హిందూ సమాజ స్వరాజ్యభానుడు ఛత్రపతి శివాజీ

390

ఒక చిన్న బాలుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అతని సిపాయిలు ఒక గ్రామాదికారిని పట్టుకొచ్చారు. అతను చేసిన నేరం ఒక అనాథ వితంతువుపై అత్యాచారం చెయ్యడం. గ్రామాధికారి కాళ్ళు, చేతులు బంధించబడి వున్నాయి. తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. దృఢ స్వరంతో ఆ బాల రాజ కుమారుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. “ ఇతని రెండు కాళ్ళు, చేతులు నరికివేయండి.” అని. అందరూ నిశ్చేష్ఠులయ్యారు. రాజ కుమారుని యొక్క న్యాయ ప్రియత్వం చూసి ప్రజలు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.

ఆయనే మన వీర శివాజీ. ఈ సంఘటన జరిగే నాటికి ఆయన వయస్సు పధ్నాలుగు సంవత్సరాలే. శివాజీ తండ్రి షాజీ బీజాపూరు సుల్తాను కొలువులో ఒక సేనాధిపతి.

ఒక సారి షాజీ తన కుమారుని బీజాపూరు సుల్తాను కొలువుకు తీసుకెళ్ళాడు. షాజీ వంగి సుల్తానుకు సలాము చేశాడు. తన కుమారుని కూడా అలాగే సలాం చెయ్యమని చెప్పాడు. “నేను పరాయి పాలకుల దగ్గర ఎప్పుడూ తల వంచను”. అని ఏమాత్రం బెరుకు లేకుండా చెప్పాడు బాల శివాజీ. ఆ చిన్న బాలుని ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య చకితులైనారు.

ఇంత చిన్న వయస్సులోనే శివాజీలో ఇంత ధైర్యము, శౌర్యము, దేశభక్తి, ధర్మ నిష్ఠ ఏర్పడడానికి కారణం ఎవరు? వీటన్నిటికీ అసలైన కారకురాలు ఆయన తల్లి జిజియాబాయి. శివాజీ చిన్నవాడుగా ఉన్నప్పటి నుండి జిజియాబాయి అతనికి రామాయణ, మహాభారత పురాణాలలోని వీరులు మహనీయుల వీర గాథలు బోధించేది. శివాజీ మనస్సులో తాను కూడా రాముని వలె, కృష్ణుని వలె, అర్జునుడు, భీముల వలె మహా వీరునిగా, ధర్మ నిష్ఠా గరిష్టునిగా తయారు కావాలనే ఆలోచన ఏర్పడడానికి ఆ వీర మాత చెప్పిన గాథలే కారణం.

శివాజీ క్రీ. శ. 1630లో శివనేరి దుర్గంలో జన్మించాడు. దాదాజీ ఖోండ్ దేవ్ వద్ద శస్త్ర, శాస్త్ర విద్యలు నేర్చాడు. భక్త తుకారాం బోధనలతో ఆధ్యాత్మిక భావధార, సమర్థ రామదాసు మార్గదర్శనంలో నైతికత, రాజనీతితో కూడిన ధార్మిక భావధార, తల్లి పెంపకంలో సాంస్కృతిక భావధారను త్రివేణీ సంగమంగా కలిగివున్నవాడు శివాజీ.

పన్నెండేళ్ళ చిరు ప్రాయంలోనే సహ్యాద్రి పర్వత సానువులలోని మావళీ తెగ వారిని సమీకరించి వారిలో దేశభక్తిని నింపి స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించాడు.  అఫ్జల్ ఖాన్, సిద్ది జౌహార్, షయస్తఖాన్, ఇనాయత్ ఖాన్, దిలేర్ ఖాన్ వంటి ధర్మ ద్రోహులతో పోరాడి ధర్మ రక్షణ గావించాడు శివాజీ.

కేవలం పదహారు సంవత్సరాల వయస్సులోనే మొట్ట మొదటిగా తోరణ దుర్గమనే కోటను జయించి హిందూ పద పాదశాహికి మంగళ తోరణం కట్టాడు. దాని తర్వాత శివాజీ ఒకదాని తర్వాత ఒకటిగా దుర్గాలను జయించసాగాడు. ప్రతాప్ గఢ్, సింహ గఢ్, పన్హాల్ గఢ్, విశాల్ గఢ్, రాయ గఢ్ వంటి దుర్గాలను జయించి హిందూ సామ్రాజ్య స్థాపన చేశాడు శివాజీ.

మోరోపంత్ పింగళే, తానాజీ మాల్సురే, సూర్యాజీ మాల్సురే, నేతాజీ ఫాల్కర్, ఆబాజీ సోనదేవ్, భాజీ ప్రభు దేశపాండే వంటి యోధానుయోధులైన వ్యక్తులను రాష్ట్ర కార్యానికి అంకితులయ్యే ధ్యేయ నిష్ఠా దురంధరులుగా తీర్చిదిద్దాడు. పర స్త్రీలను తల్లిగా భావించే హిందూ సంస్కృతికి ప్రతిరూపంగా నిలచి కళ్యాణ దుర్గం సుబేదారు అహ్మద్ ఖాన్ కోడల్ని ఇంటి ఆడపడుచును పంపినట్లుగా అత్తవారింటికి పంపాడు. బుందేల్ ఖండ్ రాజు రాజా ఛత్రసాల్ కు ప్రేరణగా నిలిచి తగిన మార్గదర్శనం చేశాడు. ఆలయ విధ్వంసకుడిగా పేరుగాంచిన ఔరంగాజేబును అడుగడుగునా ప్రతిఘటిస్తూ హిందూ వీరుల శక్తి సామర్ధ్యాలను అటు సుల్తానులకు, ఇటు మొఘలాయిలకు ఏక కాలంలో చూపిన పౌరుష పరాక్రమ మూర్తి ఛత్రపతి శివాజీ.

శివాజీ విజయ వార్తలు ఔరంగజేబుకు సహింపరానివయ్యాయి. సింహాన్నెదుర్కోవాలంటే సింహమే కావాలని నిశ్చయించుకున్నాడు. ఈ కార్యానికి మీర్జా రాజా జయసింహుని ఎన్నుకున్నాడు. జయసింహుడు గొప్ప యోధుడే కాక చాలా తెలివైన సేనాధిపతి కూడా. ఇన్ని అర్హతలున్న వ్యక్తి విధర్మీయుల సేవలో మునిగి ఉండడమే అతి పెద్ద విషాదం, అవమానకరం.

పెద్ద సైన్యంతో వచ్చిన జయసింహుడు బిజాపూరు సుల్తానుతో సహాయ సంధి చేసుకుని అన్ని దిక్కుల నుండి శివాజీ పై దాడి చేశాడు. శివాజీ ఒక లేఖ ద్వారా జయసింహునితో సంధి ప్రస్తావన చేశాడు. ఔరంగజేబుతో సంప్రదింపులు జరపడానికి అంగీకరించాడు శివాజీ. శివాజీకేమాత్రమూ అవమానము, అపకారము జరగదని, గౌరవ పూర్వకంగా చూసుకుంటామని  జయసింహుడిచ్చిన మాట నమ్మి ఆగ్రా కోటలో అడుగు పెట్టిన శివాజీకి అక్కడ అవమానం ఎదురైంది. పట్టరాని ఆగ్రహంతో ఔరంగజేబుకు అవమానం కలిగేలా రాజ సభ వదిలి బైటకొచ్చాడు శివాజీ. ఇచ్చిన మాటను విడచి శివాజీని బంధించి శిరచ్ఛేదనం చేయమని ఆజ్ఞాపించాడు ఔరంగజేబు. కానీ శివాజీ అక్కడి నుంచి ఉపాయంతో తప్పించుకుని కాశీ, గయ క్షేత్రాల మీదుగా రాయగఢ్ చేరుకున్నాడు.

క్రీ.శ.1674లో ‘గాగాభట్టు’ అనే కాశీ పండితుడు శాస్త్రానుసారంగా శివాజీకి రాజ్యాభిషేకం గావించాడు. గాగాభట్టు శివాజీ శిరస్సుపై ఒక బంగారు ఛత్రాన్నుంచి ‘ఛత్రపతి’ అని ఘోషించాడు. పరమ పవిత్రమైన తన తల్లి చరణాలను స్పృశించి, ఆశీర్వాదం పొంది రత్న ఖచిత సువర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యాడు శివాజీ. దుర్గాలన్నిటిలోకి శ్రేష్ఠమైన రాయగఢ్ దుర్గాన్ని శివాజీ రాజధానిగా చేసుకున్నాడు.

శత్రువులను ఓడించి రాజ్య స్థాపన చేయడంతోనే శివాజీ పొంగిపోలేదు. ప్రజల సుఖ సంతోషాల కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. ప్రజలను భగవంతుని రూపంగా భావించాడు. తన ప్రజలందరినీ విద్యావంతులను చెయ్యాలని శివాజీ అభిలషించాడు.

ఆ రోజుల్లో అనేక మంది హిందువులు బలవంతంగా ముస్లిం మతంలోనికి మార్చబడేవారు. వారికి తిరిగి హిందువులుగా మారాలనే కోరిక వుండేది. కానీ హిందూ సమాజం వీరిని స్వధర్మంలోనికి తిరిగి రావడానికి అనుమతించేది కాదు. శివాజీకి ఇది నచ్చలేదు. శుద్ధి కార్యక్రమం ద్వారా వారిని హిందూ ధర్మంలోనికి ఆహ్వానించాడు.

శివాజీ ఎంతటి ధీరాగ్రేసరుడో అంతటి దయామూర్తి కూడా. హిందూ దేశంలో హిందువులు సగర్వంగా జీవించగలిగే స్థితిని నిర్మాణం చేసినవాడు శివాజీ. ”అగర్ శివాజీ న హోతాతో సున్నత్ హోతీ సబకీ” [ శివాజీ లేకపోతే అందరికీ సుంతీ చెయ్యబడేది] అని సమకాలీనులు చెప్పుకునేలా ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ మొఘలులతో పోరాటం సలిపాడు శివాజీ. దేశ, ధర్మ, గో, వేదాది రక్షణకు అంకితమైనవాడు శివాజీ. దేశం కోసం, ధర్మం కోసం అనేక కష్ట నష్టాలు సహించాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఎన్నోసార్లు మృత్యువుకు దగ్గరగా వెళ్ళాడు. ఆఖరి క్షణం వరకు దేశం, ధర్మం కోసమే జీవించాడు. మూడున్నర శతాబ్దాల తర్వాత నేడు కూడా ఆ మహాపురుషుని క్షణమాత్రం తలచుకుంటే చాలు, మనలో నూతనోత్తేజం మేలుకుంటుంది. అందుకే ఇంటింటా ఓ శివాజీ జన్మించాలి, దేశ, ధర్మరక్షణ గావించాలని మనం ఆకాంక్షిద్దాం.

vskandhra