అమూల్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని డిసెంబర్ 2కి వాయిదా

690

నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఈ నెల 26 న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావలసివున్న జగనన్న – అమూల్ ప్రాజెక్టు మొదటి దశ కార్యక్రమాన్ని ప్రభుత్వం డిసెంబర్ 2 కి వాయిదా వేసినట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళా సాధికారత, సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలుగా “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -అమూల్ ప్రాజెక్టు” సంయుక్త భాగస్వామ్యంతో “జగనన్న- అమూల్ పాలవెల్లువ” కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశలలో రూ. 3,034 కోట్ల వ్యయంతో 9,899 ప్రాంతాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాలలో ప్రారంభం అవుతుందన్నారు. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక పాలదిగుబడి ఇచ్చే సంకర జాతి ఆవులు, ముర్రా, గ్రేడేడ్ ముర్రా తదితర మేలు జాతి గేదెలు రాష్ట్రంలోనే గాక గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, తదితర రాష్ట్రాల నుండి కూడా కొనుగోలు చేసుకొనే వెసులుబాటు రైతులకు లభిస్తుందని తెలిపారు. రైతులు కోరుకున్న పశువులు కొనుక్కొనే సౌలభ్యం ఉంటుందని, పశువుల కొనుగోలులో రైతుల నిర్ణయమే అంతిమంగా ఉంటుందని తెలిపారు.   అమూల్ భాగస్వామ్యం తో  పాల సేకరణ ద్వారా పాడి  రైతులకు లీటర్ కు రూ .5/- నుండి రూ . 10/- ల   అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన పాలు, పాల పదార్ధాలు అందించడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యమని కమీషనర్ ఆ ప్రకటనలో తెలిపారు.