రుణమాఫీలు-ద్వంద్వ ప్రమాణాలు

557

ఏ దేశంలోనైనా సంస్కరణలు ప్రారంభించాలంటే  ఆ దేశంలో ద్రవ్యలోటు ఎంత ఉందో చూడాలన్నది నయా ఉదారవాద ఆర్థికవేత్తల ప్రమాణం. ద్రవ్యలోటు పెరిగి, విదేశీ మారకం చెల్లింపుల సంక్షోభం తలెత్తేదాకా ఈ మేధావులు, ఆర్థికవేత్తలు ఎదురు చూస్తారు. ఈ రెండు పరిస్థితులూ తలెత్తిన తర్వాత కళేబరాన్ని రాబందులు పీక్కుతున్నట్టు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆయా దేశాలు అమలు చేయాల్సిన విధానాల చిట్టా పట్టుకుని తలుపు తడుతూ ఉంటాయి. వీటి వెనుకనే యుఎస్‌ ఎయిడ్‌, జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ బ్యాంకు వంటి సంస్థలూ క్యూలు కడతాయి. గత మూడు దశాబ్దాల భారతదేశ సంస్కరణల గమనాన్ని పరిశీలిస్తే అర్థమయ్యే విషయాలు ఇవి. ఆ మాటకు వస్తే ఐదు దశాబ్దాల ప్రపంచీకరణ క్రమంలో ఈ ఘటనలు ఆయా దేశాల్లో ముందు వెనకలుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఈ చిట్టాతో తలుపుతట్టే సంస్కరణల వైద్యులు ప్రతిపాదించే పరిష్కారాలు గమనిస్తే రోడ్డు కూడలిలో చిన్న గుడ్డతో టెంట్‌ వేసుకుని మూలికలు అమ్ముకునే వాళ్లు గుర్తుకొస్తారు. వాళ్లు అమ్మే మూలికలు ప్రకృతి పుట్టినప్పటి నుంచీ ఉన్నాయి. కానీ ప్రజలను రోగాల బారిన పడకుండా ఆపలేకపోయాయి. అదేవిధంగా ఈ సంస్కరణల చిట్కావైద్యులు చెప్పే పరిష్కారాలు పెట్టుబడిదారీ వ్యవస్థ ఆరంభం నుంచీ ఉనికిలో ఉన్నవే. అయినా పెట్టుబడిదారీ వ్యవస్థను సంక్షోభం నుంచి విముక్తి చేయలేకపోయాయి. ఉదాహరణకు భారతదేశంలో 1991 నుంచీ సబ్సిడీలు అనేక రూపాల్లో కుదించుకుంటూ వస్తున్నా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోందే తప్ప పరిష్కారం దొరకలేదు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందన్నది ప్రభుత్వాలు తమ ఆశ్రిత వర్గాలకు ఉపయోగపడే విధానాలు ముందుకు తీసుకెళ్లటానికి వాడే ఊతపదం. ఆ సందర్భనికి ప్రజాపక్షం వహించే విశ్లేషకులు వాడే అర్ధానికి మధ్య ఉన్న తేడాని మనం గుర్తించాలి. లేదంటే పాలకవర్గాలు ప్రతిపాదించే ఉపశమనాలే ఆర్థిక వ్యవస్థలను బతికిస్తాయన్న అపో హలకు మనం కూడా గురయ్యే ప్రమాదం ఉంది.

సబ్సిడీలు తగ్గించాలి, వీలైతే రద్దు చేయాలన్నది ఈ చిట్కా వైద్యులు చెప్పే వైద్యులు ఇచ్చే మొదటి మూలిక. దీన్ని మింగిన మనలాంటి దేశాలు గత ముప్పై ఏండ్లుగా సబ్సిడీల కోత కోస్తూనే ఉన్నాయి. ఈ కోవకే చెందిన మరో మూలిక రైతు రుణ మాఫీలు వద్దనటం. 2017-2018లో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభానికి గురైన సమయంలో రైతు రుణ మాఫీ కోరుతూ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు పెల్లుబికాయి. ఈ సమయంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో సహా అన్ని పార్టీలు రైతు రుణమాఫీని తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాయి. అలా చేర్చిన కొన్ని పార్టీలు గెలిచాయి కూడా. ఈ సమయంలో ఆర్థికవేత్తలు, పరిశీలకులు, విశ్లేషకులు పుంఖాను పుంఖాలుగా రాసిన వ్యాఖ్యానాల సారాంశం ఒక్కటే. రైతు రుణాలు మాఫీ చేసుకుంటూ పోతే అసలు చెల్లించే అవసరం లేదని భావించి విపరీతంగా రుణాలు తీసుకుంటారని, తద్వారా ఆర్థిక క్రమశిక్షణ గతితప్పుతుందన్నదే ఈ సారాంశం. చివరకు ప్రధాని ఆర్థిక సలహామండలి అధ్యక్షుడు మొదలు నిటి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు సలహాదారులుగా పని చేసిన వారు, మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్లు ఈ వాదనలు చేసిన వారిలో ఉన్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడివిట్‌లో రైతు రుణ మాఫీలతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుందని, అందువల్ల ఆ డిమాండ్‌ను అంగీకరించలేమని చేతులెత్తేసింది.

ప్రభుత్వ వాదనల్లో పసేమిటో అంచనా వేసేందుకు రిజర్వు బ్యాంకు విడుదల చేసిన గణాంకాలనే ప్రమాణంగా తీసుకుందాం. ఈ గణాంకాల ప్రకారం 10రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ పథకాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, పంజాబ్‌, చత్తీస్‌ఘఢ్‌, తమిళనాడుల్లో అమలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాలు ప్రకటించిన మొత్తం రాయితీల విలువ 2.37లక్షల కోట్లు. ఈ పథకాలన్నీ ప్రకటించిన ఏడాది అమలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లకు ఆమోద ముద్ర వేస్తాయి. కొత్త ప్రభుత్వాలు అధికారం చేపట్టాక ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్‌లో మాత్రమే ఈ పథకాలకు సంబంధించిన నిధుల కేటాయింపు క్రమం మొదలవుతుంది. ఇందులో ఏ రాష్ట్రం హామీ ఇచ్చిన రుణమాఫీ ఏ ఒక్క సంవత్సరంలో పూర్తయ్యేది కాదు. కనీసం నాలుగైదేండ్ల పాటు అంచెలవారీగా అమలు జరుగుతుంది. అది కూడా ఎన్నికైన పార్టీలకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటేనే.

ఈ వాగ్దానాల ప్రాతిపదికన అధికారానికి వచ్చిన పార్టీలు లేదా ప్రభుత్వాలు చేసే మొదటి పని అర్హులను ఎంపిక చేసేందుకు ప్రమాణాలు నిర్ధారించటం. ఇక్కడే సగానికి పైగా అర్హులు అనర్హులుగా మారిపోతారు. ఆ తర్వాత దాన్ని దశలవారీగా అమలు చేసే క్రమంలో మరికొంతమంది జల్లెడ నుంచి జారిపోతారు. ఉదాహరణకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన పథకానికి అయ్యే ఖర్చు 24వేల కోట్లు, కానీ నిజానికి చేసిన ఖర్చు 12వేలకోట్లేనని రిజర్వు బ్యాంకు లెక్కల్లో తేల్చింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.36500 కోట్లు అవసరమని అంచనా వేసినా దీనికి సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులు జరగలేదు. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారమే పైన చెప్పిన పది రాష్ట్రాలు తాము వాగ్దానం చేసినదాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 1.8శాతం మాత్రమే. అంటే అన్ని రాష్ట్రాలు ప్రకటించిన రైతు రుణ మాఫీల విలువ 22.71లక్షల కోట్లు. ఈ పథకాల కింద గత ఏడాది వరకు పెట్టిన ఖర్చు అంటే గడచిన మూడేండ్లల్లో పెట్టిన ఖర్చు యాభై వేల కోట్లు మాత్రమే. ఇదీ రైతు రుణ మాఫీ నాటకం.

ఇక్కడే మరో అంశాన్ని పాఠకులు తెలుసుకోవాలి. సోకాల్డ్‌ చిట్కా వైద్యులు చెప్తున్న వాదనల వెనక సారాంశం ఏమిటి? ఈ విధంగా రుణమాఫీలు చేసుకంటూ పోతే చివరకు ఖజానా ఖాళీ అవుతుందన్నదే ఈ వాదనల వెనక సారాంశం. ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుండి పెట్టే ఖర్చే అనటంలో సందేహం లేదు. ప్రభుత్వం ఈ రూపంలో పెట్టే మరో కీలకమైన ఖర్చు కూడా ఉంటుంది. దాని పేరే రీకాపిటలైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్స్‌ అని పిలుస్తారు. అంటే బ్యాంకుల్లో తరిగిపోతున్న నగదు నిల్వలను భర్తీ చేయటానికి ప్రభుత్వం టాప్‌ అప్‌ ద్వారా నగదు నేరుగా బ్యాంకుల ఖాతాలోకి జమ చేయటం అన్నమాట. ఇక్కడ పాఠకులు బ్యాంకుల్లో ప్రజలు దాచుకుంటున్న నగదు ఎందుకు తరిగిపోతోంది అన్న ప్రశ్న వేసుకుంటే చిక్కుముడి విడిపోతుంది. పారు బకాయిల రూపంలో లేదా ఘరానా వ్యాపారస్తులు ఎగ్గొట్టే బ్యాంకు రుణాల రూపంలో లేదా పారుబకాయిలుగా గుర్తించిన నాలుగైదేండ్లకు బ్యాంకు ఖాతా పుస్తకాల నుంచి రైటాఫ్‌ చేసే రూపంలో (ఈ పద్దులు తిరిగి రావు అని నిర్ధారించుకుని కొట్టేస్తారు) ఉన్న సొమ్ము ప్రజలది. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్ము. ఈ సొమ్మును ఆరగించేది బకాసురుల్లాంటి బడా పెట్టుబడిదారులు. వారి నుంచి వసూలు చేయటానికి సిద్ధం కాని ప్రభుత్వం తిరిగి ఈ ఖాతా పూడ్చ టానికి ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో కొంత మొత్తాన్ని బ్యాంకులకు బదలాయిస్తోంది. దానికి పెట్టిన ముద్దు పేరే రీకాపిటలైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్స్‌.

ఈ రూపంలో ఇప్పటికి గత ఐదేండ్లల్లో అంటే 2014-15 నుంచి 2018-2019 వరకు వివిధ బ్యాంకులు రద్దు చేసిన పారుబకాయిలు 5,10,890 కోట్లు. ఈ ఐదేండ్లల్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణ మాఫీ కింద పెట్టిన ఖర్చు 95990 కోట్ల రూపాయలు. మరి చిట్కా వైద్యులు చెప్పినట్లు రుణమాఫీల ద్వారా ప్రజల ఆర్థిక క్రమశిక్షణ గతితప్పటం, ప్రభుత్వాలు ఆర్థిక లోటు స్థితికి దిగజారిపోవటం, ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోవటానికి ఈ రుణమాఫీలే కారణమన్న చిట్కావైద్యుల వాదనే నిజమైతే పారిశ్రామిక రంగం ఆ స్థాయిలో రుణ ఎగవేతలకు పాల్పడటాన్ని ఎందుకు సమర్ధిస్తున్నట్టు? ఉపాధి కోసం అన్న వాదన ఉండనే ఉంది. 99 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ పొందిన రైతాంగం పొలం మీద దేశ జనాభాలో దాదాపు 35శాతం పని చేస్తున్నారు. కానీ ఐదు లక్షల కోట్ల రుణ మాఫీ పొందిన కార్పొరేట్‌ రంగంలో ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారు?

ఈ వాస్తవాలు పరిశీలించిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. రైతు రుణ మాఫీ వల్లనో, సబ్సిడీలు ఇవ్వటం వల్లనో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోదు. ఆర్థిక సంక్షోభాలకు అంతకన్నా లోతైన పాలక వర్గ ప్రయోజనాలు కారణం. ఈ వర్గ ప్రయోజనాల పీట ముడిని విప్పలేని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నంత కాలం ఇదే సంక్షోభాలు ప్రజలపై మరిన్ని భారాలు మోపటానికి పావులుగా మారతాయి. ఈ వాస్తవాన్ని తెలుసుకుంటేనే ఏలికలను నిలదీయటం సాధ్యమవుతుంది.

– కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037