చెబితే వింటివ గురూ గురూ..

508

సేవలను వెనక్కి తీసుకున్న స్వరూపా పీఠం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అతి సర్వత్రావర్జయేత్. అంతపెద్ద స్వామి వారికి సైతం.. అనుభవమయితే గానీ తత్వం బోధపడలేదు మరి. విశాఖ పీఠాథిపతి స్వరూపానంద మహాస్వామి వారి బర్త్‌డే సందర్భంగా.. 23 పెద్ద దేవాలయాల నుంచి ప్రధాన అర్చకులు,  చిన ముషిడివాడలోని ఆయన పీఠానికి వెళ్లి, ఆశీర్వాదంతో పాటు కానుకలు సమర్పించుకోవాలన్న,  దేవదాయ శాఖ ఓవరాక్షన్ వికటించింది. ఆ ‘అతి’పై హైకోర్టుకెళ్లిన పిటిషన్ల దెబ్బకు, విశాఖ పీఠం దిగివచ్చింది. తూచ్.. తాము ఆ లేఖను ఉపసంహరించుకుంటామని చెప్పడంతో, అయ్యోరి బర్త్‌డే గ్రీటింగ్స్ అనే లోకోత్తర దృశ్య కావ్యానికి ముందస్తుగా తెరపడినట్టయింది. ఇది కూడా చదవండి: కొత్తా దేవుడండీ..కోం గొత్తా దేవుడండీ!

అయితే తెలివిగా అదేరోజు పీఠం మేనేజర్,  ఒక ప్రకటన విడుదల చేశారు. ‘2004 నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారమే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని శారదాపీఠం కోరింది. ఈ విషయంలో ఎవరికయినా అభ్యంతరాలుంటే వాటిని స్వీకరిస్తాం’- ఇదీ పీఠం మేనేజర్,  కోర్టు నిర్ణయం వెలువడకముందు ఇచ్చిన ప్రకటన సారాంశం. కానీ, అభ్యంతరాలను ఎలా స్వీకరిస్తామని మాత్రం, అందులో ఎక్కడా వివరించలేదు. అది వేరే విషయం. సన్యాసి అయిన స్వామికి జన్మదిన సేవలందించమని, ప్రభుత్వ శాఖ ఎలా  ఆదేశిస్తుందని కొందరు భక్తులు,  హైకోర్టులో పిటిషన్ వేశారు. దానితో దిగివచ్చిన పీఠం యాజమాన్యం-దేవదాయ శాఖ జమిలిగా తమ లేఖలు ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు వె ల్లడించాయి. ఆ ప్రకారంగా.. ‘జగన్గురు’వైన శారదాపీఠాథిపతి బర్త్‌డే రోజున, పెద్ద ఆలయాలకు చెందిన ప్రధాన అర్చకులు, కానుకలు-పూలగుత్తులు-శాలువాలతో చినముషిడివాడలోని ఆయన ఆశ్రమానికి వెళ్లే బాధ తప్పింది.

అసలు  ఇది వివాదం అయిన వెంటనే ప్రభుత్వమే స్పందించి, దిద్దుబాటుకు దిగాల్సి ఉంది. కానీ పనిచేయలేదు. ఈ వ్యవహారాలేమీ సీఎంఓకు సైతం తెలియదన్నది మరో వార్త. అదంతా, స్వామి ప్రియ శిష్యుడు-ఆయనతో లబ్థిపొందిన ఓ దేవదాయ శాఖాధికారి అత్యుత్సాహంతో ఇచ్చిన ఉత్తర్వు అది. సూటిగా చెప్పాలంటే దానితో ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక శాఖ ఇచ్చిన సర్క్యులర్‌గానే దానిని చూడవలసి ఉంది.  నిజానికి.. చంద్రబాబు హయాంలోనూ పీఠం ఇలాగే లేఖ రాసింది. కానీ అప్పటి అధికారులు దానిని పరిశీలించమని చెప్పారే తప్ప, ఆదేశాలివ్వలేదు. పీఠాథిపతుల జన్మదినం రోజున ప్రభుత్వం తరఫున ఆలయ అర్చకులు వెళ్లి, గౌరవించే సంప్రదాయం వైఎస్ హయాంలోనే ప్రారంభమయింది. ఆయన ఏర్పాటుచేసిన ధార్మిక పరిషత్, ఆ వ్యవహారాలను సమీక్షించేది. అప్పటినుంచి ఆ సంప్రదాయం, గత చంద్రబాబు సర్కారు హయాం వరకూ  విజయవంతంగా కొనసాగుతోంది.

కాకపోతే.. విశాఖ పీఠ యాజమాన్యమే అతి చేసి, దానిని వివాదంగా మార్చుకుంది. ఎలాగూ ధార్మిక పరిషత్ అలాంటి వెసులుబాటు, గౌరవం ఇచ్చింది కాబట్టి,  ప్రత్యేకించి లేఖలు రాయాల్సిన అవసరమే లేదు. కానీ, ‘ఇది తాను చెప్పినట్లు వినే  ప్రభుత్వం’ అన్న భావన జీర్ణించుకుని, అత్యుత్సాహం ప్రదర్శించడమే పీఠం పరువు తీసినట్టయింది. ఒక పీఠం వ్యవహారాల గురించి హైకోర్టుకెక్కడం, తాను రాసిన లేఖను ఉపసంహరించుకున్నట్లు పీఠంతోపాటు- దేవదాయ శాఖ కోర్టుకు చెప్పడం చరిత్రలో ఇదే ప్రథమం.

తాజా వివాదంపై వైసీపీ నేతలు తలపట్టుకుంటున్నారు. విశాఖ స్వామి వ్యవహారం పార్టీ-ప్రభుత్వానికి చేటు తెస్తోందని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలు.. ఆధ్మాత్మిక అంశాల్లో స్వామి భుజం మీద నుంచి, జగన్‌పై గురిపెడుతున్నారని విశ్లేషిస్తున్నారు. దానిని విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తప్ప, మరెవరూ తిప్పికొట్టలేకపోతున్నారని గుర్తు చేస్తున్నారు.   తాజా విమర్శల నేపథ్యంలో విష్ణు ఒక్కరే తెరపైకి, బాబు హయాంలోనూ అలాంటి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఎన్నికల్లో తనను గెలిపించేందుకు సాయం చేసినందుకు కృతజ్ఞతగా,  ఓ పీఠానికి మరీ ఇంత సాగిలపడటం,  ప్రభుత్వ ప్రతిష్ఠకూ  మంచిదికాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో విశాఖ స్వామి ఇమేజ్ బాగా డ్యామేజీ అవుతుండటం, పరోక్షంగా అది జగన్ ఇమేజీకి నష్టమేనని విశ్లేషిస్తున్నారు. జగన్ ఇచ్చిన స్వేచ్ఛ వల్ల.. మంత్రులు,ఎమ్మెల్యేలతోపాటు.. పార్టీ అగ్రనేతలు, వ్యాపారస్తులు, చివరకు అధికారులు కూడా ఆశ్రమం ఆశీస్సులు పొందేందుకు ఎగబడుతున్న దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.