అనుకున్నంతా అవుతున్నది!

169

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి  వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగడం ఖాయమని విశ్లేషకులు అనుకున్నంతా అవుతున్నట్టు కనబడుతోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ – మార్చ్ 31 తో పదవీ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఈ లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపి తీరతారని చాలామంది అంచనా వేశారు.
ఆయన నిర్వహించే పదవికి; పదవీ బాధ్యతల నుంచి వైదొలగేలోగా ఆయన చేపట్టనున్న ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కు కూడా రాజ్యాంగ రక్షణ ఉండడం తో….”ఎన్నికైన ప్రభుత్వం”పై ఆయనదే పై చేయి అవుతున్నది. ఆయన హయాంలో ఎన్నికలు జరగకుండా చూడడానికి రాష్ట్రప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం ఫలించలేదు.
* ఆయన పదవీ కాలం కుదింపు అయ్యేలా ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు చేయలేదు.
* ఆయన స్థానంలో  నియమితమైన జస్టిస్  కనగరాజ్ నియామకం చెల్లలేదు.
* ఆయన హయాం లో ఎన్నికల నిర్వహణ ను నిలువరించడానికి ప్రభుత్వం చేసిన కసరత్తు ఏదీ అక్కరకు రాలేదు.
* జిల్లాల పునర్వ్యవస్థీకరణ పట్ల కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
* ఇక, ముసుగులో గుద్దులాట ఎందుకు అని – ‘ఫిబ్రవరి లో స్థానిక ఎన్నికలు’ అని అధికారికం గా ప్రకటించారు.
* న్యాయపరమైన అడ్డంకులు ఏమీ లేవని కూడా ఆయన ముక్తాయించారు.
ఇప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చినట్టు అయింది.
ఫిబ్రవరి లో ఎన్నికలు ఖాయమయ్యాయి.
ఇందులో – మరో విశేషం కూడా ఉంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు నాలుగు వారాల ముందే- ఎన్నికల కోడ్ ఉనికి లోకి వస్తుందని కూడా రమేష్ కుమార్ ప్రకటించారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడం అంటే- మొత్తం ప్రభుత్వ  అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ నియంత్రణ లోకి వెళ్లిపోవడమే.
ఆంటే- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాష్ట్ర డీజీపీ వరకు- మొత్తం యంత్రాగమంతా – ఎన్నికల కమిషన్ కనుసన్నలలో పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే- రాజ్యాంగం ఊరుకోదు.
గతం లో ప్రారంభించిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాలేదని; వాయిదా మాత్రమే పడిందని సుప్రీం కోర్టు లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదించినందున- గతం లో జరిగిన “ఏకగ్రీవా”లు రద్దు కాక పోవచ్చు. వాటిని అలాగే వదిలేసి, మిగిలిన స్థానాలకు ఎన్నికలను నిర్వహించే విషయం లో మాత్రం – “ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటో” చూపించే అవకాశం ఉన్నదని కొందరు పరిశీలకులు అంటున్నారు.
అంటే- కలెక్టర్, ఎస్ పీ లతో సహా ఎవరిని బదిలీ చేయమంటే….వారిని చేయాల్సివుంటుంది. ఎవరిని సస్పెండ్ చేయమంటే….వారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరి మీద కేసు నమోదు చేయమంటే…వారి మీద కేసు నమోదు చేయాలి.
ఈ నేపథ్యం లో- ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికీ- రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్న ఎన్నికల కమిషన్ కు మధ్య ఘర్షణ అనేది లేకుండా – విధుల నిర్వహణ బాధ్యత ఈ రెండు వ్యవస్థల మీదా ఉన్నది.

-భోగాది వెంకట రాయుడు