ప్రపంచ పత్రికాస్వేచ్ఛా దినోత్సవమట..హ్హి..హ్హి…హ్హి!

668

సరాదాగా నవ్వుకుందాం.. రండి
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా.. చాలామంది ప్రముఖులు, జర్నలిస్టులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇంకోవైపు కరోనా సీజన్‌లో.. రొటీన్ సమావేశాల హడావిడి లేని జర్నలిస్టు సంఘ నేతలై పిడికిలి బిగించి, పాత్రికేయ స్వేచ్ఛ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సరే.. వాటి తాలూకు ఫొటోలు తప్పనిసరిగా జోడిస్తారనుకోండి. అసలు ఆ హడావిడే అందుకోసం కదా? ఈ బాపతు హడావిడి నేతలంతా బెజవాడలో బాగా కనిపిస్తుంటారు. అది వేరే విషయం. ఇంతమంది హడావిడి తర్వాతనే.. హమ్మయ్య.. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినమనేది ఒకటుందని తెలిసొచ్చింది.

ఏదేమైనా పత్రికకు స్వేచ్ఛ అనేది ఒకటుందని, ఇంకా గుర్తు చేసుకుంటున్నందుకు సంతోషం. ఈ సందర్భంగా మోతుబరి జర్నలిస్టు విప్లవ నేతలు, పాత్రికేయ లోకానికి కర్తవ్యబోధ చేయడం చూడముచ్చట. జర్నలిస్టుల హక్కుల కోసం తమ సంఘం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా, ‘రాజీ’ లేని పోరాటం (?) చేస్తోందని జర్నలిస్టు జాతి నేతాశ్రీలు, తమ భుజాలు తామే చరచుకున్నారు. పనిలోపనిగా తాము, జర్నలిస్టు లోకానికి ప్రసాదించిన హక్కులను ప్రచారం చేసుకున్నారు. ఇకపైనా రెట్టించిన పట్టుదలతో, పాత్రికేయ లోకాన్ని ఉద్ధరించేందుకు.. కంకణాలు-కడియాలు కట్టుకుని తిరుగుతామని మంగయ్య శపథం చేశారు. అవన్నీ వారి ‘నెలవారీ జోకుల మ్యాగజైన్ల’లో ఎలాగూ వస్తాయనుకోండి.

సంతోషం. అసలు పాత్రికేయ లోకాన్ని ఉద్ధరిస్తామంటే వద్దనేది ఎవరు? దానికి కాళ్లు-చేతులు అడ్డం పెట్టేవారెవరున్నారు? కాకపోతే… ఈ శపథాలు చేసే బాపతు, జర్నలిస్టు నేతలు పనిచేసే పత్రికల్లో జీతాలు తీసుకుంటున్నారా అన్నది ప్రశ్న. తాము పనిచేసే మీడియా సంస్థల్లోని జర్నలిస్టులకే జీతాలిప్పించలేని, ఈ మొహాలు.. మొత్తం హోల్‌సేల్‌గా జర్నలిస్టు జాతిని ఉద్ధరిస్తామని లెక్చరిస్తే, నమ్మడానికి జర్నలిస్టులు వెర్రిపుష్పాలా? కరోనా కాలంలో పేరుగొప్ప మీడియా సంస్థలు, జర్నలిస్టుల జీతాలు 30 నుంచి 40 శాతం వరకూ తెగ్గోశాయి.

మరికొన్ని పెద్ద సంస్థలు ఉద్యోగులను సగంమందిని తొలగించేశాయి. ఇంకో పెద్ద చరిత్ర ఉన్న తెలుగు పత్రికను, కరోనా పేరుతో మూసేశారు. మరి అదే కాంపౌండు నుంచి వచ్చే ఇంగ్లీషు పత్రికకు మాత్రం కరోనా సోకని కారణంగా, అది మాత్రం అచ్చవుతోంది. అదో విచిత్రం! సాక్షి, నమస్తే తెలంగాణ వంటి కొన్ని సంస్థలు మినహాయిస్తే.. మిగిలిన ఏ ఒక్క సంస్ధ జర్నలిస్టులకు పూర్తి జీతాలిస్తున్న పాపాన పోలేదు.

అబ్బో.. అక్కడి దాకా ఎందుకు? పొద్దున నిద్రలేస్తే, రాత్రి నిద్ర పోయే వరకూ కార్మిక హ క్కులంటూ, హాహాకారాలు చేసి.. ఇల్లెక్కి కూసే ‘కమ్యూనిస్టుల మీడియా కోళ్లు’ కూడా ఆ బాపతు జాబితాలోనే చేరిపోవడం హాశ్చర్యం.
కమ్యూనిస్టుల అనుబంధ మీడియా సంస్థల్లో కూడా 30 శాతం జీతాలు కోసి, సగానికిపైగా సిబ్బందిని పీకేశారట. మరి పొద్దునలేస్తే చెప్పే కార్మిక హక్కుల కబుర్లు, పెట్టుబడి దారీ నియంతృత్వ విధానాలు ఏమయినట్లు? వాటిని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సెల్లార్‌లో ఏ మూలన మూటకట్టి ఉంచినట్లు? ఇక జర్నలిస్టు మోతుబరి నేతలే మీడియా సంస్థలు పెట్టి, జీతాలు తెగ కోస్తున్న ముచ్చట తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. మరి ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కహానీలు ఎవరి కళ్లు తుడిచేందుకు నాయకా?

తమ సంస్థల్లో తమతో పనిచేసే జర్నలిస్టులకే జీతాలు ఇప్పించుకోలేని ఈ బాపతు మహానాయకులు, జర్నల్రిస్టు జాతిని ఉద్ధరిస్తామని చెప్పడం వెటకారంగా లేదూ? ఇవీ ఈ బాపతు జర్నలిస్టు జాతి ‘ఉత్తరకుమార’ నేతల డాంబికాలు. ఇక నిన్నా మొన్నటి వరకూ.. జర్నలిస్టు జాతిని ఉద్ధరించేందుకు అవతరించిన, మరికొందరు నేతాశ్రీలయితే ఇప్పుడు సర్కారీ పల్లకీమోసే పనిలో ఉన్నారు. వారిప్పుడు సర్కారీ సలహాదార్లయినందున.. జర్నలిస్టుల గురించి ఆలోచించే తీరిక, ఓపిక లేకపోవడం సహజమే. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ర్టాల్లో, జర్నలిస్టులపై కేసులు బనాయించి, స్టేషన్లలో గంటలతరబడి కూర్చోబెటట్టిన అరాచక చర్యలపై జర్నలిస్టు సంఘాలేవీ.. ఒక్క గొంతుకతో సామూహిక నిరసన ప్రకటించిన పాపాన పోలేదు. మరి ఈ సంఘాలు ఉన్నవి ఎందుకు? పాలకుల వద్ద పైరవీలు చేసుకోవడానికా?

పాపం ఇంకా అల్లం నారాయణ వంటి పిచ్చికాలపు మాజీ జర్నలిస్టు, ప్రెస్‌అకాడమీ నిధులను, చైర్మన్ హోదాలో జర్నలిస్టులకు ఆపత్కాలంలో వెచ్చిస్తున్నారు. అయినా తెలుగు రాష్ర్టాల్లో.. యాజమాన్య స్వేచ్ఛ తప్ప, పాత్రికేయ స్వాతంత్య్రానికి నిలువు పాతరేసి చాలా కాలమయిందన్న విషయం.. ఈ జర్నలిస్టు జాతి నేతాశ్రీలకు తెలియకపోవడమే ఈ శతాబ్దపు జోక్. కాదంటారా?