జనగాంలో ఎస్సీ కుటుంబానికి ఆలయ ప్రవేశం

635

పూజలు చేయించుకునేందుకు వెళ్ళి ఎస్సీలనే కారణంతో తిరస్కారానికి గురైన ఒక కుటుంబానికి అదే దేవాలయంలో పూజలు జరిపించుకునే అవకాశం లభించింది. జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చిన  బాధిత కుటుంబాన్ని  గర్భ గుడిలోకి తీసుకువెళ్లి స్థానిక పూజారి వారితో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమం  జిల్లా జాతీయ ఎస్ సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగింది.

      ఎస్ సి వర్గానికి చెందిన లక్కేపల్లి భాస్కర్, సంధ్యారాణి దంపతులు తమ కుమారుడి కోసం శాంతిపూజలు చేయించుకోవాలని శుక్రవారం గుడికి వచ్చినప్పుడు అక్కడి పూజారి అందుకు ఒప్పుకోలేదన్న విషయం వివాదానికి దారితీసింది. దానితో పోలీసులు పూజారిని అరెస్ట్ చేశారు కూడా. అయితే ఈ రోజు భాస్కర్ దంపతులను గుడిలోకి తీసుకువెళ్లిన స్థానిక పూజారి వారితో పూజలు చేయించారు.

ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన జాతీయ ఎస్ సి   రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముక్క స్వామి మాట్లాడుతూ హిందు దేవాలయం ప్రవేశానికి,  పూజలకు ఎవ్వరి అనుమతి అవసరం లేదని,  హిందువులమైన తాము దేవాలయాల ఆచారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించుకుంటామన్నారు. ఇటీవల కాలంలో హిందూ కులాల మధ్య ఉన్న స్వల్ప విభేదాలను ఆసరాగా చేసుకుని విభేదాలను సృష్టించడానికి హిందూ ధర్మ వ్యతిరేకులు కుట్రలు చేస్తున్నారని వారి పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా క్రైస్తవ మతం స్వీకరించి ఎస్సీ, ఎస్టీలమని చెప్పుకునే వ్యక్తులకు దళితుల హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు.ఉద్యమల ముసుగులో దళితులకు న్యాయం చేస్తామని వచ్చే వారి పట్ల సమాజం అప్రమతంగా ఉండాలని, పోలీసు  విచారణలో పూజారులు దోషులు అని తేలితే  శిక్షార్హులవుతారని అన్నారు.      ఈ కార్యక్రమంలో  జాతీయ ఎస్ సి  రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి రఘుపతి, జిల్లా సంయోజక్ వెంకటస్వామి,  జిల్లా అధ్యక్షలు ఉపేందర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.