దీపావళి

705

తైలే లక్ష్మీ ర్టలే గంగా దీపావళి తిధౌ వసేత్‌
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే||
దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి (దారిద్య్రం) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు నివారణకై దీనిని చేయుట శుభము.
దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. దీనివల్ల అలక్ష్మీ నిస్సరణ జరుగుతుంది. లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ బలివరం కోరుకొన్నాడు. అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, ‘జ్ఞాత్వా కర్మాణి కుర్వీత’ తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు.
ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే||
సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికే గోచరించే రహస్యం. ముఖ్య కాలంలో చేయుటకు వీలు కాకపోతే గౌణకాలంలోనైనా, అనగా సూర్యోదయం తర్వాతనైనా తైలా భ్యంగం చేయాలి. యతులు కూడా అభ్యంగం చేయాలని ధర్మసింధువు చెబుతున్నది. ఉత్తరేణి శిరస్సుపై తిప్పుతూ స్నానం చేయవలెను. దీనివల్ల యమబాధ తప్పుతుంది. త్రిప్పేటప్పుడు మంత్రంపఠిస్తూ త్రిప్పాలి.
శీతలోష్ఠ సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మాపామార్గ భ్రామ్యమాణః పునః పునః||
దున్నిన చాలులోని మట్టిపెళ్ళతో కూడినదీ, ముళ్ళతో నున్న ఆకులు గలదియూ అగు ఓఅపామార్గమా! నిన్ను త్రిప్పుతున్నాను. మాటిమాటికీ త్రిప్పబడి నీవు నాపాపమును హరింపచేయుము, అని అర్థము. అపామార్గాన్ని ఉత్తరేణు అని అంటారు.ఇక సాయంకాలం ప్రదోషసమయంలో అన్ని చోట్ల నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి.
అమావాస్యా చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః|
యమమార్గే దికారేభ్యోముచ్యతే కార్తికే నరః||
ఇక్కడ ‘కార్తికే’ అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున. మనకిది ఆశ్వయుజమే. ఇక ఉల్కాదానం దివిటీలుకొట్టడం దక్షిణదిశగా మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినుట ఆచారము.

– చింతా గోపీ శర్మ సిద్ధాంతి
 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం) 
పెద్దాపురం, సెల్:- 9866193557