‘గ్రేటర్’లో బీజేపీ ‘పంచ’తంత్రం!

672

సంజయ సారథ్యంలో కమలం సమరోత్సాహం
చేరికలతో ఎన్నికల కోలాహలం
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే గందరగోళం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల యుద్ధానికి కమలదళం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు సంజయ్ సారథ్యంలో పంచతంత్రం ప్రణాళిక సిద్ధమవుతోంది. దుబ్బాక విజయోత్సాహంతో ఊపు మీదున్న కమలదళాలు, గ్రేటర్ ఎన్నికల్లో మేయర్‌ను పట్టేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సంజయ సారథ్యంలో గ్రేటర్‌లోని మెజారిటీ డివిజన్లను సాధించేందుకు ఐదుగురు అగ్రనేతలతో కమలదళం ఎన్నికల బరిలోకి దిగనుంది.

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బండి సంజయ్ సారథ్యంలోని కమలదళం, అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగుతోంది. ప్రస్తుతం రాజధాని నగరంలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే, నలుగురు కార్పొరేటర్లు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి గ్రేటర్‌పై పట్టు బిగించాలన్న పట్టుదలతో ఉన్న కమలదళానికి, ఇటీవలి దుబ్బాక విజయం ఒక టానిక్‌లా మారింది. దానికితోడు టీఆర్‌ఎస్-కాంగ్రెస్ నుంచి వరసగా చేరుతున్న వలసలతో, బీజేపీలో సమరోత్సాహం తొంగిచూస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మేయర్ బండ కార్తీక్‌రెడ్డి దంపతులు బీజేపీలో చేరనున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటరు కూడా కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పేసుకున్నారు.

వీరుకాకుండా, ఎన్నికల ముందు వరకూ మరింతమంది చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆ పార్టీలో జోష్‌ను పెంచుతోంది. దుబ్బాక విజయం తర్వాత, నగరంలో కూడా బీజేపీ ట్రెండ్ కొనసాగుతుందన్న అంచనాయే, ఈ వలసలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దానితో పోటీ చేసే ఆశావహ అభ్యర్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ ఉత్సాహం చూసి అగ్రనేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న, సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలో చేరికల సంఖ్య పెరుగుతోంది. టీఆర్‌ఎస్ అసమ్మతులపై ఆయన కన్నేయడంతో, నియోజకవర్గ స్థాయి నేతలు బీజేపీలో చేరేందుకు క్యూలు కడుతున్నారు.

ఇక గ్రేటర్‌పై కాషాయ జెండా ఎగుర వేయాలన్న కలను నిజం చేసేందుకు, పార్టీ దళపతి సంజయ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. కేంద్రమంతి కిషన్ రెడ్డి కన్వీనర్‌గా 23మందితో ఎన్నికల కమిటీని ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరిని ఇన్చార్జిగా నియమించారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారబరిలో సంజయ్‌తోపాటు, కిషన్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, డికె అరుణ దిగనున్నారు. వీరిలో అంతా ఫైర్‌బ్రాండ్లే. కేసీఆర్ సర్కారును దునుమాడేందుకు, ఈ పెద్దనోరు నేతలు రంగంలోకి దిగితే ఇక ఎన్నికల యుద్ధం అంతా ఆసక్తికరమే.

వీరిలో సంజయ్-అర్వింద్-అరుణ త్రయం సంగతి చెప్పనవసరం లేదు. ఈ ‘పంచ’తంత్రం ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచిచూడాలి. గత ఎన్నికల్లో బీజేపీ 3,46,253 ఓట్లతో 10.34 శాతం ఓట్లు సాధించింది. అయితే కేవలం నలుగురు కార్పొరేటరు సీట్లు మాత్రమే గెలిచింది. అంతకుముందు.. టీడీపీతో పొత్తులో పోటీచేసిన బీజేపీ డిప్యూటీ మేయర్, ఒక స్టాండింగ్ కమిటీ చైర్మన్‌తోపాటు 14 సీట్లు సాధించింది. ఆ సమయంలో బీజేపీ 5 ఎమ్మెల్యే స్థానాలు కూడా సాధించింది. టీడీపీతో తెగతెంపుల తర్వాత, బీజేపీ స్థానాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.

ఇప్పుడు మళ్లీ గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపధ్యంలో.. కనీసం 70 స్థానాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో, సంజయ దళం తీవ్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ప్రచార కమిటీతో సంజయ్ ప్రతిరోజూ భేటీ అవుతున్నారు. కిషన్‌రెడ్డి నగరంలోనే తిష్టవేశారు. ఏకంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పర్యవేక్షకుడిగా వస్తున్నారంటే, ఈ ఎన్నికలను బీజేపీ ఏ స్ధాయిలో ప్రతిష్ఠగా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు. కులాలు-ప్రాంతాలు-మతాల ప్రాతిపదికన ప్రచారంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు టీఆర్‌ఎస్ డివిజన్‌కు ఒక ఎమ్మెల్యేను పర్యవేక్షకుడిగా నియమిస్తున్న నేపథ్యంలో, బీజేపీ సైతం అందుకు దీటుగా నేతలను ఎంపిక చేస్తోంది. సెటిలర్లు ఉన్న డివిజన్లలో ప్రచారం చేసేందుకు, ఏపీ నుంచి పార్టీ అగ్రనేతలను తీసుకువచ్చే యోచన చేస్తున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ కాబట్టి, ఏపీ నేతలు ప్రచారానికి వస్తే ప్రాంతం ముద్ర పడే ప్రమాదం లేదు. కాగా కరోనా కష్టకాలంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సొంతంగా, తన 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పేదలను ఆదుకున్న వైనం కూడా, పార్టీకి కలసివస్తుందని నేతలు చెబుతున్నారు. కరోనా కాలంలో, కిషన్‌రెడ్డి భార్య వివిధ నియోజకవర్గాల్లో నిత్యావసర వస్తువులు సమకూర్చిన విషయం తెలిసిందే.

కాగా, గ్రేటర్‌లో పార్టీ విజయావకాశాలు పెరుగుతున్నందున.. టీఆర్‌ఎస్-కాంగ్రెస్-టిడిపి నుంచి చేరిన నేతలు టికెట్లకు పోటీ పడుతుండటంతో, అభ్యర్ధుల ఎంపిక క్లిష్టంగా మారుతోంది. దీర్ఘకాలం నుంచి పార్టీకి పనిచేస్తున్న వారిని కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి టికెట్లు ఇస్తే, అది గెలుపుపై ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. పైగా ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు, తమ సహజ లక్షణాల ప్రకారం కింది స్ధాయిలో పనిచేయకుండా.. కేవలం ఫ్లెక్సీలు, పత్రికా ప్రకటనలు, గతంలో తమ పార్టీల నుంచి బీజేపీలో చేరిన అగ్ర నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ, లాబీయింగ్‌కు తెరలేపడం కింది స్ధాయిలో గందరగోళానికి కారమవుతోంది. కొత్తగా చేరిన నేతల వల్ల, పార్టీలో ఎప్పుడూ లేనన్ని గ్రూపు రాజకీయాలు పెరిగాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే.. తొలి నుంచీ పనిచేస్తున్న కార్యకర్తలు- నేతల ఆత్మస్థైర్యం దెబ్బతిని, అది పరోక్షంగా పార్టీ ఓటమికి దారితీసే ప్రమాదం లేకపోలేదని పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సమస్యను నాయకత్వం, ఎలా పరిష్కరిస్తుందో చూడాలి!