ఎస్వీబీసీ లీలలు చూడతరమా?

552

తిరుమల ‘కొండా’రెడ్లు ఏం చేస్తున్నారు?
ధర్మరాజు పాలనలో ఏమిటీ దారుణాలు దేవా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తిరుమల వెంకన్న కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు… 12 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఎస్వీబీసీ చానెల్, ఇప్పుడు ధర్మరాజు లాంటి ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, ‘అత్యంత విజయవంతంగా’ ‘మునుపెన్నడూ లేనంత సమర్థతతో సాగుతోంది. శ్రీవారి సేవలో తరించాల్సిన భక్తిచానెల్, పాలకుల పల్లకీలో తన జన్మ ధన్యం చేసుకునే పనిలో ‘శ్రమ’టోడ్చుతోందట. మరి పెద్ద పెద్ద సార్లు, పాలకుల పల్లకీ మోసే పనిలో క్షణం తీరిక లేకుండా ఉంటే.. కింద పనిచేసే చిన్న సార్వాడీలు మాత్రం తక్కువ తినరు కదా? వారూ తమకు తోచిన లీలలు కొనసాగిస్తున్నారు.

మొన్నామధ్య ‘శతమానం భవతి’ కార్యక్రమం కోసం.. ఎస్వీబీసీ ఉద్యోగికి ఒక భక్తుడు మెయిల్ పెట్టారట. దాన్ని చూసిన సదరు ఉద్యోగి, పోర్నుసైటు లింకు పెట్టి, పండగ చేసుకోమని చెప్పారట. దాన్ని చూసిన సదరు భక్తశిఖామణి అపచారమంటూ నెత్తికొట్టుకుని, ఆ విషయాన్ని ఎస్వీబీసీ చైర్మన్, టీటీడీ చైర్మన్, ఈవోకు చేరవేశారు. దానితో భక్తుడిపై కరుణించిన టీటీడీ పెద్దలు.. విజిలెన్స్, సైబర్ క్రైం పోలీసులను రంగంలోకి దింపారు. ఆఫీసులో కంప్యూటర్లు తనిఖీ చేస్తే, ఉద్యోగుల‘ రాసలీలాభిమానం’ ఏమిటో బయటపడిందట.

ఈ అరాచకం-అపచారంపై టీడీపీ-బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్వీబీసీ అరాచాలను తూర్పారపట్టారు. హిందూధర్మ ప్రచారంపై, ఎస్వీబీసీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విరుచుకుపడ్డారు. అయోధ్య ప్రత్యక్ష ప్రసారం ఇవ్వని నిర్లక్ష్యాన్ని గుర్తు చేశారు. అవసరాలకు మించి ఉద్యోగుల నియామకాలు, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎండగట్టారు. దోషులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సైతం, టీటీడీ పాలకుల తీరును దునుమాడారు. టీడీపీ కార్యకర్తలు, ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. మరి కొండమీదున్న ‘కొండారెడ్లు’ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి!

అయోధ్య శంకుస్థాపనను.. లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వలేనంత బిజీగా, పాలకుల సేవలో తరిస్తున్న ఈ ఎస్వీబీసీ చానెల్‌కు, టీటీడీ ఏడాదికి ఇచ్చే బడ్జెట్ అక్షరాలా 25 కోట్లు. అందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 250 మంది. నిజానికి ప్రస్తుత అవసరాలకు సరిపోయే సిబ్బంది 100 మంది మాత్రమే. ఇప్పటిదాకా ఏఓ, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ టెక్నికల్ ఆపీసర్, చీఫ్ ప్రోగ్రామింగ్ పోస్టులు భర్తీ చేయలేదు. టీటీడీ వ్యవహారాలపై, భక్తకోటి పక్షాన, నిరంతరం పోరాటం చేస్తున్న, రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడయిన నవీన్ అనే భక్తుడు.. ఎస్వీబీసీ చానెల్ అక్రమాలపై హైకోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాల ప్రకారం విజలెన్స్ అధికారులు విచారణ జరిపితే, అందులో 2 కోట్ల 30 లక్షల అవినీతి జరిగిందని తేలింది. దానితో నాటి సీఈఓను తొలగించేశారు. ఆ అవినీతి కథ అక్కడితో ముగిసింది. అసలు అవససం లేకుండానే ఉద్యోగులను 50 వేలు-70 వేలు ఇచ్చి ఎందుకు నియమించుకుంటున్నారో తెలియదు. టీటీడీ ఇప్పటిదాకా దాడులు చేసిన 30 మందిని ఎందుకు కొనసాగిస్తుందో పాలకమండలికే తెలియాలి.అంతేనా?.. కోట్లాదిరూపాయలు ఖర్చు పెట్టి తీసిన శ్రీవారి ‘టేప్’లు ఎక్కడున్నాయి? అసలు ఉన్నాయా? లేవా? గత 13 ఏళ్ల నుంచి ఎస్వీబీసీ చానెల్ , ఏ కార్యక్రమానికి ఎన్ని కోట్లు ఖర్చు చేసిందన్న లెక్కలున్నాయా? అన్న ప్రశ్నలకు ఎవరి నుంచీ జవాబు లేదు.

భక్తులిచ్చే విరాళాలతో నడుస్తూ, టీటీడీ నిర్వహించే.. ఎస్వీబీసీ నిధులన్నీ పప్పుబెల్లాల మాదిరిగా పంచేస్తుంటే, కొండమీదున్న ‘కొండారెడ్లు’ ఎందుకు గమ్మునుంటున్నారు? ఒకరా.. ఇద్దరా.. కొండమీద ఎటు చూసినా అంతా రెడ్డిగార్లే. ఇటు చూస్తే చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి.. అటు చూస్తే ఈఓ జవహర్‌రెడ్డి.. మరోవైపు చూస్తే ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి. కొండపై కొలువుదీరిన ఈ ‘కొండారెడ్ల’ జమానాలో టీటీడీ ‘ఆరకంగా ముందుకెళుతోంది’ మరి! ఎస్వీబీసీ నిర్వహణపై శరపరంపరగా ఆరోపణలొస్తుంటే, ప్రక్షాళనకు ఎందుకు నడుం బిగించడం లేదు? వైఫల్యాలకు-ఆరోపణలకు కింది స్ధాయి వారినే ఎందుకు బలిచేస్తున్నారు? అందులో ‘కొండారెడ్ల’ నిర్వహణా వైఫల్యం లేదా? మరి ఆ లెక్కన వారిపైనా చర్యలు తీసుకోవాలి కదా? ఎస్వీబీసీకి బాసుగా ఉన్న వారిపై కదా, వేటు వేయాల్సింది?. ఈ ప్రశ్నలకు బదులిచ్చే దమ్ము, కొండమీదున్న స్వాములకు ఉందా?!