నిమోనియా

186

ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న వేళ నిమోనియా ను త్వరగా గుర్తిస్తేనే ప్రాణాలను కాపాడగలుగుతాం

నిమోనియా అనే వ్యాధి 5 సంవత్సరముల లోగా ఉన్న చిన్నారులు మరియు 75 సంవత్సరముల వయస్సు పైబడిన వారిలో సంభవించే మరణాలకు ప్రధాన కారణం.  ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా 450 మిలియన్ ప్రజలు నిమోనియా బారిన పడుతుంటే అందులో 4 మిలియన్ ప్రజలు మరణిస్తున్నారు.  ముఖ్యంగా చిన్నారులలో వచ్చే అతి పెద్ద అంటువ్యాధి నిమోనియా. 2017 గణాంకాల ప్రకారం 808694 మంది 5 సంవత్సరముల లోపు చిన్నారులు మరణించారు.  ఇది 5 సంవత్సరముల లోపు చిన్నారుల మరణాలలో 15 శాతంగా పేర్కొనబడింది.  ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులలో గమనించినప్పటికీ ఎక్కువగా దక్షిణాసియా దేశాలు మరియు సహారా ప్రాంతపు ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా కనిపిస్తోంది.

ఇక భారత దేశ విషయానికొస్తే ఏటా 5 సంవత్సరములలోపు చిన్నారులలో 1.4 లక్షల మంది నిమోనియాతో మరణిస్తున్నారు.  ఈ పరిస్థితి కోవిడ్ కారణంగా మరింత దిగజారిపోయిందనే చెప్పవచ్చు.  కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం తీవ్రతతో కూడిన నిమోనియా కారణంగా జరుగుతున్నాయనేది నెమ్మదిగా అర్థమవుతున్న విషయం.  ఇంతటి ప్రమాదకారి రోగానికి వాక్సిన్ లు ఇవ్వడమే పరిష్కారం.

నిమోనియా –నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక అంటువ్యాధి.  మన ఊపిరితిత్తులలో అల్వియోలీ అనే చిన్న చిన్న గదులుంటాయి.  మనం గాలి పీల్చుకొన్నపుడు ఈ గదులలో గాలి నిండుతుంది.  అయితే నిమోనియా వచ్చిన వ్యక్తిలో మాత్రం ఈ గదులలో గాలి బదులు వైరస్ తో నిండిన ద్రవపదార్థం చేరడం వలన మనం గాలి పీల్చుకోవడం కష్టమవడమే కాకుండా తీసుకొనే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోతుంది.  అంతే గాకుండా ఈ వ్యాధి కారణంగా గాలి గదులలో వాపు ఏర్పడుతుంది.  దీంతో ఊపిరి ఆడకపోవడం, దగ్గు, జ్వరం, ఊపిరితిత్తులలో నొప్పి, చలి మరియు అలసట లాంటివి వస్తాయి.

నిమోనియా రావడానికి కారణాలు

నిమోనియా అనేది పలు రకములైన అంటువ్యాధి ప్రేరకాలు అంటే వైరస్ లు, బాక్టీరియా లేదా ఫంగి (ఫంగస్) ల వలన వస్తుంది.  ఇవి సమాజంలో ఉన్న ఇతర వ్యక్తుల ద్వారా కాని, ఒక హాస్పిటల్ ద్వారా కానీ లేదా ఇతరత్రా కారణాల ద్వారా శరీరంలో ప్రారంభమవుతుంది.  ఇందులో ముఖ్యమైనవి….

బాక్టీరియాల కారణంగా (మొత్తం నిమోనియా కేసులలో 50 శాతం) –

 • స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా – చిన్నారులలో వచ్చే అత్యంత సాధారణమైన బాక్టీరియా ఆధారిత నిమోనియా
 • హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా రకం బి (హిబ్) – రెండవ అతి పెద్ద బాక్టీరియా ఆధారిత ఇన్ఫుఇంజా నిమోనియా
 • సూడోమోనాస్ న్యుమోనియా – ప్రతికూల వ్యాధికారక సూడోమోనాస్ ఏరుగినోసా అనబడే ఫాథోజన్ ద్వారా వచ్చే నిమోనియా. ఇది సుదీర్ఘకాలం హాస్పిటల్ లో ఉండడం వలన వచ్చే అవకాశముంటుంది.
 • మైకోప్లాస్మా నిమోనియా – ఇది అత్యంత తక్కువ ప్రభావం చూపే నిమోనియా.
 • క్లేబ్సియెల్లా న్యుమోనియా – ఈ నిమోనియా ఇతరుల నుండి కాక మన శరీరంలోని పేగులలో ఉండే ఒక రకమైన బాక్టీరియా కారణంగా ఏర్పడుతుంది. ఈ బాక్టీరియా పేగులలో ఉన్నంత వరకూ శరీరానికి హాని చేయవు.  అయితే పేగుల నుండి బయటపడి ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెందితే మాత్రం ప్రమాదకారిగా మారుతాయి.

వైరస్ ల కారణంగా ఏర్పడే నిమోనియా – రైనో వైరస్, ఇన్ఫ్లుయంజా, కరోనా వైరస్, రెస్పిరేటరీ సిన్కైషియల్ వైరస్ లు ప్రదాన కారణాలుగా చెప్పవచ్చు.

ఫంగస్ కారణంగా ఏర్పడే నిమోనియా – హిస్టోప్లాస్మా కాప్సులేటమ్, క్రిప్టోకోకస్ నియోఫార్మన్స్, న్యుమోసిస్టిస్ జిరోవెసి వంటి ఫంగస్ ల కారణంగా నిమోనియా ఏర్పడవచ్చు.  అది అరుదుగా సంభవిస్తాయి.  కొన్ని సందర్భాలలో ఎయిడ్స్ పేషెంట్లలలో కూడా నిమోనిమా గమనించవచ్చు.

పరాన్నజీవుల కారణంగా నిమోనియా – టాక్సోప్లాస్మా గోండి, అస్కారిస్ లుంబ్రికోయిడ్స్, ప్లాస్మోడియం మలేరియా వంటి పలు పరాన్న జీవులు శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత తీవ్రతను బట్టి నిమోనియా వచ్చే అవకాశాలున్నాయి.

ఇవే కాకుండా ఇడియోపతిక్ పేగు న్యుమోనియా, లిపోయిడ్ న్యుమోనియా వంటివి అంటు వ్యాధులు కాకపోయినా నిమోనియాకు దారి తీయవచ్చు.

నిమోనియా వచ్చేందుకు కారకాలు:ఏ వయస్సు వారిలోనైనా నిమోనియా వచ్చే ప్రమాదముంది.  అయితే 2 సంవత్సరములోపు చిన్నారులు మరియు 65 సంవత్సరముల పైబడిన పెద్ద వారు హై రిస్క్ కేటగిరిలో ఉంటారు.  ఈ వ్యాధి రావడానికి సాదారణ కారకాలు –

 • ఇతర వ్యాధులతో భాదపడుతూ స్టెరాయిడ్స్ లేదా క్యాన్సర్ మందులు వాడే వారు కొన్ని కారణాల చేత అతి తక్కవ రోగ నిరోధక శక్తి కలిగిన వారు.
 • ఆస్థమా, సిస్టిక్ ఫైబ్రోసిస్, డయాబెటీస్ లేదా గుండె సరైన రీతిలో పని చేయకపోవడమే రుగ్మత లాంటివి కలిగిన వారు
 • ఇటీవలే జలుబు లేదా ఫ్లూ వంటి ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడిన వారు
 • ఇటీవలే లేదా ప్రస్థుతం హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చి వెంటిలేటర్ పై వైద్యం తీసుకొంటున్న వారు
 • ఇటీవలే స్ట్రోక్ వచ్చి, మింగడానికి ఇబ్బంది పడుతూ కదలలేని స్థితిలో ఉన్న వారు
 • కొన్ని రకములైన మందులు వాడుతూ, పొగ త్రాగే వారితో పాటూ ఎక్కువ మోతాదులలో ఆల్కహాల్ సేవించే వారు
 • అలర్జీల కారకాలైన కాలుష్యం, కెమికల్స్, పొగల బారిన నిత్యం పడుతున్న వారు 

నిమోనియా లక్షణాలు:నిమోనియా లక్షణాలను సరిగ్గా గుర్తించకపోతే అది ప్రాణాంతకం కావచ్చు.  ఈ వ్యాధి లక్షణాలు క్రింద పేర్కొన విధంగా ఉంటాయి….

 • దగ్గినపుడు గళ్ల పడుతున్న వారు
 • జ్వరం
 • చలి రావడం
 • సాధారణమైన పనులు చేస్తున్నా లేదా విశ్రాంతి తీసుకొన్నపుడు కూడా ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బంది పడేవారు
 • ఊపిరి పీల్చుకొన్నపుడు లేదా దగ్గిన సందర్భాలలో ఊపిరితిత్తులలో నొప్పి
 • ఎక్కువగా అలసిపోవడం
 • ఆకలి లేక పోవడం
 • వాంతులు రావడం
 • తలనొప్పి

వీటితో పాటూ రోగి వయస్సు, ప్రస్థుత ఆరోగ్య స్థితిని బట్టి  మరి కొన్ని లక్షణాలు గమనించవచ్చు….

 • ఐదు సంవత్సరముల లోపు చిన్నారులు వేగంగా గాలి పీలుస్తున్నా….పీలుస్తున్న సందర్భాలలో ఒక రకమైన శబ్దాన్ని చేస్తున్నా
 • చిన్నారులలో ఎలాంటి లక్షణాలు లేకున్నా వాంతులు చేసుకోవడం, చలాకీగా లేక పోవడం, తాగడానికి మరియు తినడానికి ఇబ్బంది పడడం
 • ఇక వయస్సు మళ్లిన వారు సరైన దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండడం

ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులను వెంటనే సంప్రదించాలి.

నిమోనియా అంటువ్యాధా?

నిమోనియా రావడానికి కారకాలు ఏవైనా అన్నీ అంటువ్యాధి కారకాలే.  అంటే అవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తాయి.  ముఖ్యంగా బాక్టీరియా లేదా వైరస్ ఆధారిత నిమోనియా మనం దగ్గినపుడు లేదా తుమ్మినపుడు గాలిలో కలిసిపోయి ఇతరులు వాటిని పీల్చడం ద్వారా వ్యాప్తి చెందుతాయి.  అలానే ఈ వైరస్ లు లేదా బాక్టీరియాలు నేల మీద లేదా ఇతరత్రా వస్తువుల మీద ఉన్న సందర్భాలలో వాటిని తాకి నపుడు కూడా అవి వ్యాప్తి చెందుతాయి.  ఇక మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండే పంగస్ ల కారణంగా కూడా నిమోనియా రావచ్చు.  అయితే ఫంగస్ ల కారణంగా వచ్చే నిమోనియాలు అంటువ్యాధులు కావు.

వ్యాధి నిర్థారణ

నిమోనియా సోకిన వ్యక్తి వైద్యులను సంప్రదించగానే మీ ఊపిరితిత్తుల పని తీరును స్టెతస్ స్కోప్ ద్వారా పరిశీలించే గాలి పీల్చేటపుడు, వదిలేటపుడు ఏర్పడే శబ్దాలను పట్టి నిమోనియా అవకాశాలను గుర్తించవచ్చు.  అయితే ఖచ్చితమైన వ్యాధి నిర్థారణకు అంటే దానికి గల కారణాలు, ఏ స్థాయిలో ఉందో అని చెప్పడానికి క్రింది పరీక్షలు వైద్యులు సూచిస్తారు.

రక్త పరీక్షలు – మన శరీరంలో వచ్చిన అంటు వ్యాధి కారకాలు అంటే వైరస్ లు లేదా బాక్టీరియాలను కనుగొనడానికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు.  అయితే ఇందులో ఖచ్చితమైన ఫలితాలు అన్ని వేళలా సాధ్యం కావు.

ఊపిరిత్తుల ఎక్స్ రే – ఊపిరితిత్తుల ఎక్స్ రే ద్వారా వైద్యులు వ్యాధి తీవ్రత ఎంత ఉంది, ఏ ఏ ప్రదేశాలకు వ్యాపించిందని తెలుసుకొంటారు.  అయితే ఇందులో ఏ కారకాల వలన వ్యాధి వచ్చిందో చెప్పలేం.  అందుకు రక్త పరీక్ష తప్పని సరి.

పల్స్ ఆక్సిమెట్రీ – మన ఊపిరితిత్తులు ఏ మేరకు ఆక్సిజన్ ను రక్తంలోనికి పంపించగలుగుతున్నాయనేది ఈ పరికరం ద్వారా అంచనా వేయవచ్చు.

గళ్ల పరీక్ష –  గట్టిగా దగ్గిన తర్వాత వచ్చే గళ్లను పరీక్షించడం ద్వారా ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా తేల్చవచ్చు.

ఇక రోగి 65 సంవత్సరములు దాటిన వారై, హాస్పిటల్ లో చేరి తీవ్రమైన అనారోగ్యానికి గురైతే క్రింది పరీక్షలు కూడా చేయవచ్చు…

సిటి స్కాన్ – రోగికి వచ్చిన నిమోనియా తగ్గకుండా కొనసాగుతుంటే ఊపిరితిత్తులను పూర్తి స్థాయిలో పరీక్షించడానికి సిటి స్కాన్ చేస్తారు.

ప్లూరల్ ఫ్లూయిడ్ కల్చర్ – ఊపిరితిత్తుల నుండి నీడిల్ ద్వారా నేరుగా సేకరించిన ద్రవపదార్థాన్ని పరీక్షించడం ద్వారా ఇన్ఫెక్షన్ ను గుర్తించే ప్రయత్నం.

చికిత్స

నిమోనియా కు చికిత్స ప్రధానంగా వ్యాధి కారకాలు వ్యాప్తి చెందకుండా అదుపు చేయడం తో పాటూ తద్వారా ఏర్పడే ఇతరత్రా సమస్యలకు చికిత్స అందించడం ప్రధాన లక్ష్యంగా సాగుతుంది. సమాజంలోని ఇతర వ్యక్తుల ద్వారా వచ్చే నిమోనియాకు ఇంట్లోనే ఉండడం ద్వారా మందులు అందించి చికిత్స చేయవచ్చు.  అయితే సంబంధిత వ్యాధుల లక్షణాలు కొన్ని రోజులు లేదా కొన్ని వారాలలో తగ్గడంతో పాటూ నెల లేదా మరి కొన్ని రోజులు అలసట కనిపిస్తుంది.

ఇక వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ, రోగి వయస్సు మరియు అతనికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా క్రింద పేర్కొన విధంగా చికిత్స అందిస్తారు….

·         యాంటీ బయాటిక్స్ – ఇవి సాధారణంగా బాక్టీరియా ద్వారా వచ్చే నిమోనియా కోసమే వినియోగిస్తారు.  ఇందుకోసం ముందుగా ఏ రకమైన బాక్టీరియా ద్వారా ఇది వచ్చిందో తేల్చి అందుకు తగినట్లుగా ఈ మందులు అందజేస్తారు.  ఒక మాత్ర లేదా మందు ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గక పోతే ఇంకో రకమైన మందును ఉపయోగించే అవకాశముంటుంది.

·         యాంటీ వైరల్స్ – వైరస్ ల కారణంగా వచ్చే నిమోనియాలకు ఈ మందులు ఇస్తారు.

·         దగ్గు మందు – నిమోనియా తీవ్రతతో వచ్చే దగ్గు నుండి ఉపశమనం కలిగించడానికి ఈ మందు సూచిస్తారు.  అయితే ఈ మందు వినియోగం ద్వారా పూర్తిగా దగ్గును తగ్గించే ప్రయత్నం చేయరు.  ఎందుకంటే దగ్గడం ద్వారా ఊపిరితిత్తులలో ఉండే ద్రవ పదార్థం వెలుపలికి వచ్చి తద్వారా ఖాళీ అయిన గదులలో గాలి చేరడం జరుగుతుంది.  అందుకే దగ్గును పూర్తిగా తగ్గించడం చేయకూడదు.

·         జ్వరం మందు – నిమోనియా కారణంగా వచ్చే జ్వరాన్ని నియంత్రించడానికి ఈ మందులిస్తారు.

·         ఆక్సిజన్ లేదా  యన్ ఐ వి లేదా వెంటిలేటర్ మద్దతు లేదా కార్టికో స్టెరాయిడ్స్ వంటి వాటిని రోగి కున్న ఇతరత్రా వ్యాధులను బట్టి ఇవ్వడం జరుగుతుంది.

ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే వయస్సు మళ్లిన వారికి వచ్చే పలు ప్రత్యేక ఆరోగ్య ఇబ్బందుల మేరకు అంటే కొన్ని సందర్భాలలో ఊపిరితిత్తులలోని ద్రవ పదార్థం వెలుపలికి వచ్చి గుండెకు తాకడం లేదా రెండింటి మధ్య చేరడంతో పాటూ ఏ ఆర్ డి యస్ అనబడే రుగ్మత కారణంగా ఊపిరి పీల్చుకొనే సామర్ధ్యం పూర్తిగా కోల్పోవడం, ఊపిరితిత్తులలో గడ్డలు ఏర్పడడం, సెప్టిక్ షాక్ కు గురవ్వడం లేదా ఇతరత్రా అవయవాలు పాడుకావడం వంటి సమస్యలలో ఇతర చికిత్స అందించడం జరుగుతుంది. 

రాకుండా లేదా తీవ్రతకు దారి తీయకుండా చూసుకోవడమే ప్రధాన కర్తవ్యం 

నిమోనియా రాకుండా చూసుకోవడానికి ఉన్న అత్యంత సులువైన మార్గం వాక్సిన్ ఇవ్వడం.  ఇది అత్యంత నాణ్యమైన, తక్కువ ఖర్చుతో చేయగలిగిన ప్రక్రియ.  చిన్నారులు లేదా వయస్సు మళ్లిన వారికి ఏడాదికి ఒక సారి ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్ ఇవ్వవచ్చు.  సాధారణంగా పుట్టినపుడు ఇచ్చే వ్యాక్సిన్ లలో Pneumococcal Conjugate Vaccine లేదా పిసివి వ్యాక్సిన్ 6 నుండి 14 వారాల తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలి.  అనంతరం 9 వ నెలలో పిసివి బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తే అది అన్ని రకములైన నిమోనియాల నుండి జీవిత కాలం కాపాడుతుంది.  ఇది ఇవ్వని సందర్భాలలో నిమోనియా వ్యాక్సిన్ ను ప్రతి ఐదు సంవత్సరముల కొకసారి ఇవ్వాల్సి ఉంటుంది.  ఇక కొంత మందికి Hib Vaccine ఇవ్వాల్సి రావచ్చు.

ఇలా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటూ మంచి ఆరోగ్య లక్షణాలు, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి పరిశుభ్రత వంటి వాటితో వ్యాధి నిరోధకతను పెంచుకొని నిమోనియా బారిన పడకుండా చూసుకోవచ్చు.  ఇందుకోసం….

 • పొగ తాగడం మానివేయడం
 • సోప్ వాటర్ తో తరచుగా చేతులు కడుగుకోవడం
 • ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ వినియోగించడం
 • వ్యాధి వచ్చిన వారికి సాధ్యమైనంత దూరంగా ఉండడం
 • పండ్లు, కూరగాయలు, ఫైబర్ వంటి వాటితో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం
 • జలుబు లేదా ఇతర వ్యాధులు వచ్చిన సందర్భాలలో అవసరమైన విశ్రాంతి తీసుకోవడం
 • ఎక్కువగా ద్రవ పదార్థములు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులలో ఇబ్బంది తగ్గించుకోవడం
 • విటమిన్ సి లేదా జింక్ వంటి వాటిని అవసరమైనంత తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధకతను పెంచుకోవడం

వీటన్నింటితో పాటూ చిన్నారులను జలుబు లేదా ఫ్లూ వ్యాధి వచ్చిన వారికి దూరంగా ఉంచడం ఎంత అవసరం.  అలానే మన శరీరాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటూ తుమ్మాల్సి వచ్చినా, దగ్గాల్సినా చేతులు అడ్డుపెట్టుకోవడం పిల్లలకు పెద్దలకు నేర్పించడం వంటి వాటిని చేయడం ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించకుండా చూడవచ్చు.

ఇక చివరగా నిమోనియా ను అది తీవ్రతరం కాకుండా గుర్తించడం ఎంతో అవసరం, తద్వారా దాని తీవ్రత కారణంగా ప్రాణాంతకంగా పరిగణించుకుండా చూడవచ్చు.  అందుకే లక్షణాలు ప్రారంభ స్థితిలో ఉన్నపుడే వైద్యులను సంప్రదించాలి.

Dr. B Nagaraj, MBBS,MD,FCCP(USA), Consultant Interventional Pulmonologist & Sleep Specialist, Aster Prime Hospital, Ameerpet, Hyderabad