నేనొప్పుకోను..నేనొప్పుకోను..అయితే ఓకే!

281

స్థానిక సమరంపై ‘కమలం’లో ‘అరవ కామెడీ’
ముందు ఓకేనని, ఇప్పుడు నేనొప్పుకోనంటున్న వీర్రాజు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

నేనొప్పుకోను.. నేనొప్పుకోను.. అయితే ఓకే! అదేదో సినిమాలో హాస్యనటుడు కొండవస డైలాగిది! ముందు కాదని గంభీరంగా అన్న తన మాటనే, తర్వాత అయితే ఓకేనని చెప్పే, గందరగోళం కామెడీ టైపు క్యారెక్టరు ఆయనది. అయితే తెలుగు డైరెక్టు సినిమా కామెడీ అందరికీ అర్ధమవుతుంది. కానీ తమిళ డబ్బింగు సినిమాల అరవ కామెడీ ఎవరికీ అర్ధమయిచావదు. ఇప్పుడు ఏపీ బీజేపీలో ఇలాంటి కామెడీ ట్రాక్ , ఒక పాలిసీగా నడుస్తుండటమే పెద్ద కామెడీ. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం నేతల కప్పగంతులే నిదర్శనం. కాకపోతే.. ఇక్కడ కొద్దిగా రివర్సు. ముందు.. అయితే ఓకే అన్న బీజేపీ, ఇప్పుడు నేనొప్పుకోను అంటోంది. అదొక్కటే తే డా. మిగిలినదంతా షేమ్ టు షేమ్!

స్థానిక సంస్థల నిర్వహణ వ్యవహారం కమలంలో కితకితలు పెట్టిస్తోంది. గతంలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను, తిరిగి జరిపించాలని వైసీపీ మినహా, అన్ని పార్టీలూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను డిమాండ్ చేశాయి. అంతకుముందే… అంటే స్థానిక సంస్థలు జరుగుతున్న సమయంలో.. బెదిరించి తమ పార్టీ అభ్యర్ధులను ఉపసంహరించేలా చూశారని బీజేపీ సహా అన్ని పార్టీలూ ఫిర్యాదు చేశాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంత మండలంలోనే, బీజేపీ అభ్యర్ధి చేయి నరికిన వైసీపీ నేతల దాడులను, నాటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అసలు ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి, తిరిగి ఎన్నికలు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే బీజేపీ అభిప్రాయం అదేనన్నమాట. ఆ తర్వాత ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి కూడా అదే డిమాండ్ చేశారు.

ఇటీవల బీజేపీ పక్షాన ఎస్‌ఈసీ భేటీకి హాజరైన ఆ పార్టీ ప్రతినిధి పాకా సత్యనారాయణ కూడా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారం, ఎన్నికలు నిర్వహించాలని గుర్తు చేశారు. దానితోపాటు కొన్ని సందేహాలు, ప్రశ్నలతో కూడి న ఒక లేఖ కూడా ఇచ్చారు. పైగా గతంలో మాదిరి కాకుండా, ప్రచార వ్యవధి పెంచాలని కూడా కోరారు. ఆ మేరకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ అంగీకరించిందని, ఆ పార్టీ ప్రతినిధి రాసిన లేఖ చదివిన బుర్ర-బుద్ధి ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.
కానీ.. ఆ పార్టీని నడిపిస్తున్న మహా నాయకుడైన సోము వీర్రాజుకు మాత్రం, ఇంకా తమ పార్టీ ఇచ్చిన లేఖ అర్ధం కానట్లుంది. తాజాగా ఆయన కాకినాడలో నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో “ఎవరు చెబితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో హడావుడిగా ఎన్నికలు ఎందుకు నిర్వహించాల్సి వస్తోందో చెప్పాలని, ఎవరి డైరెక్షన్‌లో మీరు ఎన్నికలు నిర్వహిద్దామనుకుంటున్నారని మండిపడ్డారు.అమరావతి పేరు చెప్పి రూ.7,200 కోట్లు ఖర్చు చేసినా ఒక్క శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేకపోయారని చంద్రబాబుపై మండిపడ్డారు.అమరావతి కోసం వేల ఎకరాలు సేకరించి రైతులను నట్టేట ముంచారన్నారు. టీడీపీ హయాంలో ఉపాధి పథకాన్ని పక్కదారిపట్టించి రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు”.ఈ వ్యాఖ్యలు చూస్తే.. బీజేపీ ‘అరవ కామెడీ’లో పాత్రధారులు, ఎంత గందరగోళంగా నటిస్తున్నారో స్పష్టమవుతుంది. ఎవరు చెబితే రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహిస్తున్నారన్న వీర్రాజు ప్రశ్న, కమలనాధులకు సహజంగానే కామెడీలా అనిపించిందట. కరోనా సమయంలో హడావిడిగా ఎందుకు, ఎవరి డైరక్షన్‌లో మీరు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని ఆయన సీఈసీని ప్రశ్నించారు.

తమ సారు వేసిన ఈ ప్రశ్నకు నవ్వాలో, ఏడవాలో అర్ధం కాక, కమలనాధులు తమకు తామే కితకితలు పెట్టుకుని నవ్వుకుంటున్నారట. ఎస్‌ఈసీ వద్దకు సత్యనారాయణ అనే నేతను, పార్టీ ప్రతినిధిగా వీరగంధం దిద్ది పంపించింది వీర్రాజు గారే. ఆ సమయంలో సహజంగా పార్టీ సంఘటనా మంత్రి, ఇన్చార్జిని సంప్రదించిన తర్వాతనే ఎస్‌ఈసీ వద్ద మాట్లాడవలసిన అంశాలు ఖరారు చేస్తారు. దానినే డ్రాఫ్టుగా త యారుచేస్తారు. ఇవన్నీ రాష్ట్ర అధ్యక్షుడి అనుమతి తర్వాతనే జరుగుతాయి. మరి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు, తమ పార్టీ పూర్తి అనుకూలం అని లేఖ ఇచ్చి… ఇప్పుడు ఎవరినడిగి, ఎవరు చెబితే ఎన్నికలు నిర్వహిస్తున్నారని స్వయంగా అధ్యక్షుడే ప్రశ్నిస్తే.. అది ‘అరవ కామెడీ’నే అవుతుంది కదా అన్నది కమలనాధుల ప్రశ్న. మరి సన్నివేశాలు పండకపోతే , కథ మార్చాల్సిన.. పార్టీకి మార్గదర్శకుడైన సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డిజీ, ఈ కామెడీ కథలో తన పాత్రేమీలేదనట్లు.. మౌనంగా ఉండటమే కమలదళాల ఆశ్చర్యానికి మరో కారణం.

సహజంగా ఈ ప్రశ్న ఎస్‌ఈసీని వ్యతిరేకిస్తున్న, వైసీపీ అధికార ప్రతినిధులు వేయాలి. ఈ మధ్య వైసీపీ అధికార ప్రతినిధుల గొంతు బాగా తగ్గిపోయింది. వారు టీడీపీ అండ్ కోను, రోజూ తెగ తిట్టి అలసిపోయినట్లున్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డను దుమ్మెత్తిపోసి నోరు నొప్పిపుట్టి విశ్రాంతి తీసుకుంటున్నట్లునారు. బహుశా ఆ లోటు కనిపించకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల సబ్జెక్టు, లైవ్‌లో ఉంచేందుకు.. చంద్రుడికో నూలుపోగులా, సోము వీర్రాజు.. వారి బాధ్యత తగ్గించేందుకు, ఉడత సాయం చేస్తున్నారన్నది కమలనాధుల ఉవాచ. నిజం సోమేశ్వరుడికెరుక?