దక్షిణ భారత భాషలలో పెద్ద భాషలు తమిళం,తెలుగు. ఈ రెండు భాషల సినీ సాహిత్యంలో రెండు దిగ్గజాలు కణ్ణదాసన్, ఆత్రేయ.
ఇది ఆత్రేయ శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం,మహర్షి సాత్యవతేయ పరిషత్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకులకూ
పాల్గొంటున్న వారందరికీ చక్రావధానుల రెడ్డప్ప ధవేజి నమఃసుమాంజలులు.
ముందు అనుకున్నట్లుగానే ఇవాళ నా పాత్ర మావటీడు పాత్ర. ఒక్క ఏనుగును ఇదే ఏనుగు అని దూరం నుండి చూపించడం కష్టం కాకపోవచ్చును కాని…..
ఆ ఏనుగు నడకనూ,దాని స్వభావాన్ని చూపించడం కష్టమైన పనే!
అందులోనూ రెండు ఏనుగులాయే!
అవీ మామూలువా!!
సాహితీ సాగరాలను మధించి నిగ్గుదేలిన రెండు భధ్రగజాలు….
భారతీయ సంప్రదాయం లో లక్ష్మీదేవికి ఇరువైపులా జోతలెత్తే గజాల వలెనే తెలుగు, తమిళ భాషల చలనచిత్ర రమాసుందరికి జోతలెత్తుతూ ఆతల్లికి అలంకారంగా శోభాయమానమైన గీతమాలికలల్లి అర్పించిన రెండు దిగ్గజాలు ఆత్రేయ.. కణ్ణదాసన్!!
ఈరెండు ఏనుగుల నుడి నడవడులను కలివిడిగా తెలపవలసిన మావటి పనికి పూనుకుంటున్నాను…..
ఆత్రేయ….
ఈపేరు తెలియని తెలుగు వాడు లేడు.
ఇది అతిశయోక్తి కాదు.
అతిశయోక్తి గా మారకూడదని నేనే కాదు ప్రతి తెలుగు వాడూ కోరుకుంటాడు!
సరిగ్గా తమిళంలో కణ్ణదాసన్ పరిస్థితి కూడ అంతే!!
ఇద్దరూ సాహిత్యంలో రాటుదేలాకే సినిమాల్లోకి వచ్చారు.
ఆత్రేయ పది నాటకాలు, పదిహేను నాటికలూ,నాలుగు వందల చిత్రాలకు మాటలు,పాటలూ వ్రాస్తే…..
కణ్ణదాసన్ 232 పుస్తకాలు,ఆరువేల కవితలు,
ఐదువేల సినిమా పాటలూ వ్రాసాడు.
ముఖ్యంగా ఆయన వ్రాసిన “అర్థముల్లా ఇందూ మతం” అనే పది భాగాల పుస్తకం ఆయనకెంతో పేరు తెచ్చింది….కాని సినిమా పాటలతో ప్రజల మదిలో శాశ్వతంగా నిలచిపోతాడు కణ్ణదాసన్. బహుశః భారతియార్ తరువాత అంత పేరు తెచ్చుకున్న తమిళ కవి కణ్ణదాసనేనేమో!
తెలుగులో కూడ ‘కప్పలు,ఎన్జీవో’ లాంటి నాటకాల రచయితగా ఆత్రేయ సుప్రసిద్ధుడైనప్పటికీ ఆయన పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఆయన సినిమా పాటలే!
ఆయనంటేనే మనసు..మనసంటేనే ఆయన!!!
మనసున్న ప్రతివాడికీ ఆత్రేయ గుర్తుంటాడు.

కణ్ణదాసన్ తన సినిమా పాటలతో ఎన్నో బాషలలో ఎంతోమంది ప్రసిద్ధి చెందిన కవులను సైతం ప్రభావితం చేశాడు. తెలుగులో ఒరిజనాలిటీతో రచనలు చేయడంలో పేరొందిన ముళ్ళపూడి, దేవులపల్లి లాంటి కవులు సహితం సినిమా పా
టలలో కణ్ణదాసన్ భావాలను తీసుకుని పాటలు వ్రాశారు(బహుశః ఆ పాటలను మూలంలో కణ్ణదాసన్ వ్రాయడం కారణంగా అవ్వచ్చును)…
ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలను తొలిరోజులలో మద్రాసులోనే నిర్మించడం మూలంగా ఆయా భాషల కవులకు సాన్నిహిత్యం ఏర్పడటం,,వివిధభాషలలో ఒకే విషయంపై సినిమాలు తీయడం, ఆక్రమంలో ఒకరి ప్రభావం మరొకరిపై పడటం సంభవించింది. ఆ రకంగా పరస్పరం ప్రభావితులైన వారు ఆత్రేయ, కణ్ణదాసన్.
వారిద్దరి పాటలలో రెండు పాటలను పరిశీలిద్దాం. …

తెలుగు సినిమా పాటలలో వేదాంతం చెప్పిన పాటలు రెండు.
ఒకటి
“జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా”
రెండు
“దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇంక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా”
మొదటిది సముద్రాల, రెండవది ఆత్రేయ వ్రాశారు.
ఆత్రేయ “అంతులేని కథ” చిత్రం కోసం వ్రాసిన ఈ పాటను అదే చిత్రాన్ని మొదట తమిళంలో “అవళ్ ఒరు తొడర్ కథై” పేరుతో తీసారు.
అందులో కుటుంబ భారాన్ని మోస్తున్న కథానాయిక, తాగుబోతు గా మారి కుటుంబానికి భారమైన తన అన్నగారిని ఇంట్లోంచి వెడలగొట్టే సన్నివేశానికి తమిళంలో కణ్ణదాసన్, తెలుగులో ఆత్రేయ పాటలు వ్రాసారు.
తమిళంలో కణ్ణదాసన్
“దైవం తందవీడు వీధి ఇరుక్కు
ఇంద ఊరెన్న సొంద వీడెన్న జ్ఞాన పెణ్ణు”
ఇంట్లోంచి పొమ్మన్నావు దేవుడిచ్చిన వీధి ఒకటుంది కదా అక్కడి నుంచి పొమ్మనలేవు కదా…ఇంక సొంత ఊరేమిటి..సొంత ఇల్లేమిటి..ఓ జ్ఞానవతీ
అని కణ్ణదాసన్ తమిళంలో వ్రాస్తే…
దాన్ని

“దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇంక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్థం ఏది పరమార్ధం”

అని తెలుగులో వ్రాశారు ఆత్రేయ.
ఇక్కడ కణ్ణదాసన్ తన చెల్లెలిని “జ్ఞానపెణ్ణ్’ అన్నాడు.అంటే ‘ ఓ జ్ఞానం కలిగిన దానా’ అని అర్థం.
కాని ఆత్రేయ మాత్రం’ఓ చెల్లెలా’ అన్నాడు. తమిళంలో వ్యంగ్యం వైభవంగా ధ్వనించింది.కాని తెలుగులో ఆత్మీయతతో కూడుకున్న మందలింపు కనిపిస్తుంది. ఓ అన్న తన చెల్లెలికి లోకం లోతును తెలుపుతూ ఆత్మీయంగా చెపుతున్న మాటలా ఉంటుంది.
కణ్ణదాసన్ చరణాలలో చెల్లెలు అనే వ్రాసాడు.పైగా ప్రతి చరణంలోనూ వ్రాసాడు. కాని పాటకు పల్లవి ప్రాణం కాబట్టి కథానాయిక కు పాడుతున్ప పాత్రకు ఉన్న అనుబంధాన్ని పల్లవి లోకే తీసుకొచ్చాడు ఆత్రేయ.
అంతేకాదు……
కణ్ణదాసన్ చూపించిన వ్యంగ్యాన్ని ఏమాత్రం వదలకుండా ‘పిచ్చమ్మా,వెఱ్ఱెమ్మా’ అన్న పదాలతో ఓ అన్న తన చెల్లెలు అజ్ఞానాన్ని ఎలా ఎత్తి చూపిస్తాడో చూపించాడు.
కణ్ణదాసన్ భావనాపటిమ అనితరసాధ్యం.
తల్లి దండ్రి,పిల్లలు వీళ్ళ పుట్టుకలూ వాళ్ళచేతులలో లేవనీ,అవన్నీ దైవం చేతిలోనే ఉన్నాయనీ ,ముళ్ళచెట్టుకు చుట్టూ కంచె అక్కరలేదనీ ,మనం దేనికీ కర్తలం కామనీ,ఇది తెలుసుకోవమ్మా ఓ జ్ఞానవతీ,
అంటూ….

“తెలివాహ తెరింతాల్ సిద్దాంతం
అదు తెలియమాల్ పోనాలె వేదాంతం”
అని అత్యద్భుతంగా వేదాంతం గురించి చెబితే
దానినే ఆత్రేయ తెలుగులో….

“నన్నడిగి తల్లిదండ్రి కన్నారా
నాపిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కావే పోవే పిచ్చమ్మా
…………….,…………………….
ముళ్ళచెట్టు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా
అని అంటూ….
“తెలిసేట్లు చెప్పేది సిద్దాంతం
అది తెలియకపోతేనే వేదాంతం”
అని కణ్ణదాసన్ లాగే మామూలు తేట మాటలలో సిద్దాంతీకరించాడు ఆత్రేయ.ఇద్దరికిద్దరే…ఒకరికొకరు తీసిపోరు..
కణ్ణదాసన్ తన జీవితాన్ని ఓ హేతువాదిగా ప్రారంభించి కంచి పెరియస్వామి దార్శనికత తో గొప్ప భక్తునిగా మారి అద్వైతాన్ని ఈ పాటలో పోస్తే…..
ఆత్రేయ విశిష్టాద్వైతుడైనప్పటికీ అద్వైతపు అంచులముట్టిన జ్ఞానపారవశ్యాన్ని చూపించాడీ పాటలో…
అలాగే మరో గీతం….
తమిళంలో’ ‘మణప్పందాళ్’ చిత్రం కోసం కణ్ణదాసన్ వ్రాసిన మరో పాట.

“ఉడలుక్కు ఉయిర్ కావల్
ఉలగుక్కు ఒళి కావల్
కడలుక్కు కరై కావల్
కణ్ణుక్కు ఇమై కావల్”
అనే కావలి పాట అర్థం

‘దేహానికి ప్రాణం కాపలా
లోకానికి వెలుగు కాపలా
కడలికి ఒడ్డు కాపలా
కంటికి రెప్ప కాపలా’

అన్న పాటను తెలుగులోకి తెచ్చేటప్పుడు ఆత్రేయ తనదైన సంక్షిప్తను,సూటిగా చెప్పే అలవాటు నూ ఒకింత మార్చుకుని ఏవిధంగా చెప్పాడో చూడండి…

“ఎవరికి ఎవరు కాపలా
బంధాలన్నీ నీకేలా”

అని క్లుప్తంగా చెప్పేసాడు.కాని తెలివిగా కణ్ణదాసన్ పల్లవిని చరణాలలో నిక్షేపించాడు.

“తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసూ కాపలా
తనువును వదలి తరలే వేళ
మన మంచే మనకు కాపలా

కంటికి రెప్పే కాపలా
కలిమికి ధర్మం కాపలా
కలిమి సర్వమూ తొలగే వేళ
పెట్టినదేరా గట్టి కాపలా

చిన్నతనాన తల్లి కాపలా
వయసుకి వలచినవారు కాపలా
ఎవరి ప్రేమకు నోచని వేళ
కన్నీరేరా నీకు కాపలా”

వీటన్నింటినీ కణ్ణదాసన్ పల్లవి,చరణాలలో …

“సత్యం ఎన్బదు వెలి కావల్
ధర్మం ఎండ్రాల్ అదు మనకావల్
…,…..,……………,…………
కావల్ మురింద పెణ్ణుక్కు
వయ్ విల్ ఏర్ కావల్”
అని వ్రాస్తే ఆత్రేయ పల్లవిని ప్రశ్నగానూ, చరణాలను జవాబులుగానూ మార్చేశాడు.

పైరెండు పాటలలోనూ లోతైన భావాలను ఎక్కడా చెదరిపోకుండా తెలుగు చేసిన ఘనత ఆత్రేయది.

అలాగే ఆత్రేయ తెలుగు పాటను తమిళంలోకి తీసుకువెళ్ళినప్పుడు కణ్ణదాసన్ కూడ అదే చాతుర్యంతో,నైపుణ్యంతో వ్రాసాడు. మచ్చుకు ఆత్రేయ మనసు ముద్ర …

“తాగితే మరచిపోగలను కాని తాగలేను
మరచిపోతే తాగగలను కాని మరువలేను
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే”
పాటను తమిళంలో “వసంతమాళిగై”
లో కణ్ణదాసన్…..

“కుడిపాతరుక్కు ఒరు మనం ఇరండాల్
అవళై మరందు విడలాం
అవళై మరప్పుదురక్కు ఒరు మనం ఇరండాల్
సుజిత్తు విడలాం ఆనాల్ ఇప్పదు ఒరు మనం
నాన్ ఎన్న సేయుం
ఇరండు మనం వేండుం”

తాగడం మానడానికి ఒక మనసుండాలి
తనను మరచిపోవడానికి ఇంకో మనసుండాలి
కాని ఉన్నదొకటే మనసు నేనేంచెయ్యను
రెండు మనసులు కావాలి’
అని అద్భుతంగా తమిళీకరించాడు.
ఇద్దరూ ఇద్దరే…
ఎవరికి ఎవరూ ఎక్కువా కాదు….తక్కువా కాదు.
సరిసమానుల కదనరంగం…
కవి దిగ్గజాల కవనాహవరంగం…
కన్న..విన్న అదృష్టవంతులం మనం.
ఆ కవి దిగ్గజాలకు అంజలి ఘటిస్తూ…
నాకీ అవకాశమిచ్చిన వారందరికీ నా కృతజ్ఞతతో… స్వస్థి

చక్రావధానుల రెడ్డప్ప ధవేజి
నరసాపురం
970311558

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner