శబరిమల భక్తులకు నూతన మార్గదర్శకాలు..!

99

శబరిమలలో మండల పూజ డిసెంబర్ 26 వరకు జరగనున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులోభాగంగానే వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకోని భక్తులను అనుమతించరు. వారంలో ఐదు రోజులు రోజూ 1,000 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. శనివారం, ఆదివారం మాత్రం 2,000 చొప్పున భక్తుల్ని అనుమటించనున్నారు.

ఇక మండల-మకరవిలక్కు పూజ సందర్భాల్లో దర్శనానికి 5,000 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే డిసెంబర్ వరకు క్యూ స్లాట్స్ బుక్ అయ్యాయి.నవంబర్, జనవరిలో కొన్ని స్లాట్స్ మిగిలే ఉన్నాయి. 2020 నవంబర్ 16 నుంచి 2020 డిసెంబర్ 26 వరకు మండల పూజ, 2020 డిసెంబర్ 30 నుంచి 2021 జనవరి 20 వరకు మకరవిలక్కు పూజ, 2021 జనవరి 14న మకరవిలక్కు జరుపుకొంటారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు తాజాగా కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్-19 నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి.

అది కూడా గత 24గంటల్లో తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలి. మెడికల్ ఇన్స్యూరెన్స్ కార్డు తప్పనిసరి. భక్తులదంరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. ఇక ఈసారి పంబ నదిలో స్నానాలకు అనుమతి లేదు. భక్తులకు స్నానాల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు పంబలో ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేస్తోంది.  పంబలో లేదా సన్నిధానంలో భక్తులు బస చేసేందుకు అనుమతి లేదు. నీలక్కల్ దగ్గర పరిమితంగా బస ఏర్పాట్లు ఉంటాయి. స్వామి అయ్యప్పన్ రోడ్డు ద్వారానే ట్రెక్కింగ్‌కు అనుమతి ఉంది. సన్నిధానం దగ్గర నెయ్యాభిషేకం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి.  భక్తులను పంబకు తీసుకెళ్లి తిరిగి నీలక్కల్‌కు తీసుకొచ్చేందుకు లైట్ మోటార్ వెహికిల్స్ అందుబాటులో ఉంటాయి.