నగరంలో ఓ జీవితం

437

కాంక్రీట్ జంగిల్ లో అందరి జీవితాలు ఓ యాంత్రికమే…!!
నీకు నేనున్నాని…నీకు తోడై నిలుస్తాను అని…..
భరోసా ఇచ్చేవారి అప్యాయతలు ఎండమావులే ఇక్కడ..!!
అందుకే అనుకుంటాను
ఎవరో వస్తారని…ఏదో చేస్తారని..అనే పద రచనలు పుట్టుకొచ్చిన
జనన కేంద్రాలు నగర జీవితాలేమో అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే..!!!.
అటువంటి జీవితంలో ఎందరిలోనో మానసిక సంఘర్షణలు..మరెన్నో ఆవేదనలు…
అటువంటి ఒకరి ఆవేదనకు అక్షర రూపమే నగరంలో ఓ జీవితం అనే ఈ కధానిక…!!!

·         * *
ఆ రోజు శనివారం…
అబిడ్స్ ప్రాంతం….
రాత్రి అంతా సమస్తకోటికి జోల పాడి అలసినట్టుగా చంద్రుడు తన దినసరి కర్తవ్యన్ని ముగించాడు…పిదప ఎవరి విధులను వారికి గుర్తు చేస్తున్నట్లుగా  చురుక్ మనిపిస్తు సూర్యుడు ఉదయించడం ప్రారంభించాడు
మరోపక్క ఆకాశాన్ని తాకుతున్నయా అన్నట్టుగా ఆ ప్రాంతంలోని  ఎత్తైన భవనాలు…వాటిని చూసిన మేఘాలు నవ్వుకుంటూ పరిగెడుతున్నట్గుగా అనిపిస్తోంది…ఆ మేఘాల వేగంతో పోటిపడుతున్నట్లుగా  భూమిమీద జనం వారివారి పనులమీద పరుగులు తీస్తున్నారు..
వాహనాలు తిరుగుతున్న అలికిడికి అప్పుడే మెలుకువ వచ్చింది మోహన్ కి…బద్ధకంగా ఆవలిస్తూనే ఒక్క క్షణంపాటు జ్జాపకాల ఓడిలోకి జారుకున్నాడు…పట్నంలోని పాఠశాలకి వెళ్ళే బస్సుకోసం పచ్చని పైర్లు మీదగా పొలల వెంబడి పరుగులు..ఆ సమయంలో చల్లని చిరు గాలికి పచ్చని పైర్ల సవ్వడిలు..ఆ పైర్ల నడుమే అమ్మ ఆవు పొదుగు కోసం లేగదూడల అరుపులు మోహన్ మనస్సుకి తాకాయి…ఓరేయ్ మోహన్ ఈ క్యారేజి తీసుకుని లంచ్ టైమ్ లో తినరా అంటూ ఆ పొలాల వెంటే మోహన్ ని అమ్మ పిలుస్తున్న నాటి పిలుపులు మరల ఒక్కసారి తన చెవిని తాకినట్లుగా  అనిపించడంతో ఆ అలికిడికి జ్జాపకాల ఓడిలో నుండి వర్తమానంలోకి దూకాడు మోహన్..

రోజూలాగే కార్యాలయంలో మోహన్ కి పని ఒత్తిడి ఎక్కువగానే ఉంది…రేపు ఎట్లాగో ఆదివారమే..సెలవు కాబట్టి ఈ రోజు సాయంత్రానికి ఏ బందువు ఇంటికో చేరుకుని రేపంతా సరదాగా గడపోచ్చు అనే ఆలోచనలతో పనిలో నిమగ్నమైపోయాడు మోహన్.
***
ఏరా మోహన్ బాగున్నావా……అన్న మాటలు తన మావయ్య ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టిన మోహన్ కి వినపడ్డాయి….. ఆ పిలుపులోని అప్యాయతకి మోహన్ మనస్సు ఒక్కసారి పులకరించింది… ఆ పులకరింతతో తాను దైనందిన జీవితంలో పడుతున్న కష్టాన్ని ఒక్కమారు ఎవరో చేతితో తీసేసి పారేసినట్టుగా అనిపించింది మోహన్ కి…అవును మావయ్య బాగానే ఉన్నాను…మీరందరు ఎట్లా ఉన్నారు…రేపు ఆదివారం కదా మీ అందరితో గడపొచ్చుఅని మోహన్ తన మాటను పూర్తి చేసేలోపే….
వారం తర్వాత మాకు పిల్లలతో ప్రశాంతంగా గడిపేరోజు ఆదివారం…ఆ రోజు కూడ బంధువులు వచ్చి ఇబ్బంది పెడుతూంటే ఎట్లా పైగా ఆడపిల్లలు ఉన్న ఇల్లు కూడ…అంటూ కిచెన్ లో నుండి అత్తయ్య అంటున్న మాటలు నెత్తిమీద పిడుగు పడినంతగా తోచాయి మోహన్ కి….
మరుక్షణమే బిక్కమొహంతో  మిమ్మల్ని ఓ మారు చూసి పోదామని వచ్చాను మావయ్య…అత్తయ్య…అంటూ పలకడం మినహా మోహన్ కి మరో గత్యంతరం లేకపోయింది…మరల తటపాయిస్తూనే వారానికి ఒక్కసారైనా మీరు ఎట్లా ఉన్నారో ఫోన్ చేస్తు ఉంటాను మావయ్య అంటూ మోహన్ నిస్తేజంగా ఉండిపోయాడు..

ఎందుకురా ఫోన్లు చేస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం…ఏదైనా పని ఉంటే నేనే చేస్తానులే అని తనకేసి చూడకుండానే దినపత్రిక పఠనంలో లీనమైపోయిన మావయ్య అంటున్న పెడవిరుపు మాటలు తూటల్లాగా తనని తాకడంతో అక్కడ ఒక్క క్షణం ఉండబుద్ది కాలేదు మోహన్ కి.
ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూనే  చీకపటిపడె సమయానికి మెస్ కి చేరాడు.
మెస్ లో భోజనం చేస్తూన్నంత సేపు పరాకుతోనే ఆలోచనల్లో మునిగిపోయాడు మోహన్. జీవితం మరీ యాంత్రీకం అయిపోయింది…అవసరాల ప్రాతిపదికనే మానవ సంబంధాలు ఆధార పడుతున్నాయి…స్ధాయి..ఆర్ధిక స్ధోమత ప్రతిపాదికనే గౌరవ మర్యాదాలు,,ఆదరణలు దక్కుతున్నాయి…చివరికి చావు విషయాలకు సంబంధించిన పలకరింపుల విషయంలో కూడ స్ధోమత అంశాలే ప్రధాన్యతను వహిస్తున్నాయి..నిజంగా నగర జీవితాలు నరక ప్రాయాలు అని అనుకుంటున్నాడు…
ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక…ఏ దారి ఎటుపోతుందో ఎవరిని అడగక…అంటూ మెస్ లోని స్పీకర్స్ లో వస్తున్న పాట విన్న వంశీకి అక్కడ ఉండబుద్ధి కాలేదు…
* * *
నీ క్రమశిక్షణ..చదువులో కష్టపడుతున్న తీరు బాగుందిరా మోహన్…నువ్వు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతావు…అంటూ చిన్న తనంలో తనతోటి వారు అంటున్న సందర్భం రూమ్ లో సేదతీరుతున్న మోహన్ కి గుర్తుకొచ్చాయి…
ఎంతో ఎత్తుకు ఎదగడం మాట దేవుడేరుగు… అంటకాగిన మానవ సంబంధాలకు నిలయాలైన ఎత్తైనా కాంక్రిట్ జంగిల్ కు మాత్రం చేరుకున్నాను…దేవుడా..మనుష్యులలో కారుణ్యత ఇంతగా అంటకాగుతున్నా నువ్వు ఏమి చేస్తున్నావు…అని మోహన్ తనలో తానే అనుకుంటూ కుమిలిపోతున్నాడు… మదిలోని గత జ్ఞాపకాలు ఒక్కోక్కటిగా గుర్తుకొస్తుండటంతో మోహన్ కళ్ళు ఒక్కసారిగా చెమ్మ గిల్లాయి…
బాధతృప్త హృదయంతో ఒక్కమారు భారంగా ఆకాశం కేసి చూసాడు మోహన్… సరిగ్గా ఆ సమయంలోనే మేఘాలు ఎరుపెక్కి ఉన్నాయి. బాధతో బరువెక్కిన తన గుండెల్లాగే ఆ మేఘాలు కూడ ఉన్నట్లుగా మోహన్ కి తోచింది. ఇంతలో చినుకులు కూడ ప్రారంభమయ్యాయి..తమ భారాన్ని మేఘాలు చినుకుల రూపంలో జార విడుస్తున్నట్టుగా మోహన్ కి అనిపించింది ఆ క్షణంలో
మనస్సు వత్తిడికి గురైనప్పుడు దాన్ని ఊరడించేది గతంలోని తీపి జ్ఞాపకాలే… ఆటువంటి జ్ఞాపకాలు పొరలు పొరలుగా మోహన్ మష్కిస్తంలోకి చొచ్చుకొచ్చాయి ఆ క్షణంలో..

అట్లతద్దినాడు ఉదయానే చద్దిమూట ఆటలు…ఆ ఆటాల్లో భాగంగా  స్ధానికుల పెరట్లోలోని చెట్ల కాయల దొంగతనాలు..ఇంటి గొళ్లాలను పెట్టడం..దొరికి పోయిన వాళ్ళకి అరదండలు వంటి ఘటనలు మోహన్ కళ్ళముందు కదలాడాయి.
అందరికి ఒకే బంతి బదులు తలోకరికి ఒకక్క బంతిని ఇస్తే ఎవరి ఆటను వారే ఆడుకుంటారు కదా అని ఫుడ్ భాల్ మాష్టారుతో పరిహాసం ఆడిన స్నేహితుల ఘటనలు..ఫలితంగా ఆయన బిక్కమోహంతో తమని మందలించడం వంటి స్కూల్ జీవితంలోని సంఘటలనలు గుర్తుకొచ్చి ఒక్కసారి మోహన్ పెదవులపై చిరునవ్వు తొంగి చూసింది.
అదే సమయంలోఆటల పోటిల్లోను, చదువుల్లోను తమ స్నేహితుల మధ్య వచ్చిన స్వల్ప బేధాబిప్రాయాలు ఉపాధ్యాయులతో చివాట్లు తిన్న సందర్భాలు తన ముందు తచ్చాడినట్లు అనిపించింది మోహన్ కి.
మీరు మాకు కన్నబిడ్డల కంటే ఎక్కువే…మీకు జననం ఇచ్చింది తల్లితండ్లులు అయితే.. మంచి నడతతో సమాజంలో ఉన్నత స్ధితికి మీరందరు చేరుకోవలనే తపనతో మీకు విద్యాబుద్దులు నేర్పించాం…కొన్ని సందర్భాల్లో దండించేం..కాని అవి అన్ని మీపై ఉన్న మామకారంతో చేసినవే..మీ అభ్యున్నతిని ఆశించి చేసినవే…. మీపై మేము చూపిన ప్రేమ మీ తల్లితండ్రలు  చూపిన ప్రేమకు ఏ మాత్రం తీసిపోదు…
మీ విద్యాభ్యాసం ముగిసి మమ్మల్ని మీరు వీడుతున్న సందర్భంలో కన్నబిడ్డల్ని వీడుతునే బాధ మాకు ప్రతి ఏడాది రివాజై పోయింది. మేము కూడ మీ వయస్సులో మీలాగే అల్లరి చేసిన వాళ్ళమే…గురువుల చేత దండింపబడ్డ వాళ్ళమే…నాటి అలర్లు..దండనలు భవిష్యత్ లో మనల్ని మనం తీర్చిదిద్దుకునేందుకు గుణపాఠాలు కావాలి….అని ఉపాధ్యాయులు అంటున్న సందర్భం తన కండ్ల ముందు మరొకమారు అగుపించాయి మోహన్ కి.
ఈనాటికి అనిపిస్తూ ఉంటుంది…ఏ నలుగురైనా గుమికూడిన చోట నాటి స్నేహితులు, ఉపాధ్యాయులు ఎవరైనా తారస పడతారేమోనని..అయినా ఈ జీవిత ప్రయాణంలో ఎవరి గమ్యం వాళ్లది…ప్రయాణంలో ఉన్నంత వరకే ఒకరికొకరం..అటు తరువాత ఎవరికి వారే యుమునా తీరే కదా….. అని అనుకుంటూ నాటి జ్ఞాపకాలలో విహారిస్తున్నంత సేపు కొంత బరువు గుండెలపై నుండి ఊరడింపుగా దిగినట్లు అనిపించింది మోహన్ కి….క్రమంగా తీపి జ్ఞాపకాల జోల పాటతో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు మోహన్.
రోజులాగే తెల్ల వారింది… కిల కిల ధ్వనులతో ఆహర వేటకై పక్షులు అరుస్తూ బయలు దేరుతున్నాయి…అదే విధంగా వాహనాలు కూడ తిరిగేవాటి శబ్ధాలతో నిద్రవస్ధలో ఉన్న జనాల్ని మేలుకోల్పుతున్నాయి… యధావిధిగానే కాలచక్రంతో పోటిపడుతూ ఆశల జీవితంలో పరుగులు తీస్తున్నాడు మోహన్.

-శ్రీపాద శ్రీనివాస్