సమరసతా సేవా ఫౌండేషన్….

445

సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా గుండె గుండెలో వెల్లివిరుస్తున్న ధార్మిక చైతన్యం!

సమరసత సంకల్పం – ధార్మిక సాధికారత
కృష్ణా జిల్లా నందిగామ డి వి ఆర్ గిరిజన కాలనీలో శ్రీ సీతారామ దేవాలయంలో గత ఫిబ్రవరి నుండి శివకృష్ణ అర్చకులుగా పనిచేస్తున్నారు. గిరిజన కాలనీలో కొత్తగా కట్టిన శ్రీ సీతారామ దేవాలయంలో నిత్య పూజా కైంకర్యాలను శ్రద్దాభక్తులతో శివకృష్ణ చేయటం చూసి సాటి గిరిజనులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమలో ఒకరు మంత్రాలు చదువుతూ దీపారాధన, సంకల్పం, గణపతి పూజ, ప్రధాన పూజల తోపాటుగా సీతారామ స్వాములకు నివేదన చేసి, రాత్రికి పవళింపు సేవ చేయటం చూసి ఎంతో గర్వపడుతున్నారు. “ భగవంతుని సేవించటం నాకు ఎంతో ఆనందంగా వుంది. ఒక సామాన్య యానాది కుటుంబంలో పుట్టిన నాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శిక్షణ ఇచ్చి అర్చకుడిగా నియమించారు” అని శివకృష్ణ చెప్పుకొచ్చారు. “ మా పరిసర ప్రాంతాలలో హిందూ ధర్మ వ్యాప్తికి ఇతోధికంగా కృషి చేస్తాను. మతాంతరీకరణను అడ్డుకుంటాను” అని ఆయన అన్నారు.

శివకృష్ణ ఒక్కరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కట్టిన దేవాలయాల్లో అర్చకులుగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐదు వందల మంది పని చేస్తూ ఒక నిశ్శబ్ద ధార్మిక విప్లవాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో హరిజన, గిరిజన బస్తీలలో, కొండ ప్రాంతాలలో వారు పని చేస్తూ ధార్మిక చైతన్యానికి కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, దేవాదాయ శాఖ, హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్, సామాజిక సమరసతా ఫౌండేషన్ వారి సంయుక్త, సమైక్య కృషి ఫలితమే ఈ ధార్మిక సంస్కరణ. శతాబ్దాల పాటు సంఘానికి దూరంగా ఉంచబడ్డ వారే ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే నాయకత్వ బాధ్యతను తలకెత్తుకున్నారు.

సమరసతకు శ్రీకారం :
2015లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారు ధర్మ పరిరక్షణకు, పరివ్యాప్తికి పని చేస్తున్న సంస్థల పని తీరును సమీక్షించారు. అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోవడానికి కారణాలు అన్వేషించారు. క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా, సమన్వయంతో పని చేయగలిగిన ఒక సంస్థ ఆవశ్యకతను వారు గుర్తించారు. స్వర్గీయ పి.వి.ఆర్.కే. ప్రసాద్ గారు, తదితర పెద్దల ఆశయాలకు అనుగుణంగానే సమరసతా సేవా ఫౌండేషన్ ఆవిర్భవించింది. క్షేత్ర స్థాయిలో ధర్మ ప్రచారం చెయ్యటం, స్థానికులను ధర్మ పరిరక్షణలో భాగస్వాములను చెయ్యటం, దేవాలయాలు కేంద్రంగా నూతన ధార్మిక చైతన్యాన్ని తీసుకొని రావటం కోసం సమరసతా సేవా ఫౌండేషన్ ను ప్రారంభించారు. డిసెంబర్ 2, 2015న తిరుపతిలో శ్రీవారి ఆస్థాన మండపంలో జరిగిన ధార్మిక సమ్మేళనంలో కంచి, పెజావర్ పీఠాధిపతులతోపాటుగా ఇతర మఠాలకు చెందిన 60 మంది మఠాధిపతులు కొత్త సంస్థను దీవించారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల హిందువులను అక్కున చేర్చుకోవటం, వారి ధార్మిక అవసరాలను తీర్చటమే లక్ష్యంగా పని చేయమని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి హిందూ కుటుంబాన్ని ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చెయ్యమని దిశా నిర్దేశం చేశారు.

హిందూ ధార్మిక చైతన్య వ్యాప్తి అనే పవిత్ర యజ్ఞంలో సముచిత రీతిలో ప్రజలందరినీ భాగస్వాములుగా చేయటమే లక్ష్యంగా సంస్థ ఆనాటి నుండి రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నది. హిందూ ధర్మ వ్యాప్తికి, దాని పరిరక్షణకు మాత్రమే అంకితమైన సమరసతా సేవా ఫౌండేషన్ కు రాష్ట్ర స్థాయిలో అంకితభావంతో పనిచేసే కార్య నిర్వాహక వర్గం వుంది. కేరళ ప్రభుత్వ రాష్ట్ర రెవిన్యూ కార్యదర్శిగా పని చేసి, పదవీ విరమణ చేసి, ఇటీవలే స్వర్గస్థులైన శ్రీ ఎం. జీ. కే మూర్తి గారు అధ్యక్షులుగా సమర్ధవంతమైన సేవలు అందించారు. నవ్యాంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకు 13 మంది జిల్లా ధర్మ ప్రచారకులు వున్నారు. డివిజనల్ స్థాయిలో విభాగ్ ధర్మ ప్రచారకులు పని చేస్తున్నారు. రాష్ట్రంలోని 676 మండలాలకు గాను, 325 మండలాలలో సమరసతా సేవా ఫౌండేషన్ పని చేస్తున్నది. పని చేస్తున్న ఈ 325 మండలాలలో ప్రతి మండలానికి ఒక ధర్మ ప్రచారకుడు ధర్మ ప్రచార నిమిత్తం చిత్తశుద్దితో పనిచేస్తున్నారు. 325 మండలాలలో 45 మండలాలు సుదూర గిరజన ప్రాంతాలలో వున్నాయి. రాష్ట్రంలోని ప్రసిద్ది చెందిన పీఠాదిపతులు, మఠాధిపతులు, ధర్మ ప్రచారకులకు శిక్షణ ఇచ్చారు. ధర్మాచార్యులందరూ ఏకోన్ముఖులై ప్రచారకులకు ఇచ్చిన శిక్షణ అనితర సాధ్యం. మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి వారి సహకారంతో ధర్మ ప్రచార కమిటీలు ఏర్పాటు చేయటం ధర్మ ప్రచారకుల విధి.

ధర్మ ప్రచారం :
రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సర్వేక్షణ చేసి ధార్మిక అవసరాలను గుర్తించారు. గత మూడేళ్ళలో 39,44,403 కుటుంబాలకు ధర్మ సందేశాన్ని చేర్చారు. 42 లక్షల కరపత్రాలను పంచారు. మన ధర్మం విశిష్టత గురించి, జీవన విధానం గురించి ప్రచురించిన ఈ కరపత్రాలు బహుళ ప్రజాదరణ పొందాయి. గీతా జయంతి సందర్భంగా బాలబాలికలకు నిర్వహించిన భగవద్గీతా కంఠస్థ పోటీలలో 2016లో 47,723 మంది పాల్గొనగా, 2017 లో 52,539 మంది పాల్గొన్నారు. కలియుగంలో భగవన్నామ స్మరణకు ఎంతో ప్రాధాన్యత వుంది. భజన బృందాలకు శిక్షణ ఇచ్చి భజన సాంప్రదాయాన్ని పునరుద్ధరించటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 3వేల భజన బృందాలకు శిక్షణ ఇవ్వటం జరిగింది. సేవా ఫౌండేషన్ పని చేస్తున్న గ్రామాలలో నెలకు ఒకసారి గ్రామస్థులందరూ హాజరయ్యే విధంగా సామూహిక హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. 2032 దేవాలయాల్లో షుమారు 40వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద హిందువుల సౌకర్యార్ధం దేవాదాయ శాఖ చేపట్టిన పుణ్యక్షేత్రాల ఉచిత సందర్శన కార్యక్రమం “దివ్యదర్శనం” కు అర్హులైన బడుగు, బలహీన వర్గాల వారిని ఎంపిక చేసేందుకు దేవాదాయ శాఖకు సమరసతా ఫౌండేషన్ సహకరిస్తుంది. యువజన సమ్మేళనాల ద్వారా గ్రామీణ యువతను సమీకరించి, ధార్మిక చైతన్యం రగిలించడానికి జరుగుతున్న కృషిలో భాగంగా 2018లో 2754 గ్రామాల నుండి ఇరవై వేల మందితో కార్యక్రమాలు నిర్వహించారు.

దేవాలయాల నిర్మాణం :
తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ కులాల, తెగల వారి ఆవాస ప్రాంతాలలో, మత్స్యకార గ్రామాలలో దేవాలయాల నిర్మాణం చేస్తున్నది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం 500 దేవాలయాల నిర్మాణానికి అనుమతినిచ్చింది. దేవాలయాలను ఎక్కడ కట్టాలో నిర్ణయించే బాధ్యతను సమరసతా సేవా ఫౌండేషన్ కు ఇచ్చారు. దళారులు, గుత్తేదారులు లేకుండా స్థానికుల భాగస్వామ్యంతో ఈ దేవాలయాలను దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు, హిందూ పరిరక్షణ సంస్థల వారి మార్గదర్శకత్వంలో సమరసతా సేవా ఫౌండేషన్ కార్యకర్తలు నిర్మిస్తున్నారు. రెండున్నర ఏళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా 500 దేవాలయాలను హరిజన, గిరిజన ఆవాస ప్రాంతాలలో, మత్స్యకార గ్రామాలలో నిర్మించారు. ప్రజలు సైతం ఈ దేవాలయాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. షుమారు 25 కోట్ల మేర ధనం విరాళంగా సమకూర్చారు. హిందూ సోదరులు నిర్మాణం చేసుకుంటున్న ఈ దేవాలయాలకు కొందరు క్రైస్తవులు కూడా విరాళాలు ఇచ్చిన సందర్భాలు వున్నాయి. ఈ దేవాలయాలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన హిందువులకు ధార్మిక కేంద్రాలుగా తయారు అవుతున్నాయి.

ఈ దేవాలయాల్లో అర్చకులుగా పని చేయటానికి ధార్మిక ఆసక్తి, అర్హత కలిగిన స్థానికులనే ఎంపిక చేశారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అర్చకత్వంలో శిక్షణ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 500 మంది నేడు ఈ దేవాలయాల్లో సుశిక్షితులై, అర్చకులుగా పని చేస్తూ భగవదారాధన చేస్తున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అర్చకులుగా సేవలు అందిస్తూ, మిగిలిన సమయంలో తమ వృత్తులు చేసుకుంటూ ఆదర్శంగా వారు జీవిస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో పని చేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన అర్చకులను తన కార్యాలయానికి పిలిపించారు. వారి శ్రద్దా భక్తులకు అచ్చెరువు చెందారు. ఒక సారి శిక్షణ ఇచ్చి వదిలెయ్యటం కాక, తిరుమల దేవస్థానం కొత్తగా నియమించిన అర్చకులకు ఏడాదికి రెండు మార్లు పునశ్చరణ తరగతులను కూడా నిర్వహిస్తోంది. అట్లాగే దేవాలయ కార్యనిర్వాహక సభ్యులకు ఆలయ నిర్వహణలో మార్గదర్శనం చేస్తున్నది.

అన్య మత ప్రచారకుల వ్యతిరేకత :
హిందువులను మేలుకొలిపి, చేసిన తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకునే మహత్తర సంకల్పాన్నిసమరసతా సేవా కార్యకర్తలు చేశారు. సమరసతా సేవా కార్యకర్తలు మారుమూల కుగ్రామాలకు సైతం వెళ్ళగలిగారు. ఎక్కడెక్కడైతే బలహీన వర్గాల వారుంటున్నారో అక్కడకు వెళుతున్నారు. వారిని అక్కున చేర్చుకుంటున్నారు. సామాన్యులు వారికి స్వాగతం పలుకుతుండగా, క్రైస్తవ మత ప్రచారకులకు వారి రాక ఇష్టం లేదు. స్థానికుల భాగస్వామ్యంతో ఈ మత ప్రచారకుల అభ్యంతరాలను అధిగమించి స్థానిక ప్రజలతో కలిసి సమరసత కార్యకర్తలు పనిచేస్తున్నారు.

అయితే కొన్నిచోట్ల క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ ప్రచారకుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. కర్నూలు జిల్లా, పాండ్యం మండలం, భూపాలపాడు గ్రామంలో 37 మాదిగ కుటుంబాల వారు తమ ఆవాస ప్రాంతంలో ఒక దేవాలయం కట్టమని కోరారు. ఆ గ్రామ సర్పంచ్ దేవాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించారు. కానీ అదే కాలనీలో ఉంటున్న క్రైస్తవులు కొందరు దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకొనడమే కాక హిందూ సోదరులపై భౌతికంగా దాడి చేశారు. ఆ చిన్న గ్రామంలో అనుమతి లేని 3 క్రైస్తవ ప్రార్ధనా మందిరాలున్నాయి. అధికారులు ఈ సమస్య పరిష్కారానికి గ్రామ సభను ఏర్పాటు చేయగా 85 శాతం మంది ఆలయ నిర్మాణానికి అనుకూలంగా చేతులెత్తారు. దానితో నిర్మాణానికి ఉన్న ప్రతిబంధకం తొలగి పోగా, నిర్మాణం జరిగింది. జిల్లా అధికారులు ఆలయ నిర్మాణం కావాలనుకొన్న వారికి మద్దతుగా నిలబడగా, స్థానిక రాజకీయ నేతలు క్రైస్తవులకు మద్దతుగా నిలవటం అందరికి ఆశ్చర్యం కల్గించింది. అట్లాగే రాజమండ్రి, కాకినాడ మద్య ఒక జీర్ణ దేవాలయాన్ని పునరుధరించటానికి జరిగిన ప్రయత్నాలను కూడా క్రైస్తవ మత ప్రచారకులు అడ్డుకున్నారు. తమ విశ్వాసకులు తమకు దూరం అవుతరేమోనన్న భయంతో దేవాలయ పునరుద్ధరణను అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల దేవాలయాల నిర్మాణాన్ని ఎదో ఒక సాకుతో అడ్డుకునే ప్రయత్నం క్రైస్తవ ప్రచారకులు చేశారు. కొన్ని చోట్ల అధికారులు, మరికొన్ని చోట్ల నేతలు వారికి బాసటగా నిలవటం శోచనీయం. అయినా ఈ ప్రతిబంధకాలను అధిగమించి నిర్మాణం దిశగా సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

వెల్లివిరుస్తున్న ధార్మిక చైతన్యం :
సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న హిందువులు ధర్మాచార్యుల రాకకోసం ఎన్నో సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నారు. సామాన్య ప్రజల ఆధ్యాత్మిక తృష్ణ తీర్చటం కోసం హైందవ సంస్థలు, ఆచార్యులు ఇన్నాళ్ళుగా తగినంతగా ముందుకు రాలేదు. ఆ ఖాళీని క్రైస్తవమత ప్రచారకులు వారికి అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ధర్మంపట్ల, దైవంపట్ల, తరతరాల వారసత్వం పట్ల సామాన్య ప్రజలకు కూడా ఎనలేని ఆసక్తి వుంది. కాని చెప్పేవారు కరువై, చేస్తున్న క్రైస్తవమత ప్రచారానికి ఆకర్షితులై మతం మార్చుకుంటున్న మన సోదరుల దగ్గరకు ఇప్పుడు సమరసత కార్యకర్తలు వెళ్తున్నారు. వారి మత, ఆధ్యాత్మిక తృష్ణను తీర్చటానికి కృషి చేస్తున్నారు. సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా హైందవ ధార్మిక చైతన్యాన్ని తీసుకునిరాగలిగారు. కోటి మందికి పైగా హిందువుల వద్దకు వెళ్ళగలిగారు. సనాతనధర్మం విశిష్టత గురించి, మతాంతరీకరణ ప్రమాదాల గురించి వివరించి వారిలో ఒక ధార్మిక స్పృహను కలిగించగలిగారు. సమరసత కార్యకర్తల కృషి ఫలితంగా గ్రామీణులలో ఒక నూతన ఆసక్తి మొదలయింది. తమ హిందూ మూలాల గురించి యోచన మొదలైంది. కులాతీతంగా హిందూ విశ్వాసాల పునరుద్ధరణకు ధర్మ ప్రచారకులు చేసిన కృషి అనతికాలంలోనే ఫలితాలు ఇచ్చింది.

ధార్మిక సాధికారత :
సమరసత సేవా ఫౌండేషన్ వారు హైందవ సాధికారతకు ద్వారాలు తెరిచారు. బడుగు, బలహీన వర్గాల వారికి శిక్షణ ఇచ్చి అర్చకులుగా, పూజారులుగా తీర్చిదిద్దుతున్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ధార్మిక అవసరాలను గుర్తించి, అ అవసరాలను తీర్చటానికి ధర్మ ప్రచారకులు పనిచేస్తున్నారు. ధర్మంపట్ల, దేవాలయాల పట్ల అనురక్తి కలగటానికి భక్తి ఉద్యమాన్ని పునరుద్ధరించే పనికి వారు పూనుకున్నారు. వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు మాల దాసరులను, మాదిగ దాసరులను వేలాదిగా తయారుచేశారు. గ్రామగ్రామానా వారు వైష్ణవ భక్తి సాంప్రదాయానికి మూల స్తంభాలుగా నిలిచారు. సమరసతా సేవా ఫౌండేషన్ వారు రామానుజులు చూపిన మార్గంలోనే పయనం చేస్తున్నారు. 320 మంది ధర్మ ప్రచారకులలో సగానికి పైగా బలహీన వర్గాలకు చెందినవారు. రాష్ట్రస్థాయి నాయకత్వంలోనూ వారికే ప్రాధాన్యత. ఇటీవల స్వర్గస్తులైన శ్రీ ఎంజికే మూర్తి గారు మొన్నటి వరకు సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. ఈ ఉద్యమానికి ఎనలేని సేవలు అందించిన వారు, షెడ్యుల్ కులానికి చెందినవారు. కోశాధికారి శ్రీ తాళ్ళూరి విష్ణువు అఖిల భారత మాదిగ దాసరుల సమాఖ్యకు అధ్యక్షుడిగా కుడా వున్నారు. వారు, వీరు అని తేడా లేకుండా ఒక నూతన ధార్మిక సంస్కృతి కోసం సమరసత సేవా కార్యకర్తలు పనిచేస్తున్నారు.

“అన్ని కులాల నుండి, ప్రాంతాల నుండి, వర్గాల నుండి ధార్మిక జాగరణ కోసం పనిచేయటానికి యువకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. 322 మంది ధర్మ ప్రచారకులలో 46 మంది గిరిజనులు. వారికి మద్దతుగా స్థానికంగా అనేక మంది తమ సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. మొత్తం 5 వేల గ్రామాలలో పనిచేయటానికి ప్రోత్సాహం ప్రజల నుండే వస్తున్నది. అనేక మంది మహిళలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో పనిచేయటానికి ముందుకు వస్తున్నారు” అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ శ్యాంప్రసాద్ గారు అన్నారు. “కుల వివక్ష ఇంకా కొన్ని గ్రామాలలో వుంది. రాయలసీమలో కొన్ని కుగ్రామాలలో వివక్ష కొనసాగుతున్నది. అలాంటి గ్రామాలలో సైతం సమరసత సేవా కార్యకర్తల కృషి వలన మార్పు వస్తున్నది. సామూహిక భజన, హారతి కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొంటున్నారు. దళిత, గిరిజన అర్చకులు యిస్తున్న తీర్ధ,ప్రసాదాలను అందరూ భక్తితో తీసుకుంటున్నారు” అని ఆయన అన్నారు. పెరుగుతున్న ధార్మిక చైతన్యాన్ని మరింత బలంగా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తామని, బలహీన వర్గాల వారికి ధార్మిక సాధికారత కలిగించే దిశలో మరింత పురోభివృద్ధి సాధించ గలుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు.

మతాంతరీకరణ యత్నాలు కొనసాగుతున్నప్పటికీ, మతాంతరీకరణలు కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు కనపడుతున్నది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే అర్చకులుగా, దేవాలయ నిర్వహణలో మునుపు ఎన్నడు లేనంతగా భాగస్వాములు అవటంతో, ఆ వర్గాలవారు హిందూ సమాజం ఇన్నాళ్ళకు తమకు ఇచ్చిన గుర్తింపును నిలుపుకునేందుకు చిత్తశుద్ధితో నిలబడుతున్నారు. బలహీన వర్గాల కాలనీలలో కట్టిన దేవాలయాలు అధ్యాత్మిక కేంద్రాలుగా మారినప్పుడు మరింతగా భక్తి ఉద్యమం బలపడుతుంది. ధార్మిక చైతన్యం వాడవాడలా వెల్లివిరుస్తుంది.

– డా|| బి.సారంగపాణి.
(-vskandhra)