
అడవి బిడ్డల జీవితాలలో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమించాడు బిర్సా ముండా. సాంఘిక సంస్కరణల ఆవశ్యకత గురించి వివరించాడు. బాధితులైన తోటివారిని ఆడుకోవడం ఉత్తమ ధర్మం అన్నాడు. వాటిని తన జీవితంలో ఆచరణలోనికి తెచ్చాడు. తెల్లవారిపై తిరుగుబాటు చేశాడు. మిషనరీల కార్యకలాపాలను అడ్డుకున్నాడు. బిర్సా మూలికా వైద్యం కూడా చేసేవాడు. క్రైస్తవ మతాధికారుల ప్రోద్బలంతో ఆంగ్లేయులు బిర్సాను కారాగారంలో బంధించారు. ఆయన విడుదలకై పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. జైలు నుంచి విడుదలై వచ్చాక మిషనరీల దేశద్రోహ చర్యలకు వ్యతిరేకంగా విప్లవ శంఖం పూరించాడు. తన ఆశయాల ప్రచారానికి ఒక జెండాను కూడా రూపొందించాడు.
నుదుట బొట్టు, మెడలో జంధ్యం దహరించిన బిర్సా వనవాసీలు సంప్రదాయాలను విడిచిపెట్టరాదని, నైతిక వర్తన కలిగివుండాలని బోధించేవాడు. బిరసా ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతుండడంతో క్రైస్తవ మత మార్పిడులకు ఆటంకం ఏర్పడింది. మిషనరీలు కుట్రపన్ని మరళా జైల్లో వేయించారు. ఆంగ్ల ప్రభుత్వం అతని మీద విషప్రయోగం చేసి కలరావల్ల చనిపోయాడని నిర్లజ్జగా ప్రకటించింది. ఆంగ్ల ప్రభుత్వం, క్రైస్తవ మిషనరీల కుట్ర కారణంగా క్రీ.శ.1900 సంవత్సరం జూన్ 9న బిరసా ముండా అశువులు బాశాడు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం, స్వధర్మం కోసం, కన్న భూమి కోసం బలిదానం చేసిన భగవాన్ బిరసా ముండా చిరస్మరణీయుడు. నేడు భగవాన్ బిర్సా ముండా 145 వ జయంతి.