‘గ్రేటర్’ఎన్నికల ప్రచారానికి బాబు వస్తారా?

804

రమణ పెత్తనం వద్దంటున్న సీనియర్లు
ఎవరి ఖర్చు వారిదేనట
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. సరకు సరంజామాతో సిద్ధమవుతున్నాయి. కానీ, ఒకప్పుడు కార్పోరేషన్‌లో అధికారం సాధించిన తెలుగుదేశం పార్టీని, నాయకత్వం ఇంకా సన్నద్ధం చేస్తున్నట్లు కనిపించడం లేదు. సెటిలర్లు ఎక్కువ సంఖ్యలో ఉండే మున్సిపల్ డివిజన్లలో అయినా, ఈసారి పార్టీ ప్రభావం చూపుతుందో లేదో కూడా నేతలకు అర్ధం కావడం లేదు. అసలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా.. గణనీయమైన ఓట్లు సాధించిన టీడీపీ, ఈసారి అత్యంత స్తబ్దుగా ఉంది. ఏపీకి సంబంధించిన సీనియర్లను డివిజన్ల వారీగా మోహరింపచేసి.. ఎన్నికల యుద్ధాన్ని టీఆర్‌ఎస్-టీడీపీకి పరిమితం చేసింది. ఆ తర్వాత చంద్రబాబునాయుడు, తెలంగాణలో పార్టీని దాదాపు వదిలేశారు. దానితో నగరంలో క్యాడర్ ఉన్నప్పటికీ టీడీపీ చతికిలపడవలసి వచ్చింది. ఓటుకు నోటు కేసు తర్వాత.. కేసీఆర్‌తో జరిగిన అంతర్గత అవగాహన మేరకే, బాబు తెలంగాణలో పార్టీ కాడి కింపడేశారన్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అరవిందకుమార్ గౌడ్, కాట్రగడ్డ ప్రసూన, దయాకర్‌రెడ్డి, సాయిబాబా, నర్శిరెడ్డి వంటి గొంతున్న నేతలున్నా.. వారు అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శలు కురిపించకపోవడానికి, నాయకత్వం నుంచి ఆ మేరకు ఆదేశాలు రాకపోవడమే కారణమంటున్నారు.

ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో కూడా.. ఇతర పార్టీలను విమర్శించవద్దని, బాబు ఆదేశించడంపై నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎవరినీ విమర్శించకుండా.. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన, అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేయాలని బాబు సూచించారట. కొన్నేళ్ల క్రితం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చెబితే, వినేదెవరని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టకపోతే, ప్రజలు తమ పార్టీ ప్రత్యామ్యాయంగా ఎందుకు ఎంచుకుంటారని నేతలు ప్రశ్నిస్తున్నారు.

నగరంలో కష్టం మీద కమిటీలు పూర్తి చేసిన నగర నాయకులకు.. ఇప్పుడు కొత్త సందేహం తెరపైకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో అధినేత చంద్రబాబు వస్తారా? రాదా? అన్నదే ఆ సందేహం! ఆయన ప్రచారానికి వస్తేనే పార్టీకి అంతో ఇంతో ఊపు-కార్యకర్తల్లో ఉత్సాహం వస్తోందని చెబుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలో లోకేష్ విస్తృతంగా ప్రచారం చేశారు. తాను పక్కా హైదరాబాదీనని ఆయన చెప్పారు. అయినా ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఈసారి ఎన్నికల్లో పొత్తు ఉండదని బాబు స్పష్టం చేశారట.

ఎన్నికల సందర్భంగా అభ్యర్ధులకు, నిధులిచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఏపీ ఎన్నికల్లోనే అభ్యర్ధులకు నిధులివ్వకుండా, చేతులెత్తేశారు. అనేకమందికి ఇప్పటివరకూ బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి. నగరంలో 25 డివిజన్లలో సెటిలర్ల ప్రభావం నేరుగా ఉండగా, మరో 20 డివిజన్లలో వారే విజయాన్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. సనత్‌నగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్ వంటి నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఎక్కువ. మరి కనీసం అక్కడయినా పార్టీ అభ్యర్ధులకు నిధులిస్తారో, లేదో చూడాలంటున్నారు.

ఇప్పటికయితే, పోటీ చేసే అభ్యర్ధులకు పార్టీ నుంచి నిధులు రావని, నేతలు నిర్మొహమాటంగా చెబుతున్నారు. కేవలం నామినేషన్లు, ప్రచారానికే పరిమితం కావాలంటున్నారు. గతంలో అయితే.. ఆర్ధిక వ్యవహారాల నియంత్రణ వ్యవహారం, చంద్రబాబు చేతిలో ఉండేది. ఎన్నికల ఖర్చు విషయంలో, చంద్రబాబు చాలా ఉదారంగా ఉంటారన్న పేరుండేది. కానీ గత ఐదేళ్ల నుంచి ఆర్ధిక వ్యవహారాల్లో ఆయన ప్రమేయం తగ్గిపోయి, లోకేష్ నిర్వహణలోకి వెళ్లిందన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ అభ్యర్ధులకు నిధులపై, ఇక ఆశ వదులుకోవలసిందేనని.. ఖర్చు విషయంలో.. బాబుకు-లోకేష్‌కు చాలా తేడా ఉండటమే దానికి కారణమని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, టీడీపీ నుంచి బీజేపీ-టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ద్విత్రీయ శ్రేణి నేతలకు, ఆయా పార్టీల్లో పెద్దగా ఆదరణ లభించడం లేదన్న విషయం, టీడీపీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. టీడీపీలో ఉన్నప్పటి గౌరవం, మిగిలిన పార్టీలో కనిపించడం లేదని, పార్టీ మారిన నేతలు వాపోతున్నారట. ఒక్క సనత్‌నగర్, కంటోన్మెంట్, ముషీరాబాద్‌లోనే ఈ పరిస్థితి కొంచెం తక్కువగా ఉందంటున్నారు. అయితే, వారిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలకు.. వారి నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు, సమాధానం చెప్పడం కష్టమవుతోందట. రేపు పార్టీలోకి వస్తే, చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారిస్తారా? ఆయన ఆంధ్రాకు పరిమితమయితే మళ్లీ మా పరిస్థితి ఏమిటి? అసలు సార్ ఎన్నికల ప్రచారానికి వస్తారా? అన్న ప్రశ్నలకు తమ్ముళ్లు జవాబివ్వలేకపోతున్నారట.

అయితే, గ్రేటర్ ఎన్నికల టికెట్ల వ్యవహారంలో, పార్టీ అధ్యక్షుడు రమణ ప్రమేయాన్ని ఒప్పుకునేది లేదని నగర నేతలు స్పష్టం చేస్తున్నారు. గత గ్రేటర్, తర్వాత జరిగిన అసెంబ్లీ టికెట్లలో రమణ వైఫల్యం వల్లనే, పార్టీ ఓడిందని వారు గుర్తు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో.. తనను ప్రసన్నం చేసుకున్న అనర్హులకు సైతం టికెట్లు ఇవ్వడం ద్వారా, పార్టీ ఓటమికి కారణమయ్యారన్న విమర్శలు ఇంకా మర్చిపోలేదంటున్నారు. నగరంలో పార్టీపై ఇప్పటివరకూ దృష్టి సారించని రమణకు, టికెట్ల పంపిణీలో జోక్యం చేసుకునే నైతిక హక్కు లేదని తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు.