ముందుది వెనుక…వెనుకది ముందు అయినట్టుంది!

231

ముందు పని ముందు….వెనుక పని వెనుకా చెయ్యాలంటారు పెద్దలు.మాట వరుసకు- ఒక ఇంటర్వ్యూయర్ ఒకామెను- మీకు పిల్లలెంతమంది మేడం? అని అడిగాడట. ‘ముగ్గురు” అని చెప్పిందట ఆవిడ. ఈ ప్రశ్న కంటే ముందు ఇంకో ప్రశ్న అడగాలి గానీ…అప్పుడు అడగడం మర్చిపోయి…. ఇప్పుడు అడిగాడు,  “మీకు పెళ్లి అయిందా మేడం?” అని. ఇంటర్వ్యూయర్ పంబ రేగగొట్టింది. ఇదే ప్రశ్న ముందు గానూ; పిల్లలెంతమంది అనే ప్రశ్న తరువాతా అడిగితే…. ఇద్దరికీ హాయిగా  ఉండేది.
ఏ పీ లో బీజేపీ కి అధ్యక్షుడిని నియమించే విషయంలో- కన్నా లక్ష్మీనారాయణను నియమించే బదులు – సోము వీర్రాజును; ఇప్పుడు వీర్రాజు స్థానం లో కన్నాను నియమించి ఉంటే బాగుండేది.
నిజానికి, కన్నా ను నియమించే రోజుల్లో- రాష్ట్రం లో తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉంది. తెలుగు దేశం అంటే – సోము వీర్రాజుకు వళ్ళు మంట. అప్పుడు ఆయనను బీజేపీ అధ్యక్షుడిగా చేసివుంటే…; తెలుగు దేశంను, చంద్రబాబును కూడా రఫ్ఫాడించి ఉండేవారు. తెలుగు దేశం – దాని గొయ్యి అదే తవ్వుకుని ఉండేది కనుక; ఆ కీర్తి ఏదో సోము వీర్రాజుకు దక్కి ఉండేది. ఆ చారిత్రిక అవకాశం ఆయనకు దక్కకుండా పోయింది.
కన్నా స్థానం లో నిజానికి సోము వీర్రాజును ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారనే అభిప్రాయం బాగా బలంగా వినిపించింది కూడా.”ఇక చంద్రబాబు పని అయినట్టే. సోము వీర్రాజు ఆయనను పీకి పాకం పెడతారు…” అనే విశ్లేషణలు కూడా రాజకీయ వర్గాలలో వినిపించాయి.అనుకోకుండా కన్నా లక్ష్మినారాయణకు అవకాశం వచ్చింది.
ఇప్పుడేమో- రాష్ట్రం లో చంద్రబాబు దిగిపోయిన తరువాత, సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి అప్పగించారు.రైలు వెళ్లిపోయిన తరువాత, ప్లాట్ ఫారం మీదకు వచ్చినట్టు.
రాష్ట్రం లో ఇప్పుడు ఉన్నదేమో వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు కు అటు వైసీపీ వ్యతిరేకమే…ఇటు సోము వీర్రాజూ వ్యతిరేకమే. అలా అని చెప్పి, కాళ్ళూ చేతులూ  ఉడిగి పోయి, మూలన చతికల బడిపోయిన తెలుగు దేశంను, చంద్రబాబును ఇప్పుడు సోము వీర్రాజు విమర్శిస్తుంటే….వింటానికి అంత వినసొంపుగా ఉండడం లేదు.
ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఆయన వైసీపీ ని విమర్శించవలసినంతగా విమర్శించడం లేదన్న అభిప్రాయం ఒకటి లేకపోలేదు. ఇప్పటికే, నట్లు లూజ్ అయిపోయివున్న సైకిల్ ను ఇంకో తొక్కు తొక్కాలన్న వీరావేశం ఆయన మాటల్లో వ్యక్తమవుతూ ఉంటుంది.  వీర్రాజు ను తప్పు పెట్టాల్సిన పని లేదేమో!ఎందుకంటే….తెలుగు దేశం ది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. జగన్ ది 16,17 నెలల అనుభవం. అనుభవం మీద నేర్చుకోవచ్చు. ఎందుకు వైసీపీ ని టార్గెట్ చేయడం అనేది సోము అభిప్రాయం అయి ఉండవచ్చు
కానీ, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ది- సోము వీర్రాజు దూకుడుకు పూర్తి భిన్నమైన దూకుడు.
టి ఆర్ ఎస్ ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని అల్ల కల్లోలం చేసి పారేస్తున్నారు, బండి సంజయ్.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుకు విశ్లేషకులు సైతం విస్తు బోతున్నారు. అది ఏమి “బండి” అనేది అంతుబట్టడం లేదు. దుబ్బాక ఉప ఎన్నిక లో బీజేపీ అభ్యర్థి గెలవడానికి- బండి సంజయ్ వీర దూకుడే ముఖ్య కారణం. బీజేపీ శ్రేణులను ఆయన ముందుండి నడుపుతున్నారు. ఆయన దూకుడు కు టీ. ఆర్. ఎస్. కూడా మొదటి సారి కంగు తింటున్న సూచనలు కనిపిస్తున్నాయి.
తనను టీ. ఆర్. ఎస్ నేతలు తమలపాకు తో కొడుతుంటే- ఆయన తిరిగి తలుపు చెక్కతో వారిని పిచ్చ బాదుడు బాదుతున్నారు .వరద సాయం ఆపేయమని బండి సంజయే…ఎన్నికల కమిషనర్ కు ఉత్తరం రాసారని టీ ఆర్ ఎస్ ఒక్క మాట అంటే…బండి సంజయ్- దానిని రచ్చ రచ్చ చేశారు. ఏకంగా పాత బస్తీ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి- తాను ఆ లేఖ రాయలేదని ప్రమాణం చేశారు. గ్రేటర్ మున్సిపాలిటీ లో ఎన్ని స్థానాలు గెలుస్తారో చెప్పలేము కానీ, ఆయన పోరాట పటిమ మాత్రం ముచ్చట గొలుపుతోంది.
బండి సంజయ్ సారథ్యం లో తెలంగాణ లో  ఇక ముందు, ముందు బీజేపీ కి జవసత్వాలు సమకూరతాయనే భావన కలుగుతోంది.తెలంగాణలో బండి సంజయ్ కి ఉన్న కొన్ని వెసులుబాట్లు, రాజకీయ పరిస్థితులు, కేంద్ర నాయకుల దన్ను మొదలైనవి- ఆంధ్రాలో సోము వీర్రాజుకు లేవేమో మరి.
తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ- చరిత్రపుటలకు పరిమితమైంది. కనుక, దానిని విమర్శిస్తే, స్వరపేటిక అరుగుదల తప్ప….మరో ప్రయోజనం లేదు. కాంగ్రెస్ ఏమో బయటి వారు పట్టించుకోవాల్సిన స్థితిలో లేదు. వాళ్ళల్లో వాళ్లే…దాని సంగతి తేల్చి పారేస్తారు. ఇక, మిగిలింది టీ. ఆర్.ఎస్.దానితో, బీజేపీ అధ్యక్షుడు తన బండిని టీ ఆర్ ఎస్ పైకి  నడిపిస్తున్నారు. శరభ…శరభ  అంటూ విరుచుకు పడిపోతున్నారు.
ఆంధ్ర విషయానికి వచ్చే సరికి, సైకిల్ కు నట్లు లూజ్ అయ్యాయి తప్ప: సాంతం ఊడిపోలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తే….; తెలుగు దేశం ఎక్కడ బలపడుతుందో అన్నది సోము వీర్రాజు బెంగ. అసలు విమర్శించక పోతే బాగుండదేమో అన్న శంక. మళ్లీ- కులాల గోల ఒకటి.
దీనికి తోడు, పవన్ కళ్యాణ్ లగేజ్ ఒకటి. వైసీపీ ని విమర్శించడం పవన్ కళ్యాణ్ కి ఇష్టం. టీడీపీ ని విమర్శించడం సోము వీర్రాజుకు ఇష్టం. వెరసి- గందరగోళం.సోము వీర్రాజుకు రాంగ్ టైమ్ లో ఆ పదవి వచ్చిందేమోనన్నది నా భావన. అయినా… శ్రమ పడుతున్నారు. అల్ దీ బెస్ట్.

-భోగాది వెంకట రాయుడు