రాజకీయాలు అంటని ప్రజా నాయకుడు

740

చాలా సంవత్సారాల క్రితం మాట…రాజ్యసభలో కొంతమంది స్నేహితులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళల్లోఒకరు కాంగ్రెస్ పార్టీకి, ఒకరు కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారు కాగా, మరొకరు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న కార్మిక సమాఖ్య, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కి అనుబంధ సంస్థ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ స్థాపకులు శ్రీ దత్తోపంత్ ఠేంగ్డీ. ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపకులు, భారతీయ జనసంఘ్ రూప శిల్పులలో ఒకరు అయినటువంటి అత్యంత ప్రభావవంతమైన సంఘ్ ప్రచారక్.

అప్పుడు కాంగ్రెస్ కి చెందిన నాయకుడు అదొక రకంగా నవ్వుతూ”రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపకులు ఎవరు?”

అని ప్రశ్నించాడు. “డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్” అని బదులిచ్చారు దత్తోపంత్. అప్పుడు ఆ కాంగ్రెస్ అతను హేళనగా మాట్లాడుతూ ”నెహ్రు ఎవరో ప్రపంచానికంతటికీ తెలుసు. కానీ హెడ్గేవార్ ఎంతమందికి తెలుసు” అన్నాడు.

అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఆయన కలుగజేసుకుంటూ, “మిత్రమా, ఒక వ్యక్తి యొక్క గొప్పతనము ప్రస్తుతం ప్రజా జీవితం లో అలంకరించి ఉన్న పదవినిబట్టి ఉండదు. చరిత్రలో అతను కలగచేసిన దీర్ఘకాలిక ప్రభావం, కాలక్రమంలో అతని ఉనికి యొక్క అవసరం మీద ఆధారపడి ఉంటుంది” అన్నాడు.

ఆ సంవత్సరం అప్పటి ప్రభుత్వం నిర్వహించిన నెహ్రు శతజయంతిని ప్రజలు పెద్దగా పట్టించులేదు. కానీ అదే సంవత్సరం జరుపుకున్నటువంటి డాక్టర్ కేశవ రావు శతజయంతి లో దేశంలోని ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొని, తమ పండగగా జరుపుకున్నారు.

ఆ సంవత్సరం సంఘ్ క్రొత్తగా సేవా విభాగాన్ని ప్రారంభించింది. వెయ్యి సేవా ప్రకల్పాలు ప్రారంభించాలని లక్ష్యం. 1,70,000 పైగా సేవా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. నేను వాళ్ళిద్దరినీ పోల్చి చూడటానికి ఈ విషయం చెప్పడం లేదు. డాక్టర్ హెడ్గేవార్ గారి యొక్క పూర్తి భిన్నమైన ప్రజా విధానం, అలాగే ప్రజా జీవితంలో రాజకీయాల గురించి చెప్పడం నా ఉద్దేశం.

రాజకీయాలను పూర్తిగా త్యజించడం, అయినప్పటికీ భిన్నమైన రీతిలో వాటిని ప్రభావితం చేయడం డాక్టరు కేశవరావు గారి యొక్క భిన్నమైన దృక్పధంగా చెప్పవచ్చు. కాల క్రమంలో సంఘ్ ఈ సిద్ధాంతానికే కట్టుబడి ఉంది. సంఘ్ ని అనుసరించేవారికి, డాక్టర్ కేశవరావు గారి గురించి కాస్తో కూస్తో చదివినవారికి ఆయన తన చిన్ననాటి నించే నిబద్దత కలిగిన దేశభక్తుడు అన్న విషయం అర్ధం అయి ఉంటుంది. కలకత్తా లో ఉన్నప్పుడు ఆయన క్రాంతివీరులతో కలసి పని చేశారు. ఆయన 1918 లో కాంగ్రెస్ లో చేరి, 1920 లో సహాయ నిరాకరణోద్యమం లో పాల్గొని, జైలుకి వెళ్లారు. కాంగ్రెస్ నడుపుతున్న ఒక పత్రికకు సంపాదకత్వం వహించి, దానికి చందాలు వసూలు చేయడం కోసం పల్లె పల్లెకీ తిరిగారు. సంఘ్ ని స్థాపించిన తరువాత కూడా ఆయన 1930 లో అటవీ సత్యాగ్రహం ద్వారా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ సందర్భాల్లో మరొక్క సారి ఆయన జైలుకి వెళ్లారు. రెండు తడవలుగా ఆయన మొత్తం 19 నెలల జైలు జీవితాన్ని గడిపారు.

1929 డిసెంబర్ లో కాంగ్రెస్ జనవరి 26 , 1930 ని సంపూర్ణ స్వరాజ్యంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చినప్పుడు, డాక్టర్ కేశవరావు సంఘ స్వయంసేవకులు అందరూ సంపూర్ణ స్వాతంత్య్రం విషయంలో కాంగ్రెస్ వైఖరిని మెచ్చుకుంటూ శాఖలలో జనవరి 26 న ఉత్సవం జరుపుకోవాలని కోరుతూ ఒక సూచనను పంపారు. ఈ విషయం లో ఆయనకి స్ఫర్ధ కానీ, అసూయ కానీ లేవు.

1920 లలో కాంగ్రెస్ లో మరియు కారాగారాలలో ఆయన ఎదుర్కున్న అనుభవాల గురించి ఆయన తీవ్రంగా ఆలోచించారు. హిందూ సమాజం కుల, మత, ప్రాంత ప్రాతిపదికన చీలిపోవడం, ఖిలాఫత్ ఉద్యమం తరువాత మోప్లాలు హింసకు పాల్పడితే ఎదుర్కోలేనంత బలహీనమైనవారుగా హిందువులు జీవించడం ఆయన గమనించారు. ఇలాంటి సంఘటనలే దాదాపు దేశమంతటా జరుగుతుండటం ఆయన చూశారు. ఒకప్పుడు గొప్పగా బ్రతికిన హైందవజాతి నిరోధించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇలాంటి హింసాకాండ యథేచ్ఛగా కొనసాగడానికి కారణం హిందువులలో ఐక్యత లేకపోవడం, తనకు గర్వకారణమైన గతాన్ని మరచిపోవడం అని ఆయన అర్ధం చేసుకున్నారు. ఈ బలహీనతను ఎలాగైనా తొలగించాల్సిందే. ఒకసారి సమాజంలోని హిందువులు ఐక్యతను సాధిస్తే, మిగిలిన సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి, అప్పుడు స్వాతంత్య్రం సంపాదించడం చాలా సులభం అని ఆయన భావించారు.

ఈ ఆలోచన 1925 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపనకు దారితీసింది. వ్యక్తిగత మోక్షసాధనలో నిమగ్నమైపోయి దేశం కోసం ఉమ్మడిగా ఆలోచించని హిందువులను సంఘటనం చేసే ఒక దీర్ఘకాలిక ఆలోచన ఇది. ఇంతకు మునుపు ఎప్పుడూ జరగని ప్రయత్నం ఇది. మత ప్రమేయం లేకుండా, భరతమాత గా పిలవబడే జాతిని ఔన్నత్యం వైపు నడిపించడానికి అంకితమైన సంస్థ ఇది.

1920 లో నాగపూర్ లో జరిగిన ప్లీనం సమయం లో ఆయన చేసిన కృషికి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటె ఆయన చాలా గొప్ప స్థానానికి ఎదిగి ఉండేవారు. కానీ ఆయన తాను సాధించదలచుకున్న అత్యున్నత లక్ష్యం కోసం తన రాజకీయ భవితను త్యాగం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు.

తన దీర్ఘకాలిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. స్వాతంత్ర్యాన్ని సంపాదించే శక్తి గల సంఘటిత హిందూ సమాజ నిర్మాణం ఆయన దీర్ఘకాలిక వ్యూహం. అందుకోసం క్రమశిక్షణ కలిగిన సంఘటిత శక్తి అవసరము. “ఆవరసమైతే ఈ దేశ పౌరులుగా స్వయం సేవకులు కాంగ్రెస్ పతాకం కింద కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటారు, అలాగే ఐక్యంగా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు” అని డాక్టర్జి చెప్పారు.

సంఘ్ తమతో కలిసి పనిచేయాలని హిందూ మహాసభ కూడా ఆశించింది కానీ దానికి డాక్టర్జి అంగీకరించలేదు. అలాగే 1930 లో ఉప్పు / అటవీ సత్యాగ్రహం నించి సంఘ్ ని దూరంగా ఉండమని సభ అడిగినప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు. ఆయన స్వయంగా కారాగారానికి వెళ్లారు. కానీ ఆయన వెళ్ళడానికి ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత చేసిన ప్రసంగాలలో, ఎవరైనా సరే అలా జైలుకు వెళ్లడం అభిలషణీయం కాదని ఆయన చెప్పారు. జైలు బయట ఉంటేనే ఒక వ్యక్తి చాలా సాధించగలడని ఆయన చెప్పేవారు. ఈ విషయంలో ఏమి చేయాలి అనేది వాళ్ళ వాళ్ళ నిర్ణయానికి వదిలేశారు.

డాక్టర్ హెడ్గేవార్ కి రాజకీయ రంగంలో విశేషమైన పరిచయాలు ఉండేవి. కమ్యూనిస్ట్ నాయకుడు రుయికర్, సంఘ్ స్థాపకులలో ఒకరిగా ఉండి, స్పానిష్ పౌర యుద్ధం లో పాల్గొన్నాక కమ్యూనిస్ట్ గా మారిన బాలాజీ హద్దర్, ఇంకా కాంగ్రెస్, హిందూ మహాసభ నాయకులు ఈయన స్నేహితులుగా ఉండేవారు. ఆయన వాళ్ళతో చర్చలు జరిపి, సంఘ్ శాఖలకు, వర్గలకు ఆహ్వానించి, వాళ్ళు కూడా హిందూ సంఘటనలో పాల్గొనేలా ఒప్పించడానికి ప్రయత్నిస్తుండేవారు. వాళ్ళల్లో అందరూ కాదు కానీ, కొంత మంది సంఘ్ లో చాలా చురుకైన కార్యకర్తలు అయ్యారు. ఆయన దృష్టిలో రాజకీయాలు ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాధనమే కానీ, అధికారం చేజిక్కించుకోవడానికి మార్గం కాదు.

అందుకని డాక్టర్ హెడ్గేవార్ దృష్టిలో రాజకీయాలు అంటరానివి కావు, అలానే జాతి నిర్మాణానికి పూర్తి పరిష్కారం కాదు. వ్యక్తి నిర్మాణం వీటన్నిటికీ అతీతంగా జరగాలని ఆయన నమ్మారు. ఈ దృక్పధం వల్లనే 1930 , 1942 ఉద్యమాల లో స్వయంసేవకులు కాంగ్రెస్ నాయకత్వంలో పని చేశారు కానీ ఆరెస్సెస్ పేరుతో కాదు. డాక్టర్ హెడ్గేవార్ సంఘ్ సమాజంలోని ఒక సంస్థే కానీ సమాజం వెలుపలది కాదు అని నమ్మేవారు. స్వాతంత్య్రం రావడానికి ముందు, దేశ విభజన సమయంలోనూ తలెత్తిన భయానక పరిస్థితుల్లో హిందువులకు, సిక్కులకు రక్షణగా నిలబడింది, అలాగే కాంగ్రెస్ తో సహకరించి తోడ్పాటును అందించింది.

సర్దార్ పటేల్ గారు సంఘ్ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే బాగుంటుంది అని సూచించినప్పుడు రెండవ సర్ సంఘ్ చాలక్ అయిన శ్రీ మాధవరావు తిరస్కరించారు. గాంధీజీ హత్యానంతరం జరిగిన పరిణామాలు, సంఘ్ మీద నిషేధం విధించిన తరువాత గాంధీ జీ హత్యతో సంఘ్ కి ఎలాంటి సంబంధమూ లేనప్పటికీ, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సంఘ్ కి మద్దతుగా నిలబడక పోవడంతో చాలా మంది సంఘ్ శ్రేయోభిలాషులు సంఘ్ కూడా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని సూచించారు. తరువాతి కాలంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తాను స్థాపించబోయే రాజకీయ పార్టీకి మద్దతు తెలుపమన్నప్పుడు, తన సహచరులు కూడా పట్టుపడటంతో గురూజీ అంగీకరించారు. ఏరి కోరిన కొంతమంది కార్యకర్తలను ఆయన డాక్టర్ ముఖర్జీ కి ఇచ్చారు. రెండు ప్రముఖ పాశ్చాత్త్య వాదాలయిన పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదానికి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ, ఆర్ధిక ఆలోచనతో రావాలని శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయని ఆయన కోరారు. ఇది సమగ్ర మానవతా వాదం లేదా ఏకాత్మతా మానవ వాదానికి దారి తీసింది.

డాక్టర్జీ లాగానే గురూజీ కూడా రాజకీయాలను, సమాజంలోని బహుముఖ కోణాలలో ఒకటిగా చూడాలనే భావించారు. ఆయన అనేకసార్లు రాజకీయాలు ఒక్కటే సమాజం లోని అన్నిసమస్యలకీ పరిష్కారం కాదని స్వయంసేవకులతో చెప్తూ ఉండేవారు. సమాజంలోని అన్ని వర్గాలూ జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాలి. చైనాకు టిబెట్ ను అప్పగించినపుడు ఆయన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. 1962 లో చైనా దూకుడు ను ఎదుర్కొనడానికి తగిన విధంగా తయారుగా లేకపోవడంపై కూడా ప్రభ్త్వాన్ని ఆయన తప్పుబట్టారు. అదే సమయంలో స్వయంసేవకులను , వారి కుటుంబాలను రక్షణ దళాలకు సహాయం చేయమని పిలుపునిచ్చారు. 1963లో పండిట్ నెహ్రు స్వయంసేవకులను గణతంత్ర దినోత్సవ కవాతు లో పాల్గొనమని ఆహ్వానించినప్పుడు ఎటువంటి శషభిషలు లేకుండా అంగీకరించారు.

గో రక్షణ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ 1965 , 1971 యుద్ధాల సమయం లో సంఘ్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించింది. 1969 ఉప ఎన్నికలలో సంఘ్ నలుగురు ప్రతిపక్ష అభ్యర్థులకు సహకరిస్తే, అందులో ముగ్గురు గెలిచారు. ప్రతిపక్ష పార్టీలలో పరస్పర సహకారానికి ఇది ఒకఉదాహరణ. అంతకు మించి సంఘ్ ఎప్పుడూ రాజకీయాలలో ఆసక్తి చూపించలేదు.

1974-75 లో శ్రీ బాలాసాహెబ్ దేవరస్ శ్రీ జయప్రకాశ్ నారాయణ గారి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చినప్పుడు సంఘ్ రాజకీయాలలో బాగా చురుకుగా పనిచేసింది. 1977 ఎన్నికల ముందు ఆయన ధైర్యంగా నిర్ణయం తీసుకుని జనసంఘ్ జనతా పార్టీలో కలిసేందుకు అంగీకరించారు. కానీ సోషలిస్టు పార్టీల రహస్య విన్యాసాల కారణంగా జనసంఘ్ బయటకి వచ్చి భారతీయ జనతా పార్టీని స్థాపించింది. సంఘ్ రోజూవారీ రాజకీయాలనించి మళ్ళీ పక్కకి తప్పుకుని భారతీయ జనతా పార్టీ తాను స్వంతంగా కార్యకర్తల నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

కొంతమంది ప్రచారకులు భాజాపాలో చేరారు కానీ, సంఘ్ ఎప్పుడూ పార్టీని నియంత్రించలేదు. కోరినప్పుడు సలహాలు మాత్రం ఇచ్చింది. సంఘ్ అనుబంధ సంస్థల సమన్వయ సమావేశాలకు భాజాపాని ఆహ్వానించినప్పటికీ, అంతిమ రాజకీయ నిర్ణయం మాత్రం పార్టీదే. అలా రోజూవారీ రాజకీయాలకి, జాతి శ్రేయస్సుకి మధ్య దూరం పాటించబడుతోంది.

ఇప్పుడు పార్టీ కూడా బాగా ఎదిగింది. కాబట్టి సంఘ్ దానిని గౌరవిస్తూ ఆరోగ్యకరమైన దూరం పాటించడం సహజం. రాజకీయాలు సమాజంలోని అనేక విభాగాలలో ఒక విభాగం మాత్రమే అనే మంత్రాన్ని మనసులో ఉంచుకుని సంఘ్ వ్యక్తి నిర్మాణం, హిందూ సమాజ సంస్కరణల మీద మాత్రమే దృష్టి పెట్టింది. 2014 లో నూరు శాతం పోలింగ్ జరగాలి అని సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ జీ భగవత్ ఇచ్చిన పిలుపు దేశ హితం కోరిచేసినదే తప్ప, ఏ ఒక్క రాజకీయ పార్టీకోసమో కాదు.ఈసారి కూడా ఆయన నూరు శాతం పోలింగ్ జరిగేలా చూడమని కార్యకర్తలకు సూచన చేశారు. ఇలాంటి సమస్థితిని పాటించడం కష్టమే కానీ ఆరెస్సెస్ దానిని విజయవంతంగా చేయగలుగుతుంది.

vskandhra