హైద్రాబాద్ ఎన్నికల్లో టీడీపీ..బోణీ కొట్టడం సాధ్యమేనా?

390

ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అంతేగాని పాతలభైరవి సినిమాలోలా బొమ్మ ని రుద్దితే “నరుడా ఏమి నీ కోరిక” అని చిటికెలో నెరవేర్చేది కాదు.. ఏదైని ఒక ప్రాంత ,రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక, చిత్తశుద్ధి కలిగిన ప్రయత్నం అవసరం.. కలకత్తా, బెంగళూరు , చెన్నై, డిల్లీ, ముంబాయి , హైదరాబాద్ లాంటి మహా నగరాలు ఏర్పడటానికి వందల ఏళ్ళు పట్టింది.. ఈ నగరాల అభివృద్ధి క్రమంలో ఒక ప్రభుత్వంలో శంఖుస్థాపన జరిగి, మరో ప్రభుత్వంలో పనులు ప్రారంభం అయి, ఇంకొక ప్రభుత్వలో పూర్తయిన పనులెన్నో ఉన్నాయి… అంతవరకు అందరికీ ఒకే గాని అసలు  సమస్య ఎప్పుడు వస్తుందంటే, చంద్రబాబు లాంటి నాయకులు “నేను రాక ముందు అభివృద్ధి అనేదే అసలే లేదు, మొత్తం నేనే చేశానని” చెప్పుకోవటంతోనే ఇబ్బంది.

 తనని ఎందరు ఏమనుకుంటున్నా సరే, పక్కనోళ్ళ నవ్విపోతున్నా సరే చంద్రబాబు మాత్రం ఈపాట ని వదిలేలాలేరు… తాజాగా గ్రేటర్ హైద్రబాద్ ఎలక్షన్స్ ప్రచారం మొదలవడంతో తెలుగుదేశం నేతలతో చంద్రబాబు నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో మరోసారి హైదరాబాద్ నేనే అభివృద్ది చేశా. నాడు నా దూర దృష్టి వలనే నేడు హైదరాబాద్ కు అమెజాన్ లాంటి సంస్థలు వస్తున్నాయని, ఇదే ప్రచారం చేసి తెలుగు తముళ్ళు గ్రేటర్ ఎన్నికలకు సిద్దం కావాలని సూచనలు ఇచ్చారు… దాన్ని ఈ తెలుగు తమ్ముళ్లు గొర్రెల్లాగా నమ్మి ప్రచారం చేయడం మాత్రం హాస్యాస్పదమే..

సరే కొద్దిసేపు చంద్రబాబు ఆయన శిష్యులందిరి మాటలే నిజమనుకొని హైద్రాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంత?? ఆయనకి ముందు ముఖ్యమంత్రులెవరు అసలు హైద్రాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదా?? లేక 2003 లో చంద్రబాబు ఓటమి తర్వాత హైద్రాబాద్ అభివృద్ధి ఆగిపోయిందా అని లెక్కలు తీసుకొని విశ్లేషిస్తే చంద్రబాబు డొల్లతనం బయటపడుతుంది… చంద్రబాబు కేవలం కాగితం పులేనని, ఆయన ప్రచారానికి, పనికి అసలు సంబంధమే ఉండదు అనే విషయం కూడా అవగతమవుతుంది…

మాటి మాటికి చంద్రబాబు హైటెక్ సిటీ నేనే కట్టానని, ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ కూడా నేనే కట్టానని, అసలు హైద్రాబాద్ కి కంప్యూటర్ ని పరిచయం చేసేందే తానేనని కానీ అక్కడి ప్రజలు నన్ను మరిచారు అని అంటుంటారు.. హైద్రాబాద్ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర లెక్కలతో సహా ఇదిగో…

సైబర్ టవర్ఎవరి సృష్టి.??

రాజీవ్ గాంధీ హత్య తర్వాత, ఆయన మొదటి వర్ధంతి 21-May-1992 తేదీన రాజీవ్ దార్శనికతకి, టెక్నాలజీకి ఇచ్చిన ప్రాముఖ్యతను చిహ్నంగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు స్వయంగా ఇప్పటి సైబర్ టవర్స్ భవన నిర్మాణానికి, 4.5 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు… ఈ వ్యవహారాలన్నీ పర్యవేక్షించటానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి దానికి R.పార్ధసారధి గారిని ఎండిగా నియమించారు.. అప్పుడే అనేక అమెరికా కంపెనీలు ఇక్కడ తమ వ్యాపారకార్యకలాపాల నిర్వహణకు సంసిద్దం వ్యక్తం చేశాయి. అదేసమయంలో హార్డ్వేర్ పార్క్ నిర్మాణానికి జపాన్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది. 400 కోట్ల సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని కూడా నిర్ధేశించుకున్నారు. పార్థసారధి గారు అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 ప్రముఖ కంపెనీలకు లేఖలు రాసి, రాష్ట్రం కల్పించే ఐటి సదుపాయాలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు.
భవిష్యత్తులో హైదరాబాద్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ కు, చిప్ డిజైనింగ్ కు కేంద్రం అవుతుందని నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు అప్పుడే జోస్యం చెప్పారు . సైబర్ టవర్స్ శంకుస్థాపన జరిగిన ఆరు నెలలకే జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటం, కోట్ల పదవిలోకి రావటం,తక్కువ సమయంలోనే ఎన్నికలు రావడం, అందులో కాంగ్రెస్ ఓడిపోవటం, ఎన్టీఆర్ గెలుపు , వైశ్రాయ్ సంఘటన… వెరసి సైబర్ టవర్స్ పనులు మరుగునుపడ్డాయి…

చంద్రబాబు- సాఫ్ట్వేర్
1995లో వైస్రాయ్ ఘటనతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత నేదురుమల్లి గారి ప్రాజెక్టుకు కొనసాగింపుగా అక్కడ సైబర్ టవర్స్ నిర్మాణం చేపట్టారు… అప్పటి నుంచి 2004 వరకు ఐ.టిలో పెద్ద చెప్పుకోదగ్గ పురోగతి జరగలేదు. ఇప్పుడు ఎంతో రద్దీగా మారిన కూకట్ పల్లి, మాదాపూర్ , మెహదీపట్నం, గచ్చిబౌలి రోడ్లు 2004 వరకు ఎంత నిర్మానుష్యంగా ఉండేవో ఆనాడు చూసిన చాలామందికి తెలుసు. అంతే కాకుండా ఆనాడు జరిగిన అభివృద్ది గణంకాల రూపంలో ఇప్పటికి భద్రంగా ఉంది. దాని ప్రకారం 1994 -1995 సంవత్సరంలో మూడవసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు మన దేశం యొక్క సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 కోట్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 22 కోట్లు అంటే 9%, దేశంలోనే మూడో స్థానం లో ఉండేవాళ్ళం.. అలాగే 1998-99 సంవత్సరంలో సాఫ్ట్వేర్ మన రాష్ట్రంలో ఎగుమతులు ఒక్కసారిగా 22 కోట్లు నుండి 575 కోట్లు అయింది అని ఇదంతా చంద్రబాబు ప్రతిభే అని టీడీపీ, యెల్లో మీడియా భాకాలు ఊదుతారు…
కానీ దేశ వ్యాప్తంగా లెక్కలు విశ్లేషిస్తే అదే సంవత్సరం భారత దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎగుమతులు 6,300 కోట్లు ఉండగా అందులో  ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 575 కోట్లు మాత్రమే
అంటే 9% మాత్రమే… కానీ అదే యేడు కర్నాటక సాఫ్ట్వేర్ ఎగుమతులు 2,888 కోట్లుగా, నోయిడా కు సంబంధించి 1,430 కోట్లుగా, తమిళనాడుకి సంబంధించి 800 కోట్లుగా గణాంకాలు నమోదయ్యాయి… చివరగా చంద్రబాబు 2004 లో ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి రాష్ట్రం ఎగుమతులలో 3వ స్థానం నుండి 5వ స్థానానికి దిగజారిపోయాం..

వైస్సార్-  ఐటీ
చంద్రబాబు అతని మోచేతి నీళ్లు తాగే ఓకవర్గం మీడియా 2019 తమ ఓటమి తర్వాత,, పరిశ్రమలు రావడంలేదు, అభివృద్ధి ఆగిపోయింది,, ఆరాచకపాలన, ఇక టీడీపీ నే మీకు దిక్కు అని ఎలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అంతకుమించి 2004 లో వైస్సార్ గారు ముఖ్యమంత్రి ఇనా తర్వాత చేశారు.. ఈ విషయం ఇప్పట్లో చాలామందికి తెలియకున్నా 2000 నుండి వార్తాపత్రికలు చదివే నాలాంటి చాలామందికి ప్రస్ఫుటంగా తెలిసిన విషయమే… చంద్రబాబు నా వల్లే హైదరాబాద్లో ఐ.టి అభివృద్ది అని చెప్పుకున్నా,, రైతు పక్షపాతిగా, అపర భగీరధుడిగా పేరొందిన వై.యస్.ఆర్ గారి హయాంలో ఈ ఐటీ అభివృద్ధి ఎంత శరవేగంగా జరిగిందో మనకి గణంకాలు తెలియజేస్తాయి..
2004 వరకు రాష్ట్రం నుంచి రూ.5025 కోట్ల రూపాయల విలువైన ఐటీ ఎగుమతులు మాత్రమే ఉండేవి కానీ అదే ఐటీ ఉత్పత్తుల విలువ 2010 నాటికి రూ.36 వేల కోట్లకు గణనీయంగా పెరిగింది.. ఇది భారత ఐటీ ఎగుమతుల్లో 15 శాతం.. ఐటీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానిది దేశంలోనే నాలుగో స్థానం..ఇక వైఎస్సార్‌ హయాంలోనే రాష్ట్రానికి ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీలు వచ్చాయి. ఇన్ఫోసిస్, టిసిఎస్, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ కంపెనీల స్థాపనకు ప్రోత్సహించారు. వైఎస్సార్‌ హయాంలోనే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌(ఐటీఐఆర్‌)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 50 వేల ఎకరాల్లో రెండు దశల్లో ఐటీఐఆర్‌ అభివృద్ధి, రూ. 219 కోట్లు ఖర్చు చేసి 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ఈ కార్యాచరణ ఉద్దేశం.. ప్రముఖ ఐటీ కంపెనీలు అన్నీ హైదరాబాద్‌లో శాశ్వతంగా ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాలను కలుపుతూ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు అన్నీ ఇక్కడ ఏర్పాటవుతున్నాయి..
ఈ చర్యలతో రాష్ట్రంలో వైఎస్సార్‌ హయాంలోనే ఐటీ రంగంలో అత్యధికంగా ఉద్యోగాల కల్పన జరిగింది… 2003–04 ఐటీ రంగంలో 71,445 మందికి ఉద్యోగాలను కల్పించారు. ఇదే 2009లో ఈ సంఖ్య 2,51,786కు పెరిగింది…  దాంతో పాటు మౌళిక సదుపాయాల్లో భాగంగా నేడు లక్షల మంది రోజు వెళ్లే ఫ్లై ఓవర్లు నిర్మించారు. కూకట్ పల్లి – హైటెక్ సిటి ఫ్లై ఓవర్ శంకుస్థాపన 2007లో జరిగితే పూర్తైంది మాత్రం 2013లో. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ 2008లో మొదలైతే అక్టోబర్ 2010 లో పూర్తైంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ 2011లో పూర్తైంది..

అలాగే చంద్రబాబు ఎన్ని చెప్పుకున్నా హైద్రాబాద్ చుట్టూ వేసిన రింగ్ రోడ్డు ఎవరి హయాంలో DPR లు పూర్తిచేసుకుని పనులు మొదలయ్యాయో అందరికీ విదితమే.. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్, మెట్రో, పీవీ ఎక్స్ప్రెస్ వే ఇవన్నీ ఎవరి కలలో, ఎవరి హయాంలో ఒక రూపు దిద్దుకొని పనులు వేగంగా జరిగాయి అనే కానీస ఇంగితం కూడా లేకుండా చంద్రబాబు అన్నింటికీ నేనే అని చెప్పుకోడానికి అప్పుడప్పుడైనా సిగ్గుండాలి…

ఇక వైస్సార్  హయాంలో కేవలం హైదరాబాద్ లోనే అభివృద్దిని కేంద్రీకరించకుండా అభివృద్దిని అన్ని జిల్లాలకు వికేంద్రికరిస్తూ,,, విశాఖ భీమిలిలో ఐ.టి కారిడార్, దువ్వాడలో ఐ.టి సెజ్, పరవాడలో ఫార్మా కారిడార్, నెల్లూరు నాయుడు పేట మండలం లో మేనకూరు సెజ్, తడా మండలం మాంబట్టు సెజ్, సత్యవేడు శ్రీ సిటీ ని ఏర్పాటు చేశారు. దీంతో 2008-09 సంవత్సరం లో 32,507 కోట్ల ఎగుమతులు ఈ రంగంలో సాధించారు. ఇది జాతీయ ఎగుమతులలో 15 % (జాతీయ వృద్ది రేటు 32% ఉండగా రాష్ట్ర వృద్ది రేటు 41 %).. ఇలాక్ వైస్సార్ గారి హయాంలో హైద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకెళ్లినట్టు లెక్కలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి…

ఇలా హైద్రబాద్ లో జరిగిన అభివృద్దిని అధికారికంగా ఉన్న లెక్కల ప్రకారం చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందే హైద్రబాద్ నుండి ఐటి ఎగుమతులు 9% అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి 5 ఏళ్ళు 1999వరకు కూడా అదే 9%లో మార్పు లేదు. ఇక చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయ్యే నాటికే సాఫ్ట్వేర్ ఎగుమతులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే 3వ స్థానంలో ఉంటే ఆయన 2004లో ముఖ్యమంత్రిగా దిగిపోయే సమాయనికి అది 5వ స్థానంలోకి పడిపోయింది. ఈ లెక్కన ఆయన చేసిన హైదరాబాద్ అభివృద్ది ఎంటి అనేది ఆయనే చెప్పాలి….??

ఇంకో 10 ఏళ్ల తర్వాత హైద్రాబాద్ కి ఏదేని పెద్ద సంస్థ వస్తే అది అప్పటి నాయకుల కష్ట ఫలితమే గాని సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 3 వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 5 వ స్థానానికి దిగజార్చి, హైటెక్ సిటీ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూమిని తన వర్గీయులకు కట్టబెట్టి, ఇక్కడి తెలంగాణ ప్రజల నోట్లో మన్నుకొట్టి  17 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయిన చంద్రబాబు ఘనత ఏ మాత్రం కాదు… ఇవన్నీ హైద్రాబాద్ ప్రజలు మరవులేదు అందుకే 2004 నుండి హైద్రాబాద్ ఎన్నికల్లో టీడీపీ ప్రస్థానం ఎంత దిగజారిందో అందరికీ తెలిసిందే… ఈ సారి ఎన్నికల్లో కూడా బోణీ కొట్టడం అసాధ్యమే.. ఒకవేళ కొట్టినా సరే అది 1 లేక 2 సీట్లకు పరిమితం.

-రవి కుమార్

1 COMMENT

  1. హైద్రాబాద్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఈ కథ రాసినట్లు అర్థం అవుతోంది. 2014 లొనే కదా గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు గాను 10 స్థానాల్లో గెలిచింది. మిత్రపక్షంగా బీజేపీ కి ఐదు సీట్లు విజయాన్ని కట్టబెట్టింది.. హైద్రాబాద్ లో అసలు ఊహించని రోడ్ల విస్తరణ టీడీపీ నుంచి మొదలైంది. ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మించి, శానిటేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్లనే నేషనల్ లెవెల్ లో మూడుసార్లు క్లీన్ సిటీ అవార్డ్ హైద్రాబాద్ కు దక్కింది. తద్వారానే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి.. మైక్రోసాఫ్ట్ వాడు వచ్చింది కాంగ్రెస్ వారు చేసిన గ గొప్ప పనులు చూసి కాదు. పేరుకు జర్నలిస్ట్ అనే ముసుగులో చెత్తంతా నింపుదాం అనుకుంటే ాాఅబాసుపాలు కాక తప్పదు.