కృష్ణం వందే జగద్గురుం

652
“ముద్దు గారె యశోద ముంగిట ముత్యము వీడు. దిద్దరాని మహిమల దేవకీసుతుడు” అని అన్నమయ్య ముద్దులు కురిపించినా, “గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అందమైన యదునందునిపై నికుందరదనవరవందగ పరిమళ గంధమ” అంటూ త్యాగయ్య మురిసినా.. “నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవా బృందలోలం” అంటూ కంచర్లగోపన్న మైమరిచినా అది ఆ బాలకృష్ణునిగ,“ఆబాల“ గోపాలకృష్ణుని గురించే. యదునందను గురించి, పార్థసారధి గురించి. జనార్ధనుని గురించి. యావద్భారతం అత్యంత వైభవంగా శోభాయమానంగా, మురిపెంగా జరుపుకునే పండగ కృష్ణాష్టమి. హిందువుల సనాతనధర్మంలో ప్రతిపాదించబడిన దశావతారాలలో కృష్ణుడు ఎనిమిదో అవతారం.

శ్రీకృష్ణ కథ, జీవిత విశేషాలు ప్రపంచచరిత్రలో నాగరికతకు చుక్కానిగా దిశానిర్దేశం చేస్తాయి. ఏకేశ్వరవాద మతాలన్నీఈయన అందించిన‘గీత’ను అర్థం చేసుకోగలితే ప్రపంచంలో మతపరమైన యుద్దాలు అనే ప్రసక్తే ఉండదు. ఆయన జన్మించిన శ్రావణ బహుళ అష్టమి భారతదేశం యావత్తు అతిభక్తిప్రపత్తులతో జరుపుతున్నా, ఆయన అందించిన సందేశం ఎందుకో హిందూసమాజం పూర్తిగా అమలులోకి తేవటంలేదేమొనన్నఅనుమానం కలుగుతోందని అరవింద మహర్షి అనుమానపడ్డారు. కృష్ణతత్త్వం తెలిస్తే యావత్ సనాతన జ్ఞానం అందిపుచ్చుకున్నట్టేనని అరవింద మహర్షి ఘంటాపథంగా చెప్పారు.

శ్రీకృష్ణుడు అందించిన ఆధ్యాత్మికసౌరభం ఒక ఎత్తైతే, ప్రాపంచిక జ్ఞానం, సామాన్య ప్రజలకు అతిసులభంగా అర్థం అయ్యేటట్టు ఆయన లీలలు ఉన్నాయని ఎందరో భాగవతోత్తములు పేర్కొన్నారు.

ప్రకృతిపూజకు ప్రాముఖ్యత ఆయన గోవర్ధనగిరి ఉదంతంలోమనకు అర్ధం అవుతుంది.

సంగీతంలోని అలౌకిక ఆనందం అందుకునే తత్వజ్ఞానం ఆయన చేతిలోని మురళి.

స్నేహబంధపు ప్రాముఖ్యత, స్నేహితుడు సమస్యల్లో ఉంటే అడక్కపోయినా సహయంచెయ్యాలి అన్న పాఠం కుచేలునికథ ద్వారా మనకు తెలుస్తుంది. స్నేహంలో స్థాయీబేధాలకు తావులేదని ఆయన స్పష్టంగా నిరూపించారు.

శ్రీకృష్ణభగవానుని నరకాసుర సంహరలీల ద్వారా స్త్రీశక్తి ప్రకటన చేశారు. ఇక స్త్రీమూర్తుల గౌరవాన్ని పరిరక్షించాల్సిన ప్రాముఖ్యత ద్రౌపదీవస్త్రాపహరణ సందర్భంగా మనం తెలుసుకోవాలి. రాధాకృష్ణుల ప్రేమతత్వం, లేదా గోపికలగోపాలప్రేమతత్వం గమనిస్తే అమలిన ప్రేమతత్వం, నిస్వార్థప్రేమతత్వం మనకు అవగతం అవుతుంది. ముఖ్యంగా యువతీయువకులకు ఈ భావజ్ఞానం అందించాల్సిన అవసరం ఉంది.

మహాభారతం చదివితే, శ్రీకృష్ణుని ధర్మపరిరక్షణ విధానం అర్ధం అవుతుంది. ఎప్పుడు సమాజం ధర్మనిష్ఠను తప్పుతుందో అప్పుడు నీవు ధర్మంపక్షాన నిలబడ్డావా జీవిత కురుక్షేత్రంలో కృష్ణభగవానుడు నీపక్షాన నిలిచి నిన్ను గెలిపిస్తాడు అన్న పరమసత్యం తెలుస్తోంది. “ధర్మోరక్షతిరక్షిత ” అన్నసనాతనవిలువను ఆ జీవనసారంగా కృష్ణుడు మనకు అందించారు. నువ్వే తల్లివి, తండ్రివి, నీవే గురువు, నీవే సఖుడవు అని ఆత్మనివేదన చేసి మనం చెయ్యాల్సిన పని మనం చేసుకుపోవడమే. ఆపైన బాధ్యత తాను చూసుకుంటానని ఎన్నో సంఘటనల్లో నిరూపించారు.

శ్రీకృష్ణుడు కేవలం హిందూసనాతన సాంప్రదాయంలోనేకాదు ఆ సనాతన సాంప్రదాయం అనుసరించిన బౌద్దం, జైనం, సిక్కు, బహాయి సాహిత్యంలో విరివిగా కనిపిస్తారు. బౌద్ద జాతకకధలలో విదుర జాతకకధలో గోవర్ధనునిగా పేర్కొన్నారు. జైనుల తీర్ధంకరులు కృష్ణుడిని వాసుదేవుడు అ నేపేరుతో ఉటంకించారు. గురుగోవిందులవారు కృష్ణావతారం గురించి తెలిపారు. ఇక బహాయిలు ఆయనను యుగపురుషునిగా పేర్కొన్నారు. అనేకమంది పాశ్చాత్యతత్వవేత్తలు శ్రీకృష్ణుని అనేకమంది ప్రవక్తల సరసన విశ్లేషించి ఆశ్చర్యపడ్డారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఉద్యమం ఇంతమంది పాశ్చాత్యులను ఆకర్షించింది.

ప్రముఖులు శ్రీకృష్ణుడు గురించి ఇలా అన్నారు –

“కృష్ణుడిని కృష్ణునిగా ఆరాధించకూడదు, కృష్ణుడి తత్వాన్ని అర్ధంచేసుకుని కృష్ణుడిని ఆదర్శంగా చేసుకొని అప్పుడు పూజించాలి “. – స్వామి వివేకానంద: స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంధావళి (సంపుటం 1-9)

“మతాల కుటుంబంలో, హిందూ మతం తెలివైన వృద్ధ తల్లి. దాని పవిత్ర పుస్తకాలు, వేదాలు ‘సత్యం ఒకటి, కానీ అనేకులు దీనిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు’ అనే సందేశాన్ని ఇస్తాయి. ఇస్లాం,  అన్ని ఇతర ఏకేశ్వర మతాలు ఆ పాఠం నేర్చుకుంటే, మత యుద్ధాల భీభత్సం అంతా నివారించవచ్చు.  కృష్ణుడు భగవద్గీతలో `అన్ని మార్గాలు చివరికి నావైపే దారి తీస్తాయి’. -రాబర్ట్ ఆర్. సి. జెహ్నర్

“ కృష్ణుడి పాత్ర ప్రత్యేకమైనది – అతను ఏమి చేసినా, తన శక్తితో, ధ్యానంతో తన మనస్సుతో చేశారు; స్వశక్తికి ప్రాముఖ్యత ఇచ్చిన కృష్ణుడు, త్యాగపు ప్రాముఖ్యతను కూడాతెలియజెప్పారు’’ – రామ్మనోహర్ లోహియా

ఈ కృష్ణాష్టమినాడు భారతీయుల గురుతరబాధ్యత ఏమిటీ అంటే కృష్ణతత్త్వం పూర్తిగా తెలుసుకొని యువతరానికి అందించడం, ధర్మాన్ని తప్పకుండా జీవితాన్నిగడపటం.

VSK TELANGANA సౌజన్యంతో….