రాజకీయ విభేదాలు ఎందుకొస్తున్నాయి?

247

సర్వ’భోక్తక’, (కు)సామ్యవాద, (అ)లౌకిక, (అ)ప్రజాస్వామ్య, గణ ‘తాంత్రిక’ పాలకులు…!!!

ఈరోజు అన్ని పేపర్లలోనూ తెలంగాణ రాష్ట్రానికి  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ‘అ’న్యాయాల గురుంచి  కెసిఆర్  పడుతున్న ఆవేదన ప్రచురితమైంది. దురద్రుష్టవశాత్తూ చాలా కాలంగా ఎందరో రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా తరచుగా ఇలాంటి ఆక్రోశాన్నే పదే పదే వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు… బీజేపీ పాలనలో లేని ప్రతి రాష్ట్రంలోనూ ప్రతినిత్యం ఇలాంటి ఆవేదనలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తీకరించంటం ఈరోజుల్లో నిత్యకృత్యం ఆయిపోయింది…!… ఒక రకంగా బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల్లో లోకల్ బీజేపీ నాయకులు పదేపదే అసలు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నది, పోషిస్తున్నది, తరింపచేస్తున్నదీ కేవలం కేంద్ర ప్రభుత్వమే అని చాలా తరచుగా భజన చేస్తూ, కీర్తిస్తూ, ప్రచారం చేస్తున్నారు. అసలు నిజం భగవంతుడికే ఎరుక…!!!

అసలు సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన మన పవిత్ర భారత దేశంలో ఈ రకమైన ప్రాంతీయ, రాష్ట్రీయ, సాంఘిక, ఆర్ధిక, రాజకీయ విభేదాలు ఎందుకొస్తున్నాయి…?… దీనికి కారణమేమిటి…???… రాజరికాలు అంతరించిపోయినా… రాజులూ, రాజ్యాలు, నియంతలు అంతమైపోయినా… కొత్త, కొంగొత్త, రాజులు, నియంతలు, దేవుళ్ళు ఎవరైనా పుట్టుకొచ్చారా…?… మనం ఎటుపోతున్నాం…?… ఒక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ప్రజల్ని, ఒక రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవించలేని కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా గణతంత్ర రాజ్యమంటారు…?… ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని తమ జేబు సంస్థలా, మోచేతి నీళ్లు తాగే పరాన్నజీవులు గా ఎవరైనా భావిస్తున్నారా…?… ఎవరూ ఎవరికీ ముష్టి వేయటం లేదు…

ఇక్కడ ఎవరూ ఎవరి దయ దాక్షిణ్యాల మీదా బతకడం లేదు… ఒక్కొక్కసారి వింటున్న కేంద్ర ప్రభుత్వ ‘దయ’, ‘సహాయం’, ‘కారుణ్యం’…వంటి మాటలు అభిమానం ఉన్న ఏ ఒక్కరి కైనా ఆత్మాభిమానాన్ని గాయపరుస్తాయి. ఇది అన్యాయం… అక్రమం… అసమంజసం… “మేము ఈ దేశం లో భాగం కాదా?” అనుకొనేలా చేయవద్దు… కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయటం కేంద్ర ప్రభుత్వ భాద్యత… ఇందులో రాజకీయాలు, తమ-పర బేధాలు, రాజకీయ అవసరాలు, లక్ష్యాలు, దీర్ఘకాల టార్గెట్లు గా చూడకండి… ఇలాంటి విషయాలలో పక్షపాతం చూపవద్దు… రాజకీయాలు ఎలెక్షన్ల వరకు ఓకే… కానీ అన్నికాలాల్లో రాజకీయం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు… గుర్తుంచుకోండి..

      స్వతంత్రం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అంటే ఇది కాదు… ఇలాంటి వైఖరి భారతదేశ జాతీయ సమైక్యత కు గొడ్డలి పెట్టు… సమైక్యతా స్ఫూర్తి ని మరచి పోవద్దు… ఇప్పటికే దక్షిణ భారతదేశ ప్రజలు చాల వెనుకబడి, ఒకరకంగా అభద్రత తో ఎన్నో కష్టాలు పడుతున్నారు. పన్నులలో వాళ్ళ వాటా వాళ్లకు ఉత్తర భారతదేశం తో సమానంగా పొందటం వాళ్ళ హక్కు. ఇక్కడ ఎవ్వరి ధర్మం, భిక్ష , దయ అవసరం లేదు. తెలుగు ప్రజలకు మీరు చేసిన అన్యాయాలు చాలు. ఇకనైనా ధర్మంగా పోండి…
నియంతృత్వంతో… నీచ రాజకీయాలతో ఎన్నో రాజ్యాలు … ఎందరో రాజులూ … మరెందరో నియంతలూ సమాధి చేయబడ్డారు… మీరెంత…??? దయచేసి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేయండి… టాక్స్ పేయర్స్ ని గౌరవించండి… న్యాయం గా మా రాష్ట్రాలకు రావాల్సిన వాటా మాకు సగౌరవంగా  ఇవ్వండి. ప్రజలతో ఎన్నుకున్న ముఖ్యమంత్రుల్ని ప్రభుత్వాల్ని ముఖ్యం గా ప్రజలను  వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని గౌరవించండి…జై హింద్ … భారత మాతకు జై…

                             పెన్మెత్స రవి ప్రకాష్ అశోక వర్మ, శృంగవృక్షం,
Near భీమవరం,
పాలకోడేరు మండలం,
పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్