వరవరరావుని ఎందుకు విడుదల చేయకూడదంటే….

297

ఏళ్ళతరబడి అతిశయోక్తులతో కూడిన ప్రజాజీవితం లో ఉండి,  భారత దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదు అని భావించే ఈయనను ‘మావోయిస్ట్ కవి’ గా అభివర్ణించడానికి విలేకరులు, సంపాదకులు జంకుతూ ఉండవచ్చు. విలేఖరులు కానీ సంపాదకులు కానీ ఆయనను మావోయిస్టు కవి అని పిలవడానికి బదులుగా ప్రజాకవి అని అభివర్ణిస్తున్నారు. నిజానికి ఆయన ప్రజాజీవనం నుంచి చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నారు. రహస్య జీవనాన్ని గడిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భారతదేశానికి తగినది కాదని ఆయన పేర్కొన్న విషయం రికార్డులలో ఉంది. రెడిఫ్ కోసం సందేష్ ప్రభుదేశాయ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రావు ఎటువంటి సంకోచం లేకుండా , “పార్లమెంటరీ రాజకీయాలను తిరస్కరించదానికి, వ్యవసాయదారులు  సాయుధ విప్లవం చేపట్టదానికి  మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) ను ఏర్పాటు చేయడానికి నక్సల్బరీ మార్గ నిర్దేశనం చేసింది.” అని చెప్పడమే కాకుండా , “1990 లతో పోలిస్తే, నేడు మా పరిస్థితి  చాలా బలంగా ఉంది. వాస్తవానికి, ఉత్తర తెలంగాణ మరియు దండకారణ్యాలలో, గెరిల్లా జోన్లను రూపొందించే అధునాతన దశకు అది చేరుకుంది. మేము దండకారణ్యాన్ని ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నఒక బేస్ ప్రాంతంగా భావిస్తున్నాము. ఒక్కో దానిలో 200 మంది ఎర్ర సైన్యం గల దళాలతో కూడిన ప్రజా సైన్యాన్ని తయారు చేయడానికి దండకారణ్యం మాకు అనువైన ప్రాంతముగా మేము భావిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమం అణగారిపోతోంది అని ఎలా చెప్పగలరు?

వరవారరావు ఇలాంటి దేశద్రోహ వాదనలు చేయడం కొత్తేమీ కాదు. అతను 1970 లలోనే జైలు పాలయ్యాడు. 1980 లలోని రామ్ నగర్ కుట్ర కేసులో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అతను 1986 లో కటకటాల పాలయ్యాడు. ఈ కేసులో రికార్డు స్థాయిలో 17 సంవత్సరాల విచారణ తరువాత, రావు 2003 లో విడుదలయ్యాడు. యుపిఎ -1 సమయంలో, అతను మళ్ళీ 2005 లో జైలు పాలయ్యాడు. వరవరరావుకి జైలుతో సుదీర్ఘ అనుబంధముంది. అతను దశాబ్దాలుగా హింసా మార్గంలోనే కొనసాగినప్పటికీ  చెప్పుకోదగ్గ కారణమేమీ లేకుండానే భారత ప్రభుత్వం అతన్ని ఇంతకాలం సహించింది. అలాగే, మన ప్రసిద్ధ పత్రికలు మరియు సంస్థాగత మీడియా అతన్ని  ‘ప్రజాకవి’ గా పిలుస్తాయి. మావో జెడాంగ్, జోసెఫ్ స్టాలిన్, అయతోల్లా రుహోల్లా ఖొమేని మరియు ముయమ్మర్ గడ్డాఫీలు కూడా కవిత్వం రాశారు. కానీ వారు చేసిన సామూహిక జన హనన చరిత్ర నుంచి వారికి వారి కవితలు మినహాయింపునివ్వలేవు.

విడుదల చెయ్యాలంటూ చేస్తున్న ప్రచారం రాజకీయ ప్రయోజనాల కోసమేనా?
“ప్రజాకవి అనే గుర్తింపు, ఆయన వయస్సు 80 సంవత్సరాలు” అనే ఈ రెండు విషయాలూ ఆయన విడుదల కోరుతూ చేస్తున్న ప్రచారంలో ఆయన మద్దతుదారులు మరియు సానుభూతిపరులు ఉపయోగించే ప్రధాన అస్త్రాలు. ఈ వాదన కనీసం మూడు కారణాల వల్ల హేతుబద్ధమైనది కాదు. మొదట, ఏ నిందితుడైనా సీనియర్ సిటిజన్ అయినంత మాత్రాన క్షమార్హుడు కాలేడు. ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా’ (2015) ప్రకారం భారతదేశంలోని వివిధ జైళ్లలో ఉంటున్న 1,34,168 మంది దోషులలో 24,035 (17.9%) మంది దోషులు 50 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు. గత 5 సంవత్సరాల్లో ఈ సంఖ్య పెరిగి ఉండవచ్చునని అనుకోవచ్చు. ఇప్పుడు, వరవరరావు కోసం COVID-19 కారణంగా మినహాయింపు పొందగలిగితే,  దానిని ‘వృద్ధులు’ గా వర్గీకరించగల ఇతర 25 వేల మంది ఖైదీలకు కూడా వర్తింపజేయాలి. కోవిడ్ భయం గురించి మాత్రమే అయితే వరవరరావులా 50 ఏళ్లు పైబడిన ప్రతి ఖైదీని విడుదల చేయాలని రావు యొక్క ‘కామ్రేడ్స్-ఇన్-ఆర్మ్స్’ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఖచ్చితంగా, ఆ 25 వేల మంది ఖైదీలను ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే వారు మేధావులు గానీ కార్యకర్తలు గానీ కాదు అలాగే కామ్రేడ్ల యొక్క ఏ పట్టణ నెట్‌ వర్క్ లోనూ వారు భాగస్వాములు కాదు. వరవరరావు కామ్రేడ్ల కిరీటంలోని ఆభరణం వంటివాడు. ఎందుకంటే అతనిలాంటి వారిని నక్సల్బరీ మరియు మావోయిస్టు తిరుగుబాటు ఉద్యమం యొక్క ‘పోస్టర్ బాయ్స్‌’గా వారు ఉపయోగించుకుంటారు.

రెండవది, రావు కూడా ఇతర ఖైదీల మాదిరిగానే, అతనికి అవసరమైనప్పుడు జైలులోనే వైద్య సహాయం పొందాల్సిన అవసరం ఉంది. రావుకు వైద్య సహాయం ఇవ్వడం లేదని అతని భార్య హేమలతా రావు మరియు కుమార్తె పవన ఆరోపించారు. “జైలులో ఆయన్ని చంపవద్దు” అని కూడా వారు అధికారులను కోరారు. ఇది మళ్ళీ కమ్యూనిస్ట్ తరహా ప్రచారం. ఇలాంటి నాజీ తరహా గోబెల్స్‌ ను ప్రచారం చెయ్యడంలో వారు సిద్దహస్తులు. ముంబైలోని జెజె హాస్పిటల్ డీన్ రంజిత్ మంకేశ్వర్, రావుకు అన్ని వైద్య సదుపాయాలు అందజేస్తున్నట్లు మీడియాకు మరియు ప్రజలకు రెండు మూడు సార్లు ఆయన ఆరోగ్య పరిస్థితులపై స్పష్టతనిచ్చాడు. ఇటీవల, వరవరరావుకు COVID సంక్రమించింది. ఇది ఒక రకమైన గందరగోళానికి దారితీసింది. అయితే ఒక నేర చరితుడు స్వేచ్ఛను పొందడానికి ఇది ఒక కారణమవడం సబబేనా? భారతదేశంలోని లక్షలాది మంది ఖైదీల కేసులతో పోలిస్తే అతని కేసు ఏ విధంగా ప్రత్యేకమైనది మరియు భిన్నమైనది? ఆయన పట్ల ఎందుకు అదనపు శ్రద్ధ చూపాలి? నిజానికి భారతదేశంలోని చాలా రాజకీయ పక్షాల మద్దతును రావు పొందుతున్నారనే వాస్తవం చాలా మందికి తెలియదు. ఒకవేళ కొంత అదనపు శ్రద్ధ కనబరచడం కోసం అతన్ని ‘రాజకీయ ఖైదీ’ అని పిలవాల్సి వస్తే, నక్సలిజం ముసుగులో ఆయన చేసిన కార్యకలాపాలను పరిశీలించడం తోపాటుగా దానివల్ల భారత ప్రజాస్వామ్యానికి ఎంతటి ముప్పు కలిగిందనే విషయాన్ని కూడా పరిగణించాలి.

తూత్తుకుడి కాల్పుల తరువాత ఒక ఇంటర్వ్యూలో రావు మాట్లాడుతూ, “సిపిఐ (మావోయిస్ట్) నాయకత్వంలో సాయుధ విప్లవం నక్సల్బరీ మార్గం నిర్దేశించిన కొత్త ప్రజాస్వామ్య విప్లవం కోసం, దండకారణ్యంలోని“ జనతన సర్కార్ ”లోకి ప్రవేశించింది. సరండా లేదా జార్ఖండ్‌, ఆంధ్ర,ఒరిస్సా బోర్డర్ స్పెషల్ గెరిల్లా జోన్ ఒక ప్రాంతీయ విప్లవాత్మక మండలి. జంగల్‌మహల్, పశ్చిమ కనుమలు, ట్రై జంక్షన్ మరియు తెలంగాణలలో 1996-1999 ప్రాంతాలలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి. ” ప్రభుత్వ సంస్థలలో ఇప్పటికీ బలమైన స్థానాలను కలిగివున్న వారు కూడా రావును ఎందుకు సమర్థిస్తున్నారో తెలుసుకోవటానికి ఇంతకంటే సాక్ష్యాలేం కావాలి? వరవారరావును సమర్థించిన వారు ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చి, భారత ప్రజాస్వామ్యం, రాష్ట్రం, పోలీసులు మరియు సాయుధ దళాలపై రావు అభిప్రాయాలతో వారు ఎంతవరకు ఏకీభవిస్తున్నారో “జనతన సర్కార్” కోసం ఆయన చేస్తున్న కృషికి మద్దతు ఇస్తున్నారా? లేదా? అనే విషయాలను స్పష్టం చేయాల్సి ఉంది? అలా కాకుండా వారు తమ ఉద్దేశాలను మానవత్వం వెనుక ఎంతకాలం దాచిపెడతారు? వారు వరవరరావు కోసం మానవ హక్కులను వల్లిస్తారు. కానీ ఇన్ఫార్మర్ల నెపంతో పోలీసు సిబ్బందిని, అమాయక గిరిజనులను నక్సలైట్లు చంపడాన్ని మాత్రం సమర్థిస్తారు.

వరవరావును ఎట్టి పరిస్థితులలోనూ విడుదల చేయకూడదు. ఆయన భారత రాజ్యాంగాన్ని విశ్వసించకపోయినా, అందరి భారతీయ పౌరులలాగే, ఆయనకూ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అలాగే ఇతర ఖైదీలకు అందించిన విధంగానే ఆయనకు కూడా అవసరమైన సమయంలో ఉత్తమ వైద్య చికిత్స అందించాలి. అదేవిధంగా  అతను చేసిన నేరాలకు ఇతరుల మాదిరిగానే అతన్ని కూడా శిక్షించాలి. అతను ‘మావోయిస్టు సిద్ధాంతకర్త’ అయినంత మాత్రాన ఆయనకు శిక్ష నుంచి మినహాయింపు వుండకూడదు.

 (వ్యాసకర్త ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడు)

-vskandhra