జన సంక్షేమ సమితి తుఫాను సహాయతా కేంద్రం ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గుండేల పుట్టుగ గ్రామంలో జనసంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్మితమైన తుఫాను సహాయతా కేంద్రం మరియు యువత నైపుణ్య శిక్షణా కేంద్ర భవనం “ద్వారక” ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆరెస్సెస్ సహ ప్రాంత ప్రచార ప్రముఖ్ విజయాదిత్య మాట్లాడుతూ సంఘటిత సమాజ నిర్మాణము, ఉన్నత వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల నిర్మాణమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లక్ష్యమని, కనుక భవనాల నిర్మాణం కంటే, వ్యక్తి నిర్మాణమే మన ప్రథమ కర్తవ్యమని ఆయన కార్యకర్తలకు వివరించారు.
మనం ఎప్పటి నుంచో చేస్తున్న పనిలో భాగంగా, ఆ పనిలో సహాయకారిగా ఉంటుందనే ఈ భవనాన్ని నిర్మించుకున్నామని, ఈ భవనం ఆధారంగా సద్గుణ సంపన్నమైన సంఘటిత సమాజాన్ని నిర్మాణం చెయ్యాలని ఆదిత్య వివరించారు. ఈ భవనంలో చుట్టు ప్రక్కల గ్రామాల యువతకు అనేక విషయాలలో శిక్షణ లభించాలని, ఈ భవనం ద్వారా యువతకు అనేక విషయాలలో విశేషమైన నైపుణ్యాలు లభించాలని, దాని ద్వారా యువత శక్తివంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
అపారమైన యువశక్తి భారతదేశానికి స్వంతమని, మన యువత శక్తివంతమైతే యావత్ ప్రపంచం శక్తివంతమైనట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.కుల వివక్షకు తావులేని గ్రామాల నిర్మాణం ఈ భవనం నుంచి జరగాలని, చుట్టు ప్రక్కల గ్రామాలను ఈ భవనం ఆత్మ నిర్భర భారత్ వైపు నడిపించాలని ఆదిత్య అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఇంకా ఆరెస్సెస్ విజయనగరం విభాగ్ సంఘచాలక్ DVV కృష్ణంరాజు, శ్రీకాకుళం జిల్లా కార్యవాహ లింగరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత కళాశాల విద్యార్థి ప్రముఖ్ జనార్థన్, సహ సేవా ప్రముఖ్ కొండారెడ్డి, సేవాభారతి తెలంగాణ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, MLC మాధవ్, దాసప్ప,ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.