కర్షకుల కోసం కాదు..కార్పొరేట్ల కోసమే వ్యవసాయ బిల్లులు?                                                    

674

స్వేచ్చా మార్కెట్ ద్వారా రైతులు తమ పంటలు ఎక్కడైనా  అమ్ముకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన స్వేచ్చా మార్కెట్  ప్రయోగం సెధ్యానికి చేటు చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధానం వల్ల లాభపడేది మాత్రం  కార్పొరేట్ వర్గాలు,దళారీలు,వ్యాపారులు మాత్రమే, రైతుల  ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పి న కేంద్రప్రభుత్వం. రైతు ఆదాయం రెట్టింపు మాట దేవుడెరుగు.వ్యాపారులు,దళారులు,కార్పొరేట్ల ఆదాయాన్ని మాత్రం పదింతలు పెంచే విధంగా లొక్ సభలో  మూడు వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు రైతుల గుండెల్లో త్రిశూలాలు కానున్నాయి. వ్యవసాయ దేశం మనది.ఇప్పటికీ 60 శాతం మందికి పైగా ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనాధారం వ్యవసాయమే, 70శాతం మంది గ్రామీణ ప్రజలు ఇప్పటికీ వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు. సాగుదారుల్లో దాదాపు 82 శాతం మంది వరకు చిన్న సన్నకారు రైతులే. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా 14 శాతంగా ఉందంటే దేశ ఆర్ధికాభివృద్దిలో ఈ రంగానిదే ప్రధాన పాత్ర.  అయినా అన్నివ్యవస్థలను   ప్రవేటీకరించి కార్పొరేట్ రంగానికి ధారాదత్తం చేసినట్లే,వ్యవసాయరంగాన్ని కూడా కార్పొరేట్ రంగానికి ధారా దత్తం చేసేందుకు ద్వారాలు తెరిచింది కేంద్ర ప్రభుత్వం.ప్రియమైన దేశవాసులారా నవభారత్ నిర్మాణం దిశగా ప్రతిన తీసుకొని ముందుకు సాగుదాం,రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేద్దామని,మనం చేపట్టిన పనిని  నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయకపోతే అనుకొన్న ఫలితాల్ని సాధించలేమని,మనమంతా కలిసి రైతులు ఏ ఆందోళనా లేకుండా గుండెమీద చేయి వేసుకొని నిద్రించే భారత్ ను నిర్మిద్దాం అని ప్రధాని  మోడీ ప్రకటన చేశారు.ఈ ప్రకటనలో ఇసుమంత నిజం వుంటే ఇటువంటి నిరంకుశమైన బిల్లులు  నిరంకుశంగా ఆమోదించి అన్నదాతల వెన్ను విరిచేవారు కాదు. ఒక పక్కన వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్నామని గొప్పలు చెబుతూ మరోపక్కన గొప్పల కింద వ్యవసాయానికి గోతులు తీస్తున్నారు .

ప్రధాని నరేంద్ర మోడీ కీర్తిస్తున్నట్లు ఇవి విప్లవాత్మక బిల్లులు కాదు వినాశనకర బిల్లులు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గొప్పలు చెప్పినట్లు రైతులకు  సిరులు కురిపించడం  కాదు,రైతులకు వురులు బిగించనున్నాయి.మూడు బిల్లులు.దేశంలో అత్యధికుల జీవనాధారమైన  వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ రంగానికి ధారాదత్తం చేసేందుకు రాజ్యసభలో ఈ బిల్లులు ఆమోదించిన తీరు దారుణం. ఈ బిల్లును ఆమోదించే ముందు రాజ్యసభ  సెలక్టు కమిటీకి పంపాలన్న ప్రతి పక్షాల డిమాండ్ ను అంగీకరించకపోగా వాటిపై కనీస చర్చ కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరించారు. కష్టాల్లో వున్న కర్షకులను రెండు చేతులా ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు,వ్యాపారులకు అప్ప గించి చేతులు దులుపు కొన్నది. ఒక పక్కన  స్వావలంభన సాదిద్దాం  అంటు సంకల్పాలు చెబుతూ పరోపక్కన వ్యవసాయరంగాన్ని పరాధీనం చెయ్యడం స్వావలంబన  ఎలా అవుతుంది ?

రైతుల ఆదాయాన్ని2022 నాటికి రెట్టింపు చేస్తామన్న లక్ష్యాన్ని గుట్టు చప్పిడు కాకుండా 2024 కి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రకటన కూడా పక్కకు పోయింది.2024 లక్ష్యాన్ని మాత్రం పొడిగించరన్న నమ్మకం ఏమిటి?2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ ప్రధాని చేసిన ప్రకటన  పై చాలా మంది వ్యవసాయ రంగ నిపుణులు అప్పట్లోనే  సందేహాలు వ్యక్తం చేశారు.ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వ్యవసాయ రంగం ఏటా  15 శాతం వృద్ది రేటు సాధించాలి అన్నారు.ప్రపంచం  చరిత్రలో ఎక్కడా వ్యవసాయ రంగం ఈ స్థాయిలో వృద్ది రేటు సాధించిన దాఖలాలు లేవు.కేంద్రప్రభుత్వం లోక్ సభలో వెల్లడించిన అధికార గణాంకాలు ప్రకారమే వ్యవసాయ రంగం వృద్ది రేటు గత ఆరేళ్ళ లో కేవలం 3 శాతం మాత్రమే వృద్దిరెటు  నమోదు అవుతుంది.ఈ పరిస్థితుల్లో 2024 నాటికి మాత్రం రెట్టింపు చేస్తామంటే ఎలా నమ్మాలి ?

పాలించినంత కాలం అబద్దాలు,మోసాలే….మోడీ మోసాలకు హద్దు లేకుండా పోయింది. వ్యవసాయం రాష్ట్రాలకు సంభందించిన అంశం.కనీసం రాష్ట్రాలను సంప్రదించకుండా బిల్లులు తేవడం సమాఖ్యవ్యవస్థకు విఘాతం .కనీసం ప్రతిపక్షాల అభ్యతరాలను ఖాతర చెయ్యకుండా వారిగొంతు నోక్కి బయటకు నెట్టి రైతులకు మరణ శాసనం రాశారు. రైతు శ్రేయం కోసం అంటూ తెచ్చిన బిల్లులు ఒకటి రైతు తనపంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకొనేస్వేచ్చ,రెండువ్యాపారులతోచేసుకొనేముందస్తుఒప్పందాలకు చట్టబద్దత,మూడు నిత్యావసర వస్తువులు చిరు పప్పు ధాన్యాలు,నూనెగింజలు నిల్వలపై ఆక్షలు తొలగించడం. ఈ బిల్లులు  ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, అద్భుతాలు జరగుతాయని రైతులు పంట ఉత్పత్తులను స్వేచ్ఛగా ఎక్కడికైనా తీసుకుపోయి నచ్చిన ధరకు విక్రయించు కోవచ్చంటూ ప్రధాని సహా కేంద్ర ప్రభుత్వం బులిపించడం వాస్తవ విరుద్ధం.

రైతులు పెట్టుబడికి తెచ్చిన అప్పు తీర్చేందుకు కల్లంలోనే పంట అమ్ముకొనే పరిస్తితిలో వున్నసన్న,చిన్న కారు రైతులే 80 శాతం పైగా వున్నారు.వారు అందరు నిరక్షరాస్యులే .వారు పంటలను నిల్వచేసుకోవడమో,ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడమో ఎలా సాధ్యం ?పంటలు నిల్వ చేసుకొని,ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడం ద్వారా రైతులు లాభపడతారని చెప్పడం మోసం,దగా కాదా ? మారుమూల గ్రామాల్లో వున్న  సన్న, చిన్నకారు రైతులు పంటను పక్కరాష్ట్రానికో, మరోనగరానికో తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమేనా ?అంత స్థోమత,సామర్ధ్యం,పరిజ్ఞానం వారి కుంటుందా ? ఒక వేళ పంటను మంచిధరకోసం మరో రాష్ట్రానికో,నగరానికో తీసుకెళ్లినా  ఎకరా,రెండేకరాలున్న రైతు తన  పంటను అంతదూరం తీసుకెళ్లినందుకు అయిన రవాణా ఖర్చులకు,అక్కడ మార్కెట్ మాయాజాలానికి ఎవరు భాధ్యులు? రవాణా ఖర్చులు కూడా రాకపోతే అప్పుడు రైతు పరిస్తితి ఏమిటి? చిన్న రైతులు పంటను మార్కెట్లోనో ,స్థానిక వ్యాపారులకో అమ్ముకోవడానికే నానా అవస్థలు పడుతుంటారు.ఇప్పటిదాకా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు ప్రధానంగా మార్కెట్‌ యార్డుల్లోనే జరిగేవి. కొత్త వ్యవసాయ బిల్లులతో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు-కొనుగోళ్ల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ది ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ కామర్స్‌, ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటీస్‌ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ యార్డులు ఉనికి కోల్పోనున్నాయి.

కేంద్రం తెచ్చిన చట్టాలు భారత రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని ప్రద్గాని గొప్పలు చెబుతున్నారు.ఎటువంటి ప్రమాదం వుండదని ప్రధాని ఉద్ఘాటిస్తున్నారు.మరి అటువంటప్పుడు  కనీస మద్దతు ధరను చట్టాల్లో ఎందుకు చేర్చ లేదు. మార్కెట్ కమిటీలను నిర్వేర్యం చేసి రైతులను  కార్పొరేట్ల కబంద హస్తాలకు అప్పగించడం రైతును బలఫీటమేక్కించడమే.ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్న కార్పొరేట్ రంగానికి కొత్త అవకాశాలు కల్పించి వారిని  బాగు చెయ్యడానికే.కార్పొరేట్ల పై వున్న ప్రేమ కర్షకుల పై లేదు కేంద్రానికి. మార్కెట్‌ యార్డుల కంటే కొంత మేర ఎక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసినా నాణ్యతా లోపం, డిమాండ్‌ లేదన్న కుంటి సాకులు చూపి ధరలు తగ్గించేయడం ఖాయం. అదే జరిగితే రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కదు. రైతులు ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉండదు. దేశంలో ఎక్కువమంది చదువుకోని రైతులే ఉన్నం దున ప్రైవేట్‌ కంపెనీలతో లావాదేవీలు నెరపడం వారికి కష్టమవు తుంది.

ఇక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకే పంటను అమ్ముకుంటే మార్కెట్‌ యార్డులు నిర్వీర్యమై ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రాదు. ఇక ది ఫార్మర్స్‌ ఎంపవర్‌మెంట్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ బిల్లు ద్వారా రైతులు పంట దిగుబడికి ముందే వ్యాపారులతో ఒప్పందం చేసుకోవచ్చు. అయితే పంట చేతికొచ్చాక నాణ్యత లేదనో, డిమాండ్‌ లేదనో ఏదో విధంగా వంకలు చూపి వ్యాపారులు ధరలు తగ్గిస్తే. రైతులకు వేరే దిక్కుండదు.అడిగే నాథుడు ఉండడు చిన్న,సన్న కారు రైతులు కార్పొరేట్ సంస్థలతో న్యాయపోరాటం చెయ్యడం సాధ్యమేనా ?అట్లా గే కార్పొరేట్ కంపెనీలతో కలిసి రైతులు కాంట్రాక్టు వ్యవసాయం సాధ్యమేనా?రైతుకు ఏ పంట వెయ్యాలో స్వేచ్చ కూడా వుండదు.లీజుకు తీసుకొన్న కంపెనీ ఏ పంట వెయ్యమంటే ఆ పంటే వెయ్యాలి..ఏ పంటకు గిరాకీ వుంటే ఆ పంటే వెయ్య మంటుంది కంపెనీ.ఎవరెన్ని చెప్పినా మద్దతు ధరల భాధ్యత నుంచి కేంద్రం తప్పుకొని  రైతులను  కార్పొరేట్లకు,దళారులకు అప్పగిస్తుంది.  రైతులు ఏటా వంద రకాల పంటలు పండిస్తుంటే కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకే మద్దతు ధరలు ప్రకటించి చేతులు దులుపు కొంటుంది.దీనివల్ల రైతులు ఏటా మూడు లక్షల కోట్లు నష్టపోతున్నట్లు సమాచారం.

కేంద్రప్రభుత్వం చేసిన మరొక నిర్వాకం ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌-1955. దీనివల్ల ధాన్యం, పప్పులు, నూనెగింజలు, వంటనూనెలు, బంగాళాదుంపల వంటి నిత్యావసరాల ఎగుమతులపై ఇప్పటివరకున్న ఆంక్షలు తొలగిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని బడా వ్యాపారులు, సంస్థలు పంట సీజనులో రైతుల నుంచి పెద్ద ఎత్తున తక్కువ ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని గోడౌన్‌లలో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు తిరిగి అమ్ముకుంటారు. దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వానికి ఆస్కారం లేకుండా పోతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలపై మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ప్రభుత్వ నియంత్రణలో వున్నప్పుడే ఆహారోత్పత్తులు లభ్యత ఇబ్బందిగా  మారితే  నిల్వలపై ఆంక్షలు ఎత్తి వేస్తూ కేంద్రం తెచ్చిన కొత్త చట్టం  అమలులోకి వస్తే  పరిస్తితి ఇంకెలా వుంటుంది? 1995 నిత్యావసర  సరకుల వస్తువుల చట్టం తొలగిస్తే మోడీ సర్కారు అసమర్థ, స్వార్థపూరిత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.  ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి పోయి సామాన్యుల జీవితం దర్భరం అవుతుంది. ఈ బిల్లుద్వారా వచ్చిన స్వేచ్చతో అపరిమితంగా నిల్వలు వుంచి ధరలు పెరిగిన సమయంలో వ్యాపారులు లాభపడతారు.నిత్యావసర సరుకుల నిల్వ నియత్రణ పై కేంద్రం కొత్త చట్టం తెచ్చిన తరుణంలో వ్యాపారులు నిలవ చెయ్యడం,వున్న నిల్వలు బయటికి తీయక పోవడంతో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం ప్రారంభం అయి నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి.కావునా పంట  పండించే వారిని పస్తుపెట్టే విధానాలు మంచిది కాదు.

పండించిన పంటకు గిట్టుబాటు లేక, పెట్టిన పెట్టుబడులు రాక,వరస నష్టాలతో,రుణభారాలతో కుమిలిపోతున్నప్పటికి వ్యవసాయాన్ని మానేసి మరో వృత్తి చేపట్టడానికి ప్రత్యామ్నాయం లేకనే రైతు అందులోనే మగ్గుతున్నారు.నష్టమైనా,కష్టమైనా వ్యవసాయంలోనే కొనసాగాల్సిన దుస్థితి నెలకొని ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మీద ఆదారపడి రైతు జీవించాల్సి వస్తుంది.వ్యవసాయ ఉత్పత్తిలో మూడో వంతు మాత్రమే ఉత్పత్తి దారులకు దక్కుతుంది.మిగిలినది దళారులు,వ్యాపారులు ,వాణిజ్య సంస్థలు కబళిస్తున్నాయి.వ్యవసాయ ఉత్పత్తులకు కాలానుగుణంగా ధరలు దక్కక పోతే రైతులు తమ వృత్తిని కొనసాగించలేరు.దండగమారి వ్యవసాయం ఎక్కువ కాలం. ఆరుగాలం శ్రమించి గిట్టుబాటు ఎండమావై పెట్టుబడులు కూడా లేక బతుకులు బండబారుతున్న సాగుదారుల వ్యదార్ధ  జీవన చిత్రం ఒక పక్కన కళ్ళకు కడుతుంది.కోతకి ,నూర్పిడి ఖర్చులు రాని ధర విని కడుపు రగిలిపోయి కంటికి రెప్పలా సాకిన పంటను రైతే చే జెతులా నిప్పు బెడుతున్న విషాద ఘట్టాలు చూస్తున్నారు పాలకులు.తమ ప్రమేయంలేని చీడపీడలు ,పకృతి ఉత్పాతాలు,మార్కెట్ శక్తుల  మాయాజాలం,దళారుల దాష్టీకాలకు రైతు మూల్యం చెల్లించే దుర్మార్గం .

డాక్టర్ స్వామి నాధన్ కమిటీ చేసిన విలువైన సిఫార్సులు  అమలు చేస్తామని అధికారంలోకి కమలనాధులు వాటిని గాలికి వదిలేసి సాధ్యంకాని,ఉపయోగం లేని చట్టాలతో రైతులను మునగ చెట్లు ఎక్కిస్తున్నారు.రైతుని వ్యవసాయానికి దూరం చేసే దుర్విధానాలతో ఆహార భద్రత,రైతు భద్రత గాలిలో దీపం కానుంది .నిజంగా కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మేలు చెయాలన్న ఆపేక్ష వుంటే వారికి  గిట్టుబాటు  ధర కల్పిస్తే చాలు. రైతులుఏళ్లతరబడిగా  అడుగుతున్నది కూడా గిట్టుబాటు ధరనే, అదిఇచ్చి వారి పంటను కొని ఆ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తే ఎంతో  సంతోషిస్తారు.
మౌలిక సదుపాయాలు కల్పించి.పంట ఉత్పత్తులను స్థానికంగా ప్రభుత్వాలే కొనుగోలు చెయ్యాలి. అలా కాకుండా కార్పొరేట్  వర్గాలు ,వ్యాపారులు,దళారుల కు కొమ్ముకాసే విధానాలతో రైతులను నిండా ముంచడం  సమర్ధనీయం కాదు. రైతులు ఏ ఆందోళన లేకుండా నిద్రించే భారత్ ను నిర్మిద్దామంటూ ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం వినాశకర బిల్లులు తెచ్చి రైతులకు కంటిమీద కునుకు లేకుండాచేశారు. ఇప్పటికే సంక్షోభంలో కూరుకు పోయిన వ్యవసాయ రంగం పై తెచ్చిన కొత్త చట్టాలు రైతులకు,వినియోగదారుడకు,దేశ ఆహార భద్రతకు పెను ప్రమాదంగా  పరిణమించనున్నాయి.

–  సుంకర పద్మశ్రీ( ఏపీ కాంగ్రెస్ )