బీజేపీ మేనిఫెస్టో భలే..భలే!

437

సర్కారును ‘గ్రేటర్ ’ కార్పొరేషన్ ఆదేశిస్తుందా?
స్కూళ్లు లేకున్నా ట్యాబులు ఎలా ఇస్తారు?
కమలం మేనిఫెస్టో కమిటీ వైచిత్రి
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

మేనిఫెస్టో అంటే ఒక రాజకీయ పార్టీ విశ్వసనీయతకు నిలువుటద్దం. అది ఆయా పార్టీల భవిష్యత్తు పనితీరుకు, ఓ ముందస్తు అంచనాగా నిలిచే హామీల కొలబద్ద. మరి అలాంటి విశ్వసనీయత కల్పించే మేనిఫెస్టో రూపకల్పన సమయంలో, ఆ పార్టీ నాయకత్వాలు ఎంత శ్రద్ధ చూపించాలి? ఎంతమంది అనుభవజ్ఞులను అందులో నియమించుకోవాలి? వారిచ్చిన సలహాలను గుదిగుచ్చి కదా మేనిఫెస్టో తయారుచేయాల్సింది? మరి ప్రధాని, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులను పిలిపించి బీజేపీ చేస్తున్న ప్రచార పర్వంలో… అవగాహనలేని, అసంబద్ధమయిన మేనిఫెస్టోను విడుదల చేస్తే, పార్టీ పరువు ఏమవుతుంది? అది చూసిన వారికి అది ఉత్తుత్తి హామీలపత్రంగా అనిపించదూ? ఆ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం ఎగిరిపోదూ? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో అచ్చం అలాగే కనిపిస్తోంది.

బీజేపీ మాజీ సీఎం ఫడ్నవీస్ చేతుల మీదుగా ఆవిష్కృతమయిన… ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో, నగరంపై ఏమాత్రం అవగాహనలేని నేతలు రూపొందించిన హామీలుగా మారింది. అందులో ప్రకటించిన హామీలలో 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనివే కావడం ప్రస్తావనార్హం. తనకు సంబంధం లేని అంశాలపై , బీజేపీ ఎలా హామీలిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిథిలోని సమస్యలు-దాని పరిష్కారాలు, అందుకు లోబడి హామీలు ఇచ్చిఉంటే బాగుండేది. ఆ మేరకు కొన్ని ఇచ్చారు కూడా. అంతవరకూ బాగానే ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాలను కూడా, తాము చేస్తామని ప్రకటించడమే అభాసుపాలు కావడానికి కారణమయింది. ఆ హామీలు పరిశీలిస్తే.. మేనిఫెస్టో కమిటీకి నాయకత్వం వహించిన వారికి, అసలు నగరం గురించి ఏమాత్రం అవగాహన లేదన్నది సులభంగా అర్ధమయిపోతుంది.

పాతబస్తీకి ప్రత్యేక ప్యాకేజీ, అందరికీ కరోనా వ్యాక్సిన్, పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు 4 కోట్లకు తగ్గగుండా నిధులు, వీధివ్యాపారులకు ఆరోగ్య బీమా, మహిళలకు కిలోమీటర్‌కు ఓ టాయిలెట్, అతిపెద్ద తెలుగు గ్రంధాలయం ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అనుమతులు అవసరం లేకుండా 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణం, జంక్షన్‌కో వంతెన, మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు, జీహెచ్‌ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు, కార్మికులకు పన్నుల మాఫీ, మూసీఫ్రంట్ డెవలప్‌మెంట్ ఏర్పాటు, గ్రీవెన్‌సెల్, డంపింగ్ యార్డులు, గుంతలు కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతుల వంటి హామీలిచ్చింది.
అవన్నీ గ్రేటర్ పరిథిలోనివే కాబట్టి, ఆమేరకు వాటిని ప్రకటించడం మంచిదే. వాటిని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. నగరంలో పెద్ద తెలుగు గ్రంధాలయ నిర్మాణంపై ఇచ్చిన హామీ బాగుంది. అయితే.. కానీ, గత పదేళ్ల నుంచి కార్పొరేషన్.. ప్రజల నుంచి వసూలు చేస్తున్న, 8 శాతం లైబ్రరీ సెస్సు దాదాపు వెయ్యి కోట్ల బకాయిలను.. గ్రంధాలయ సంస్ధకు చెల్లించకపోవడం ప్రస్తావనార్హం. అంటే చివరకు లైబ్రరీలు కూడా, గ్రంధాలయ సంస్థ ఏర్పాటుచేయాల్సిందేనన్న మాట!

మేనిఫెస్టోలో కొన్ని హామీలు బాగున్నా… అసలు కార్పొరేషన్‌ను ఏమాత్రం సంబంధం లేని అంశాలను ప్రస్తావించడమే, బీజేపీ విశ్వసనీయతకు మచ్చగా మారింది. ఇతర జిల్లాల మాదిరిగా నగరంలో కార్పొరేషన్ నిర్వహణలో స్కూళ్లు లేవు. అయినా విద్యార్ధులకు ఉచితంగా ట్యాబులు ఇస్తామని ప్రకటించడమే విమర్శలకు దారితీస్తోంది. నగరంలోని కార్పొరేట్ స్కూళ్ల నియంత్రణ అధికారం కూడా కార్పొరేషన్‌కు లేదు. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు, ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు హామీ కూడా ఆ దారిలోనిదే. అయినా ఆ హామీ కూడా ఇవ్వడమే వింత. 5 ఏళ్లలో 15 మహిళా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తామన్న హామీ కూడా నవ్వు తెప్పిస్తోంది. అది హోంశాఖకు సంబంధించిన అంశం. మరి గ్రేటర్ ఎలా ఏర్పాటుచేస్తుందన్నది ప్రశ్న.

నాలాలు, డ్రైనేజీలు మెట్రోవాటర్ వర్క్స్‌కు సంబంధించినదయితే, కార్పొరేషన్ ఆ బోర్డును ఎలా శాసిస్తుంది? 24 గంటల నీటి సరఫరా, ఇంటింటికీ నల్లా కనెక్షన్ కూడా మెట్రో వాటర్ బోర్డు పరిథిలోనివే. ఈ అంశాల్లో కార్పొరేషన్-మెట్రోవాటర్‌బోర్డు మధ్య పనుల కోసం, కేవలం సమన్వయం మాత్రమే ఉంటుంది. కానీ వాటి ఆధునీకరణ కోసం.. 10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుచేస్తామన్న హామీ, నవ్వులపాలు చేసేదేనంటున్నారు.విద్యుత్ చౌర్యం పూర్తిగా ఇంధనశాఖ పరిథిలోనిదే. అయినా దానిని కూడా గ్రేటర్ హామీలో చేర్చడమే ఆశ్చర్యం. కులవృత్తులకు, పేదలకు వంద యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ కూడా రాష్ట్ర ప్రభుత్వ అంశమే.ఇవన్నీ డిస్కంలు అంగీకరించాల్సినవే. వాటిని ఏ రాష్ట్రంలోనూ స్థానిక సంస్థలు తమ అధికార ంతో ఇవ్వలేవు. మరి ప్రభుత్వంలో లేని బీజేపీ వాటిని ఎలా ఇస్తుందో వివరిస్తే, మేనిఫెస్టోపై విశ్వసనీయత మరింత పెరిగేది.

ఇక వరద సాయం కింద ఒక్కొక్కరికీ, 25 వేల రూపాయల హామీ కూడా విమర్శల పాలవుతోంది. ఇప్పుడు తెలంగాణ సర్కారు ఇచ్చిన ఇంటికి పదివేల సాయం కూడా, సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరు చేసిందే. అంత బడ్జెట్ గ్రేటర్ కార్పొరేషన్‌కు ఎక్కడి నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కూడా, రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి సంబంధించినదే. మేయర్‌గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయలేరు. దానిని తీర్మానించి ప్రభుత్వానికి పంపాల్సిందే. అయినా అది ఇటీవలే అసెంబ్లీలో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే.మరి బీజేపీకి అసెంబ్లీలో ఉన్న బలం రెండే అయినప్పుడు, ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలా రద్దు చేస్తారన్న ప్రశ్న విద్యావంతులలో వ్యక్తమవుతుంది. సహజంగా కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్ వంటి స్కీములు ప్రవేశపెట్టినా, దానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రావలసిందే. అదొక్కటే కాదు.. విధానాలను సంబంధించి కార్పొరేషన్లు సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేవు. కార్పొరేషన్లు తీర్మానం చేసి పంపిన వాటిని ప్రభుత్వాలు ఆమోదించాల్సిన అవసరం లేదు.

మరి రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోని అంశాలన్నీ బీజేపీ.. తన హామీగా మేనిఫెస్టోలో ఎలా పెట్టిందో ఎవరికీ అర్ధం కావడం లేదు. తాము అధికారంలోకి వస్తే.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదినంగా ప్రకటిస్తామని ఫడ్నవీస్ ఇచ్చిన హామీ, అసలు గ్రేటర్ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేనిది. ఒకవేళ బీజేపీ నేతల కష్టం-వ్యూహం ఫలించి, రేపు గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ సాధిస్తే… తెలంగాణ రాష్ట్రంలో, సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదినంగా ఏవిధంగా ప్రకటిస్తారన్నది ప్రశ్న. ఈవిధంగా బీజేపీ మేనిఫెస్టో కూర్పులో.. నగరంలో సీనియర్ నేతల సలహా, సూచనలు తీసుకున్నట్లు లేదన్న విషయం, ప్రకటించిన హామీలు చూస్తే స్పష్టమవుతుంది. జిల్లాల్లో పనిచేసే నాయకులకు.. సహజంగా కార్పొరేషన్ పరిథి-అధికారాలకు సంబంధించి, పెద్దగా అవగాహన ఉండదు. ఎందుకంటే జిల్లాల్లో మున్సిపల్-ప్రభుత్వ శాఖలు కలసే ఉంటాయి. ఎక్కువగా ప్రభుత్వానికే అధికారాలుంటాయి. కాకపోతే అవి మున్సిపాలిటీల్లో కూడా అమలవుతుంటాయి. బహుశా.. అలాంటి అవగాహన ఉన్న జిల్లా స్థాయి నేతలే ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు కనిపిస్తోంది.

అయితే..గతంలో కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన చంద్రవదన్, డిప్యూటీ మేయర్‌గా పనిచేసి, 30 ఏళ్ల నుంచి బీజేపీలో కీలకనేతగా ఉన్న సుభాష్‌చందర్జీ కమిటీలో ఉన్నప్పటికీ.. ఇలాంటి హామీలు ప్రకటించడమే ఆశ్చర్యం. ఈ కమిటీకి మాజీ ఎంపీ వివేక్ చెర్మన్‌గా ఉన్నారు. ఆ ప్రకారంగా.. అసలు సుభాష్‌జీ-చంద్రవదన్‌లను, మేనిఫెస్టో కమిటీలో భాగస్వాములను చేయకపోయినా ఉండాలి. లేక వారి సూచనలు, బుట్టదాఖలు చేసయినా ఉండాలని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.పోనీ.. జీహెచ్‌ఎంసీ-స్థానిక సంస్థలు- రెవిన్యూ చట్టాలపై అవగాహన ఉన్న జి.ఆర్.కరుణాకర్, వెంకటరమణి వంటి సీనియర్లనయినా సంప్రదించినట్లు కనిపించలేదు. అసలు మేనిఫెస్టో విడుదల సందర్భంగా.. ఆ కమిటీలో ఉన్న సుభాష్‌చందర్జీ, చంద్రవదన్ కనిపించకపోవడమే ఆశ్చర్యం. అంటే మేనిఫెస్టో కమిటీ సభ్యులకే సమాచారం లేకుండా.. మేనిఫెస్టో విడుదల చేశారన్నమాట! బీజేపీ భలే భలే!!