తిరుపతిలో పోటీపైనే  బీజేపీ భవిష్యత్ రాజకీయం !

విజయవాడ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరం లో లేవని; జరగవలసిన సమయం కంటే బాగా ముందుగానే జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. తగిన సమాచారం లేకుండా ఆయన అలా వ్యాఖ్యానించి ఉండరు. అంటే- ఇప్పుడు తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో విజయం సాధించే అభ్యర్థి పదవీ కాలం మూడున్నరేళ్లు ఉండే అవకాశం లేదు. ఉంటే ఏడాదిన్నర…కాదంటే ఓ రెండేళ్లు.

ఆ మాత్రం దానికోసం ఖర్చు, ఆయాసం, కాళ్ళ తీపులూ ఎందుకులే అని ఏపార్టీ అనుకున్నా- రాజకీయ పరుగు పందెం లో వెనుకబడి పోయే ప్రమాదం ఉంది. అధికారం లో ఉన్న వైసీపీ అలా అనుకునే అవకాశం లేనే లేదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ ఎన్నికలో పోటీ చేయడానికి ఎదురు చూస్తున్న తెలుగు దేశం -ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టదు.
ఇక, బీజేపీ-జన సేన. భవిష్యత్ రాజకీయ ఉనికి ప్రదర్శన కోసమని ఇప్పుడు తిరుపతి లోకసభ ఉప ఎన్నిక సందర్భాన్ని వినియోగించుకోవాలని బీజేపీ; జనసేన కూడా గట్టిగా భావిస్తున్నాయి. ఈ రెండూ కవల పిల్లలు. ఈ రెండింటి మధ్య ఉన్న సయోధ్య దృష్ట్యా….ఎవరో ఒకరు ‘త్యాగం’ చేయాలి.

ముందుగా- బీజేపీ విషయం చూద్దాం. ఆ పార్టీ రాష్ట్ర శాఖ కు అధ్యక్షులు గా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత, పోటీ చేయడానికి లభించిన తొలి అవకాశం -తిరుపతి ఉప ఎన్నిక  గతం లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి లోకసభకు ఎన్నికైన చరిత్ర ఉంది.తిరుపతి లోకసభ పరిధిలో గట్టి నాయకత్వం బీజేపీ కి ఉంది.గ్రామ గ్రామాన కార్యకర్తల బలగం ఉంది. శ్రీ వేంకటేశ్వరుడు అక్కడే కొలువై ఉండడం తో ; హిందూత్వ భావాలు పుష్కలం. దేశవ్యాప్తం గా నరేంద్ర మోడీ గాలి బాగా వీస్తున్నది.డబ్భుకు లోటు ఉండే అవకాశం లేదు. పక్కనే, కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప ఉన్నారు. కేంద్ర పరిశీలకుడు థియోధర్ కు కూడా ఇది ప్రతిష్టాత్మకం.ఇలా , ఇక్కడ నుంచి పోటీ చేయడానికి బీజేపీ కి అనేక సహేతుకమైన కారణాలు ఉన్నాయి.

ఇక, జనసేన విషయానికి వస్తే….లోకసభకు పోటీ చేసేంత అర్ధ బలం గానీ, అంగ బలం గానీ ఉన్న భావన కలగడం లేదు.2009 లో చిరంజీవి ఇక్కడ నుంచి గెలిచారు. నిజమే. కానీ, ఆయన ఆ సీటు ను చివరి వరకు నిలుపుకోలేదు.మధ్యలోనే వదిలేశారు. జన సేన అయినా 2014 లో పోటీ చేయలేదు.2019 లో గెలవలేద పార్టీ నిర్మాణం ఈ పూటకీ అక్కడ లేదు. గ్రామ కమిటీలో, మండల కమిటీలో లేవు.

అటు వైసీపీ అభ్యర్థి కి దన్నుగా ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఇటు టీడీపీ అభ్యర్థికి చంద్రబాబు ఉన్నారు. కనుక ఈ రెండు పార్టీల అభ్యర్థులకు అర్ధబలం లో గానీ, అంగబలం లో గానీ లోటు ఉండే అవకాశం లేదు. అటువంటి అభ్యర్థులను; వారి అధినాయకులను తట్టుకోగల శక్తి జనసేనకు లేవు.  పోటీ చేయవలసిన సమయం లో పోటీ చేయకుండా….పోటీ చేసే అవకాశం ఏమాత్రం లేని  పరిస్థితుల్లో పోటీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారు.

2014 ఎన్నికలకు ముందు పార్టీ ప్రకటన ద్వారా  ఆంధ్ర రాజకీయాన్ని తీవ్ర కల్లోలానికి గురిచేసిన పవన్ కళ్యాణ్- ఎన్ని సీట్లలో పోటీ చేయాలని అభిలషిస్తే…అన్ని సీట్లను చంద్రబాబు నాయుడు – బంగారపు పళ్లెం లో పెట్టి ఇచ్చేవారు. ఆ అవకాశాన్ని వదిలేసి, ఇప్పుడు ఒక ఉప ఎన్నికలో పోటీ కోసం తహతహ లాడుతున్నారు. జుట్టు వదిలేసి, కాళ్ళు పట్టుకోవడం అంటే…ఇదే నేమో!తిరుపతి ని ఆయనకు వదిలేస్తే- జనసేన ఖర్చు, బీజేపీ ప్రచార ఖర్చు కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే భరించాలి. తిరుపతి ఉప ఎన్నికలో పడే ఆ బాధ ఏదో- బీజేపీ కే ఆయన వదిలేస్తే- గౌరవం గా ఈ రగడ నుంచి బయటపడవచ్చు.

లేస్తే మనిషిని కాదు అన్న సామెత చందంగా….’ అదే మేము గనుక పోటీ చేసి ఉంటేనా…?’ అని చెప్పుకోడానికి ఓ అవకాశమైనా మిగిలి ఉంటుంది.తన బలం చూపించడానికి ముందు ముందు చాలా అవకాశాలు వస్తాయి. ఈలోగా- తన బలం ఏమిటో…,బలహీనతలు ఏమిటో మదింపు చేసుకుని ఈ సారి శాసన సభ ఎన్నికలకు ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి. గాలి వాటం రాజకీయాలతో ఆయన ఎంతో దూరంప్రయాణించలేరు. తిరుపతి ని బీజేపీ కి ఆయన వదిలిపెట్టడంలో ఎంతో విజ్ఞత ఉంది. దానివల్ల, భవిష్యత్ లో ఆయన ‘బార్గయినింగ్ పవర్’ బాగా పెరుగుతుంది.

-భోగాది వెంకట రాయుడు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami