కొత్తా దేవుడండీ..కోం గొత్తా దేవుడండీ!

267

( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘‘నేలకు సొరగం దించాడండీ
దించిన సొరగం పంచాడండీ
నెత్తిన చేతులు పెడతాడండీ
నెత్తినెట్టుకుని ఊరేగండి
వీరే మీకు సమస్త
వీరికే మీ నమస్త’’
‘రాజాధిరాజు’ సినిమాలో.. కొత్త దేవుడిగా విజయచందర్‌ను ప్రమోట్ చేసే ఉత్సాహంలో, భక్తులనుద్దేశిస్తూ  నూతన్‌ప్రసాద్ పాడిన పాట అది. అప్పట్లో అది హిట్ సాంగ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆ పాట మళ్లీ విశాఖ పీఠం పుణ్యాన, భక్తకోటి గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చింది. కాకపోతే అలాంటి సాంగ్ ఇంకా తయారుచేసినట్లు లేదు. ‘‘అసలు దేవుళ్ల’ మెడ, తలపై బంగారు కిరీటాలు, ఆభరణాలుంటాయి. కానీ మన ‘కొసరు కొత్త దేవుడు’ మాత్రం సింపుల్‌గా ఉంటారు. అదొక్కటే తేడా. మిగిలినదంతా ‘షేమ్ టు షేమ్‌‘ ఇది కూడా చదవండి.. జన్మదిన ‘జగన్గురువు’కు జయహో!

తెలుగు ప్రజలు-భక్తులు, కొత్తగా వెలసిన  నయా దేవుడిని దర్శించుకుంటున్నారు. ఈ కొత్త దేవుడికి.. ‘అసలు దేవుడే దిగివచ్చి’ జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలట. అలాంటి ఫత్వా స్వయంగా సర్కారే జారీ చేసింది. దేవుడి ప్రతినిధిగా ఉండే ప్రధాన అర్చకులు, కొత్త దేవుడు దగ్గరకు వచ్చారంటే, అసలు దేవుడే దిగివచ్చినట్లు లెక్క మరి! అసలు దేవుళ్లకు అలాంటి వెసులుబాటు ఇచ్చిన కొసరు దేవుడైన విశాఖ స్వామి వారికి భక్తులు రుణపడి తీరాల్సిందే!!

మీకు అర్ధమవుతోందా? ఈనెల 18న పరమ పూజ్యనీయ, అపర శివస్వరూపులైన శ్రీశ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు హ్యాపీబర్త్‌డే చేసుకోనున్నారు. ఆ శున ఘడియలను సెలబ్రేట్ చేసుకునేందుకు, రాష్ట్రంలోని పెద్ద ఆలయాల నుంచి ప్రధాన అర్చకులు కదలి రావాలని.. విశాఖ పీఠం వారి వినతి మేరకు, దేవదాయ శాఖ ఫర్మానా జారీ చేసింది.

సరే… దేవదాయ శాఖ ఆదేశాల ప్రకారం, ఆయా దేవాలయ అధికారులు పెద్ద స్వామి-చిన్న స్వామి వారికి..  ఏమేం నజరానాలు సమర్పిస్తుందన్నది వేరే  ముచ్చట. మరి ఈలోగా స్వామివారి భక్తాగ్రేసరులు.. ఆ మధుర ఘట్టాన్ని ఎలా లోకకల్యాణంగా మార్చాలన్న దానిపై, ఒక దిశానిర్దేశం కావాలి కదా? అంటే స్వామి వారికి బర్త్‌డే గ్రీటింగ్స్ ఏ రూపంలో, ఏయే డిజైన్లలో అందించాలన్న దానిపై ఒక స్పష్టత రావాలి కదా?

అందుకే.. అలాంటి గందరగోళం లేకుండా, స్వామి వారి భక్తమండలే ఎంచక్కా..  బర్త్‌డే ప్రమోషన్ కోసం, కొన్ని డిజైన్లు తయారుచేయించింది. ఒక డిజైన్‌లో పెద్దస్వామి వారు చిరునవ్వులు చిందిస్తుంటే, పైన చిన స్వామివారేమో దండంతో నిల్చునే డిజైన్ తయారు చేశారు. మరొక డిజైన్‌లో పెద్ద స్వామి వారు దండంతో దర్శనమిస్తారు. ఇంకో ఫోజులో స్వామి వారు భక్తులను అనుగ్రహిస్తున్నట్లు డిజైన్ చేశారు. అన్ని డిజైన్లలోనూ  ‘రాజశ్యామల అమ్మవారి నిత్య ఆరాధానతో, విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సిద్ధిపీఠంగా మలిచిన అపర శంకరుల’నేది కామన్ క్యాప్షన్! ఇదీ ఆ డిజైన్ల కథ!!

వాటిని భక్తులు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, బ్యానర్స్‌ను భక్తులు తమకు అవసరమయ్యే సైజులో ప్రింటింగు చేయించుకోవచ్చని స్వరూపానంద భక్త మండలి… ఆ డి జైన్లకు భక్తుల సౌకర్యార్ధం అందుబాటులో ఉంచారు. ఆ మేరకు కింద సూచన కూడా చేశారు! ‘స్వామీజీ జన్మదిన వేడుకల ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, బ్యానర్స్‌కు సంబంధించిన లింకు ఇది. ఈ లింకు కంప్యూటరులో మాత్రమే ఓపెన్ అవుతుంది. మీకు అవసమయ్యే సైజలులో ప్రింటింగు కోసం వినియోగించుకోవచ్చు’ అని సూచన కూడా ఇచ్చారు.

సహజంగా కొత్త సినిమాలు, కొత్త బ్రాండ్లను మార్కెట్‌లో రిలీజు చేసే సందర్భాల్లోనే.. ఇలాంటి ప్రమోషన్లు చేపడుతుండటం మాత్రమే, మనకు తెలుసు. ఇప్పుడు ఒక సన్యాసి బర్త్‌డేకు సైతం, అలాంటి ప్రమోషన్లను ఇంత భక్తి శ్రద్ధలతో చేపడుతుండటం విశేషమే. సహజంగా ఎవరికయినా అదృష్టం, దరిద్రంలా పట్టిందని కుళ్లుకుంటారు. కానీ ధర్మం విషయంలో, ఇక్కడ ఆ సామెత కొద్దిగా రివర్సయిందంతే!