భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాబాయ్

752

స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అనేక సంవత్సరాల పాటు మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ  తలమానికంగా భారతదేశాన్ని నిలబెట్టి దేశ ప్రజలంతా గర్వంగా మనది ‘అభివృద్ధి చెందిన దేశం‘ అని చెప్పుకునేలా చేసిన ఘనత భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు, వీటికి కేంద్రంగా ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు దక్కుతుంది. 2017 ఫిబ్రవరి 15వ తేదీన ఇస్రో లాంచ్ చేసిన PSLV C37  ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపటం ఒక ప్రపంచ రికార్డు. వీటిలో 101 శాటిలైట్లు విదేశాలకు చెందినవి కాగా అందులో 80కి పైగా అంతరిక్ష పరిశోధనలు అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికావి.

ఇటువంటి అనేక ఘనతలు సాధించిన మన దేశపు  అంతరిక్ష రంగం యొక్క ఈ విజయాల వెనుక హోమి జహంగీర్ బాబా, విక్రమ్ సారాబాయ్, అబ్దుల్ కలాం వంటి ఎందరో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కృషి ఉన్నది. వీరిలో ‘విక్రమ్ సారాబాయ్‘ ని భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు లేదా ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‘ అని  పిలుచుకుంటున్నాము. ఈ సంవత్సరం వారి శత జయంతి సంవత్సరం. అంతేకాక సారాబాయ్ స్థాపించిన ఇస్రోకు 50 సంవత్సరాలు. ఈ సందర్భంగా విక్రమ్ సారాబాయ్ జీవిత విశేషాలు, అంతరిక్ష పరిశోధనలో వారి కృషి రేఖామాత్రంగా వివరించే ప్రయత్నం చేద్దాం.

అది 1948 వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన. అప్పుడు సారాబాయి అహ్మదాబాద్లో మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు అనుబంధంగా ఉన్న ఒక చిన్న పరిశోధన సంస్థలో అధ్యాపకునిగా ఉన్నారు. ఆరోజు సారాబాయ్ ల్యాబ్ కు వచ్చేసరికి తన పరిశోధన విద్యార్థులంతా గుమికూడి ఉన్నారు. ఒక విద్యార్థి ముందుకు వచ్చి ‘సార్ ఎలక్ట్రిక్ మీటర్ పాడైపోయింది. దానికి కారణం నేనే. ఎక్కువ కరెంట్ పంపించడం వల్ల అలా జరిగింది సార్‘ అని భయపడుతూ చెప్పాడు. అతనితో సారాభాయ్ “అంతేనా దాని గురించి అంతగా విచారించకండి. పొరపాటు చేయనిదే విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు? ఇకముందు మరికాస్త జాగ్రత్తగా ఉండండి.‘ అని సముదాయించారు. సారాబాయ్ కి దేశంలో పరిశోధనలలో జరగాల్సిన అభివృద్ధి, అందుకు కావలసిన మెరికల్లాంటి యువ విద్యార్థులను ఎంపిక చేసి ప్రోత్సహించటం పట్ల ఉన్న శ్రద్ధ ఈ సంఘటన ద్వారా మనకు అర్థం అవుతుంది. అబ్దుల్ కలాం లాంటి‘  మిస్సైల్ మాన్‘ ను గుర్తించి అందించిన దూరదృష్టి సారాబాయ్ ది.

విక్రమ్ సారాబాయ్ పూర్తి పేరు విక్రమ్ అంబాలాల్ సారాబాయ్. ఆగస్ట్ 12, 1919న విక్రమ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించారు. తండ్రి అంబాలాల్ సారాబాయ్,  తల్లి సరళాదేవి. వీరిది సంపన్న కుటుంబం. అంబాలాల్ అహ్మదాబాద్ లో పారిశ్రామికవేత్త. వీరికున్న ఎనిమిది మంది సంతానంలో విక్రమ్ ఒకరు. వీరి కుటుంబం స్వాతంత్రోద్యమంలో చురుకుగా ఉండటం వల్ల వారి ఇంటికి మోతిలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీజీ వంటి మహామహులు వస్తూ ఉండేవారు. వీరి ప్రభావం విక్రమ్ పై బాగానే ఉంది. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు సంవత్సరాల విక్రమ్ ను చూసి ఈ బాలుడు గొప్పవాడు అవుతాడు అని జోస్యం చెప్పారు. వారి ఇంట్లోనే మాంటిస్సోరీ విధానంలో ఒక పాఠశాలను ప్రారంభించారు సరళాదేవి. విక్రమ్ చిన్నప్పుడు చదువులోనే కాకుండా అల్లరిలో కూడా ముందుండేవాడు. సైకిల్ పై చేతులు వదిలేసి విన్యాసాలు చేయడం, ఇంటి ఆవరణలోని కొలనులో ఈదటం విక్రంకు బాగా ఇష్టమైన ఆటలు.

అలా విక్రమ్ విద్యాభ్యాసం కొంత పెద్ద కాన్వెంట్ లలో తరువాత కళాశాల విద్య కోసం ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం లో చేరాడు. అలా 1940 వ సంవత్సరంలో నేచురల్ సైన్సెస్ లో డిగ్రీ పూర్తి చేసాడు. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలవడంతో తిరిగి భారత్ వచ్చేశాడు. వెంటనే బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో లెక్చరర్ గా చేరాడు. అప్పుడు భారతదేశపు నోబెల్ బహుమతి గ్రహీత సి. వి.రామన్ డైరెక్టర్ గా ఉన్నారు. అక్కడే మరో మహా శాస్త్రవేత్త  హోమి జహంగీర్ బాబా కూడా ఉన్నారు. ఇంకేముంది ఒకవైపు నోబెల్ గ్రహీత, మరొకవైపు జీవితమంతా దేశ సేవకి అంకితం చేయాలని సంకల్పించిన హోమీ బాబా. ఆ విధంగా వారి సాంగత్యంలో భారత అంతరిక్ష రంగం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు కారణమైన విక్రమ్ సారాభాయ్ తొలి అడుగులు పడ్డాయి.

అక్కడే విశ్వ కిరణాలపై రీసెర్చి ప్రారంభించాడు విక్రమ్. ఆ రోజుల్లో అంతరిక్ష పరిశోధనలు కొద్ది దేశాలు మాత్రమే చేస్తున్నాయి. 1942లో IISC  బెంగుళూరులో విక్రమ్ సారాభాయ్ వెలువరించిన తన తొలి పరిశోధన పత్రం( (‘Periodical variation of the intensity of the cosmic rays)’ కాలానుగుణంగా విశ్వ కిరణాలలో వచ్చే మార్పులు‘ అనే అంశంపై) ను ప్రచురించారు.

1944లో మొదటి ప్రపంచ యుద్ధం ముగియటంతో మళ్లీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పి హెచ్ డి లో చేరాడు.1947లో పి హెచ్ డి పట్టా పొంది, అప్పుడే స్వేచ్ఛను పొందిన భారత్లో అడుగు పెట్టాడు. వెంటనే అహ్మదాబాద్ లోని మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు అనుబంధంగా, స్వంతంగా ఒక చిన్న ల్యాబొరేటరీ ని స్థాపించి పరిశోధనలు ప్రారంభించడమే కాక దేశంలోని అనేకమంది ఆణిముత్యాల వంటి యువ విద్యార్థులను అక్కడికి తీసుకు వచ్చాడు. 1948లో హోమీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ‘ఆటమిక్ ఎనర్జీ కమీషన్‘ ను ఏర్పాటు చేసింది. కానీ 1954లో బాబా చైర్మన్ గా‘ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ‘ DAE ను ఏర్పాటు చేశాక మాత్రమే అంతరిక్ష పరిశోధనకు నిధులు కేటాయించారు. దీని వెనుక బాబా, సారాబాయ్ ల కృషి ఎంతో ఉంది.1957లో సోవియట్ రష్యా ప్రపంచంలోనే తొలిసారిగా‘ స్పుత్నిక్‘ అనే కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించి విజయం సాధించింది. ఈ ఉపగ్రహం ఇరవై రెండు రోజుల పాటు పనిచేసి భూమికి సమాచారాన్ని అందించి ఆ తరువాత దానిలో ఉంచిన బ్యాటరీ అయిపోవడంతో పనిచేయటం ఆగిపోయింది.

అప్పటివరకు అణుశక్తి పై పరిశోధనలు విస్తృతంగా చేస్తున్న ప్రపంచ దేశాలన్నీ అంతరిక్ష రంగం పై దృష్టిసారించాయి. విక్రమ్ సారాబాయ్ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కలిసి అంతరిక్ష పరిశోధన ఫలితాలు సాధారణ ప్రజల అవసరాలను ఏ విధంగా తీరుస్తాయో, వివిధ దేశీయ అవసరాల కోసం ఎలా ఉపయోగపడుతుందో వివరించి, అంతరిక్ష పరిశోధనల కోసం స్వీయ సారథ్యంలో 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCoSpaR) ఏర్పాటు చేయడం జరిగింది. అలా విక్రమ్ సారాబాయ్ స్పేస్ రీసెర్చ్ కు పునాదులు వేశారు. “మింగటానికి మెతుకులు లేవు గాని మీసాలకు సంపెంగె నూనె కావాలి అన్నట్టు, ఈ దేశానికి అంతరిక్ష పరిశోధన అవసరమా?” అని అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా ఇతర దేశాలు ఎత్తి పొడిచాయి. కానీ నెహ్రు, బాబా, సారాబాయ్ లు లక్ష్యం స్పష్టంగా తమ ముందు ఉంచుకొని ముందుకెళ్లారు. అంతకుముందే స్పేస్ ప్రోగ్రాంలో పరిశోధనలను ప్రారంభించి భావి భారత శాస్త్రవేత్తలను ప్రోత్సహించి, అబ్దుల్ కలాం వంటి వారిని ముందుకు తీసుకు వచ్చారు. ఆ విధంగా INCoSpaR లో భాగంగా పరిశోధన ఫలితాలను పరీక్షించడానికి ఒక రాకెట్ అవసరమైంది. దాని కోసం అమెరికా నుండి ‘నైకీ అపాచీ‘ అనే సౌండింగ్ రాకెట్ ను 6 వేల డాలర్ల కు కొనుగోలు చేశారు. ఇప్పుడు దాన్ని పరీక్షించడానికి అనువైన స్థలం కోసం కేరళ లోని తుంబ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. తుంబ మీద నుండి భూ అయస్కాంత కేంద్ర రేఖ వెళ్తుంది.1963 నవంబర్ 21వ తేదీన ఈ సౌండింగ్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు. అయితే ఆ రాకెట్ ను లాంచింగ్ సెంటర్ కు ఒక సైకిల్ పై తీసుకెళ్లటం జరిగింది. ఈ ఫోటోను అప్పట్లో వివిధ దేశాల పత్రికల్లో ప్రచురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. విజయవంతంగా తొలి అడుగు పడింది. ఇంతలోనే 1966 జనవరి 24వ తేదీన ఒక విమాన ప్రమాదంలో హోమీ బాబా పరమపదించడం ఒక పెద్ద దెబ్బ. ఆ తర్వాత భారత అణు – అంతరిక్ష కార్యక్రమాలకు సారథ్యం వహించడం విక్రమ్ సారాబాయ్ వంతు అయ్యింది.1967లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా, విక్రమ్ సారాబాయ్ ఆధ్వర్యంలో మన దేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి సౌండింగ్ రాకెట్‘ రోహిణి‘ ని విజయవంతంగా ప్రయోగించటం జరిగింది.

ఆ తరువాత 1969లో విక్రమ్ సారాభాయ్ INCoSpaR ను ‘ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‘ (ఇస్రో) గా మార్చారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యం. విక్రమ్ సారాబాయ్ ఇస్రోకు తొలి చైర్మన్ గా రాబోయే పది సంవత్సరాలకు ప్రణాళికను తన యువ శాస్త్రవేత్తల బృందానికి ఇచ్చారు. ఈ బృందంలో సతీష్ ధావన్, అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. దీనిలో భాగంగా ఈ పరిజ్ఞానం గ్రామీణ, పట్టణ ప్రజలకు ఎలా ఉపయోగపడగలదో, ఆ దిశలో ఆలోచనలు చేయడం, వ్యవసాయం, ఖనిజాల అన్వేషణ, విద్య, వైద్యం తదితర రంగాలు, రక్షణ అవసరాల కోసం టెక్నాలజీని అభివృద్ధి చేయడం మొదలైన ముఖ్య లక్ష్యాలున్నాయి. ఆ విధంగా మన అంతరిక్ష పరిశోధన దేశీయంగా ఉపగ్రహాలను తయారు చేసే  దిశలో అడుగులు పడుతున్నప్పుడే 1971 లో రష్యా దేశపు రాకెట్ లాంచింగ్ ను మన దేశంలోని తుంబాలో చేయ తలపెట్టారు. ఆ కార్యక్రమానికి విక్రమ్ సారాబాయ్ కూడా అతిథిగా హాజరయ్యారు. 31 డిసెంబర్ 1971 రోజున తుంబ వెళ్లారు సారాభాయ్. ఆరోజు రాత్రి అక్కడ ఒక రిసార్ట్ లో బసచేశారు.1972 జనవరి 1 నాడు ఉదయం నిద్రలోనే ఆయన తుది శ్వాస వదిలారు.

భారత అంతరిక్ష కార్యక్రమ పితామహునిగా ఆయన స్థాయి మహోన్నతమైనది. అంతేకాక వారు తన వ్యక్తిత్వంతో అనేకమందిని ప్రభావితం చేశారు. ఆయన వినయశీలత, నిరాడంబరత, స్నేహభావం ఆయన స్థాయిని మరింతగా పెంచాయి. తనతో పనిచేసేవారు అందరిని సమానంగా చూడడం, ప్రేమగా సంభాషించడం వారి ప్రత్యేకత. ఒకసారి తన కార్యాలయ ఆవరణలో ఒక సాధారణ ఉద్యోగి ఒక బరువైన పెట్టెను లాగలేక పోతుంటే అటుగా వెళ్తున్న సారాభాయ్ వెనక నుండి బండిని తోయటం… ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో సాధారణం. పరిశోధనా విద్యార్థులతో, తన తోటి బృందంతో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపేవారు.

భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచంలోని అగ్రగామి గా నాటి రోహిణి నుండి నేటి చంద్రయాన్-2 వరకు అప్రతిహతంగా మన విజయపరంపర కొనసాగడానికి ఆయన బంగారు బాటను పరిచారు. భారత ప్రభుత్వం 1962లో ‘శాంతిస్వరూప్ భట్నాగర్‘ అవార్డు ను, 1966లో ‘పద్మభూషణ్ ‘పురస్కారాలను ప్రదానం చేసింది. భారత్ ప్రభుత్వం 1972లో ఆయన మరణానంతరం ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో ఆయనను గౌరవించుకుంది.

విక్రమ్ సారాబాయ్ శతజయంతి ఉత్సవాలను మనం జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో మనం విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-2 లో చంద్రునిపై దిగే ల్యాండర్ పేరు‘ విక్రమ్‘ గా నామకరణం చేసి వారికి ఇస్రో నివాళులర్పించింది.

“విజ్ఞాన భారతి” అనే స్వదేశీ సైన్సు ఉద్యమ సంస్థ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే రాష్ట్రస్థాయి‘ సైన్స్ ప్రతిభా పరీక్ష- కౌశల్‘ లో ఈ సంవత్సరం ఇస్రో అంశాన్ని కూడా ప్రత్యేకంగా ఉంచింది.

ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి విక్రమ్ సారాబాయ్ జీవితాన్ని, వారి పరిశోధనల వివరాలను అధ్యయనం చేయడం అత్యంత స్ఫూర్తిదాయకం. విద్యాలయాలలో ఈ అంశంపై పోటీలు నిర్వహించడం చేస్తే భావి శాస్త్రవేత్తలైన మన విద్యార్థులు దేశం కోసం పనిచేయాలనే దృక్పధాన్ని మనసులలో మననం చేసుకుంటారు.

జై భారత్- జై విజ్ఞాన్.

                      – పూడి వెంకట ప్రసాద్

(సైన్సు ఉపాధ్యాయులు, నెల్లూరు జిల్లా)