నిజమైన లక్ష్యాలు…

821

ఉద్యమేన హి సిధ్యంతి కార్యాణి, న మనోరథైః
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖీ మృగాః

జీవితాన్ని ఒక లక్ష్యంతో సాగించాలనీ, ఆ లక్ష్యాన్ని సాధించడానికి శ్రమించాలని, లక్ష్యసాధన కోసం తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ప్రయత్నించాలని చెప్పే హితోపదేశం ఇది. సింహం గొప్ప పరాక్రమం గల జంతువే అయినా.. అడవికి రాజే అయినా.. గుహ బయటకు వెళ్లి వేటాడకపోతే ఆహారం దొరకదు. నిద్రిస్తున్న సింహం నోట్లోకి జంతువులు తమంత తామే వెళ్లి దూరవు. అలాగే.. ఏ పని అయినా మన ప్రయత్నంతోనే సిద్ధిస్తుందిగానీ, మనసులో అనుకున్నంత మాత్రాన ఆ పని అయిపోదని దీని అర్థం.

మనం ఎవరం, ఎందుకోసం జీవనం కొనసాగిస్తున్నాం, మన లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్య సిద్ధి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి ? ప్రతి మనిషీ తనకు తాను వేసుకోవాల్సిన ప్రశ్నలివి.
ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో సంపద కూడబెట్టి, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మనం నిజంగా, ఆనందంగా ఉన్నామా ? మనం సంపాదించిన డబ్బు నిజంగా మనకు ఆనందాన్ని ఇస్తుందా ? ఒకవేళ డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఆనందాన్ని ఇచ్చేటట్లయితే చాలా మంది ప్రముఖులు తాము నిజమైన ఆనందాన్ని పొందడం లేదని ఎందుకు చెబుతున్నారు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు మన సనాతన జీవన ధర్మంలో ఉన్నాయి.

వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యం, ఉత్తమమైన కుటుంబ జీవన విధానం మనకున్నాయి. వీటన్నింటినీ ఆలంబనగా చేసుకుని మన పూర్వీకులు జీవనం సాగించేవారు. కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించకుండా.. తోటివారి గురించి, జీవనాధారమైన ప్రకృతి గురించి ఆలోచించి వ్యవహరించేవారు. తోటి ప్రాణుల పట్ల దయ కలిగి ఉండేవారు. ప్రకృతిని ఆరాధించేవారు. వేదాల ద్వారా లభించిన జ్ఞానంతో.. భగవంతుని పట్ల విశ్వాసంతో, భక్తితో.. ధర్మాన్ని ఆచరిస్తు, సత్యాన్ని పలుకుతూ జీవించేవారు.

‘‘ఈ ప్రపంచమంతా పరమాత్మయే నిండి ఉన్నాడు. ఇది ఎవ్వరి సొంతమూ కాదు. కాబట్టి స్వార్థబుద్ధిని వీడి.. భూమి పై జీవించినన్నాళ్లూ తోటివారికి, ప్రకృతికి హాని తలపెట్టకుండా బతకాలి.’’ అనే దృక్పథంతో జీవించేవారు. దైవ చింతన, పాపభీతి, ధర్మంపట్ల అవగాహన వారికి ఉండేవి. కాలక్రమేణా ఆ దృక్పథం పోయి డబ్బుకు విలువ పెరిగింది. స్వార్థం ఊడలు దిగింది. దైవ చింతన, పాపభీతి ఏ కోశానా లేకపోగా.. మానవ సంబంధాల పరిధి కుచించుకుపోయింది. ‘నువ్వు చేస్తున్న పని చెడు, పాపం’ అని మనసు హెచ్చరిస్తున్నా.. బలవంతంగా దాని నోరు నొక్కేసి తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడటం పెరిగిపోయింది.

ఆధ్యాతిక జీవన విధానం పట్ల.. అది ఇచ్చే అపారమైన తృప్తి పట్ల సరైన అవగాహన లేక, ఆ మార్గంలో జీవించాలన్న లక్ష్యం లేకపోవడమే ఈ అనర్థాలన్నింటికీ కారణం. అలా కాకుండా పూర్వీకుల్లా నిస్వార్థంగా ఆలోచిస్తూ.. తోటివారిపట్ల దయతో మెలగుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ.. వారి జీవన విధానాన్ని అనుసరిస్తే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయి.
అలా మనం ప్రవర్తించినప్పుడే మన పిల్లలకు విలువలతో కూడిన జీవనాన్ని అందించగలం. వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయగలం. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘మంచిగా బతకాలి’ అని మనసులో అనుకోవడంతో సరిపెట్టకుండా.. మంచిగా బతకడాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టినప్పుడే మానవత్వం పరిమళిస్తుంది.శుభం జయం