హమ్మయ్య.. నేతా‘శ్రీదేవి’…పార్టీ పల్సు పట్టేశారు!

336

‘రెడ్డి’కార్పెట్‌పై ఎమ్మెల్యేకు జ్ఞానోదయం
( మార్తి సుబహ్మణ్యం- 9705311144)

ఇన్నాళ్లూ రాష్ట్రంలో ప్రతిరంగంలోనూ ‘రెడ్డి’కార్పెట్ పరుస్తున్నారంటూ.. టీడీపీ తమ్ముళ్లు తెగ ఆడిపోసుకుంటున్నారు. తిరుమల కొండపై నుంచి.. కింద వరకూ అన్నీ ‘రెడ్డార్పణం’ చేస్తున్నారని ఈర్ష్యపడుతున్నారు. కావన్నీ అవన్నీ ఓడిపోయిన కసితో, తమ్ముళ్లు పనిలేక చేస్తున్న ఆరోపణలని జనం సర్దుకుంటారనుకోవచ్చు. కానీ స్వయంగా తన గుండె ‘లబ్‌డబ్’కు బదులు.. జగనన్న జగనన్నా అంటూ ప్రతిస్పందిస్తోందని చెప్పిన జగనన్న చెల్లెమ్మ … వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాల్లోనూ, అవే మాటలు జాలువారడమే విశేషం. పార్టీ కార్యకర్త ఒకరితో ఫోన్‌లో మాట్లాడిన శ్రీదేవి నోటి నుంచి రాలిన.. రెడ్డీస్ ఆణిముత్యాలు ఇప్పుడు జగనన్న పార్టీలో హాట్‌టాపిక్. దళితులను రెడ్లు వాడుకోవడంలో మహా నేర్పరులంటూ, డాక్టర్ గారు అనుభవపూర్వకంగా తెలుసుకుని మాట్లాడిన సంభాషణ, ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంతకూ డాక్టర్ శ్రీదేవి, రెడ్లపై ఏమంత విరుచుకుపడలేదు. కాని మాటలు గానీ, అప్రజాస్వామ్య పదాలు గానీ వాడలేదు. ఎంచక్కా అందరికీ అర్ధమయ్యే తేటతెనుగులోనే సంభాషించారు. రెడ్లపై తన మనసులో మాట వెలిబుచ్చారు. అధికారం అంతా రెడ్ల దగ్గరే ఉండాలనుకుంటారని, దళితులను ఎలా అణగదొక్కాలా అని ఆలోచిస్తుంటారని, పైకి మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటారని సెలవిచ్చారు. అంతేనా? ఎన్నికల సమయంలో దళితులను వాడుకుంటారని, ఈ విషయాలన్నీ పెంపుడు కుక్కలా వాడుతున్నా, ఎంపీ నందిగం సురేష్‌కు తెలియడం లేదన్న విషయాన్ని బయపెట్టి, సురేష్ అమాయకత్వంపై సానుభూతి వ్యక్తం చేశారు. శాసనమండలి రద్దుతో గుంటూరు వైసీపీ నేత ఎల్.అప్పిరెడ్డి తిక్క కుదిరిందని, తన సంతోషాన్ని వైసీపీ నేతతో ఫోన్‌లో పంచుకున్నారు.

ఇంత చెప్పిన ఎమ్మెల్యే అక్కయ్య.. చివరాఖరలో ఈ రెడ్డీస్ ఉన్నారే.. ఎప్పుడూ డేంజర్సేనని అసలు విషయాన్ని కక్కేశారు. మనం మనం ఒకటి. అంతా కలసి ఎన్నికల్లో సహరించుకోవాలి. ఈ రెడ్లు మనల్ని ఎప్పుడూ కలుపుకొని వెళ్లరు. మనం చెట్టులా బలంగా ఉంటే, కొమ్మల్ని నరికి వీక్ చేయాలని చూస్తారు. కీలక నిర్ణయాల్లో మన భాగస్వామ్యం ఉండదు. ఎన్నికలప్పుడు మాత్రం వాడుకుంటారని… శ్రీదేవమ్మ తన అనుచరుడికి తత్వాన్ని విడమరిచి చెప్పడంతో, సదరు కార్యకర్త కూడా ‘అవును మేడమ్’ అంటూ తన్మయత్వం చెందుతూనే.. ఎందుకయినా మంచిదని, ఆమె మాటలను రికార్డు కూడా చేసి, చరిత్రలో భద్రపరిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే ఆమె కొంపముంచింది. ఆ ఆడియో కాస్తా రెండు భాగాలుగా, సోషల్‌మీడియాలో విడుదలయి అందరినీ అలరిస్తోంది. ఎమ్మెల్యే మేడమ్ తన చెవిలో చెప్పిన ‘రెడ్డికోట’ రహస్యాన్ని, సదరు అనుచరుడు ఆ విధంగా బట్టబయలు చేసి, ముందుకు వెళ్లారన్నమాట!

మొత్తానికి నేతా‘శ్రీదేవి’ పార్టీల తత్వాన్ని, 17 నెలల తర్వాతయినా గ్రహించేశారు. మరి అనుభవం అయింది కదా? అందుకే పెద్దలు.. అనుభవమయితేగానీ, తత్వం బోధపడదంటారు! కాకపోతే మేడమ్‌కు ఏ బోధి చెట్టుకిందనో జ్ఞానోదయం కాకుండా, బుద్దుడు నడయాడిన అమరావతిలోనే జ్ఞానోదయం కావడం గొప్ప విషయమే! రోగుల పర్సు ఠక్కున పట్టేసే డాక్టర్ ఎమ్మెల్యే, ఇంత త్వరగా తన పార్టీ పల్సు కూడా పట్టేయడం గ్రేటే! ఎంతయినా డాక్టర్ గారు కదా మరి? రాష్ట్రంలో జగనన్న సర్కారు, పేరుకు దళిత-బీసీల జపం చేస్తున్నా.. పైనుంచి కింది వరకూ వందల పదవులన్నీ కొండా‘రె డ్ల’కే కట్టబెడుతున్నారన్న, టీడీపీ ఆరోపణలను నిజమేనన్న నమ్మకం.. శ్రీదేవి మాటలతో రుజువయింది. అదే వైసీపీ అసల పితలాటకం! ఇప్పటిదాకా ఏదో ఎస్సీ-బీసీ ముసుగులో ‘రెడ్డి’కార్పెట్ వేసి.. ‘సామాజిక’ సేవ చేస్తున్న జగనన్నకు, ఎమ్మెల్యే చెల్లెమ్మ విప్పిన ‘రెడ్డి’కార్పెట్ గుట్టు ‘సామాజిక’ సంకటమే.

నిజానికి అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ అయినా, అంతకుముందున్న కాంగ్రెస్ అయినా చేసింది సొంత ‘సామాజిక’ సేవనే. అసలు ఆంధ్రాలో రెడ్లు-కమ్మ, తెలంగాణలో వెలమల సంఖ్య ఎంత? వారి ఓటు శాతం ఎంత? మొత్తం కలిపితే 12 శాతం లోపు మాత్రమే. కానీ దశాబ్దాలుగా వారే రాష్ర్టాలను ఏలడం లేదూ? కేవలం ఆ కులం వారు ఓట్లేస్తేనే ఆయా పార్టీలు గెలవవు కదా? అందుకే ముసుగులు అవసరం. యుద్ధంలో సైనికుడు రక్షణ కవచంలా, డాలు పట్టుకుంటాడు. అలాగే రాష్ర్టాన్ని నిర్నిరోధంగా ఏలుతున్న ఈ కులాలు.. ఎస్సీ-బీసీ-మైనారిటీలను కవచంలా వాడుతుంటాయన్నది మనం మనుషులం అన్నంత నిజం.

ముసుగులో కింది కులాలకు ఎక్కువ లబ్ధి కల్పిస్తున్నట్లు కలరింగు ఇస్తుంటాయి. కానీ సింహభాగం పదవులు, ఆర్ధిక ప్రయోజనాలన్నీ తమ కులాలకే కట్టబెట్టే, ‘సామాజిక’ వ్యూహంలో వెళుతుంటాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. అయితే మరి అధికారంలో ఉండే రెడ్లు-కమ్మ-వెలమకు చెందిన కులాలవారంతా బాగుపడతారా? అంటే.. అందరూ బాగుపడరు. అధికారం చుట్టూ ఉంటే ఆ ‘కులదీపాలే’ అన్ని రకాలుగా వెలుగుతుంటాయి. కాంట్రాక్టులూ, కమిషన్లు, వంటి కాసులొచ్చే పనులన్నీ ఆయా ‘కుల’దీపాలకే దక్కుతుంటాయి. ఆయా కులాలకు చెందిన మిగిలిన వారంతా, ఎవరి కష్టం వారు చేసుకోవలసిందే. ఇదే అసలు తత్వం! ఇది తెలియకుండా కాకి గోల చేసే వారు, అమాయకుల కిందే లెక్క!

అయితే.. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు శ్రీదేవి అక్కయ్య, పాపం ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణపై విరుచుకుపడటమే ఆశ్చర్యం. ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్లు.. మాట్లాడింది తాను. రికార్డు చేసి, దానిని విడుదల చేసింది తన కార్యకర్త. మధ్యలో పాపం రాధాకృష్ణ ఏం చేశారు? వారి సంభాషణలు తన చానెల్‌లో ప్రసారం చేసి, తన పత్రికలో రాయడమే ఆయన చేసిన నేరంలా ఉంది. తన ఆడియో గురించి అంత బాగా రాసిన రాధాకృష్ణ , ఓటుకు నోటు కేసులో ‘బ్రీఫ్డ్‌మీ’ అన్న బాబూజీ ఆడియోను, ఎందుకు టెలికాస్టు చేయలేదన్నది శ్రీదేవి ప్రశ్న.

నిజమే. డాక్టరయినా, ఆమె లేవనెత్తిన లా పాయింటు కరెక్టే. కానీ, అప్పట్లో కొడిగ డుతున్న టీడీపీ ప్రభను.. తన అక్షరాల నూనెతో, దేదీప్యమానంగా వెలిగించే పనిలో ఉన్న రాజగురువు గారు.. బాబూజీ మాట్లాడిన ఆడియోను ఎందుకు టెలికాస్టు చేస్తారు? ఆశ మంచిదే. అత్యాశ తప్పు కదా? ఆయన ఆ శ్రమదానం చేసినందుకే కదా.. సమాచారశాఖ ఖజానా ను, ‘జ్యోతి’కి హారతికర్పూరంతో కరిగించింది?
అందుకే కదా.. అసెంబ్లీ లైవ్ టెలికాస్టు హక్కును, టెండరు కూడా లేకుండా సమర్పించుకుంది? ఇన్ని రకాల సేవలు సమర్పించుకున్న బాబు సర్కారుపై, రాజగురువులు ధ్వజమెత్తుతారా ఏంటి? అమాయకత్వం కాకపోతే…? అదేదో నలుగురుతోపాటు నారాయణలా.. జగనన్న సర్కారు ప్రకటనలు ఇచ్చి ఉంటే ఆ కథ వేరేలా ఉండేదేమో? కానీ బంతిలో వలపక్షం చూపిస్తే, ఎవరికయినా కాలిపోదూ? మరి రాజగురువు ఆర్ధిక పుట్టలో జగనన్న వేలు పెడితే కుట్టరా .. ఎమ్మెల్యే అక్కయ్యగారూ?!