తిరుపతి అభివృద్దిపై తెదేపా, వైఎస్‌ఆర్‌సీపీలు చర్చకు సిద్దమా?

250

తెదేపా, వైఎస్‌ఆర్‌సీపీలకు దమ్ముంటే తిరుపతి నగరానికి, చిత్తూరు జిల్లాకు ఏం చేశాయో చెప్పాలని రాజ్యసభ సభ్యులు, భాజపా నాయకులు జీవిఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి ప్రాంత అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్దమా అని తెదెపా, వైఎస్‌ఆర్‌సీపీలను ప్రశ్నించారు. రానున్న తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయాలో చెప్పాలన్నారు. భవిష్యత్ చేయబోయేవి, కేంద్రప్రభుత్వం చేసినవి తప్పించి మీరేం చేశారో మాత్రమే చెప్పాలని స్పష్టంచేశారు. అవినీతి, అవాస్తవ రాజకీయాలు తప్ప ఈ పార్టీలు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం గల ఆరేళ్లుగా రాష్ట్రానికి కేటాయించిన ప్రతి పథకంలోనూ తిరుపతికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లతో పాటు రహదారులు, రైల్వేప్రాజెక్టులు, పారిశ్రామిక సమూహాలు, స్మార్ట్‌సిటీగా అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులిచ్చిందన్నారు.

సాగరమాల పథకం కింద రహదారులు, ఓడరేవులను అనుసంధానం చేసే దేశవ్యాప్త ప్రాజెక్టులు 91 అమలుచేస్తే అందులో ఎపీకి 32 కేటాయించినట్లు చెప్పారు. వాటిలో చిత్తూరు, తిరుపతి ప్రాంతంలో 7 రహదారులున్నాయి. ఈ పథకంలోనే దేశవ్యాప్తంగా చేపట్టిన 83 రైలుప్రాజెక్టుల్లో 21 ఎపీకి కేటాయించారని, అందులో 4 ఈ ప్రాంతంలోనివే అన్నారు. రూ.1825 కోట్లతో ఓబులవారిపల్లె నుంచి వెంకటాచలం మధ్య 95 కి.మీ.కొత్త రైల్వేలైన్, రూ.87 కోట్లతో కృష్ణపట్నం వెంకటాచలం మధ్య డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్, రూ.761 కోట్లతో గూడూరు దుగరాజపట్నం మధ్య నూతన రైలుమార్గం నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటి మొత్తం విలువ రూ.3 వేల కోట్లుగా చెప్పారు. వీటికి అదనంగా రూ.5 వేల కోట్ల రహదారులు నిర్మిస్తున్నామన్నారు. తిరుపతిని స్మార్ట్‌సిటిగా ప్రకటించి రూ.2 వేల కోట్లతో 62 ప్రాజెక్టులు అమలుచేస్తున్నామన్నారు. రూ.1074 కోట్లతో నిర్మించే ఐఐటీకి రూ.525 కోట్లు, రూ.1137 కోట్లతో నిర్మించే ఐఐఎస్‌ఇఆర్‌కు రూ.600 కోట్లు ఇప్పటికే విడుదల చేయడం జరిగిందన్నారు.

దేశంలో నిర్మించే 20 ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో 3 ఎపీకి కేటాయించామని అన్నారు. అవి శ్రీసిటిలో ఒకటి, ఏర్పేడు ప్రాంతంలో రెండు ఉన్నాయన్నారు. రూ.56.76 కోట్ల విలువైన శ్రీసిటిలో నిర్మించే క్లస్టర్‌కు 2016లో అనుమతి ఇచ్చామని, రూ.340 కోట్లతో ఎపీఐఐసీ ఏర్పేడులో నిర్మించే క్లస్టర్‌కు 2017లో అనుమతి ఇచ్చామని, రూ.104 కోట్లతో ఏర్పేడులోనే మరో క్లష్టర్ ఏర్పాటుకు అనుమతి లభించిందన్నారు. వీటి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుందని లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్రం ఏర్పాటుచేసిన ఈ సంస్థల ఏర్పాటులో లోకేష్ ఘనకార్యం ఏమీలేదన్నారు. రెండో ఫేస్‌లో కడపలో మరోటి ఏర్పాటుచేసేందుకు ముఖ్యమంత్రి జగన్ కోరారని దానికి అనుమతి లభించిందన్నారు. దేశంలో 38 మెగా ఫుడ్ ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తే అందులో చిత్తూరుకు ఒకటి కేటాయిస్తే రూ.126 కోట్లతో అది ఇప్పుడు పనిచేస్తుందన్నారు.

తిరుపతిలో కాలుష్యం తగ్గేందుకు ఫేమ్ పథకంలో భాగంగా 50 ఎలక్ట్రిక్ వాహనాలు, 68 ఛార్జింగ్ స్టేషన్లు మంజూరుచేశామన్నారు. రూ.181 కోట్లతో విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్ధాయిలో రూ.177 కోట్లతో రన్‌వేను అభివృద్ది చేశామన్నారు. దేశంలో కేటాయించిన మూడు నేషనల్ ఇన్వెస్టిమెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌లలో 2 చిత్తూరు, ప్రకాశంజిల్లాలకు కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వాటిని ఏర్పాటుచేయలేదన్నారు. ఇవి ఏర్పాటైతే కేంద్రం నుంచి విస్తృతంగా పెట్టుబడులు వచ్చేవని లక్షలాది మందికి ఉపాధి లభించేదన్నారు. అలాగే విశాఖ చెన్పై పారిశ్రామిక కారిడార్‌లోని ఏర్పేడు, శ్రీకాళహస్తి నోడ్ ఏర్పాటుకు 11,846 ఎకరాల భూమి అందుబాటులో ఉందని 2018లో చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తిరుపతికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్దే ప్రధాన అజెండాగా ప్రచారం చేసి భాజపా ప్రజాభిప్రాయం కోరనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి కేటాయించిన కేంద్ర సంస్థల వివరాలు సేకరించడంతో పాటు, వాటిలో పర్యటించి అభివృద్ధిని తెలుసుకుంటున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తిరుపతికి జరిగిన అభివృద్దితో దృశ్యపూరిత ప్రచారం చేస్తామన్నారు. ‘‘గుండెగుండెకు భాజపా ’’పేరుతో అన్ని ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా విసృ్తత ప్రచారం చేసి ఓటు అడుగుతామన్నారు. సమావేశంలో భాజపా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.