రాష్ట్ర ప్రయోజనాలకోసం విజయసాయిరెడ్డి…

0
1

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్లపాటు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పడేసి జగన్ మీద కేసులను వేగవంతం చెయ్యాలని, విచారణను ఫాస్ట్ గా చేసి జైలుకు పంపించాలని అడుగుతుండేవారని, ఆయన సతాయింపు భరించలేక ఆ తరువాత చంద్రబాబుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం మానేశారని ఆ మధ్య ఎవరో కేంద్రమంత్రి చెప్పిన జ్ఞాపకం. పార్లమెంట్ సభ్యులైతే చాలు సొంత వ్యాపారాలకోసం, కొత్త కాంట్రాక్టులకోసం కేంద్రమంత్రులను ప్రాధేయపడుతూ మంత్రుల ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం, వారిని కౌగిలించుకుంటూ ఫోటోలు తీయించుకుని మీడియాకు ఇస్తుండటం, బ్యాంకులనుంచి తీసుకున్న అప్పులను ఎగగొట్టి కేసులు లేకుండా చేసుకోవడం పరమార్ధంగా ప్రజాశ్రేయస్సును బలిచేస్తున్న పార్లమెంట్ సభ్యులున్న ఈ రోజుల్లో….

వైసిపి రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఢిల్లీ వెళ్లారంటే కచ్చితంగా ఏవో కొన్ని ప్రాజెక్టులు సాధించుకుని వస్తారని, కేంద్ర మంత్రులతో ఆయన రాసుకుపూసుకుని తిరగకుండానే వారితో చర్చించి ఒప్పిస్తారని ఆయన సన్నిహితులు చాలా గర్వంగా చెబుతుంటారు. ఢిల్లీలోని ఆయన ఆఫీసులో పైరవీకారులకు ప్రవేశం ఉండదు.గతేడాది నేను ఢిల్లీ వెళ్ళినపుడు మిత్రుడు శ్రీ దేవరకొండ రామభాస్కర్ గారు ఆహ్వానిస్తే ఆయనతో పాటు విజయసాయిరెడ్డి గారి ఆఫీసుకు వెళ్ళాను. రెండు రోజులపాటు అక్కడ ఉన్నా, ఏ ఒక్క పైరవీకారుడు, బ్రోకర్, ఆయన ఆఫీసులో కనిపించలేదు. ఎవరో పనిమీద వచ్చే ఇద్దరు ముగ్గురు ఎంపీలు మినహా, ప్రయివేట్ వ్యక్తులు ఎవరూ ఆ ప్రాంగణంలో కనిపించలేదు. నలుగురో అయిదుగురో ఆఫీస్ సిబ్బంది మాత్రం పనిచేసుకుంటూ కనిపించారు. అదే కాంప్లెక్ లో ఉన్న మరికొందరు వేరే రాష్ట్రాల ఎంపీల ఆఫీసుల ముందు డజన్లకొద్దీ కార్లు, ఘరానా పెద్దమనుషులు మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు.

మొన్న ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి గారు నిన్న విమానయానశాఖామంత్రి హర్దీప్ ను కలిసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అనుమతులు, నిర్మాణం గూర్చి చర్చించి ఆయన సహకారం లభిస్తుందని ఆయననుంచి హామీని పొందారు. తన మంత్రిత్వశాఖ హార్దిక, ఆర్ధిక మద్దతు అందిస్తామని మంత్రిగారు మాట ఇచ్చారు.కోవిద్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ గౌరవ మంత్రిగారితో విజయసాయిరెడ్డి గారు చర్చిస్తున్న ఫోటోను చూడవచ్చు. ఎంపీలు అంటే ఇలా ఉండాలి కానీ, స్వార్థంకోసం ప్రజాసేవకుల ముసుగు వేసుకుని ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ, సిబిఐ, ఈడీలు వేట మొదలు పెట్టగానే భయపడి అధికారపార్టీలో దూరిపోయేవారా ఎంపీలు!

-రవి కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here