మరణాలకు మతమేమిటి..వీర్రాజా?

329

విశాఖ పీఠం, టీటీడీ కేసుపై పెదవి విప్పరేం?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

చావులో విషాదం చూస్తాం. గుండెలోతుల్లో దాగున్న బడబాగ్ని చూస్తాం. ఆ కుటుంబాలు పడే వేదన- ఆవేదన-ఆర్తి చూస్తాం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. ఎంత కఠిన పాషాణ హృదయులకయినా, మానవత్వం అనేది ఉంటుంది. అందుకే మనసున్న మనుషులెవరూ చావును విషాదంగానే భావిస్తారు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం దీనికి భిన్నం. మరణంలోనూ మతాన్ని దర్శించే మహా రాజకీయ దార్శనికుడాయన. అందుకు నంద్యాలలో జరిగిన ఓ ముస్లిం కుటుంబ సామూహిక ఆత్మహత్య నిదర్శనం.

ప్రాణాలు ఎవరికి చేదు? ఎవరు మాత్రం కోరి మృత్యు ఒడిలోకి వెళతారు? ఆత్మహత్య చేసుకోవడానికి చాలా గుండె ధైర్యం కావాలి. దానికి ఎవరూ సిద్ధపడరు. చిన్న రోగం వస్తేనే హైరానా పడతారు. కరోనా వస్తే, తమ ప్రాణాలు కాపాడుకునేందుకు, పరాయి రాష్ర్టాలకు పరుగులు తీసిన మంత్రులు, ఎమ్మెల్యేలను చూస్తూనే ఉన్నాం. అదీ ప్రాణభయమంటే. కానీ ప్రాణాలు కూడా పోగొట్టుకునేందుకు ఓ చిన్న కుటుంబం సిద్ధపడిందంటే.. వారి గుండెకయిన గాయం, అతి పెద్దదయి ఉండాలి. తిన్న ఎదురుదెబ్బలతో, మనిషి ఆత్మస్థైర్యాన్ని చంపేంత పెద్దదయినా ఉండాలి. వ్యక్తులు, లేదా వ్యవస్థ చేతులో ఎదురయిన అవమానభారం తాలూకు, విషాదజ్ఞాపకాలయినా అందుకు కారణమయి ఉండాలి. దీనికి కులాలు-మతాలతో సంబంధం లేదు. మరణానికి కులం-మతంతో పనిలేదు. మృత్యువు అందరికీ సమానమే. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నంద్యాలలో ముస్లిం కుటుంబ సామూహిక ఆత్మహత్యానంతర పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పరువు-ప్రతిష్ఠను పెంచాయా? తుంచాయా అన్నది ఓసారి చూద్దాం.

నంద్యాలలో ఓ ముస్లిం కుటుంబం.. పోలీసుల వేధింపులకు నిరసనగా రైలుకింద పడి సామూహిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆ కుటుంబం ఓ సెల్ఫీ తీసింది. తమ ఆత్మహత్యలకు కారణం ఫలానా పోలీసులే కారణమని చెప్పి, ఆత్మహత్య చేసుకుంది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫలితంగా సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై సర్కారు కేసు పెట్టి అరెస్టు చేసి, జైలుకు పంపింది. అయితే, సరైన సెక్షన్లు నమోదుచేయకపోవడంతో, స్థానిక కోర్టు పోలీసులకు బెయిల్ ఇచ్చింది. దానిపై ఎస్పీ స్పందించి, పోలీసులకు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ, పైకోర్టుకు వెళతామని చెప్పారు. ఈ విషయంలో సీఎం జగన్ కూడా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని, పోలీసుల బెయిల్ రద్దు చేయించాలని ఆదేశించారు. కేసులోని తీవ్రత-విషాదం దృష్ట్యా జగన్ సర్కారు, డీజీపీ వాయువేగంతో స్పందించడాన్ని సమాజం హర్షించింది. ఇంతవరకూ అందరికీ తెలిసిన కథే ఇది.  శహభాష్…సీఎం!

తాజాగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఈ వ్యవహారాన్ని మతంతో ముడిపెట్టడమే అమానవీయం. ఆత్మహత్య చేసుకున్న కుటుంబమేమీ, ఆ వ్యవహారాన్ని పబ్లిసిటీకి వాడుకోలేదు. తమ ప్రాణాలు పణంగా పెట్టి, సెల్ఫీ తర్వాత నిజంగానే మృతువును ఆహ్వానించింది. తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని బాధితులు చెప్పిన దానినే సర్కారు పరిగణనలోకి తీసుకుంది. ఆ మేరకే పోలీసులను అరెస్టు చేసింది. దాన్ని వీర్రాజు తప్పుపట్టడమే ఆశ్చర్యం. ‘‘ ముస్లింలు కోరగనే డ్యూటీలో ఉన్న పోలీసులను జగన్ అరెస్టు చేయిస్తున్నారు. పోలీసులకు టీడీపీ బెయిల్ ఇప్పించి, చంద్రబాబు ముస్లింలను సమీకరించి ఉద్యమాలు చేయిస్తున్నారు. హిందువులెవరూ ఓటర్లు కాదా?. ఆ రెండు పార్టీలకు ముస్లిం ఓట్లు చాలా? మనమెవ్వరం మనుషులం కాదా? రాష్ట్రంలో హిందువులు, ఇతర కులాలు వద్దు. ఎంత దారుణం’’ ఇదీ వీర్రాజు గారి ప్రసంగంలో దొర్లిన ఆణిముత్యాలు. పైగా అంతర్వేది ఘటనపై మేం స్పందిస్తే, మాది మతత్వ పార్టీ అన్న వాళ్లు.. ఇప్పుడు చేస్తున్నది ఏంటని కూడా ప్రశ్నించారు.

అంటే సోము కవిహృదయమమేమిటంటే.. టీడీపీనే నిందితులయిన పోలీసులకు బెయిలిప్పించింది. అంటే ఆ కేసు విచారించిన కోర్టు ఎలాంటి విచారణ చేపట్టకుండా, టీడీపీ అడిగిన వెంటనే బెయిలిచ్చేసిందని అనుకోవాలా? ఇక ముస్లింలు కోరగనే జగన్ పోలీసులను అరెస్టు చేశారట. అంటే ఒక సీఎంకు అంతకుమించిన పనులేవీ లేవన్న మాట! సరే.. అంతర్వేది, టీటీడీ ఘటనలపై తామేదే పోరాటాలు చేశారని సోమన్న చెప్పుకోవడమే వింత. నిజానికి, అంతర్వేది ఘటనలో తొలుత స్పందించింది స్థానికులు, అగ్నికుల క్షత్రియులు మాత్రమే. ఆ తర్వాత టీడీపీ, హిందూ మహాసభ, కాంగ్రెస్ నేతలు వెళ్లారు. అప్పటికీ బీజేపీ నేతలు భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. సినిమాలో ఫైటింగ్ సీనంతా అయ్యాక, చివరాఖరలో పోలీసులు వచ్చినట్లు, బీజేపీ నేతలు చివరలో కనిపించారు. అంత ర్వేది కేసు సీబీఐకి అప్పచెప్పిన తర్వాత, దాని పురోగతి ఏమిటన్నది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రశ్నించిన పాపాన పోలేదు.

ఇక టీటీడీ వ్యవహారాలపైనా, బీజేపీ స్వరం ఇప్పటికీ బలహీనమే. ఇప్పుడు పోయిందంటున్న శ్రీవారి పింక్ డైమండ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఆర్నెల్లలో దాని గురించి వీర్రాజు ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. విజయసాయిరెడ్డి-రమణ దీక్షితులుపై, టీటీడీ పరువునష్టం కేసు ఎందుకు ఉపసంహరించుకుందని గర్జించిన దాఖలాలు లేవు. పింక్ డైమండును తేల్చాలని పట్టుపట్టిన సందర్భాలు లేవు. ఇక విశాఖ పీఠాథిపతి అతిపై హిందూసమాజమే తిరగబడుతోంది. ఆయన మఠం అతిచేష్ఠలపై హిందువులే నవ్వుకుంటున్నారు. దానిపై మీడియాలో చర్చ జరుగుతుంటే, హిందూ సామ్రాజ్యాధిపతిగా భావిస్తున్న వీర్రాజు.. ఆ ఆధ్యాత్మిక తప్పిదాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు? అప్ప ఆర్భాటమే గానీ బావ బతికుంది లేదన్నట్లు… ఎంత హిందూకార్డు వాడాలని ప్రయత్నించినా,‘ విషయం’ లేకపోతే.. ఏ కార్డయినా చిరునామా లేని పోస్టు కార్డులాంటిదేనంటున్నారు. ఇంతకూ… టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడిగినట్లు… ఈ వ్యాఖ్యలు సోము వీర్రాజు వ్యక్తిగతమా? పార్టీ పరమైనదా అన్నదే చెప్పాలి.

అన్నట్లు… మతం- మత రాజకీయాల గురించి మాట్లాడుతున్న వీరన్న వ్యాఖ్యలపై, ఇప్పుడు ‘కులవాదులు’ కొత్త సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో అరెస్టయిన సీఐ తమ సామాజికవర్గానికి చెందిన వారే కాబట్టి, ఆయనను రక్షించేందుకు మతం ముసుగులో.. వీర్రాజు ‘కుల రాజకీయాలు’ చేస్తున్నారన్నది కులవాదుల అనుమానం. నిజం నారాయణుడికెరుక?