హోదా ఇక రాదా…?

581

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు,
ఆచరణలో  అయ్యింది తుక్కుతుక్కు.

*ఇచ్చిన హామీలన్నీ సునామీల్లా…ఆంధ్రాను ముంచేశాయి.

తెలుగోడి గోడు… చెదిరిన గూడుగానే మిగిలిపోయింది.

ఇచ్చిన వాగ్దానాలన్నీ…. ఉత్తుత్తి దానాలే… చెప్పిన మాటలన్నీ బీటలువారిన  కోటలే…*

ఇరవై మూడు జిల్లాలు పదమూడు అయినా…మళ్లీ అవి ఇరవైఐదుగా విభజించబడినా… జరిగేది ఏమీ లేదు…మనకు ఒరిగిందేమీ లేదు…

హోదా మాత్రం గోదాట్లో కలిసి పోయింది.

ఇరుగు పొరుగు రాష్ట్రాలన్ని… ఆంధ్రా అభివృద్ధిని అడ్డుకునేందుకు…సందకాడ కూసే  నక్కలయ్యాయి

తెలుగు జాతి ముక్కలయింది గాని.. చక్కబడే మార్గమే కనిపించటం లేదు,

నాయకులంతా వినాయకులయ్యారు, అరచేయి చూపించి హామీలిచ్చే వారే కానీ…!
అరక్షణం దొరికినా…టీవీల ముందు ఠీవిగా  కూర్చుని బీరాలు పలికే వారే కానీ‌.. పరువుకోసం ప్రాకులాడే వాళ్ళు కనిపించడం లేదు.

ఇచ్చిన హోదా పదేళ్ళు..! గడిచింది ఆరేళ్ళు…!
గుప్పించిన హామీలు బోలెడు…
సాధించిన ప్రగతి సాలిగూడు..!

ఢిల్లీ పెద్దలు చూపించిన ఆశలు బారెడు….        ఢిల్లీ నుండి గల్లీకి చేరిన నిధులు బిత్తెడు…

ఉమ్మడి సొమ్ములు విభజన జరగడమూ లేదు…
సామాజిక మాధ్యమాల్లో భజన ఆగడమూ లేదు.

టీవీల ముందు కూర్చుంటే పొట్టేళ్ల కొట్లాటే నయం, ఎన్నికలొస్తే మళ్ళీ నక్కజిత్తుల వినయాలే…ప్రియం
చివరకు కుక్కలు చింపిన విస్తరి అవ్వడం ఖాయం….

అయినా ఒకటి మాత్రం నిజం…

కొందరు కొంతకాలం మాత్రమే మోసం చేయగలరు….!

అందరూ…కొంత కాలం మాత్రమే మోసపోగలరు…!

కొందరిని మాత్రమే చాలా కాలం మోసం చేయగలరు…!

అందరినీ ఎల్లకాలం మోసం చేయడం ఎవరి తరం కాదు.

(ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు
హోదాపై నా మదిలో రగిలిన బాధ మాత్రమే)

                                                                               పత్తిపాటి రమేష్ నాయుడు
-ఫోన్: 9491776837.