసాహెబ్” అని పిలిచేవారు.

vskandhra