జగన్‌ తల్చుకుంటే…అంతే మరి!

447

ఆయన మదిలోకి వచ్చిందంటే ఆచరించడమే ఆయనకున్న నైజం. త్వరలో జరుగనున్న తిరుపతి (రిజర్వుడు) లోక్‌సభ ఉప ఎన్నికల వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా తన సొంత ఫిజియోథెరపిస్ట్‌ గురుమూర్తిని ఎంపిక చేయడం చూస్తే జగన్ తనను నమ్ముకున్న వ్యక్తికే పట్టం గట్టారనిపిస్తుంది.చారిత్రాత్మకమైన పాదయాత్రలో జగన్‌ వెంట అన్ని రోజులూ ఉండి ఆయనకు ఫిజియో సేవలందించిన గురుమూర్తి చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన వాడు. సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో జగన్‌కు కాళ్ల నొప్పుల నివారణకు చిట్కాలు చెప్పడం… ప్రతి రోజూ జగన్‌ తాను బస చేసిన బస్సులోకి ప్రవేశించగానే కనిపెట్టుకుని ఉండి ఆయన పాదాలను రక్షించే బాధ్యతలు నిర్వర్తించే వారు. ఈ క్రమంలోనే ‘గురు’ జగన్‌ను బాగా ఆకట్టుకుని దగ్గరయ్యారు.

అనుకోకుండా తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌రావు కరోనాతో మృతి చెందడం, ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి దుర్గాప్రసాద్‌ సతీమణి విముఖత చూపడంతో ప్రత్యామ్నాయ అన్వేషణ మొదలైంది. తనకు వద్దు, తన కుమారుడు కళ్యాణ చక్రవర్తికి తిరుపతి టికెట్‌ ఇవ్వాల్సిందిగా దుర్గాప్రసాద్‌ సతీమణి చేసిన వినతిని జగన్‌ పట్టించుకోలేదు. మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఇస్తామని వారికి రాయబారం పంపారు.

మరో వైపు తిరుపతి అభ్యర్థి కోసం ఇతరత్రా అన్వేషణ చేస్తూ వచ్చారు. ఎవరో ఎందుకు ? తన ఫిజియో థెరఫిస్ట్‌ ‘గురు’నే ఎంపిక చేస్తే పోలా? అని భావించి అదే విషయాన్ని జగన్‌ పార్టీ నేతల చెవిలో వేశారు.బాస్‌ చెప్పాక తిరుగేముంది? అందరూ మౌనంగా‘ ఏకాభిప్రాయం, పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే మాకు శిరోధార్యం’ అనే పల్లవి ఎత్తుకున్నారు.ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి చెందాలని అటు దుర్గాప్రసాద్‌ కుటుంబీకులకు నచ్చ జెప్పి గురుమూర్తి పేరును అదను చూసి ప్రకటించే బాధ్యతను కొందరు ముఖ్య నేతలకు జగన్‌ అప్పగించారు.

గురును ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఆయన చిత్తశుద్ది అంటున్నారు. అంతే కాదు, బాపట్లలో ఒక సామాన్యుడు గ్రామ స్థాయి నేత కూడా కాని నందిగం సురేష్‌కు ఎకాఎకీగా పార్లమెంటు టికెట్‌ ఇచ్చి జగన్‌ గెలిపించుకున్నారు. అదే మాదిరిగా తానే అధికారంలో ఉన్నపుడు తిరుపతిలో గురుమూర్తిని గెలిపించుకోలేనా! అనే ఉద్దేశ్యంతో జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏతా వాతా చూస్తే రాజకీయాల్లో తన కంటే చిన్న వయసు వారిని, సమాన వయస్కులనూ సాధ్యమైనంత మందిని ప్రోత్సహిస్తే తుదికంటా తన వెంట ఉంటారనే యోచనతో జగన్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.కాకలు తీరిన వృద్ధ నేతలు, సీనియర్‌లతో ఎప్పటికైనా తంపటమే అన్నట్లుగా కూడా జగన్ తలపోస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తన పాదయాత్ర ముగిశాక ఇదే గురుమూర్తిని తనతోనే ఉండిపోవాలని జగన్‌ కోరగా… ఇంటి వద్ద మాట్లాడుకుని వస్తాను సార్‌… అంటూ వెనుదిరిగారట. ఇంటి వద్ద సంప్రదింపులు జరిగి జగన్‌తో ఉండి పోదామని నిర్ణయం తీసుకుని వెనుదిరిగి వస్తే జగన్‌ను కలవడానికి అనుమతి దొరక్క గురు ఆపసోపాలు పడ్డారు.జగన్‌ ఓ సారి ఫలానా చోటకు విమానంలో వెళ్తున్నారని తెలిసి అదే విమానంలో తాను కూడా వెళ్లేలా టికెట్‌ కొనుక్కుని అందులోకి ప్రవేశించి జగన్‌కు కనిపించారట. ఏమయ్యావు? అనే ప్రశ్నకు మిమ్మల్ని కలవడానికి ఇబ్బంది పడ్డాను సార్‌ అనడంతో.. జరిగింది గ్రహించిన జగన్‌ సరే అని గురుకు ఓ ఉద్యోగం ఇచ్చారు. ఆ తరువాత ఇపుడేకంగా ఎంపీ ఉద్యోగమే ఇవ్వబోతున్నారు. కొన్ని అలా జరుగుతాయంతే!