ఓట్ల బిచ్చగాడిగా మారిన కేటీఆర్:డా.దాసోజు శ్రవణ్

134

టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు
ప్రజల్ని ఓటు వేసే యంత్రంలా చూస్తున్న కేటీఆర్
దుబ్బాక మాదిరిగానే జీహెచ్ఏంసీలో టీఆర్ఎస్ ని ఓటర్లు పాతాళంలోకి తోక్కేయడం ఖాయం
భాదితులని అప్లికేషన్ కోరడం సరికాదు .. ప్రభుత్వం బాధితుల దగ్గరికి వెళ్ళాలి
డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు,  జీహెచ్ఎంసీ  అధికారులు, రెవెన్యూ సిబ్బందికి న్యాయం జరగాలి
ఆస్తిపన్నుని పూర్తిగా రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ ని రద్దు చేసిన తర్వాతే ప్రజల వద్దకు రావాలి.

”మంత్రి కేటీఆర్ ఓట్ల బిచ్చగాడిగా మారారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఆఘమేఘాల మీద మీటింగ్ పెట్టి ఆస్తి పన్నుపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడం ఓట్ల ఎరలో భాగమని విమర్శించారు దాసోజు. ఈ రోజు గాంధీ భవన్ లో నిర్వహించని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో లో ఓటర్ల దెబ్బకి కేసీఆర్ అండ్ కో. మైండ్ బ్లాంక్ అయ్యిందని, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ లో కూడా అదే సీన్ రిపీట్ కాబోతుందని గ్రహించిన కేటీఆర్ .. ఓట్ల బిచ్చగాడిగా మారి ఎర సిద్దం చేస్తున్నారని, 50 శాతం ఆస్తి పన్ను రాయితీ, శానిటరీ కార్మికులకు జీతాలు, వరద బాదితులని కొత్తగా అప్లికేషన్ పెట్టమని చెప్పడం.. ఇవన్నీ ఓట్ల ఎరలో భాగమని వివరించారు దాసోజు.

”టీఆర్ఎస్ చిల్లర రాజకీయానికి అంతులేకుండా పోయింది. రూ. 550 కోట్ల వరద సాయంలో 200 కోట్ల రూపాయిలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వార్డ్ స్థాయి లీడర్లు జేబులో వేసుకున్నారు. మిగతాది బాధితులకు కాకుండా ఇష్టం వచ్చినట్లు ఒక లెక్కా పత్రం లేకుండా పంచారు. పది వేల రూపాయిలు ఇస్తామని చెప్పి వెయ్యి, రెండు వేలు ఇచ్చారు. ఇంకా చాలా మంది అర్హులకు సాయం అందలేదు. చేతికందినది దోచేశారు. టీఆర్ఎస్ నేతల చిల్లర రాజకీలకు దుబ్బాక ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ .  నిజానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఓట్లపై తప్పా ప్రజలపై ప్రేమ లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపధ్యంలో ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ అని ప్రకటించడం కేటీఆర్ ఓట్ల బిచ్చగాడిగా మారాడని చెప్పకనే చెబుతుంది.  ప్రజలపై ఐదేళ్ళుగా లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది.? ఎన్ని జిమ్ముక్కులు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు ప్రజలకు అర్ధమౌతున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ ని ఎలా దెబ్బ కొట్టారో జీహెచ్‌ఎంసీ లో కూడా టీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కేయడానికి ప్రజలు సిద్దమైయ్యారని ” అభిప్రాయపడ్డారు దాసోజు.

”టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలని నిలువునా దోచేస్తుంది. ఎంతో శ్రమతో ప్రజలు రూపాయి రూపాయి కూడ బెట్టి ఫ్లాట్లు కొనుక్కుంటే ఎల్ఆర్ఎస్ పేరు చెప్పి వేల రూపాయిలు ప్రజల దగ్గర గుంజుకోవడానికి ప్రణాళికలు వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆస్తి పన్నులో50 శాతం రాయితీ అని ప్రకటించడం చూస్తుంటే ఒక చేయితో ఇచ్చి మరో చేత్తో లాక్కొనే మోసం తప్పా ప్రజలపై ప్రేమ కాదు. ప్రజలు కేసీఆర్ కి మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? ప్రజల్ని ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..   నిజంగా ప్రజలపై ప్రేమ వుంటే ఎల్ఆర్ఎస్ ని రద్దు చేసి ప్రజల ముందుకు రావాలి. లేదా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భూములని రెగ్యులరైజ్ చేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

”శానిటరీ కార్మికులకు జీతాలు మూడు వేలు పెంచారు. నిజంగా శానిటరీ కార్మికులకు ఎంత ఇచ్చినా తక్కువే. వాళ్ళు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. అయితే కరోనా, లాక్ డౌన్ కాలంలో శానిటరీ కార్మికులతో పాటు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా ఎనలేని సేవలు అందించారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వారి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళ జీతాలు కానీ, ప్రోత్సాహకాలు గురించి కానీ ఎందుకు మాట్లాడడం లేదు ? అదే విధంగా పోలీసులు రేయింబవళ్ళు కష్టపడ్డారు. కరోనా వణికిస్తున్నప్పటికీ ఎంతో ధైర్య సాహసాలతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. వాళ్ళే కాదు.. జీహెచ్ఎంసీ కార్మికులు, రెవెన్యూ సిబ్బంది వీళ్ళంతా కూడా కరోనా, లాక్ డౌన్ కాలంలో విశేష సేవలు అందించారు. వీళ్ళందరిని తప్పించి ఒక్క  శానిటరీ కార్మికులకు ప్రోత్సాహకం ప్రకటించి దాన్ని ఏదో అద్భుతమని ప్రచారం చేయడం అంటే కేవలం ప్రజలని మభ్యపెట్టడమే. నిజంగా కేటీఆర్ కి చిత్తశుద్ధి వుంటే  డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు,  జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది.. వీళ్ళందరికీ కూడా న్యాయం చేయమని డిమాండ్ చేశారు దాసోజు.