సోము ‘వీరత్వం’ పార్టీపై ఏదీ?

340

పార్టీ సమావేశాల్లో ‘సూర్య’ ముచ్చట్లా?

అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిర సమావేశం. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ముఖ్య అతిథి. ‘రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ పాత్ర’ ఆ శిక్షణలోని ప్రధానాంశం. మరి అందులో ఆ పార్టీ పాత్ర ఏమిటన్నది కదా అధ్యక్షుడు మార్గదర్శనం చేయాల్సింది? కానీ, అక్కడ కూడా సోము వీర్రాజు గారు యధావిథిగా కోడిగుడ్ల గురించే మాట్లాడారు. అది వేరే విషయం. కానీ… ఆ శిక్షణా శిబిరంలో ‘సూర్య’ వెబ్‌సైట్ గురించి, వ్యక్తగతంగా నా గురించి ప్రస్తావించడమే ఆశ్చర్యం.

ఆ సమావేశంలో సోము ఏం మాట్లాడారంటే.. ‘నేను కోడిగుడ్ల కాంట్రాక్టర్లను డబ్బు అడిగానట. వాళ్లు ఇవ్వకపోవడం వల్ల నేను కోడిగుడ్ల అవినీతి గురించి మాట్లాడుతున్నానట. సుబ్రమణ్యం అని ఓ రిపోర్టరు నా గురించి రోజూ రాస్తాడు. ఆడికి (గోదావరోళ్లు కదా.. భాషకిచ్చే మర్యాద అది) తెలుగుకోవర్టులు డబ్బులిచ్చి నాపై రోజూ రాయిస్తుంటారు. ఇదీ ఆయన శిక్షణ శిబిరంలో చేసిన ప్రసంగం! అసలు ఇంతకూ ఆ సమావేశంలో పార్టీ పాత్ర గురించి ఏమైనా చెప్పారా? లేదా? అన్నది వేరే విషయం. ఓ నాయకుడినుద్దేశించి, ‘నీకు కూడా నా మాదిరిగా ఓవరాక్షన్ ఎక్కువనుకుంటా’ నన్న వీర్రాజు నిజాయితీ మెచ్చదగిందే.

అదొక్కటే కాదు. ఆ మరుసటిరోజున పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులోనూ నా నామస్మరణే! సూర్య అనేది అసలు వెబ్‌సైట్ కాదని, దాన్ని పట్టించుకోవద్దు. అది మనకు యాంటీగానే రాస్తోంది. మరో పత్రికాయనతో మాట్లాడితే , వ్యాసాలు రాసి పంపమన్నాడని.. ఇప్పుడు పార్టీలో ‘షాడో అధ్యక్షుడి’గా వ్యవహరిస్తోన్న మరో ‘మహానాయకుడు’ కూడా హితబోధ చేశారట.

మాననీయ, మహానేత వీర్రాజు గారూ.. నేను… పార్టీ శిక్షణా శిబిరాలు, టెలీకాన్ఫరెన్సుల్లో ప్రస్తావించదగ్గ పెద్దవాడిని కాదు. మీ సమావేశాల్లో అనవసరంగా నా పేరు ప్రస్తావించడం కంఠశోష, సమయం వృధా. నా నామస్మరణకు వెచ్చించే ఆ అమూల్య సమయమేదో మీరూ, మిమ్మల్ని నడిపిస్తున్న మీ మహామంత్రి పార్టీ విస్తరణ, అభివృద్ధిపై దృష్టి సారిస్తే.. కనీసం రాజమండ్రి ఒకటవ వార్డులో ఓ పది ఓట్లు, కాతేరులోని సొంత వార్డులో మరో ఇరవై ఓట్లు వచ్చే అవకాశం ఉంది కదా! అనంతపురం వంటి జిల్లాలో కూడా, అదనంగా మరో 11, 12 వందల ఓట్లు ఎక్కువచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో ‘నోటా’ను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తే, పార్టీ ప్రతిష్ఠయినా పెరుగుతుంది. వీర్రాజు చెప్పిన ఆ ‘తెలుగు కోవర్టులు’ నాకేమీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. అదే తెలుగు కోవర్టుల వల్ల ఎమ్మెల్సీ పదవి పొందింది ఆయన మాత్రమే. మరి అప్పుడు ఆ పదవి తీసుకున్నందుకు, వీర్రాజు గారు అదే తెలుగు కోవర్టులకు ఎంత ఇచ్చారని నేను కూడా ప్రశ్నించవచ్చు. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి, అలాంటి ‘నేలటికెట్టు ప్రశ్న’ అడగను.

అయినా… నేను… సూర్య వెబ్‌సైట్‌లో రాసిన ‘కోడిగుడ్డు-కమలం కథ’ స్టోరీలో ఎక్కడా సోము వీర్రాజు గారి పేరు ప్రస్తావించలేదు. ఆయన ఫలానా కాంట్రాక్టరును డబ్బు అడిగినట్లూ రాయలేదు. పైగా.. అంగన్‌వాడీ సెంటర్లలో పంపిణీ చేస్తున్న కోడిగుడ్ల సరఫరాను, కేంద్రమంత్రి మెచ్చుకున్నారని ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా పత్రికా ప్రకటన చేశారు. అంటే, జగన్ ప్రభుత్వమే ఖండించిందన్నమాట! అయినా మరి ‘గుమ్మడికాయల’ చందంగా ఆయన భుజాలు తడుముకోవడమే వింత.

సరే.. వీర్రాజు గారు చెప్పినట్లు, నాకు డబ్బులిచ్చి రాయించిన ఆ ‘తెలుగు కోవర్టు’ వదాన్యులెవరో చెబితే కూడా ఆయన ఆరోపణలకు విలువ ఉండేది. అయినా.. వీర్రాజు గారూ.. నేనెప్పుడూ, మహానాయకుడయి ఉండి కూడా మీరు.. మీ సొంత కాతేరు వార్డు ఎన్నికలు, కడియం అసెంబ్లీ, రాజమండ్రి ఎంపీ ఎన్నికల్లో అద్భుతం-అనన్యం-అనూహ్యం-అనితర సాధ్యమైన మెజారిటీతో ఎలా ఓడిపోయారని ఎప్పుడూ రాయలేదే? నైతిక విలువల గురించి ఎక్కువగా వాపోయే మీరు, టీడీపీ సహకారంతో వచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తూ ఎప్పుడూ రాయలేదే? కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో నాటి సీఎం చంద్రబాబును, బస్సులో కలసిన ముచ్చట్ల గురించి ఎప్పుడూ రాయలేదే? రాజమండ్రి అసెంబ్లీ టికెట్ మీకే ఇచ్చినా, డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారికి ఎలా ఇచ్చారు? దాని తెరవెనుక కథేమిటని ఎప్పుడూ రాయలేదే?

మొన్నటి ఎన్నికల్లో, అమలాపురం ఎంపీ అభ్యర్ధిత్వం కోసం వచ్చిన వ్యక్తితో జరిపిన మంతనాల సారాంశాన్ని రాయలేదే? గతంలో అమెరికా వెళ్లినప్పుడు చినబాబుతో, మీకున్న సాన్నిహిత్యం గురించి అక్కడి ఎన్‌ఆర్‌ఐలకు చెప్పిన ముచ్చట్ల గురించి రాయలేదే? చినముషిడివాడలోని విశాఖ పీఠంలో వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డితో, స్వామివారి సమక్షంలో జరిపిన రాజకీయ మంతనాల మర్మం గురించి ఏనాడూ రాయలేదే? మరి ఇవేమీ రాయనప్పుడు.. పార్టీ సమావేశాలు-టెలీకాన్ఫరెన్సులలో నా ప్రస్తావన తీసుకురావడం పెద్దమనుషుల లక్షణమా చెప్పండి?

ఉమ్మడి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన పివి చలపతిరావు, సూర్యనారాయణరెడ్డి, వి.రామారావు, జూపూడి యజ్ఞనారాయణ, వెంకయ్యనాయుడు, విద్యాసాగర్జీ, బండారు దత్తాత్రేయ, చిలకం రామచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గంగాపురం కిషన్‌రెడ్డి వరకూ మీడియా గురించి గానీ, మీడియా ప్రముఖుల పేర్లు గానీ ఇలా స్థాయి తక్కువగా ప్రస్తావించిన దాఖలాలు లేవు. చివరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత అధ్యక్షులయిన హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ గానీ మీడియాను విమర్శించిన సందర్భాలు లేవు. అందులో వెంకయ్యనాయుడు, ఇంద్రసేనారెడ్డి, కిషన్‌రెడ్డి మీడియాతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వీర్రాజు హయాం నుంచే ఈ కొత్త సాంప్రదాయం మొదలవడం దురదృష్టం.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో మొదలయిన వీర్రాజు గారి మాటల దాడి.. రజనీకాంత్, వెంకటకృష్ణ, నావరకూ కొనసాగడం.. బీజేపీ వంటి ఉన్నత విలువలున్న రాజకీయ పార్టీ నాయకత్వానికి, ఆ పార్టీ విధానాలకు ఏం మాత్రం శోభనివ్వదు. ఈ విషయంలో ఆయన కాలు, వైసీపీ చెప్పుతో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ-టీడీపీకంటే తీవ్రమైన రాజకీయ శత్రుత్వం ఉంది. ఎవరికి వారు తమ సొంత భావ జాల మీడియాను పోషిస్తున్నారు. కాబట్టి.. వారిమధ్య బురద రాజకీయం కొనసాగడాన్ని అర్ధం చేసుకోవచ్చు.

అన్నట్లు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను బహిరంగంగానే దునుమాడుతున్న వీర్రాజు గారు.. తమ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా.. సందర్భానుసారం అదే పత్రికలో వ్యాసాలు రాస్తున్న విషయం మర్చిపోతే ఎలా? వీర్రాజు గారు పార్టీ పగ్గాలు తీసుకునే వరకూ, అదే ఆంధ్రజ్యోతికి.. ఓవి రమణ అనే జాతీయ స్థాయి నాయకుడు కూడా వ్యాసాలు రాశారు. అందువల్లే ఆయనపై వేటు పడింది. ఆయన జనతాదళ్ జాతీయ ప్రతినిధిగా మీడియాకు తెలుసు. పైగా వీటికి మించి రమణ, ఏపీ బలిజనాడు వ్యవస్ధాపక అధ్యక్షుడు. కాపు-బలిజ కోటా నుంచి అధ్యక్షుడయిన వీర్రాజు.. పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత పడిన తొలి వేటు, బలిజ నేతపై కావడమే ఆశ్చర్యం.

ఆ తర్వాత లంకా దినకర్ కూడా జాతీయ మీడియాకు తెలిసిన వ్యక్తే. వారిద్దరూ ఆంధ్రజ్యోతిలో, ‘వీర్రాజుగారి పుణ్యాన’ పార్టీ నుంచి సస్పెండయ్యేవరకూ వ్యాసాలు రాశారు. పార్టీకి భూమి ఇచ్చిన వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌నూ సస్పెండ్ చేశారు. మరి వారి మాటేమిటి? ఆ ప్రకారంగా రాధాకృష్ణను విమర్శిస్తున్న వీర్రాజు గారికి.. తమ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేదా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును .. ఆంధ్రజ్యోతిలో వ్యాసాలు రాయకుండా నిలువరించే ధైర్యం ఉందా?

కానీ, ‘పాయింట్ ఎయిట్ పర్సెంట్’ పార్టీకి ప్రెసిడెంటయిన వీర్రాజు గారు కూడా, పులినిచూసి నక్క వాతపెట్టుకున్న చందంగా, తమ వీరత్వం గురించి ఎక్కువగా ఊహించుకుని.. ఆ దారిలోనే మీడియాపై విరుచుకుపడటమే వింత. మీడియా మీద పెట్టే దృష్టి పార్టీపై పెడితే, నీసం ఆ ‘పాయింట్ ఎయిట్ పర్సెంట్ ముద్ర’ నుంచి, పార్టీని రక్షించినవారవుతారు. అంతేతప్ప, జర్నలిస్టులపై ఇలాంటి నేల టికెట్టు- నేలబారు భాష వాడటం హుందాతనంగా ఉండదు. ఆలోచించండి!

మార్తి సుబ్రహ్మణ్యం
ఎడిటర్, సూర్య
9705311144