అవిస్మరణీయ అజ్ఞాత వీర కిశోరం బటుకేశ్వర దత్

277

18 నవంబర్ 1910 కాన్పూర్కి 22కి.మీ దూరంలో ఉన్న బుర్ద్వాన్ నుంచి బి.కే.దత్,బట్టు మరియు మోహన్ గా పిలవబడే బటుకేశ్వర్ అనే విద్యార్థి తన హై స్కూలు విద్య కోసం కాన్పూరు వచ్చాడు. అక్కడే భారత దేశ స్వాతంత్ర్య విప్లవ వీరుడు  చంద్రశేఖర్ ఆజాద్ ను కలుసుకున్నాడు. ఆ సమయంలో చంద్రశేఖర్ ఆజాద్ ఝాన్సి, కాన్పూర్, అలహాబాద్ వంటి ప్రాంతాల్లో విప్లవ కార్యకలాపాలకు సారధ్యం వహించేవాడు. 1924లో భగత్ సింగ్ కూడా అక్కడికే వచ్చి చేరాడు. బటుకేశ్వర్ లోని దేశభక్తి భావనలను పసిగట్టిన తమ మొదటి కలయిక నుంచే బటుకేశ్వర్ని తన స్నేహితుడిగా స్వీకరించాడు. 1928లో చంద్రశేఖర్ ఆజాద్ ప్రారంభించిన “హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీలో బటుకేశ్వర్ దత్ కీలక సభ్యుడు. అనతి కాలంలోనే బటుకేశ్వర్ బాంబుల తయారీలో శిక్షణ పొంది అందులో ప్రావీణ్యం సపాదించాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ యొక్క అనేక విప్లవ కార్యకలాపాల్లో బతుకేశ్వర్చురుగ్గా పాలుపంచుకునే వాడు.

 అమాయక భారతీయుల్ని పలు విధాలుగా హింసలకు గురి చేస్తున్న విదేశీ పెత్తందార్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి, సవాలు చెయ్యడానికి అన్ని విధాలుగా సన్నద్దమౌతున్నారు విప్లవకారులు. కాకోరి ఉదంతం, లాహోర్ పోలీసు అధికారి సాండర్స్ హత్య అందులో భాగాలే. సెంట్రల్ అసెంబ్లీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను నిలువరించాలని ఆంగ్ల ప్రభుత్వం భావించింది. ఇదే సమయంలో విప్లవకారులు కూడా ఆ సమ్మెలో భాగస్వాములు కావాలని, ఆ విధంగా ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం లభిస్తుందని, తాము చేస్తున్న అజ్ఞాత కార్యాన్ని అందరికీ తెలిపే అవకాశం లభిస్తుందని భావించారు.

ఏప్రిల్ 08, 1929న  భగత్ సింగ్, బటుకేశ్వర్ కలిసి సెంట్రల్ అసెంబ్లీ హాలులోని ప్రేక్షకుల గాలరీ నుంచి సెంట్రల్ అసెంబ్లీ హాలులో బాంబు వేశారు. నిజానికి ఆ బాంబు ఎవరికీ ప్రాణ హాని కలిగించటం కోసం వేసినది కాదు. అటు ప్రభుత్వానికి, ఇటు దేశ ప్రజలకు తమ ఆలోచనలు, పోరాటం తెలియాలి, భారతీయులలో స్ఫూర్తి నిమ్దాలన్నదే వారి ఉద్దేశ్యం. అంతే కాదు బాంబు వేసిన తర్వాత భగత్ సింగ్ , బటుకేశ్వర్లిద్దరూ అక్కడి నుంచి పారిపోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చెయ్యలేదు. ఆ హాలులోనే అందరూ వినేలా నినాదాలిచ్చి ప్రసంగం ద్వారా తమ ఆలోచనలు తెలియజేయడానికి ప్రయత్నించారు.  ఈ చర్యతో సామాన్య భారతీయులకు తామెందుకోసం పని చేస్తున్నామో అర్ధమై, విప్లవకారుల మీద వున్న అపోహలు తొలగి పోతాయని భావించారు.

భగత్ సింగ్, బటుకేశ్వర్లు ఇరువురూ అరెస్టు చేయబడ్డారు. విచారణ మొదలైంది. జూలై 6,1929న విచారణ సందర్భంగా భగత్ సింగ్, బటుకేశ్వర్లిద్దరూ సంయుక్తంగా చేసిన ప్రకటన అత్యంత  స్ఫూర్తిదాయకమైనది.  కోర్టు ఈ కేసులో ఇద్దరికీ ఆజన్మ ఖైదు విధించింది. ఇద్దరినీ లాహోర్ జైలుకు తరలించారు. అంతే కాకుండా లాహోరు కుట్ర కేసు కుడా వారిద్దరిపై మోపబడింది. లాలా లజపతి రాయ్ నేతృత్వంలో సైమన్  కమీషన్కి వ్యతిరేకంగా ఉద్యమించిన భారతీయులపై పోలీసులు దాడి చేశారు. లాలా లజపతి రాయ్ ని తీవ్రంగా కొట్టడంతో  వారు మృతి చెందారు. వారి మృతికి ప్రతీకారంగా విప్లవకారులు బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రతినిధి అయిన పోలీసు ఆఫీసర్ని హత్యా చేశారు. ఈ కేసులో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్లకు మరణ శిక్ష పడగా, బటుకేశ్వర్ని దోషిగా నిరూపించటానికి ఏ విధమైన ఆధారాలూ లభించకపోవటంతో జీవిత ఖైదు నిమిత్తం అండమాన్ తరలించారు.

జైలులో బటుకేశ్వర్ 1933, 1937లలో  రెండు పర్యాయాలు చేసిన నిరాహార దీక్షలు అత్యంత చారిత్రాత్మకమూ, సంచలనాత్మకమూను. 1937లో ఆయనను పాట్నాలోని బంకిపుర సెంట్రల్ జైలుకి తరలించారు. 1938 లో జైలు నుంచి విడుదలయ్యే నాటికి అందమాన్లోని నీటి కారణంగా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యున్నారు. మళ్ళీ 1941లో మరోసారి అరెస్టు చేయబడి 1945లో విడుదల చెయ్యబడ్డారు.

స్వాతంత్ర్యం అనంతరం నవంబర్ 1947లో అంజలీ దత్ తో కలిసి పాట్నాలో తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. ఆయనను బీహార్ శాసన మండలికి ఎంపిక చేసుకోవడం ద్వారా బీహార్ శాసన మండలి తనను తాను సత్కరించుకున్నట్లైంది. బటుకేశ్వర్ దత్ జులై 20, పంతొమ్మిది వందలా అరవై ఐదులో  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు పరమపదించి  భారతమాత దివ్య చరణాలను చేరుకున్నారు. వారి విప్లవోద్యమ సహచరులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల స్మృతి చిహ్నాల నడుమ పంజాబ్లోని హుస్సేనీవాలాలో  వారి పార్ధివ దేహం ఖననం చేయబడింది. ఒక విప్లవ జ్యోత్జి నింగికెగసింది. ఒక ధ్రువ తార ఆకాశం చేరింది. ఒక పవిత్ర కుసుమం భారతమాత చరణాలను చేరింది. భారత్ మాతాకి జై.

vskandhra