‘గ్రేటర్’లో ఇద్దరికీ ఇజ్జత్ కా సవాల్!

433

( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. అధికార టీఆర్‌ఎస్-ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం, ముదురుపాకాన పడుతోంది. మేయర్ పీఠంపై మళ్లీ కన్నేసిన టీఆర్‌ఎస్ ఆ మేరకు అన్ని అస్ర్తాలను సంధిస్తోంది. మంత్రి కేటీఆర్ కారుకు సారథిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి తెరాస గెలుపు-ఓటములకు ఆయనే బాధ్యుడు.

అయితే దుబ్బాక ఉప ఎన్నిక ముందు వరకూ పెద్దగా ఆశల్లేని బీజేపీ… దుబ్బాక విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఆ పార్టీ కూడా టీఆర్‌ఎస్ మాదిరిగానే, నియోజకవర్గాలు, డివిజన్లకు అగ్ర నేతలను ఇన్చార్జిలుగా నియమించింది. ఫలితంగా ప్రచారం ఇప్పటికే వేడెక్కింది. బీజేపీ దళపతి బండి సంజయ్, గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని, ఎన్నికల కమిటీని నియమించారు. వారిలో ఎంపీ,మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలున్నారు. మరో రెండు రోజుల్లో ఏపీ నుంచి బీజేపీ అగ్రనేతలు ప్రచారంలోకి రానున్నారు. వారిని సెటిలర్లు ఉన్న డివిజన్లలో ప్రచారం చేయించనున్నారు.

ప్రస్తుతం నాలుగు స్థానాలున్న బీజేపీ, ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో 70 సీట్లలో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది. ప్రధానంగా ఆ పార్టీ దళపతి సంజయ్.. వరద-పాతబస్తీ-హిందూత్వ కార్డు సంధిస్తూ, ప్రచారాన్ని వేడెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు .పాతబస్తీలో బిల్లులు వసూలు చేసేందుకు భయపడుతోందని, తాము గ్రేటర్‌లో విజయం సాధిస్తే.. హైదరాబాద్‌లోని 40వేల మంది రోహింగ్యాలను తరిమివేస్తామని భరోసా ఇస్తున్నారు. వరద బాధితులకు 25 వేల రూపాయల పరిహారం ఇస్తామని, వారిని ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

అయితే, సంస్థాగతంగా అభ్యర్ధుల ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. పార్టీకి సుదీర్ఘ కాలం నుంచీ పనిచేస్తున్న సీనియర్లను కాదని, కొత్తగా చేరిన నేతలకు టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తి భగ్గుమంటోంది. కార్యకర్తలు తిరుగుబాటు చేసి, సహాయనిరాకరణ ప్రారంభించారు. బౌద్ధనగర్ వంటి కీలకమైన డివిజన్లలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.
సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో చివరకు, కేంద్రమంత్రి ప్రకాష్‌జవదేకర్ సైతం జోక్యం చేసుకుని, టికెట్లు సిఫార్సు చేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తతమవుతోంది. తార్నాకలోనూ అసంతృప్తి వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిణామాలు పార్టీ విజయంపై, కచ్చితంగా ప్రభావితం చేస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తమ అగ్రనేతలు పైరవీల ప్రలోభానికి గురయినందుకే, ఈ దుస్థితి తలెత్తిందని బీజేపీ సీనియర్లు చెబుతున్నారు.

ఇక టీఆర్‌ఎస్ రధసారథి మంత్రి కేటీఆర్, సుడిగాలి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. కేటీఆర్, కవిత,హరీష్ సహా మంత్రులంతా డివిజన్లలో పాగా వేస్తున్నారు. ఫలితంగా ఎన్నికల వాతావారణం ఏ స్థాయిలో వేడెక్కుతుందో అర్ధంచేసుకోవచ్చు. నిజానికి వరదలు రాకపోతే, టీఆర్‌ఎస్ అవలీలగా విజయం సాధించే అంశంలో.. ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ తమకు సాయం అందలే దని విమర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, దానిని బీజేపీ-కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలచుకోవడంతోనే టీఆర్‌ఎస్‌లో ఆందోళన పెరుగుతోంది. ఆ అనుమానంతోనే, ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎమ్మెల్యేలు కోరారు. కానీ కేసీఆర్ మాత్రం… విజయావకాశాలు తమకే ఎక్కువగా ఉన్నందున, భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చి ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఒక్కటే కాదు. గతంలో వచ్చినన్ని సీట్లు కచ్చితంగా సాధించడమే టీఆర్‌ఎస్‌కు ప్రధానం. ఒకవేళ కోఆప్షన్ సభ్యులు, మజ్లిస్‌తో కలసి మేయర్ సాధించినా, అది నైతికంగా విజయం సాధించనట్లే లెక్క. పైగా మంత్రి, డిప్యూటీ స్పీకర్, అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుకు సైతం ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. కరోనా కాలంలో వారి పనితీరుకు, ప్రజలు మార్కులు వేయనున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏమాత్రం సీట్లు తగ్గినా, ఆ పార్టీకి కష్టకాలం మొదలయినట్లే.

ఇక బీజేపీకి సైతం ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. దుబ్బాక టానిక్‌తో బరిలోకి దిగుతున్న ఆ పార్టీ, కచ్చితంగా ఫలితాలు రాబట్టవలసి ఉంది. లేకపోతే.. కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ఎన్నికలప్పుడే హడావిడి చేస్తుందన్న విమర్శను శాశ్వతంగా మూటకట్టుకోవలసి ఉంది. ప్రస్తుత చేరికలను చూసి బలం అనుకుంటే, కచ్చితంగా తప్పులో కాలేసినట్లే.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందన్న అంచనాతో, చాలామంది టీఆర్‌ఎస్ నేతలు సైతం కాంగ్రెస్‌లో చేరారు. కానీ, ఫలితాలు తారుమారయ్యాయి. అంగ- అర్ధబలంలో టీఆర్ ఎస్‌ను ఢీకొనడంపైనే బీజేపీ సత్తా తేలనుంది. ఇప్పటికయితే,పార్టీ నుంచి నయాపైసా సాయం రాదని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. అటు టీఆర్‌ఎస్ అన్ని వనరులతో బరిలోకి దిగింది. చూడాలి ఏం జరుగుతుందో?!